త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | గుర్తు పెట్టుకో రేవంత్.. నీకు డిపాజిట్లు కూడా రావ్

Harish Rao | రేవంత్ రెడ్డి హిట్లర్ పాలనను అంతం చేయడానికి ప్రజలు కంకణం కట్టుకున్నార‌ని.. దేశంలో సీఎంలు ఓడిపోయే ట్రెండ్ న‌డుస్తోంద‌ని.. బెంగాల్, త‌మిళ‌నాడులో అదే జ‌రిగింద‌ని మాజీ మంత్రి హ‌రీశ్‌రావు వ్యాఖ్యానించారు. రానున్న ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు కూడా రావన్నారు.

S

Telangana | Published On Jun 12, 2026, 5.41 pm IST

Harish Rao | గుర్తు పెట్టుకో రేవంత్.. నీకు డిపాజిట్లు కూడా రావ్
Advertisement
  • దేశంలో సీఎంలు ఓడిపోయే ట్రెండ్ నడుస్తుంది
  • బెంగాల్, తమిళనాడులో అదే జరిగింది.. నెక్స్ట్ తెలంగాణలో అదే రిపీట్ అయితది
  • రాష్ట్రంలో రేవంత్ బూతులతో ధ్వని కాలుష్యం నడుస్తుంది
  • ఆయ‌న పెట్టిన‌ ఆశల వలయంలో ప్రజలు చిక్కుకున్నరు
  • హుజూరాబాద్ ప్ర‌జ‌ల కోసం కౌశిక్ రెడ్డి బాగా ప‌ని చేస్తున్న‌డు
  • బీఆర్ఎస్‌ కార్య‌క‌ర్త‌ల స‌మావేశంలో సీఎం రేవంత్‌పై మాజీ మంత్రి హ‌రీశ్‌రావు ఫైర్‌

Harish Rao | త్రినేత్ర‌.న్యూస్: రేవంత్ రెడ్డి హిట్లర్ పాలనను అంతం చేయడానికి ప్రజలు కంకణం కట్టుకున్నార‌ని.. దేశంలో సీఎంలు ఓడిపోయే ట్రెండ్ న‌డుస్తోంద‌ని.. బెంగాల్, త‌మిళ‌నాడులో అదే జ‌రిగింద‌ని మాజీ మంత్రి హ‌రీశ్‌రావు వ్యాఖ్యానించారు. త‌ర్వాత తెలంగాణలోనూ అదే రిపీట్ అయితద‌ని పేర్కొన్నారు. హుజురాబాద్ నియోజకవర్గం జమ్మికుంటలోని MPR గార్డెన్స్‌లో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో శుక్ర‌వారం ఆయ‌న ముఖ్యఅతిథిగా హాజ‌రై ప్ర‌సంగించారు. బీఆర్ఎస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా రాదని రేవంత్ రెడ్డి అంటున్నాడ‌ని.. నిజ‌మే ప్రతిపక్ష హోదా కాకుండా పాలకపక్ష హోదా వ‌స్తుంద‌ని చెప్పారు. రానున్న ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు కూడా రావన్నారు.

హుజూరాబాద్‌లో 2004 నుండి ఇప్పటివరకు ఒక్క ఉపఎన్నిక తప్ప ఏ ఎన్నిక వచ్చినా ఎప్పుడూ ఎగిరిన జెండా గులాబీ జెండానే. ప్రపంచమే అబ్బురపడ్డ రైతుబంధు, దళితబంధు పథకాలు ప్రారంభమైంది హుజురాబాద్ నుంచే. ఉద్యమ సమయంలో ఉప్పల్ రైల్వే స్టేషన్‌లో రైల్ రోకోతో ఢిల్లీని స్తంభింపచేసిన గడ్డ ఈ హుజురాబాద్ గడ్డ. ఒకప్పుడు సభ్యత్వ నమోదు రసీదులు ఉండేది. ఇప్పుడు అంతా ఆన్‌లైన్‌లోనే. ప్రతి నియోజకవర్గంలో కార్యకర్తలకు శిక్షణా తరగతులు నిర్వహించి కాంగ్రెస్ మోసాలను గ్రామగ్రామానికి తీసుకుపోయే కార్యక్రమాన్ని పార్టీ ప్రారంభించబోతుంది అని హ‌రీశ్‌రావు చెప్పారు.

లేనిపోని ఆశ‌లు పెట్టిండు..

కేసీఆర్ రైతు బంధు, రైతు బీమా, కల్యాణ లక్ష్మి, ఆసరా పింఛన్లు, కేసీఆర్ కిట్టు వంటి ఎన్నో పథకాలను తెస్తే రేవంత్ రెడ్డి లేనిపోని ఆశలు పెట్టాడు. ఇన్ని చేశాం కదా ప్రజలు కృతజ్ఞతతో ఓట్లు వేస్తారు అనుకున్నాం. కానీ కృతజ్ఞతకు, ఆశకు జరిగిన పోరాటంలో రేవంత్ రెడ్డి పెట్టిన ఆశల వలయంలో ప్రజలు చిక్కుకున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పును గౌరవించాల్సిందే. ఇక‌ రైతు వ్యతిరేక కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసే పరిస్థితి లేదు. కేసీఆర్ హయాంలో కరోనా వచ్చినా రైతు బంధు ఆగలేదు. 11 సార్లు 74 వేల కోట్ల రూపాయలను రైతుల అకౌంట్‌లో వేసిన దేశంలోనే ఒకే ఒక్క నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు.

రుణ‌మాఫీ చేసినా అని సంక‌లు గుద్దుకుంటుండు..

రేవంత్ రెడ్డి వచ్చాక ఒక‌ రైతు బంధు మొత్తం ఎగ్గొట్టాడు. ఈసారి 2 ఎకరాలకే ఇచ్చాడు. 20 వేల కోట్ల రైతు బంధు ఎగ్గొట్టి రుణమాఫీ చేసిన అని సంకలు గుద్దుకుంటుండు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎండకాలం వచ్చినా కరెంట్ పోలేదు, తాగడానికి నీళ్లకు ఇబ్బంది రాలేదు, కాల్వల్లో నీళ్లు పారినాయి. కానీ ఇవాళ కాంగ్రెస్ రాజ్యంలో కరెంట్ కోతలు మొదల‌య్యాయి. తాగడానికి నీళ్లు లేవు, సాగునీరు లేక పంటలు ఎండిపోయిన‌య్‌. రైతులు కన్నీరు పెడుతున్నారు అని హ‌రీశ్‌రావు ఆవేద‌న చెందారు.

రైతు బీమా బంద్ అయ్యింది. రేవంత్ రెడ్డి LICకి డబ్బులు కట్టలేదు. కేసీఆర్ తెచ్చిన పథకమని రైతులకు ఉపయోగపడే పథకాన్ని ఆపడం ఎంత‌వ‌ర‌కు స‌మంజ‌సం. రేవంత్ రెడ్డి వచ్చిండు ఎరువుల కష్టాలు మొదలయ్యాయి. తరుగు లేకుండా వడ్లు కొనడం లేదు. రైతులు 40, 50 రోజులకుపైగా వడ్లు అమ్ముకోడానికి, మక్కలు అమ్ముకోవడానికి పడిగాపులు కాస్తున్నారు. యాసంగి పంటకు బోనస్ ఎగ్గొట్టిన్రు అని ధ్వ‌జ‌మెత్తారు.

రైతు డిస్కం పేరుతో ఉరి..

కేసీఆర్ ఉన్నప్పుడు రైతులకు 24 గంటలు కరెంట్ ఇస్తే.. ఇప్పుడు కాంగ్రెస్ 11 గంటలే కరెంట్ ఇస్తుంది. ఈ రేవంత్ రెడ్డి రైతు డిస్కం పేరిట 24 గంటల కరెంట్‌కు ఉరేస్తున్నడు.. రైతులను ఆగం చేయాలని చూస్తున్నడు. రైతు డిస్కం అమలులోకి వస్తే ఇప్పుడొచ్చే 11 గంటలు కూడా రైతులకు కరెంట్ రాదు. 5, 6 గంటలే వస్తుంది. రైతు అనేవాళ్లు ఇక కాంగ్రెస్‌కు ఓటేసే పరిస్థితి లేదు. రేవంత్ రెడ్డి ఏం మాట్లాడినా అబద్ధాలే. ఆయన పనైపోయింది.

రూ.5 కోట్ల‌తో హెలికాప్ట‌ర్ కొంటుండు..

విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ ఎగ్గొట్టిండు, 4000 పెన్షన్ ఇస్తానని అవ్వా తాతలను మోసం చేసిండు. రూ.2,500 ఇస్తానని మహిళలను మోసం చేసిండు. జూబ్లీహిల్స్‌లో ఆయనకున్న ప్యాలెస్ సరిపోదని రూ.100 కోట్లతో ఇంకో క్యాంప్ ఆఫీస్ కట్టిండు, ప్యూచర్ సిటీ అని పెట్టి అక్కడ రూ.100 కోట్లతో క్యాంప్ ఆఫీస్ కట్టిండు. హెలికాప్టర్ ఉన్నది చాలదని నెలకు 5 కోట్లు ఖర్చు పెట్టి కొత్త హెలికాప్టర్ కొంటున్నడు. ఫుట్‌బాల్ సోకులకు, అందాల పోటీలకు వందల కోట్లు ఖర్చు పెట్టిండు. పక్క రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే మూటలు పంపడానికి డబ్బులుంటాయి. రేవంత్ రెడ్డి గుర్తు పెట్టుకో.. నీ హిట్లర్ పాలనను అంతం చేయడానికి ప్రజలు కంకణం కట్టుకున్నారు. నీ పార్టీకి డిపాజిట్లు కూడా రావు గుర్తుపెట్టుకో. రాష్ట్రంలో ఎక్కడ చుసినా ఒక్కటే మాట కాంగ్రెస్ పోవాలే కేసీఆర్ రావాలె. గ్యారంటీగా రాసి పెట్టుకోండి మళ్ళొచ్చేది కారే.. ఏర్పడేది కేసీఆర్ సర్కారే అని హ‌రీశ్ పేర్కొన్నారు.

కాళేశ్వ‌రం విలువ అప్పుడే తెలుస్తుంది..

ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి బాగా పనిచేస్తున్నాడు. డంపింగ్ యార్డ్ గురించి పోరాడితే కేసులు పెట్టి CID ఆఫీసుల చుట్టూ తిప్పారు. అయినా వెన‌క్కి తగ్గలేదు. మీ తరుఫున గట్టిగ నిలబడ్డాడు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఈ డంపింగ్ యార్డ్ సమస్యఫై బీఆర్ఎస్ పార్టీ గళమెత్తుతుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండున్నర ఏళ్ళు అయ్యింది. ఇప్పటి వరకు మేడిగడ్డ రిపేర్ చెయ్యలేదు. అప్పుడు కొట్టుకుపోయింది అన్నారు. ఇప్పుడు రిపేర్లు చేస్తాం అంటున్నారు. కాళేశ్వరం విలువ కాలం కానపుడే తెలుస్తుంది. ఈ సంవత్సరం కాంగ్రెస్ కి అది అర్థం అయ్యింది. 2021లోనే ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే నంబర్ వన్ గా నిలిచింది అని ఆయ‌న తెలిపారు.

ప్ర‌జ‌లు డిసైడ్ అయి ఉన్న‌రు..

చాలా మంది BRS కార్యకర్తల మీద అక్రమ కేసులు పెడుతున్నారు. అయినా కూడా పార్టీ కోసం కార్యకర్తలు కష్టపడుతున్నారు. కష్టకాలంలో పార్టీకి అండగా ఉండే కార్యకర్తలే మాకు దేవుళ్లు. రేవంత్ రెడ్డి మాట్లాడితే అన్ని బూతులే. రాష్ట్రంలో వాయు కాలుష్యం లాగా ధ్వని కాలుష్యం నడుస్తుంది. రేవంత్ రెడ్డి బూతులతో ధ్వని కాలుష్యం మొద‌లైంది. ఈ ధ్వని కాలుష్య రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పాలని ప్రజలు డిసైడ్ అయిపోయారు. మళ్లీ కేసీఆర్ రావాలి, మంచి రోజులు రావాలని ప్రజలు కోరుకుంటున్నారు అని హ‌రీశ్‌రావు ఉద్ఘాటించారు.

 

Advertisement
Advertisement