Harish Rao | రేవంత్! దివ్యాంగులపై మానవత్వం లేదా? వారికిస్తానన్న రూ.6,000 పెన్షన్ ఏది?
Harish Rao | సీఎం రేవంత్‌రెడ్డి దివ్యాంగులపై కనీస మానవత్వం లేకుండా దగా చేస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు విమర్శించారు. వారికి రూ.6,000 పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చి.. ఒక్కొక్కరికీ రూ.66 వేలు బాకీ పడ్డారని గుర్తు చేశారు. బ్యాక్‌లాగ్ పోస్టులు, ఉచిత బస్సు ఏమైందని నిలదీశారు.
- ఒక్కొక్కరికి 66 వేలు బాకీ పడ్డవ్
- బ్యాక్‌లాగ్ పోస్టులు, ఉచిత బస్సు ఏమాయె?
- అందాల పోటీలకు, ఫుట్‌బాల్ సోకులకు డబ్బులుంటాయ్.. కానీ పెన్షన్లకు ఉండవా
- దివ్యాంగులకు మద్దతుగా ఇందిరా పార్క్ వద్ద మహా ధర్నా చేస్తాం
- సమర శంఖారావం సభలో మాజీ మంత్రి హరీశ్‌రావు హెచ్చరిక
Harish Rao | త్రినేత్ర.న్యూస్: సీఎం రేవంత్‌రెడ్డి దివ్యాంగులపై కనీస మానవత్వం లేకుండా దగా చేస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు విమర్శించారు. వారికి రూ.6,000 పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చి.. ఒక్కొక్కరికీ రూ.66 వేలు బాకీ పడ్డారని గుర్తు చేశారు. బ్యాక్‌లాగ్ పోస్టులు, ఉచిత బస్సు ఏమైందని నిలదీశారు. అందాల పోటీలకు, ఫుట్‌బాల్ సోకులకు డబ్బులుంటాయని.. కానీ పెన్షన్లకు ఉండవా అని ప్రశ్నించారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో వారి తరఫున గొంతు ఎత్తుతామన్నారు. ఇందిరాపార్క్ వద్ద మహాధర్నాకు పూనుకుంటామని చెప్పారు. శనివారం హస్తినాపురంలోని జీఎస్ఆర్ కన్వెన్షన్ హాల్‌లో స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన సమర శంఖారావం సభలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి 33 నెలలు గడిచిపోయాయి. రాష్ట్రంలోని 5 లక్షల 11 వేల మంది దివ్యాంగులకు హామీ ఇచ్చిన నెలకు రూ.6000 చొప్పున లెక్కేస్తే.. ఒక్కొక్క దివ్యాంగుడికి ఈ ప్రభుత్వం ఏకంగా 66 వేల రూపాయలు బాకీ పడింది. సెప్టెంబర్ 7 నుంచి ప్రారంభం కానున్న శాసనసభ సమావేశాల్లో దివ్యాంగుల పక్షాన, వారి హక్కుల కోసం బీఆర్ఎస్ పార్టీ బలమైన గొంతుకగా నిలబడి ప్రభుత్వాన్ని నిలదీస్తుంది.
ఈరోజు తెలంగాణలో ఉన్నది దయలేని ప్రభుత్వం. దివ్యాంగుల పట్ల కనీస మానవత్వం కూడా లేని ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఆనాడు దివ్యాంగుల కష్టాలను అర్థం చేసుకున్న కేసీఆర్, నెలకు కేవలం రూ.500గా ఉన్న పెన్షన్‌ను 8 రెట్లు పెంచి రూ.4,016 చేశారు. వారిని ఓటర్లుగా కాదు, కుటుంబ సభ్యులుగా చూసుకున్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఆసరా పెన్షన్ల కోసం సుమారు రూ.54 వేల కోట్లు ఖర్చు చేస్తే, అందులో కేవలం దివ్యాంగుల కోసమే రూ.10,300 కోట్లు అందజేశాం. ప్రతి నెలా క్రమం తప్పకుండా పెన్షన్ ఇచ్చాం.
దేశంలో ఎక్కడా లేని విధంగా దివ్యాంగులకు డబుల్ బెడ్రూం ఇళ్లలో 5 శాతం రిజర్వేషన్, విద్యా ఉద్యోగాల్లో 4 శాతం రిజర్వేషన్ కల్పించింది కేసీఆర్ గారే. దివ్యాంగుల హక్కుల చట్టాన్ని దేశంలోనే అత్యుత్తమంగా అమలు చేసిన రాష్ట్రంగా 2015లోనే తెలంగాణ జాతీయ అవార్డు గెలుచుకుంది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దివ్యాంగుల పెన్షన్‌ను ఒక్క రూపాయి కూడా పెంచలేదు. పైగా నెలనెలా ఇవ్వాల్సిన పెన్షన్‌ను ఒక నెల ఇస్తూ, ఇంకో నెల ఆపుతూ.. ఏకంగా మూడు నెలల పెన్షన్ ఎగ్గొట్టాడు. దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం, నెలకు రూ.6000 పెన్షన్, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు, బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీ.. ఇలా ఎన్నికల ముందు ఎన్నో హామీలు ఇచ్చి దగా చేశారు. ఒక్క బ్యాక్‌లాగ్ పోస్టును కూడా భర్తీ చేయలేదు.
ఎన్నికలు దగ్గర పడే సమయానికి ఆరు నెలల పెన్షన్లు విదిలించి ప్రజలను మభ్యపెట్టొచ్చు అనుకుంటున్నారేమో! దివ్యాంగులు మీ మోసాలను మర్చిపోరు. మిమ్మల్ని నమ్మరు. దివ్యాంగులకు పెన్షన్లు ఇవ్వడానికి ఈ ప్రభుత్వం వద్ద డబ్బులు లేవా? లేక మనసు లేదా? అందాల పోటీలకు, ఫుట్‌బాల్ సోకులకు, మూసీ సుందరీకరణకు వందల, లక్షల కోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఫ్యూచర్ సిటీ పేరుతో ఆర్భాటాలు చేయడానికి, దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా టీవీల్లో మీ ఫొటోలతో ప్రకటనలు ఇచ్చుకోవడానికి కోట్లు ఉంటాయి కానీ పెన్షన్లకు ఉండవా?
కేసీఆర్ గారు అత్యద్భుతమైన సెక్రటేరియట్ కట్టారు, కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మించారు. జూబ్లీహిల్స్ లో నీకు నివాసం ఉంది. అయినా ఇవన్నీ కాదన్నట్టు కొత్త క్యాంప్ ఆఫీస్ కోసం వందల కోట్లు ఖర్చు చేయడానికి మాత్రం డబ్బులు ఉంటాయి. వాస్తవం ఏంటంటే.. బడా కాంట్రాక్టర్లకు వేల కోట్ల బిల్లులు చెల్లిస్తే వాళ్ల నుంచి మీకు కమీషన్లు వస్తాయి. అదే దివ్యాంగులకు పెన్షన్లు ఇస్తే కమీషన్ రాదు కదా! అందుకే దివ్యాంగులను నిర్లక్ష్యం చేస్తున్నారు.
మిమ్మల్ని చిన్న చూపు చూసినోడే అసలైన దివ్యాంగుడు..
ఈ 33 నెలల కాలంలోనే రూ.30 వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను అమ్మేశారు. అత్యంత ఖరీదైన ప్రభుత్వ ఆస్తులను ముఖ్యమంత్రి తన సొంత తమ్ముడికి కట్టబెడుతున్నాడు. ఇవన్నీ చేయడానికి డబ్బులున్నాయి కానీ.. దివ్యాంగుల పెన్షన్‌కు మాత్రం దిక్కులేదు. దివ్యాంగులను చిన్నచూపు చూసినా, అవహేళన చేసినా.. వాడే అసలైన దివ్యాంగుడు. మీరు కాదు. మీ సత్తా ఏంటో, మీ శక్తి ఏంటో రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వానికి చూపిద్దాం. రేవంత్ రెడ్డికి, ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి కేవలం రియల్ ఎస్టేట్ దందాలు మాత్రమే తెలుసు. కానీ, మాకు ప్రజల పక్షాన నిలబడి పోరాటాలు చేయడం తెలుసు.
మేమేం గొంతెమ్మ కోరికలు, కొత్త కోరికలు అడగటం లేదు. కాంగ్రెస్ పార్టీ తమ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలనే అమలు చేయమంటున్నాం. వంద రోజుల్లో గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు. వంద రోజులు పోయి వెయ్యి రోజులు వస్తోంది. ఇంకెప్పుడు అమలు చేస్తావు రేవంత్ రెడ్డి? మీరు దిగిపోయే కాలం దగ్గరపడింది. వెంటనే దివ్యాంగుల సమస్యలు పరిష్కరించాలి. లేదంటే మీ హక్కుల సాధన కోసం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో త్వరలోనే ఇందిరా పార్క్ వద్ద మహా ధర్నా చేపడతాం. మీకు బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుంది.
అధికారంలోకి వచ్చిన తర్వాత సమాజంలోని అన్ని వర్గాలనూ రేవంత్ రెడ్డి దారుణంగా మోసం చేశాడు. అందరినీ రోడ్డు మీదికి తెచ్చి ధర్నాలు చేయిస్తున్నాడు. జీవో 97 రద్దు చేయాలని పాలిటెక్నిక్ విద్యార్థులు రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్నారు. జాబ్ నోటిఫికేషన్లు, జాబ్ క్యాలెండర్ ఏదని నిరుద్యోగ యువత ధర్నాలు చేస్తున్నారు. 24 గంటల కరెంటు కోసం, యూరియా కోసం, రైతుబంధు నిధుల కోసం అన్నదాతలు రోడ్లపై ధర్నాలు చేస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం నెలకు రూ.6 వేల పెన్షన్ ఎప్పుడిస్తావు? ఉచిత బస్సు ప్రయాణం ఎక్కడిది? బ్యాక్‌లాగ్ పోస్టులు ఎప్పుడు భర్తీ చేస్తావు? అని ప్రశ్నిస్తూ నేడు దివ్యాంగులు ధర్నాలు చేయాల్సిన దుస్థితి వచ్చింది.
ఎన్నికల ముందు అరచేతిలో వైకుంఠం చూపించి, మాయమాటలతో గద్దెనెక్కిన ఈ ప్రభుత్వానికి నేడు కేవలం కమీషన్లు, కాంట్రాక్టులపైనే ధ్యాస తప్ప.. బాధల్లో ఉన్న ప్రజలను పట్టించుకునే తీరిక లేదు. ఎన్నికల ముందు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల పేరిట ఊదరగొడుతూ డిక్లరేషన్లు ప్రకటించారు. కానీ అధికారంలోకి వచ్చాక అందులో ఒక్కటంటే ఒక్క హామీని కూడా అమలు చేయలేదు. ఏం మాట్లాడినా పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌ను, మీ గురువు గారిని ఆదర్శం అంటావు కదా రేవంత్ రెడ్డి.. అక్కడ మీ గురువు గారు దివ్యాంగులకు నెలకు రూ.6 వేల వరకు పెన్షన్ ఇస్తున్నారు. మరి నువ్వెప్పుడు ఇస్తావ్ రేవంత్ రెడ్డి.
పేద ఆడబిడ్డలకు అండగా నిలిచే కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను కూడా నిలిపివేసే కుట్ర చేస్తున్నారు. కోర్టు స్టే పేరు చెప్పి ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది. మరి అదే హైకోర్టు ‘హైడ్రా’ కూల్చివేతలను ఆపాలని స్పష్టంగా ఆదేశించినప్పుడు ఎందుకు అమలు చేయలేదు రేవంత్ రెడ్డి, పేదల పథకాలకు వచ్చేసరికి కోర్టు సాకులు, కూల్చివేతలకు వచ్చేసరికి బుల్డోజర్ల దాష్టీకమా? దివ్యాంగులను మోసం చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి గట్టిగా బుద్ధి చెప్పాలి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ ఒక్కో గ్రామాన్ని చైతన్యవంతం చేసి ఈ కాంగ్రెస్ మోసాలను ఎండగట్టాలి. రేవంత్ రెడ్డి వైఫల్యాలను, మోసపూరిత హామీలను సోషల్ మీడియా వేదికగా ప్రజలందరికీ తెలియజేయాలి.
ఈ సందర్భంగా దివ్యాంగుల హక్కుల కోసం బీఆర్ఎస్ పార్టీ తరఫున మూడు కీలక కార్యాచరణలను ప్రకటిస్తున్నాం. త్వరలోనే ఒక నిర్దిష్టమైన తేదీని ఖరారు చేసి, హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద దివ్యాంగుల హక్కుల సాధన కోసం భారీ ఎత్తున 'మహా ధర్నా' కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. కేసీఆర్‌తో మాట్లాడి, త్వరలోనే పార్టీలో అధికారికంగా బీఆర్ఎస్ దివ్యాంగుల విభాగంను ఏర్పాటు చేసి, మీ సమస్యలపై నిరంతరాయంగా అండగా నిలబడతాం అని హరీశ్ రావు స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పక్ష ఉపనేత సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు వాసుదేవ రెడ్డి, దేవీ ప్రసాద్, ఎర్రోళ్ల శ్రీనివాస్, స్థానిక నాయకులు, పెద్ద ఎత్తున దివ్యాంగులు పాల్గొన్నారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Gorilla Campaign | కోతుల బెడద.. వర్సిటీ విద్యార్థి సంఘం ఎన్నికల్లో "గొరిల్లా ప్రచారం"
- ●Pragya Jaiswal | ప్రగ్యా జైస్వాల్‌ను ఆటాడుకుంటున్న అక్కినేని ఫ్యాన్స్ - బర్త్‌డే పోస్ట్ వివాదం
- ●CM Revanth Reddy Letter to ECI | 73.39 లక్షల మంది ఓటర్లను తప్పుల జాబితాలో పెట్టడం ఏంటి? సీఈసీకి రేవంత్ లేఖ
- ●Pakistan drone | సరిహద్దు వద్ద పాక్ డ్రోన్ కలకలం.. సైన్యం అలర్ట్
- ●Kadiyam Srihari | మాజీ విద్యాశాఖ మంత్రిగా కోరుతున్నా.. జీవో 97ను రద్దు చేయండి
- ●GST Council | సెప్టెంబర్ 12న జీఎస్టీ కౌన్సిల్ 57వ సమావేశం

Gorilla Campaign | కోతుల బెడద.. వర్సిటీ విద్యార్థి సంఘం ఎన్నికల్లో "గొరిల్లా ప్రచారం"

Pragya Jaiswal | ప్రగ్యా జైస్వాల్‌ను ఆటాడుకుంటున్న అక్కినేని ఫ్యాన్స్ - బర్త్‌డే పోస్ట్ వివాదం

CM Revanth Reddy Letter to ECI | 73.39 లక్షల మంది ఓటర్లను తప్పుల జాబితాలో పెట్టడం ఏంటి? సీఈసీకి రేవంత్ లేఖ

Pakistan drone | సరిహద్దు వద్ద పాక్ డ్రోన్ కలకలం.. సైన్యం అలర్ట్










