త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kasipeta | మ్యుటేష‌న్ చేసేందుకు లంచం.. రిటైర్డ్ త‌హ‌సీల్దార్‌కు రెండేళ్ల జైలు శిక్ష‌

Kasipeta | ఆరేళ్ల క్రితం ఓ రైతు భూమిని మ్యుటేష‌న్ చేసేందుకు లంచం డిమాండ్ చేసిన కేసులో రిటైర్డ్ త‌హ‌సీల్దార్‌కు రెండేళ్ల జైలు శిక్ష విధించింది క‌రీంన‌గ‌ర్ ఏసీబీ కోర్టు. రూ. 10 వేల జ‌రిమానా కూడా విధించింది.

S

Telangana | Published On Sep 11, 2026, 3.48 pm IST

Kasipeta | మ్యుటేష‌న్ చేసేందుకు లంచం.. రిటైర్డ్ త‌హ‌సీల్దార్‌కు రెండేళ్ల జైలు శిక్ష‌
Advertisement

Kasipeta | త్రినేత్ర‌.న్యూస్ : ఆరేళ్ల క్రితం ఓ రైతు భూమిని మ్యుటేష‌న్ చేసేందుకు లంచం డిమాండ్ చేసిన కేసులో రిటైర్డ్ త‌హ‌సీల్దార్‌కు రెండేళ్ల జైలు శిక్ష విధించింది క‌రీంన‌గ‌ర్ ఏసీబీ కోర్టు. రూ. 10 వేల జ‌రిమానా కూడా విధించింది. ప్ర‌స్తుతం 69 ఏళ్ల వ‌య‌సున్న రిటైర్డ్ త‌హ‌సీల్దార్ ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నాడు.

కేసు వివ‌రాలివే..

కాసిపేట మండ‌లానికి చెందిన కురుస న‌ర్స‌య్య వ‌రిపేట శివారులో 6.22 ఎక‌రాల భూమిని ముత్యం రావు వ‌ద్ద కొనుగోలు చేశాడు. ఇక మ్యుటేష‌న్ చేయ‌డానికి కాసిపేట త‌హ‌సీల్దార్ అలుగునూరి రోశ‌య్య‌ను న‌ర్స‌య్య సంప్ర‌దించాడు. 6.22 ఎక‌రాల భూమిలో కేవ‌లం 3.02 ఎక‌రాల భూమి మాత్ర‌మే మ్యుటేష‌న్ చేసేందుకు వీలుంద‌ని, మిగ‌తాది క‌ష్ట‌మ‌ని రైతుకు త‌హ‌సీల్దార్ సూచించారు. అది కూడా రూ. 15 వేలు ఇస్తేనే పేరు న‌మోదు చేసి ప‌ట్టా పుస్త‌కాలు జారీ చేస్తాన‌ని రోశ‌య్య స్ప‌ష్టం చేశాడు. దీంతో రైతు బ‌తిమిలాడ‌గా.. రూ. 10 వేల‌కు ఒప్పుకున్నాడు.

ఈ క్ర‌మంలో నర్సయ్య కరీంనగర్‌ రేంజ్‌ ఆదిలాబాద్‌ ఏసీబీ అధికారులను సంప్రదించాడు. 2013 జనవరి 9న నర్సయ్య నుంచి తహసీల్దార్‌ రోశయ్య రూ.10 వేలు తీసుకున్న వెంటనే ఏసీబీ డీఎస్పీ సుదర్శన్‌ పట్టుకొని కేసు నమోదు చేశారు. పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ జ్యోతిరెడ్డి వాదనలు వినిపించారు. సాక్ష్యాధారాలు పరిశీలించిన న్యాయమూర్తి నామ సంతోష్‌కుమార్‌ గురువారం రోశయ్యకు రెండు సంవత్సరాల జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు.

మంచిర్యాల పట్టణంలోని హన్మాన్‌నగర్‌కు చెందిన రోశయ్య(69) ఆరేళ్ల కింద‌ట ప‌ద‌వీ విర‌మ‌ణ పొందారు. ఆ త‌ర్వాత‌ పక్షవాతం, వెన్నెముక ప్రాక్చర్, క్యాన్సర్‌ సంబంధిత వ్యాధులతో మంచంకే పరిమితం అయ్యారు. దీంతో గురువారం ఆయనను అంబులెన్స్‌లో కోర్టుకు తీసుకొచ్చి హాజ‌రుప‌రిచారు. తీర్పు వెలువడిన తదుపరి పైకోర్టుకు అప్పీల్‌ చేసుకుంటానని నిందితుడు కోరగా ఆయన అభ్యర్థనను మన్నించి న్యాయస్థానం బెయిల్‌ మంజూరు చేసింది.

Advertisement
Advertisement