త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Revanth Reddy | ధిక్కార స్వ‌రం వినిపించిన నేల తెలంగాణ‌

CM Revanth Reddy | తెలంగాణ ప్రజల స్వేచ్ఛ, ఆత్మగౌరవం, హక్కుల కోసం పోరాడిన యోధులకు నివాళులర్పిస్తున్నానని సీఎం రేవంత్​ రెడ్డి పేర్కొన్నారు. తరతరాల అణచివేత, దోపిడీ, భూస్వామ్య, పెత్తందారీ విధానాలపై ధిక్కార స్వరం వినిపించిన నేల తెలంగాణ అని కొనియాడారు.

S

Telangana | Published On Sep 17, 2026, 11.01 am IST

CM Revanth Reddy | ధిక్కార స్వ‌రం వినిపించిన నేల తెలంగాణ‌
Advertisement

అన్యాయాన్ని ఎదురించ‌డం ఈ నేల స్వ‌భావం
పాలనలో ప్రజలే కేంద్రంగా ఉండాలి.
ప్రజల ఆకాంక్షలే ప్రభుత్వ నిర్ణయాలకు ప్రామాణికం కావాలి
అదే స్ఫూర్తితో ప్రజా పాలన కొనసాగిస్తున్నాం
ప్ర‌జా పాల‌న దినోత్స‌వంలో సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy | త్రినేత్ర‌.న్యూస్ : తెలంగాణ ప్రజల స్వేచ్ఛ, ఆత్మగౌరవం, హక్కుల కోసం పోరాడిన యోధులకు నివాళులర్పిస్తున్నానని సీఎం రేవంత్​ రెడ్డి పేర్కొన్నారు. తరతరాల అణచివేత, దోపిడీ, భూస్వామ్య, పెత్తందారీ విధానాలపై ధిక్కార స్వరం వినిపించిన నేల తెలంగాణ అని కొనియాడారు. నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ప్రాణాలకు తెగించి పోరాడిన యోధులకు పుట్టినిల్లు తెలంగాణ అన్న సీఎం, అస్తిత్వం, ఆత్మగౌరవం, హక్కుల కోసం ఈ నేల ప్రజా చైతన్యాన్ని రగిలించిందని గుర్తు చేశారు. హైదరాబాద్​లోని పబ్లిక్​ గార్డెన్​లో ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో రేవంత్​ రెడ్డి పాల్గొని మాట్లాడారు.

సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్.. ఆయ‌న మాట‌ల్లోనే..

తెలంగాణ ప్రజల స్వేచ్ఛ, ఆత్మగౌరవం, హక్కుల కోసం పోరాడిన యోధులందరికీ ఈ చారిత్రక సందర్భంగా ఘనంగా నివాళులు అర్పిస్తున్నాను. తరతరాల అణిచివేత, దోపిడీ, భూస్వామ్య, పెత్తందారీ విధానాలపై ధిక్కార స్వరం వినిపించిన నేల తెలంగాణ. నిరంకుశ పాలకులకు వ్యతిరేకంగా ప్రాణాలకు తెగించి పోరాడిన యోధులకు పుట్టినిల్లు తెలంగాణ. అస్తిత్వం, ఆత్మగౌరవం, హక్కుల కోసం ఈ నేల ఎప్పటికప్పుడు ప్రజా చైతన్యాన్ని రగిలించింది. సమ్మక్క-సారలమ్మల పోరాటం నుంచి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం వరకు... ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం వరకు... అన్యాయాన్ని ఎదిరించడం ఈ గడ్డ స్వభావం. ఆ సుదీర్ఘ పోరాట చరిత్రలో సెప్టెంబర్ 17కు ప్రత్యేకమైన స్థానం ఉంది.
భారతదేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం వచ్చింది. కానీ అప్పటి హైదరాబాద్ రాష్ట్రం నిజాం పాలనలోనే కొనసాగింది. తెలంగాణతో పాటు నేటి మహారాష్ట్ర, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలు కూడా హైదరాబాద్ రాష్ట్రంలో భాగంగా ఉండేవి. నిజాం పాలనలో హైదరాబాద్ పారిశ్రామిక, వ్యవసాయ, విద్యా, వైద్య రంగాల్లో పురోగతి సాధించింది. నిజాం పాలనలో హైదరాబాద్ ప్రపంచ స్థాయి గుర్తింపును అందుకుంది. అదే సమయంలో గ్రామీణ తెలంగాణలో భూస్వామ్య దోపిడీ, వెట్టిచాకిరి, అణిచివేత తీవ్రంగా ఉండేది. చివరి దశలో రజాకార్ల దౌర్జన్యాలు ప్రజలను కల్లోలపరిచాయి అని సీఎం పేర్కొన్నారు.

రాచరిక పాలన నుంచి ప్రజాస్వామ్య పాలనకు

భారతదేశంలో అంతర్భాగం కావాలన్న ఆకాంక్ష ప్రజల్లో బలపడింది. నిజాం ఆంధ్ర మహాసభ, హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఉద్యమాలు జరిగాయి. మరోవైపు రజాకార్ల ఆగడాలకు వ్యతిరేకంగా, భూమి-భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో సాయుధ పోరాటం ఉధృతమైంది. రావి నారాయణరెడ్డి, భీంరెడ్డి నరసింహారెడ్డి, అనభేరి ప్రభాకర్రావు, చాకలి ఐలమ్మ, ఆరుట్ల కమలాదేవి, మల్లు స్వరాజ్యం వంటి ఎందరో యోధులు ఈ పోరాటాలకు నాయకత్వం వహించారు. హైదరాబాద్ ప్రజల ఆకాంక్షలు, ఉద్యమాలు, పోరాటాల నేపథ్యంలో ఆనాటి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ, ఉప ప్రధానమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ నాయకత్వంలో ఆపరేషన్ పోలో సైనిక చర్య చేపట్టారు. ఆపరేషన్ పోలో అనంతరం ఏడో నిజాం భారత ప్రభుత్వానికి లొంగిపోయారు. 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ రాజ్యం అధికారికంగా భారతదేశంలో అంతర్భాగమైంది. అది నిజాం పాలకుల అధికారం ముగిసిన రోజు మాత్రమే కాదు. రాచరిక పాలన నుంచి ప్రజాస్వామ్య పాలనకు మార్గం తెరుచుకున్న చారిత్రక సందర్భం. అందుకే సెప్టెంబర్ 17ను మనం “ప్రజా పాలన దినోత్సవం”గా జరుపుకుంటున్నాం. ప్రజా పాలన అంటే ప్రజల మాటకు విలువ ఇవ్వడం. వారి సమస్యలకు పరిష్కారం చూపడం. వారి హక్కులను కాపాడడం. ప్రభుత్వ వనరులు అందరికీ చేరేలా చూడడం. ప్రతి మనిషి ఆత్మగౌరవంతో జీవించే పరిస్థితి కల్పించడం అని సీఎం పేర్కొన్నారు.

తెలంగాణ ప్రపంచంతో పోటీ పడుతోంది 

హైదరాబాద్ రాజ్యం భారతదేశంలో విలీనమయ్యే వరకు ఎన్నో ఉద్యమాలు, త్యాగాలు, బలిదానాలు జరిగాయి. ఆ చరిత్ర మనకు ఒక స్పష్టమైన సందేశం ఇస్తోంది. పాలనలో ప్రజలే కేంద్రంగా ఉండాలి. ప్రజల ఆశలు, ఆకాంక్షలే ప్రభుత్వ నిర్ణయాలకు ప్రామాణికం కావాలి. అదే స్ఫూర్తితో ప్రజల ఆత్మగౌరవానికి పట్టం కడుతూ ప్రజా పాలన కొనసాగిస్తున్నాం. తెలంగాణ ఇప్పుడు పొరుగు రాష్ట్రాలతో మాత్రమే కాదు... ప్రపంచంతో పోటీ పడుతోంది అని సీఎం తెలిపారు.

రైతు సంక్షేమానికి దాదాపు రూ.1 లక్ష 72 వేల కోట్లు ఖర్చు

రాష్ట్ర తలసరి ఆదాయం రూ.4,18,931కు చేరింది. ఇది దేశ తలసరి ఆదాయం కన్నా దాదాపు 91 శాతం అధికం. అభివృద్ధి అంకెల్లో మాత్రమే కాకుండా... ప్రజల జీవితాల్లో కనిపించాలన్నదే మా లక్ష్యం. ప్రజా ప్రభుత్వం రైతు పక్షపాతి. ప్రతి రైతు కుటుంబం సంతోషంగా ఉండాలనే లక్ష్యంతో రూ.2 లక్షల వరకు పంట రుణాలు మాఫీ చేశాం. రూ.20,616 కోట్లు విడుదల చేసి 25.35 లక్షల రైతు కుటుంబాలను అప్పుల ఊబి నుంచి బయటపడేశాం. రైతు భరోసా కింద రూ.36 వేల కోట్లకు పైగా రైతుల ఖాతాల్లో జమ చేశాం. సన్నాలకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ చెల్లించాం. ప్రభుత్వం ఇచ్చిన మద్దతుతో వరి సాగు విస్తీర్ణం, దిగుబడిలో తెలంగాణ దేశంలోనే నెంబర్వన్ స్థానంలో నిలిచింది. 32 నెలల్లో వ్యవసాయం, రైతు సంక్షేమానికి దాదాపు రూ.1 లక్ష 72 వేల కోట్లు ఖర్చు చేశామ‌ని సీఎం స్ప‌ష్టం చేశారు.

కృష్ణా జలాల్లో తెలంగాణకు దక్కాల్సిన వాటా కోసం న్యాయ పోరాటం

రైతుకు భూమితోనే భుక్తి. అందుకే భూ భారతి చట్టం ద్వారా భూ పరిపాలనలో సమగ్ర సంస్కరణలు తీసుకొచ్చాం. భూధార్, ఏఐ ఆధారిత భూమిత్ర సేవలు ప్రారంభించాం. 5 లక్షల 94 వేల మంది రైతులకు పట్టాదార్ పాస్బుక్స్ జారీ చేశాం. కృష్ణా జలాల్లో తెలంగాణకు దక్కాల్సిన వాటా కోసం న్యాయ పోరాటం చేస్తున్నాం.పాలమూరు-రంగారెడ్డి, సీతారామ ఎత్తిపోతలు, ఎస్‌ఎల్బీసీతో పాటు ఇతర పెండింగ్ ప్రాజెక్టుల పనులను యుద్ధ ప్రాతిపదికన చేపడుతున్నామ‌ని రేవంత్ రెడ్డి తెలిపారు.

తెలంగాణలో ప్రతి ఆడబిడ్డ సగర్వంగా జీవించాలి

తెలంగాణలో ప్రతి ఆడబిడ్డ సగర్వంగా జీవించాలి. ఆర్థికంగా స్వతంత్రంగా ఎదగాలి. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలన్న లక్ష్యంతో మా ప్రభుత్వం పనిచేస్తోంది. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం కల్పించాం. ఈ ప్రయాణాలతో మన ఆడబిడ్డలకు రూ.12,385 కోట్ల మేర ఖర్చు ఆదా అయింది. గృహజ్యోతి కింద 53 లక్షలకు పైగా కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. 43 లక్షల కుటుంబాలకు రూ.500కే వంటగ్యాస్ సిలిండర్ అందిస్తున్నాం. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ ద్వారా 1 లక్ష 68 వేల మంది ఆడబిడ్డలకు రూ.4,709 కోట్ల సహాయం చేశాం. 4 లక్షల 54 వేల స్వయం సహాయక సంఘాలకు రూ.60 వేల 487 కోట్ల బ్యాంకు లింకేజీ, రూ.1,900 కోట్ల వడ్డీ రాయితీ కల్పించాం. మహిళా మార్టులు, పెట్రోల్ బంకులు, ఆర్టీసీ అద్దె బస్సులతో మహిళల ఆదాయం పెంచుతున్నాం. మహిళను కేవలం లబ్ధిదారుగా కాకుండా... ఆర్థిక వ్యవస్థలో భాగస్వామిగా నిలబెట్టాలన్నదే మా లక్ష్యం అని సీఎం ఉద్ఘాటించారు.

హైదరాబాద్ నగర పరిధిలో లక్ష ఇందిరమ్మ ఇళ్లు

ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా 3.42 కోట్ల మందికి సన్న బియ్యం అందిస్తున్నాం. 15 లక్షలకు పైగా కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేశాం. 43 లక్షలకు పైగా మందికి సామాజిక భద్రతా పింఛన్లు అందిస్తున్నాం. మేం అధికారంలోకి వచ్చిన తర్వాత పింఛన్ల కింద సుమారు రూ.31 వేల కోట్లు అందించాం. తాజాగా మరో 2.25 లక్షల మందికి పింఛన్లు ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది. ప్రతి కుటుంబం ఆత్మగౌరవంతో నివసించాలనేది మా ప్రభుత్వ ఆశయం. ఇందిరమ్మ ఇళ్ల తొలి దశలో రూ.22,500 కోట్లతో 4 లక్షల 50 వేల ఇళ్లు మంజూరు చేశాం. ఒక్కో ఇంటికి రూ.5 లక్షలు కేటాయించాం. రెండో దశలో మరో 2.50 లక్షల ఇళ్లు మంజూరు చేశాం. హైదరాబాద్ నగర పరిధిలో లక్ష ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఇందిరమ్మ టవర్ల నిర్మాణాన్ని ప్రారంభించాం అని ముఖ్య‌మంత్రి పేర్కొన్నారు.

 “తెలంగాణ సోషల్ జస్టిస్ డే”గా ఫిబ్రవరి 4 

ప్రజా పాలనకు సామాజిక న్యాయం పునాది. సామాజిక అంతరాలను తగ్గించి ప్రతి ఒక్కరికీ న్యాయం చేయాలనే లక్ష్యంతో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ కుల సర్వేను శాస్త్రీయంగా చేపట్టాం. ఆ సర్వే గణాంకాల ఆధారంగా విద్య, ఉపాధి, స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లులను శాసనసభలో ఆమోదించి రాష్ట్రపతి ఆమోదానికి పంపించాం. గౌరవ సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి దేశంలోనే తొలిసారిగా ఎస్సీ వర్గీకరణ చేపట్టాం. ఫిబ్రవరి 4ను ప్రతి ఏటా “తెలంగాణ సోషల్ జస్టిస్ డే”గా జరుపుకుంటున్నాం. సామాజిక న్యాయం అంటే నినాదం కాదు. వెనుకబడిన వారిని ముందుకు తీసుకురావడం. అవకాశాలు తక్కువగా దక్కిన వారికి మరిన్ని అవకాశాలు కల్పించడం. అప్పుడే సమాజం సమానంగా ముందుకు సాగుతుందన్నారు.

పిల్లలందరికీ నాణ్యమైన విద్య

ప్రజా ప్రభుత్వానికి విద్య, వైద్యం రెండు కళ్లలాంటివి. కుల, మత భేదాలు లేకుండా పిల్లలందరికీ నాణ్యమైన విద్య అందాలనే లక్ష్యంతో ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు నిర్మిస్తున్నాం. ఒక్కో నియోజకవర్గంలో 20 నుంచి 25 ఎకరాల్లో సకల వసతులతో వీటి నిర్మాణం చేపడుతున్నాం. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ తరగతులు ప్రారంభించాం. ప్రతి నియోజకవర్గంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఉదయం అల్పాహారం, పాలు అందించేందుకు రూ.927 కోట్లు ఖర్చు చేస్తున్నాం. మధ్యాహ్న భోజనాన్ని 12వ తరగతి విద్యార్థుల వరకు విస్తరించాం. 11 లక్షల మంది విద్యార్థులకు స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నాం. విద్యా రంగంలో తీసుకున్న చర్యలతో పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్లో తెలంగాణ 28వ స్థానం నుంచి 18వ స్థానానికి చేరుకుంది. ప్రపంచంలోని అత్యుత్తమ విశ్వవిద్యాలయాల ఆఫ్షోర్ క్యాంపస్లను హైదరాబాద్కు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నాం. అమెరికాకు చెందిన నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీతో పాటు బ్రిటన్లోని 17 స్వతంత్ర విద్యా సంస్థల సమాఖ్య యూనివర్సిటీ ఆఫ్ లండన్ తమ ఆఫ్షోర్ క్యాంపస్ల ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేశాయి అని సీఎం తెలిపారు.

రూ.2,700 కోట్లతో కొత్త ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణం

ఆరోగ్య రంగానికీ అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచాం. ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా 5 లక్షల 19 వేల మందికి రూ.2,526 కోట్ల సహాయం అందించాం. సామాన్యుడికి కార్పొరేట్ స్థాయి వైద్యం అందించాలనే లక్ష్యంతో గోషామహల్లో రూ.2,700 కోట్లతో కొత్త ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణం మొదలైంది. సనత్నగర్లో మర్రి చెన్నారెడ్డి టిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను ప్రారంభించుకున్నాం. అల్వాల్, ఎల్బీనగర్ టిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను త్వరలో అందుబాటులోకి తీసుకొస్తామ‌ని పేర్కొన్నారు.

ఏఐతో ఉద్యోగాల స్వరూపం మారుతోంది

తెలంగాణ ఉద్యమంలో యువత ముందుండి పోరాడింది. ఉద్యోగాలు, ఉపాధి అవకాశాల కోసం పోరాడింది. 72 వేలకుపైగా ప్రభుత్వ ఉద్యోగ నియామకాలను పారదర్శకంగా పూర్తి చేశాం. గ్రూప్-1 నుంచి గ్రూప్-4 వరకు పరీక్షలను పారదర్శకంగా నిర్వహించాం. ప్రపంచం వేగంగా మారుతోంది. ఏఐతో ఉద్యోగాల స్వరూపం మారుతోంది. కొత్త నైపుణ్యాలకు డిమాండ్ పెరుగుతోంది. అందుకే నైపుణ్యాభివృద్ధికి పెద్దపీట వేస్తూ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేశాం. ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా అప్‌గ్రేడ్ చేసుకున్నాం. ఏటీసీలో శిక్షణ పొందిన విద్యార్థులు ఈరోజు క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ సాధిస్తున్నారు. పాలిటెక్నిక్ కాలేజీల్లోనూ కొత్త కోర్సులు ప్రవేశపెడుతున్నాం. మన యువత తెలంగాణలోనే కాదు... ప్రపంచంతో పోటీ పడే స్థాయికి ఎదగాలి అని సీఎం అన్నారు.

ఆహార కల్తీని ఎట్టి పరిస్థితుల్లో సహించం

రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన మౌలిక వసతులను కూడా వేగంగా విస్తరిస్తున్నాం. రూ.38 వేల 595 కోట్లతో 122.9 కిలోమీటర్ల మెట్రో రెండో దశ విస్తరణకు ప్రతిపాదనలు పంపించాం. ఆదిలాబాద్, మామునూరు విమానాశ్రయాలకు అనుమతులు సాధించాం. అవసరమైన భూసేకరణ చేపట్టాం. హైదరాబాద్ ప్రజలకు స్వచ్ఛమైన గాలి, నీరు అందించాలనే లక్ష్యంతో మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు ప్రారంభించాం. 55 కిలోమీటర్ల పరిధిలో మూసీని పునరుజ్జీవింపజేస్తాం. ప్రజల ఆరోగ్యంతో ఆడుకునే ఆహార కల్తీని ఎట్టి పరిస్థితుల్లో సహించం. అందుకే టీజీ సేఫ్ ఏర్పాటు చేశాం. రాష్ట్రాన్ని మాదకద్రవ్యాల రహితంగా తీర్చిదిద్దేందుకు ఈగల్ వ్యవస్థను పటిష్ఠం చేశామ‌ని సీఎం స్ప‌ష్టం చేశారు.

రూ.70 వేల కోట్లతో దేశంలోనే అతిపెద్ద ఏఐ డేటా సెంటర్

మన లక్ష్యం ఈ రోజు అవసరాలు తీర్చడమే కాదు. రేపటి తెలంగాణను నిర్మించడం. తెలంగాణ రైజింగ్ విజన్ 2047 లక్ష్యాలను సాధించేందుకు ప్రజా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. 2047 నాటికి తెలంగాణను మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలనేది మా సంకల్పం. దేశ జీడీపీలో తెలంగాణ వాటాను 10 శాతానికి పెంచే దిశగా అడుగులు వేస్తున్నాం. దాదాపు 30 వేల ఎకరాల్లో భారత్ ఫ్యూచర్ సిటీని దేశంలో తొలి నెట్-జీరో స్మార్ట్ సిటీ నిర్మిస్తున్నాం. డిసెంబర్లో నిర్వహించే ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026 సందర్భంగా ఫ్యూచర్ సిటీ మాస్టర్ ప్లాన్‌ను ఆవిష్కరిస్తాం. ఫ్యూచర్ సిటీలో టీసీఎస్ రూ.70 వేల కోట్లతో దేశంలోనే అతిపెద్ద ఏఐ డేటా సెంటర్ నిర్మించేందుకు ముందుకు వచ్చింది. రూ.లక్ష కోట్ల పెట్టుబడితో అమెజాన్ ఇప్పటికే డేటా సెంటర్ నిర్మాణం చేపట్టింది. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, లైఫ్ సైన్సెస్ హబ్, ఈవీ పార్క్, ఏఐ సిటీ, హెల్త్ సిటీ, ఎడ్యుకేషన్ సిటీ వంటి ప్రత్యేక జోన్లతో ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేస్తున్నామ‌ని ముఖ్య‌మంత్రి తెలిపారు.

రహదారులు అభివృద్ధికి సూచిక

రీజినల్ రింగ్ రోడ్డు, గ్రీన్ ఫీల్డ్ హైవేలు, డ్రైపోర్టులు, హైదరాబాద్-నాగపూర్, హైదరాబాద్-బెంగళూరు, హైదరాబాద్-విజయవాడ పారిశ్రామిక కారిడార్లు తెలంగాణ ముఖచిత్రాన్ని మార్చనున్నాయి. రహదారులు అభివృద్ధికి సూచిక. గ్రామం నుంచి మండలానికి... మండలం నుంచి జిల్లాకు... జిల్లా నుంచి రాష్ట్ర రాజధానికి మెరుగైన రహదారి అనుసంధానం కల్పించేందుకు పనులు చేపట్టాం. ఆర్ అండ్ బీ పరిధిలో రూ.13 వేల కోట్లతో, పంచాయతీరాజ్ పరిధిలో రూ.6,294 కోట్లతో రహదారి పనులు చేపడుతున్నాం. ప్రస్తుతం ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. విద్యుత్ డిమాండ్ కూడా పెరిగింది. తాగునీరు, విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు రాకుండా ముందస్తు ప్రణాళికలతో పనిచేస్తున్నాం. వీబీ జీ రామ్ జీలో ఎక్కువ పని దినాలు కల్పించేందుకు ప్రయత్నిస్తున్నాం అని రేవంత్ రెడ్డి తెలిపారు.

చరిత్రను మరిచిపోం.. చ‌రిత్ర దగ్గరే ఆగిపోం..

అభివృద్ధి, సంక్షేమంతో పాటు ఆత్మగౌరవం, స్వేచ్ఛ, సమానత్వం, సామాజిక న్యాయం మా ప్రజా పాలనకు పునాదులు. సెప్టెంబర్ 17 మనకు గతాన్ని మాత్రమే గుర్తు చేసే రోజు కాదు. మన బాధ్యతను కూడా గుర్తు చేసే రోజు. నిజాం రాచరిక పాలన నుంచి ప్రజాస్వామ్య పాలనకు మార్గం తెరుచుకున్న చారిత్రక ఘట్టం. సకల జనుల ఉద్యమం, ఎన్నో పోరాటాలు, అమరుల త్యాగాలతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఇప్పుడు ఆ చరిత్ర, ఆ ఉద్యమాల ఫలాలు ప్రజల జీవితాల్లో కనిపించాలి. రైతుకు భరోసా ఉండాలి. మహిళలు ఆర్థికంగా ఎదగాలి. అట్టడుగు వర్గాలకు న్యాయం జరగాలి. పేద బిడ్డకు మంచి చదువు, మంచి వైద్యం అందాలి. యువతకు ప్రపంచంతో పోటీ పడే అవకాశాలు రావాలి. అభివృద్ధి రాష్ట్రంలోని ప్రతి ప్రాంతానికీ చేరాలి. చరిత్రను మరిచిపోం. చ‌రిత్ర దగ్గరే ఆగిపోం.. ఆ పోరాట స్ఫూర్తితో ఆధునిక తెలంగాణను నిర్మించుకుందాం. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల భాగస్వామ్యంతో... తెలంగాణను ప్రపంచం గర్వించే రాష్ట్రంగా తీర్చిదిద్దుకుందాం అని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.

Advertisement
Advertisement