త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

School Education | ఇంకనూ ప్రయోగాలేనా?.. వ్యవస్థను బలోపేతం చేసేదెప్పుడు?

School Education | ఇప్పుడు పాఠశాలల (School Education) రూపం మారనున్నది అనే ఓ చర్చ జరుగుతున్నది. ఇకపై 1 నుంచి 4 తరగతుల వరకు ప్రాథమిక పాఠశాలలు..! 5 నుంచి 8 తరగతులు సెకండరీ పాఠశాలలు..! 9 నుంచి 12 తరగతుల వరకు హయ్యర్ సెకండరీ పాఠశాలలుగా ఏర్పడనున్నవి అనే వార్తల నేపథ్యంలో ఉపాధ్యాయుల్లో ఈ అంశం చర్చనీయంగా మారింది!.

G

Telangana | Published On Nov 15, 2026, 11.11 am IST

School Education | ఇంకనూ ప్రయోగాలేనా?.. వ్యవస్థను బలోపేతం చేసేదెప్పుడు?
Advertisement

School Education | ఇప్పుడు పాఠశాలల (School Education) రూపం మారనున్నది అనే ఓ చర్చ జరుగుతున్నది. ఇకపై 1 నుంచి 4 తరగతుల వరకు ప్రాథమిక పాఠశాలలు..! 5 నుంచి 8 తరగతులు సెకండరీ పాఠశాలలు..! 9 నుంచి 12 తరగతుల వరకు హయ్యర్ సెకండరీ పాఠశాలలుగా ఏర్పడనున్నవి అనే వార్తల నేపథ్యంలో ఉపాధ్యాయుల్లో ఈ అంశం చర్చనీయంగా మారింది!. అంటే ఇకపై ఇంటర్ మొదటి సంవత్సరంకు పబ్లిక్ పరీక్షలు ఉండవు!. 10, 12 తరగతులకు మాత్రమే పబ్లిక్ పరీక్షలు ఉంటాయి!. ఇంటర్మీడియేట్ అనే పదం పోతున్నది!. 11 వ తరగతి, 12 వ తరగతి అనే పదాలు సంబోధనలోకి రానున్నాయి..!

విద్యా శాఖలో ప్రయోగాలు కొత్త కాదు!. ముఖ్యంగా ప్రభుత్వాలు మారినప్పుడల్లా ప్రయోగాలు జరుగుతున్నాయి!. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండగా ప్రతి ఆవాసానికి ఒక పాఠశాలను ఏర్పాటు చేసింది ఆ ప్రభుత్వం!. ఎందుకంటే అప్పుడు డ్రాప్ సంఖ్య ఎక్కువగా ఉండేది. అందుకు తగ్గట్టుగానే ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేవారు. ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక మోడల్ స్కూల్స్‌తో కొత్త పాఠశాలను ఏర్పాటు చేశారు. అప్పటికే కొనసాగుతున్న పాఠశాలలు అలాగే ఉండగా.. ఆద‌ర్శ‌ పాఠశాలలు ఏర్పాటు చేసి.. వాటిలో సీబీఎస్సీ (CBSC) సిలబస్ అంటూ ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టారు. ఆ తర్వాత సీబీఎస్సీ కాదు స్టేట్ సిలబస్ అంటూ మార్చిండ్రు..!

మారనున్న రూపం..!

తెలంగాణ ఏర్పాటయ్యాక కేసీఆర్ ప్రభుత్వం విరివిగా గురుకుల పాఠశాలను ఏర్పాటు చేసింది. బీఆర్‌ఎస్ పార్టీ ప్రతి సందర్భంలో మేమే అత్యధిక గురుకుల పాఠశాలను ఏర్పాటు చేశామని గొప్పగా చెప్పుకుంటూ ఉంటుంది. ఇక రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రభుత్వం వచ్చాక నియోజకవర్గానికి ఒకటి చొప్పున పబ్లిక్ స్కూల్స్ పేరుతో ఏర్పాటు చేయబోతున్నారు. అందుకు టెండర్లు కూడా పూర్తి అయ్యాయని, వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభిస్తామని ప్ర‌భుత్వం చెబుతున్న‌ది. ఇక ఇప్పుడు కొత్తగా పాఠశాలల రూపం మారనున్నది..!

ఇక్కడ మనం గమనించాల్సిందేమిటి అంటే.. ప్రభుత్వాలు ఎన్ని మారినా ఉన్న పాఠశాలలను బలోపేతం చేయడంలో దృష్టి సారించడం లేదు. మౌలిక సదుపాయాలు అప్ప‌టికే ఉన్న పాఠశాలలో కల్పించలేకపోతున్నారు. ఆ పాఠశాలను అలాగే ఉంచుతూ కొత్తగా పాఠశాలలను క్రియేట్ చేస్తున్నారు. అంటే వ్యవస్థను బలోపేతం చేసే అడుగులు పడడం లేదు. ఎవరి హయాంలో వాళ్ల మార్కును చూపెట్టుకోవాలనే తాపత్రయమే తప్ప ఉన్న వ్యవస్థను బలోపేతం చేయాలనేటువంటి ఆలోచన లేదు..!

పాఠశాల ఒకటే.. బోర్డులు వేర్వేరు..!

ఇప్పుడు ఇంటర్మీడియెట్‌ను పాఠశాల విద్యలో విలీనం చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. ప్రస్తుతం ఉన్న Board of Secondary Education (SSC), Board of Intermediate Education రెండింటినీ విలీనం చేసి కొత్తగా Telangana School Education Board (TSEB) ఏర్పాటు చేయాలని ఆలోచన చేస్తున్నది. నిజానికి ఒకే బోర్డు అంటే తప్పనిసరిగా 10, 11, 12 తరగతులు ఒకే పాఠశాలలోనే నిర్వహిస్తారని కాదు. ఉదాహరణకు మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో బోర్డు ఒకటే ఉన్నప్పటికీ 11, 12 తరగతులకు ప్రత్యేక జూనియర్ కాలేజీలు ఉన్నాయి. మన రాష్ట్రంలో బోర్డులు వేర్వేరుగా ఉన్నప్పటికీ ఇంటర్ తరగతులు ఒకే పాఠశాలలో బోధిస్తున్న స్కూల్స్ ఉన్నాయి. మోడల్ స్కూల్స్, గురుకులాలు, కేజీబీవీ పాఠశాలల్లో 6 వ తరగతి నుంచి ఇంటర్ వరకు తరగతులు నిర్వహిస్తున్నారు. అయితే 10వ తరగతి వరకు SSC బోర్డు, ఇంటర్ తరగతులు Board of Intermediate Education పరిధిలోకి వస్తవి. అంటే పాఠశాల ఒకటే! బోర్డులు వేర్వేరు..!

అడ్మిషన్లలో అగ్రగామి తెలంగాణ..

నిన్ననే విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా ఓ ప్రకటన చేసిండ్రు. ప్రభుత్వ పాఠశాలల అడ్మిషన్లలో దేశంలోనే తెలంగాణ (Telangana) అగ్రగామిగా ఉందని వారు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుతున్నా, తెలంగాణ మాత్రమే అడ్మిషన్లలో అగ్రగామిగా ఉందని వారు వెల్లడించారు. అంటే ఇప్పుడున్న ప్రభుత్వ పాఠశాలల పని తీరు బాగున్నట్లే. ఇక ఇప్పుడు ప్రభుత్వం చేయాల్సింది ఉన్న పాఠశాలలో మౌలిక సదుపాయాలు మెరుగు పరచి, తరగతికి ఒక ఉపాధ్యాయుడే కాకుండా.. ప్రతి సబ్జెక్టుకు ఓ ఉపాధ్యాయుడిని నియమిస్తే అడ్మిషన్లలో మాత్రమే కాదు ఫలితాల్లోనూ తెలంగాణ అగ్రగామిగా నిలువగలదు!!

-తానిపర్తి తిరుపతి రావు

ప్రభుత్వ ఉపాధ్యాయుడు, పెద్దపల్లి జిల్లా.

Advertisement
Advertisement