త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | 22ఏ వెనుక కచ్చితంగా రేవంత్‌ హస్తం ఉంది

Harish Rao | 22ఏ వెనుక క‌చ్చితంగా రేవంత్‌రెడ్డి హ‌స్తం ఉంద‌ని.. ఇందులో ఏ1 రేవంత్ అయితే ఏ2 పొంగులేటి శ్రీ‌నివాస్‌రెడ్డి అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ హ‌రీశ్ రావు ఆరోపించారు. శుక్ర‌వారం తెలంగాణ భవన్‌లో 22ఏ నిషేధిత భూముల స్కాంపై ఆయ‌న‌ ప‌వ‌ర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా బాధిత రైతుల‌కు, బీఆర్ఎస్ నాయ‌కులకు కూలంక‌షంగా వివ‌రించారు.

S

Telangana | Published On Sep 11, 2026, 3.25 pm IST

Harish Rao | 22ఏ వెనుక కచ్చితంగా రేవంత్‌ హస్తం ఉంది
Advertisement
  • 22ఏలో A1-రేవంత్‌రెడ్డి, A2-పొంగులేటి
  • రేవంత్‌రెడ్డి ఇల్లు కూడా 22ఏ లో పెట్టారు.. కానీ రాత్రికి రాత్రే తీసేశారు
  • మరి ప్రజల ఆస్తులను ఎందుకు తీయడం లేదు
  • దీనిపై జ్యుడీషియల్ విచారణ చేయాలి
  • మీకు రియల్‌ఎస్టేట్ తెలుసు, మాకు పోరాటం తెలుసు
  • తెలంగాణ భ‌వ‌న్‌లో 22ఏ స‌మ‌స్య‌ల‌పై మాజీ మంత్రి హరీశ్ రావు ప‌వ‌ర్ పాయింట్ ప్రజెంటేషన్

Harish Rao | త్రినేత్ర‌.న్యూస్‌: 22ఏ వెనుక క‌చ్చితంగా రేవంత్‌రెడ్డి హ‌స్తం ఉంద‌ని.. ఇందులో ఏ1 రేవంత్ అయితే ఏ2 పొంగులేటి శ్రీ‌నివాస్‌రెడ్డి అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ హ‌రీశ్ రావు ఆరోపించారు. శుక్ర‌వారం తెలంగాణ భవన్‌లో 22ఏ నిషేధిత భూముల స్కాంపై ఆయ‌న‌ ప‌వ‌ర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా బాధిత రైతుల‌కు, బీఆర్ఎస్ నాయ‌కులకు కూలంక‌షంగా వివ‌రించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. ఒక్క పెన్ను పోటుతో రాత్రికి రాత్రి ప్రజల భూములు కబ్జా పెట్టారన్నారు. తాతల తండ్రుల వారసత్వ సంపదను నిషేధిత జాబితాలో పెట్టి ప్రజలను కన్నీళ్ళు పెట్టిస్తున్నారని వాపోయారు.

కేసీఆర్‌ ప్రజలు కేంద్రంగా పాలన సాగిస్తే రేవంత్ పాలన మొత్తం భూముల కేంద్రంగా సాగుతున్నది. రేవంత్ ప్రతి నిమిషం భూముల గురించి ఆలోచిస్తున్నాడు. నైతికత ఉంటే పొంగులేటి రాజీనామా చేయాలి. కేసీఆర్‌ సమస్యలను పరిష్కరించారు, రేవంత్‌ సమస్యలను సృష్టిస్తున్నారు. 22ఏ నిషేధిత భూముల స్కాం విషయంలో జ్యుడీషియల్ విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నాం

అల్లుళ్లు తీసుకోని ప‌రిస్థితి ఉంది..

22-ఏ అనేది లక్షల మంది ప్రజల ఆవేదన. కట్నం కింద ఇచ్చిన భూములు అల్లుళ్లు తీసుకోని పరిస్థితి ఉంది. కాంగ్రెస్ వచ్చిన తర్వాతే సమస్య వచ్చిందని బాధితులు చెప్తున్నరు. ఎవరి నోట విన్నా 22-ఏ గురించి ఆవేదనే. అన్ని జిల్లాల్లో ఈ సమస్య ఉంది. 1908లో బ్రిటిష్ కాలంలో 22-ఏ ప్రకారం.. నిర్దిష్టమైన భూములను నిషేధించే అధికారం ఇచ్చారు. ప్రభుత్వ, దేవాదాయ, అసైన్డ్ భూములను.. కాపాడే ఉద్దేశంతో 22-ఏ చట్టం తెచ్చారు.

22-ఏ 1(ఏ)లో గవర్నమెంటు, పోరంబోకు భూములు, 22-ఏ 1(బీ)లో ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చిన అసైన్డ్ భూములు, 22-ఏ 1(సీ)లో దేవాదాయ, వక్ఫ్ భూములు, 22-ఏ 1 (డీ)లో ల్యాడ్ సీలింగ్ కింద ప్రభుత్వానికి సంక్రమించిన భూములు పెట్టి చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి ప్రభుత్వ ప్రయత్నం చేస్తోంది. గత ప్రభుత్వం మీద నెట్టేసే కుట్ర చేస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినకంనే రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయి.

భూమి చుట్టూ రేవంత్ ప‌రిభ్ర‌మ‌ణం..

రాజ్యం అంటే భూమి కాదు.. భూమిపై బతికే మనుషులు. ఆ విషయం కాంగ్రెస్ మర్చిపోయింది. సూర్యుడి చుట్టూ భూమి తిరిగినట్టు.. భూమి చుట్టూ రేవంత్ పరిభ్రమణం. కేసీఆర్ పాలనలో ప్రజలు కేంద్రంగా ప్రభుత్వం నడిచేది. భూమి కేంద్రంగా రేవంత్ రెడ్డి పాలన జరుగుతోంది. లగచర్ల నుంచి హిల్ట్ పాలసీ వరకు అన్నీ కుంభకోణాలే. రేవంత్ ప్రతీ నిర్ణయం వెనక భూమి, భూమి, భూమి.

రాజ్యం అంటే మనుషులు అని రేవంత్ తెలుసుకోవాలి. రాత్రికి రాత్రి ఒక్క గీతతో లక్షల మంది ప్రజల ఆస్తులను జీరో వాల్యూ చేశారు. ప్రజలకు ప్రభుత్వం మీద నమ్మకం లేకుండా పోయింది. నిన్నటిదాకా హైడ్రా, ఇప్పుడు 22-ఏ. ప్రజల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం ఆడుతోంది. ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు రక్షణ కల్పించడం ప్రభుత్వాల బాధ్యత. ప్రజల ఆస్తులను ప్రభుత్వమే భక్షిస్తోంది. భూమి అనేది ప్రభుత్వం దృష్టిలో నాలుగు గజాల స్థలం కావొచ్చు. కానీ అదే భూమి ఒక రైతుకు జీవనాధారం. భూమి అనేది పేదవాడికి జీవితకాలం పొదుపు.

మధ్యతరగతి కుటుంబాలకు భూమి అనేది పిల్లల భవిష్యత్తు. కూతురి పెళ్లి కోసం దాచుకున్న ఒక తండ్రి ఆస్తి. తల్లిదండ్రులకు పిల్లల చదువుల కోసం పెట్టుకున్న భరోసా. ఒక కుటుంబానికి వైద్యం కోసం చివరి ఆధారం భూమి. అలాంటి భూములపై ప్రభుత్వం అనిశ్చితి అనే కత్తిని వేలాడదీసింది. ప్రభుత్వమే భూములు భక్షిస్తే ప్రజలు ఎవరిని శరణు కోరాలి? ఈ ప్రభుత్వం భూమిని ఒక మార్కెట్ వస్తువుగా చూస్తోంది. భూమిని ప్రజల హక్కుగా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. రేవంత్ రెడ్డి, పొంగులేటి రియల్ ఎస్టేట్ వ్యాపారులు అని హరీశ్ రావు ధ్వ‌జ‌మెత్తారు.

వ్యాపారంలో ఉన్నప్పుడు మీకు భూమి అనేది ఆస్తి కావొచ్చు. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత భూమి అనేది ప్రజల హక్కు. ఆ సోయి మరిచి భూములను నిషేధిత జాబితాలో పెట్టారు. లక్షలాది మంది ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు. పిల్లల చదువులు, పెళ్లిళ్లు ఆగిపోతున్నాయి. నల్లగొండ జిల్లాలో ఆడపిల్ల పెళ్లి ఆగిపోతే.. ఊరంతా కలిసి పెళ్లి చేసింది. కానీ ఇంకా ఆగపోయిన పెళ్లిళ్లు ఎన్ని? ఆగిన గుండెలు ఎన్ని? ఆగిన చదువులెన్ని?

400 ఎకరాలు బాంబే స్టాక్ ఎక్స్‌ఛేంజ్‌లో కుదవెట్టారు..

హెచ్‌సీయూలో 400 ఎకరాల భూమిని కబ్జా పెట్టే కుట్ర చేశారు. 400 ఎకరాలు బాంబే స్టాక్ ఎక్స్ ఛేంజ్‌లో కుదవపెట్టి.. రూ.10 వేల కోట్ల అప్పు తెచ్చిండు రేవంత్. 9.5 శాతం వడ్డీకి అప్పు.. బ్రోకర్‌కు రూ.200 కోట్ల లంచం. మేడ్చల్ జిల్లాలో 8 వేల ఎకరాలను బీఎస్ఈలో కుదవపెట్టి.. మరో రూ.10 వేల కోట్ల అప్పులు తెచ్చాడు. అగ్రికల్చర్ యూనివర్సిటీలో వంద ఎకరాలు తీసుకున్నడు. అల్లుడికి, తమ్ముళ్లకు వందల ఎకరాలు కట్టబెట్టిండు.

హిల్ట్ పాలసీ వెనక ఉన్నది కూడా భూమే..

పాలిటెక్నిక్ కాలేజీల భూములపైనా రేవంత్ కన్ను పడింది. ఆ భూముల కోసమే పాలిటెక్నిక్ కాలేజీలపై కత్తి. హిల్ట్ పాలసీ వెనక ఉన్నది కూడా భూమే. ఏ నిర్ణయం తీసుకున్నా దాని వెనక ఉండేది భూమే. హైడ్రా వెనక ఉన్నది కూడా భూదోపిడీనే. బడాబడా బాబుల ఇండ్లు హైడ్రాకు కనబడవు. మూసీ సుందరీకరణకు అటు వంద, ఇటు వంద ఎకరాలు ఎందుకు? మల్లన్నసాగర్ నీళ్లు తెచ్చి మూసీలో పోస్తే సరిపోదా? దానికి రూ.లక్ష కోట్లు తగలేయాలా? మూసీ సుందరీకరణ వెనక 3 వేల ఎకరాల వ్యాపారం ఉంది. 280 ఎకరాల భూమి కోసం మెట్రోతో తెగదెంపులు.

22-ఏ వెనక ఉన్నది కూడా భూమే. ప్రజల వారసత్వ సంపదను 22-ఏలో చేర్చారు. 30 పర్సంట్ కమీషన్ పాలన నడుస్తోంది. ఇది 30 పర్సెంట్ గవర్నమెంట్ అని ప్రజలు బహిరంగంగా చెప్తున్నారు. ఊళ్లకు ఊళ్లు, ప్రజల ఆస్తులు, అపార్ట్ మెంట్లు, కాలనీలు.. అడ్డగోలుగా 22-ఏలో చేర్చారు. నిన్నటివరకు అది నీ భూమి.. పొద్దున నిషేధిత భూమి. ఒక కలం పోటుతో నిషేధిత భూమిగా మార్చారు. పాత ఇల్లు కూలగొట్టి కొత్త ఇల్లు కట్టుకుందామంటే.. రాత్రికి రాత్రి ఆ భూమిని నిషేధిత జాబితాలో పెట్టారు. ముఖ్యమంత్రి, రెవెన్యూ మంత్రి బాధ్యతలు విస్మరించారు.

సొంత ఆస్తులు, రెవెన్యూ పెంచుకోవడం మీద పడ్డారు. హమీ ఇవ్వకపోయినా కొత్త పథకాలు తెచ్చిన నాయకుడు కేసీఆర్. ఇచ్చిన హామీలకు పంగనామాలు పెట్టిన మోసగాడు రేవంత్. కేసీఆర్‌కు ఓటేయకుండా తప్పు చేశామని ఓ రైతు చెప్తున్నడు. చేతిలో పట్టా ఉన్నా.. భూమికి వాల్యూ లేదు. కొత్తగా 22-ఏలో ఏమీ పెట్టలేదని బొంకులేటి బొంకుతున్నడు. ఇంతకన్నా పచ్చి అబద్ధం ఉంటుందా?. రెవెన్యూ మంత్రి పదవికి పొంగులేటి తక్షణమే రాజీనామా చేయాలి. ఉల్టా చోర్ కోత్వాల్ కో డాంటే అన్నట్టు కాంగ్రెస్ బురద రాజకీయం. ఎంతసేపూ మమ్మల్ని తిట్టుకుంటనే బతుకుతారా? కేసీఆర్ పాలనలో ఇలాంటి పరిస్థితి ఉండేనా?

బీఆర్ఎస్ పార్టీ సమస్యలను పరిష్కరించింది. కాంగ్రెస్ పార్టీ సమస్యలను క్రియేట్ చేసింది. డిసెంబర్ 31, 2025 నాడు జీవో నం.179 వచ్చింది. 22-ఏ కోసం భూముల లెక్క చెప్పాలని కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు. కొత్త ప్రొహిబిషన్ లిస్టు తయారు చేయాలని 2025, సెప్టెంబర్ 11న ఆర్డర్ వచ్చింది. 2025, నవంబర్ 11 నాడు జనగామ‌ కలెక్టర్ లిస్టు తయారు చేశారు. తర్వాత భూములను నిషేధిత జాబితాలో పెడుతూ గెజిట్ ఇచ్చారు. అన్ని జిల్లాల కలెక్టర్లు ఇలాగే గెజిట్స్ విడుదల చేశారు. సిర్పూర్ కాగజ్‌నగర్ నియోజకవర్గంలో 30 వేల ఎకరాలు నిషేధిత జాబితాలో పెట్టారు. అది ట్రైబల్ ఏరియా.. అందరూ పేద రైతులు.. వారి పరిస్థితి ఏంటి? మంచిర్యాల నియోజకవర్గంలో 11 వేల ఇండ్లు నిషేధిత జాబితాలో పెట్టారు.

భూ భారతి పోర్టల్‌లో వక్ఫ్‌ భూముల డేటా లేదు

33 జిల్లాల కలెక్టర్ల లెటర్లు బయట పెడుతున్నం. ఇప్పుడు చెప్పండి.. బొంకులేటి కరెక్టా? ప్రజల మాట కరెక్టా? చీమూ, నెత్తురు, సిగ్గు ఉంటే పొంగులేటి వెంటనే రాజీనామా చేయాలి. ఆధారాలన్నీ అసెంబ్లీలో పెడితే తలకాయ ఎక్కడ పెట్టుకుంటారు? అందుకే కుట్రతో బీఆర్ఎస్ సభ్యులను సస్పెండ్ చేశారు. అన్నీ అడుగుతమనే అసెంబ్లీకి రాకుండా చేశారు. భూ భారతి పోర్టల్‌లో వక్ఫ్‌ భూముల డేటా లేదు. దేవాదాయ భూముల వివరాలు కూడా లేవు. ఈ నిమిషానికి కూడా భూ భారతిలో డేటా కనిపించట్లేదు. ఏ జిల్లా, ఏ మండలం డీటెయిల్స్ కొట్టినా వస్తలేదు. దీని వెనక ఏదో కుట్ర ఉంది. ఉండాల్సిన భూముల వివరాలు భూభారతిలో లేవు. భూములను మాత్రం నిషేధిత జాబితాలో పెట్టారు.

ప్రభుత్వం కలెక్టర్ల మెడ మీద కత్తి పెట్టింది. రెవెన్యూ మినిస్టర్, సీసీఎల్‌ఏ కలిసి కలెక్టర్లను తరిమాయి. హెచ్‌ఎండీఏ, హుడా ఆక్షన్ చేసిన భూములు కూడా నిషేధిత జాబితాలో పెట్టారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలను కూడా 22-ఏలో పెట్టారు. మొత్తం షేక్‌పేట్ ఏరియానే 22-ఏలో చేర్చిపారేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే పద్ధతి లేకుండా 22-ఏ పెట్టారు. వెరిఫికేషన్ లేదు.. బాధ్యత లేదు. అమీన్‌పూర్‌లో 50 వేల కుటుంబాలు రోడ్డునపడ్డాయి.

అక్క‌డ నేను ఎత్త‌లేన‌న్ని అప్లికేష‌న్లు..

నేను కుమ్రం భీం జిల్లాకు పోతే.. నేను ఎత్తలేనన్ని అప్లికేషన్లు వచ్చినయి. పది వేల మంది నాకు దరఖాస్తులు ఇచ్చారు. అసెంబ్లీలో పొంగులేటి టేబుల్ మీద ఆ 10 వేల దరఖాస్తులు పెడదామనుకున్న. అందుకే మేం అసెంబ్లీకి రాకుండా చేశారు. అయినా ఇడిచిపెట్టం.. అరెస్ట్ చేసినా వదలం. బాధితుల పక్షాన బీఆర్ఎస్ పోరాటం చేస్తది. భూదాన్ ముసుగులో ఊరు ఊరంతా 22-ఏలో పెట్టారు. 8 నెలలుగా చెప్పులు అరిగేలా తిరిగినా స్పందన లేదు. టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేస్తే ఎత్తేటోడు లేడు. సమాధానం చెప్పలేక కలెక్టర్లు గ్రీవెన్స్ సెల్‌కు వస్తలేరు.

పొంగులేటి సారీ చెప్పింది ప్ర‌జ‌ల‌కా.. రేవంత్‌కా?

రేవంత్ రెడ్డి ఇల్లు కూడా 22-ఏలో పడ్డది. ఆ విషయం మేం బయటపెడితే రాత్రికి రాత్రి రేవంత్ ఇల్లును.. 22-ఏ నుంచి తీసేశారు. మరి ప్రజల భూములను ఎందుకు తీస్తలేరు? పొంగులేటి సారీ చెప్పింది ప్రజలకా? రేవంత్ రెడ్డికా? సంధ్యారావు అకౌంట్‌తోనే రేవంత్ ఫేకుడు ప్రజలకు అర్థమైంది. రేవంత్ ఏం మాట్లాడినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ప్రభుత్వం చేసిన తప్పుకు ప్రజలు ఎందుకు బాధలు పడాలి? తప్పు ప్రభుత్వానిది.. శిక్ష ప్రజలకు. ఒక సేల్ డీడ్ ఆగిపోవడమంటే ఒక పెళ్లి ఆగిన్టటు, ఒక చదువు ఆగినట్టు.

వేల మంది ప్రజలు ఉపాధి కోల్పోతున్నారు. పొంగులేటి తప్పు చేసి అధికారుల మీద రుద్దుతున్నడు. తప్పు చేస్తే 33 జిల్లాల కలెక్టర్లు తప్పు చేస్తరా? ప్రభుత్వ ఆదేశం లేకుండానే ఇదంతా జరిగిందా? అధికారులే తప్పు చేస్తే.. ఒక్కరి మీద కూడా ఎందుకు చర్యలు తీసుకోలేదు? 22-ఏలో పెట్టిన భూములను ప్రభుత్వమే తొలగించాలి.
ప్రజలను ఆఫీసుల చుట్టూ తిప్పకూడదు. వివరాలన్నీ పబ్లిక్ డొమెయిన్‌లో పెట్టాలి. ఎన్ని ఎకరాలు పెట్టారు? ఎన్ని ఆస్తులు పెట్టారో వెల్లడించాలి. ఎన్ని తొలగించారు? ఏ కారణంతో తొలగించారో కూడా చెప్పాలి.

22-ఏతో ముఖ్యమంత్రికి సంబంధం ఉందా లేదా? ముమ్మాటికీ ముఖ్యమంత్రికి కూడా సంబంధం ఉంది. రేవంత్ రెడ్డికి ముందే తెలుసని మంత్రి కోమటిరెడ్డి చెప్పిండు. యాదాద్రి జిల్లాలో 40 వేల ఎకరాలు 22-ఏలో పెట్టారని.. సహచర మంత్రే మీడయాకు చెప్పారు . 4 నెలల ముందే రేవంత్‌కు తెలుసని కూడా చెప్పారు. అప్పుడే రేవంత్ చర్య తీసుకుని ఉంటే ఇదంతా జరిగేదా? సర్కారు మెడలు వంచి 22-ఏను తీసేసేదాకా పోరాటం ఆగదు. బేషరతుగా నిషేధిత జాబితా తొలగించాలి. సమస్య పరిష్కరిస్తరా? ప్రజల పాదాల కింద నలిగి చస్తరా?

నాదర్‌గుల్ స్కాంను బీఆర్ఎస్ పార్టీ బయటపెట్టింది. రెవెన్యూ మినిస్టర్ కొడుక్కి 373 ఎకరాల భూమిని ధారాదత్తం చేశారు. రైతులను వారి భూముల్లోకి పోనివ్వడం లేదు. ప్రైవేటు సైన్యం కొండలు, గుట్టలను కొల్లగొడుతోంది. ప్రభుత్వ భూమిలో మైనింగ్ జరుగుతున్నా పాలకులు పట్టించుకోరు. ఏక్యూ స్క్వేర్, కొహినూర్ గ్రూప్ వాళ్లు ప్రభుత్వ భూమిని చెరబట్టారు. క్రిస్టల్ మాన్షన్ ఇండియా ప్రై.లిమిటెడ్, అహ్మద్ ఖాద్రీ.. హర్షారెడ్డి పొంగులేటి, సింగిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి డైరెక్టర్లు.

శిల్పా ఇన్ ఫ్రాలో సింగరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, శిల్పా రాఘవ వెంచర్స్ డైరెక్టర్లు. శిల్పా రాఘవ వెంచర్స్‌లో డైరెక్టర్లు కూడా హర్షారెడ్డి, చంద్రమోహన్ రెడ్డి. 2023 డిసెంబర్ 13న అంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన.. వారం రోజులకే కోహినూర్ గ్రూప్ బోర్డు వెలిసింది. గవర్నమెంట్ ల్యాండ్ అని రాసి ఉన్న దగ్గరే రేకులు వేసి ప్రహరీలు కట్టారు. దీనిపై 2024 ఏప్రిల్ 6న తెలంగాణ భవన్‌లో ప్రెస్ మీట్ పెట్టినం. పొంగులేటి కొడుకు భూ భాగోతాన్ని బయటపెట్టినం. మేం బయపెట్టిన వారం రోజులకే బోర్డులు మాయమైనాయి. ఇప్పడు మళ్లీ అక్కడ బోర్డులు వెలిశాయి. ఆ భూమి విలువ రూ.10 వేల కోట్లు. అది ప్రైవేటు వారి భూమి అని హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ చెప్పారు-

పొంగులేటి చెర‌లో ఉన్న భూమిని వాప‌స్ తీసుకోవాలి..

2025 మార్చి 17న ఆ ప్రాంత ఆర్డీవో సుప్రీంకోర్టులో కేసు వేశారు. అది ప్రభుత్వ భూమి అని పిటిషన్‌లో పేర్కొన్నారు. రంగనాథ్‌కు పేదోళ్ల గుడిసెలు మాత్రమే కనిపిస్తయా?. నాదర్‌గుల్ భూముల మీదికి పోయే ధైర్యం రంగనాథ్‌కు లేదు. ఎందుకు లేదో అందరికీ తెలుసు. గవర్నమెంట్ ల్యాండేనని అప్పీలెట్ ట్రిబ్యునల్ కూడా చెప్పింది. ఇప్పటికీ ఆ 373 ఎకరాల భూమి పొంగులేటి కుటుంబం చెరలో ఉంది. వెంటనే ఆ భూమిని ప్రభుత్వం వాపస్ తీసుకోవాలి. పొంగులేటి కుమారుడి కబంధ హస్తాల్లో భూమి బందీగా ఉంది.

అనుముల తిరుపతి రెడ్డిది ఇంకో కథ. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం పసుమామ్ల గ్రామంలో.. 4 ఎకరాల భూమిని తిరుపతిరెడ్డి చెరబట్టాడు. ఆ భూమిని సెకండ్ రిజిస్ట్రేషన్ చేయించుకుంటే కోర్టు కొట్టేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ భూమిలో.. నాలా కన్వర్షన్‌కు అనుమతులు ఇచ్చింది. ఇండ్లు కట్టుకున్న భూమిని వ్యవసాయ భూమి కింద కన్వర్ట్ చేశారు. బాధితులతో సెటిల్ మెంట్లు చేస్తున్నారు. భూభారతిని అడ్డం పెట్టుకుని అనుముల బ్రదర్స్ భూదందాలు. ఖాజాగూడలో కూడా భూములు గోల్ మాల్ చేశారు. నిషేధిత జాబితాలో ఉన్న భూమిని ప్రైవేటు వారికి రిజిస్ట్రేషన్ చేశారు. భూ భారతి పేరిట జరుగుతున్న భూ హారతికి ఇంతకంటే ఏం సాక్ష్యం కావాలి?

Advertisement
Advertisement