త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bomb Threat | మ‌ళ్లీ ముంబయి సీఎస్‌ఎంటీ రైల్వే స్టేషన్‌కు బాంబు బెదిరింపు..!

Bomb Threat | దేశవ్యాప్తంగా పండుగల రద్దీ కొనసాగుతున్న వేళ ముంబ‌యి ఛత్రపతి శివాజీ మహారాజ్‌ టెర్మినస్‌ (CSMT) రైల్వే స్టేషన్‌కు బాంబు బెదిరింపు రావడం కలకలం రేపింది. గుర్తుతెలియని వ్యక్తి పోలీసులకు ఫోన్‌ చేసి స్టేషన్‌లో బాంబు పెట్టినట్లు చెప్పడంతో పోలీసులు, భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి.

P

National | Published On Nov 15, 2026, 10.41 am IST

Bomb Threat | మ‌ళ్లీ ముంబయి సీఎస్‌ఎంటీ రైల్వే స్టేషన్‌కు బాంబు బెదిరింపు..!
Advertisement
  • రంగంలోకి దిగిన పోలీసులు, భ‌ద్ర‌తా బ‌ల‌గాలు
  • జాగిలాలతో క్షుణ్ణంగా త‌నిఖీలు
  • ఎలాంటి వ‌స్తువులు దొర‌క్క‌పోవ‌డంతో బిగ్ రిలీఫ్‌
  • ఫేక్ కాల్‌పై ఆరా తీస్తున్న పోలీసులు

Bomb Threat | దేశవ్యాప్తంగా పండుగల రద్దీ కొనసాగుతున్న వేళ ముంబ‌యి ఛత్రపతి శివాజీ మహారాజ్‌ టెర్మినస్‌ (CSMT) రైల్వే స్టేషన్‌కు బాంబు బెదిరింపు రావడం కలకలం రేపింది. గుర్తుతెలియని వ్యక్తి పోలీసులకు ఫోన్‌ చేసి స్టేషన్‌లో బాంబు పెట్టినట్లు చెప్పడంతో పోలీసులు, భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. నవంబర్‌ 14న సాయంత్రం 6.50 గంటల సమయంలో డయల్‌ 112 అత్యవసర నంబర్‌కు కాల్‌ వచ్చింది. పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌కు ఫోన్‌ చేసిన వ్యక్తి సీఎస్‌ఎంటీ రైల్వే స్టేషన్‌లో బాంబు అమర్చినట్లు పేర్కొన్నాడు. దీంతో వెంటనే డాగ్‌ స్క్వాడ్‌, బాంబ్‌ డిటెక్షన్‌ అండ్‌ డిస్పోజల్‌ స్క్వాడ్‌ (బీడీడీఎస్‌) బృందాలు స్టేషన్‌కు చేరుకున్నాయి. స్టేషన్‌ ప్రాంగణమంతా క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టాయి. రాత్రి 9.30 గంటల వరకు కొనసాగిన ఈ సోదాల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు, పేలుడు పదార్థాలు లభించక‌పోవ‌డంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. అయినప్పటికీ ముందు జాగ్రత్త చర్యగా స్టేషన్‌తోపాటు పరిసర ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ ఘటనపై రైల్వే పోలీసులు ప్రధాన కంట్రోల్‌ రూమ్‌కు సమాచారం అందించారు.

బెదిరింపు కాల్‌పై దర్యాప్తు

బాంబు బెదిరింపు చేసిన వ్యక్తిని గుర్తించేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. కాల్‌ చేసిన వ్యక్తి వివరాలను సేకరించి అతడి ఆచూకీ కనుగొనే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు పండుగల నేపథ్యంలో రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ పెరుగుతున్నందున భద్రతా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. కాగా, ఈ వారంలోనూ ముంబ‌యిలో పలుచోట్ల బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపింది. బాలీవుడ్‌ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ నివాసం, మేయర్‌ కార్యాలయం, ఛత్రపతి శివాజీ మహారాజ్‌ అంతర్జాతీయ విమానాశ్రయం, మహాలక్ష్మి రేస్‌కోర్స్‌తోపాటు పలు బ్యాంకులు, కోర్టులకు ఈమెయిల్‌ ద్వారా బెదిరింపులు అందాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు చేపట్టి భద్రతను పెంచారు. ఎక్కడా అనుమానాస్పద వస్తువులు మాత్రం క‌నిపించ‌లేదు. ఈ ఘటనలపైనా దర్యాప్తు కొన‌సాగుతోంద‌ని పోలీసు వ‌ర్గాలు తెలిపాయి.

Advertisement
Advertisement