త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Minister Ponnam Prabhakar | దశాబ్దం తర్వాత ఆర్టీసీ యూనియన్ ఎన్నికలు

Minister Ponnam Prabhakar | తెలంగాణ ఆర్టీసీలో దాదాపు దశాబ్దం తర్వాత కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికలు జరగనున్నాయి. అక్టోబర్‌ 9న నిర్వహించే ఎన్నికల్లో కార్మికులంతా స్వచ్ఛందంగా, ప్రజాస్వామ్యబద్ధంగా పాల్గొనాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ పిలుపునిచ్చారు. గత ప్రభుత్వ హయాంలో అణచివేతకు గురైన కార్మిక సంఘాల హక్కులను ప్రజాపాలన ప్రభుత్వం పునరుద్ధరిస్తోందని తెలిపారు.

P

Telangana | Published On Sep 19, 2026, 3.31 pm IST

Minister Ponnam Prabhakar | దశాబ్దం తర్వాత ఆర్టీసీ యూనియన్ ఎన్నికలు
Advertisement
  • కార్మికులంతా స్వ‌చ్ఛందంగా పాల్గొనాలి
  • కార్మికుల హ‌క్కుల‌ను ప్ర‌భుత్వం పున‌రుద్ధ‌రిస్తోంది
  • ర‌వాణాశాఖ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌

Minister Ponnam Prabhakar | తెలంగాణ ఆర్టీసీలో దాదాపు దశాబ్దం తర్వాత కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికలు జరగనున్నాయి. అక్టోబర్‌ 9న నిర్వహించే ఎన్నికల్లో కార్మికులంతా స్వచ్ఛందంగా, ప్రజాస్వామ్యబద్ధంగా పాల్గొనాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ పిలుపునిచ్చారు. గత ప్రభుత్వ హయాంలో అణచివేతకు గురైన కార్మిక సంఘాల హక్కులను ప్రజాపాలన ప్రభుత్వం పునరుద్ధరిస్తోందని తెలిపారు. 2016 జూలై 19న ఆర్టీసీ కార్మిక సంఘాల చివరి గుర్తింపు ఎన్నికలు జరిగాయని మంత్రి గుర్తుచేశారు. ఆ తర్వాత ఎన్నికలకు అవకాశం లేకుండా పోయిందన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఆర్టీసీ కార్మిక సంఘాలు కీలక పాత్ర పోషించాయని పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రజాపాలన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టీసీ సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నామని పొన్నం తెలిపారు. కార్మికులకు ఆర్థిక భరోసాతో పాటు ప్రజాస్వామ్య హక్కులను కూడా పునరుద్ధరిస్తున్నామని చెప్పారు.

విలీన ప్రక్రియలో కార్మికుల భాగస్వామ్యం

గుర్తింపు సంఘాల ఎన్నికల అనంతరం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే అంశంపై తదుపరి ప్రక్రియ చేపడతామని మంత్రి తెలిపారు. ఎన్నికల్లో గెలిచిన గుర్తింపు సంఘం ప్రతినిధులను అధికారుల కమిటీలో భాగస్వాములను చేస్తామని చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో విలీనం అనంతరం ఎదురైన ఇబ్బందులు పునరావృతం కాకుండా.. కార్మికుల ప్రయోజనాలను కాపాడేలా విలీనం ప్రక్రియను ముందుకు తీసుకెళ్తామని స్పష్టం చేశారు. ప్రజాపాలన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టీసీ కార్మికుల సంక్షేమం కోసం పలు నిర్ణయాలు తీసుకున్నామని పొన్నం వివరించారు. పెండింగ్‌ డీఏలను చెల్లించడంతో పాటు 2017కు సంబంధించిన 21 శాతం, 2021కు సంబంధించిన 11 శాతం ఫిట్‌మెంట్‌ అందించామని తెలిపారు. సీసీఎస్‌, పీఎఫ్‌ బకాయిలను విడుదల చేసి నెలవారీ చెల్లింపులు కొనసాగిస్తున్నామని చెప్పారు.

తొల‌గించిన కార్మికుల‌ను విధుల్లోకి తీసుకున్నం

1,432 కారుణ్య నియామకాలు పూర్తి చేయడంతో పాటు గత ప్రభుత్వ హయాంలో సర్వీసు నుంచి తొలగించిన 250 మంది ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకున్నామని పేర్కొన్నారు. పని భారం తగ్గించేందుకు 4 వేల ఉద్యోగాల నియామకాలకు అనుమతి ఇచ్చామని తెలిపారు. డ్రైవర్‌, శ్రామిక్‌ పోస్టుల నియామక ప్రక్రియ పూర్తి చేశామని, ఆర్టీసీకి 2,932 కొత్త బస్సులు కొనుగోలు చేస్తున్నామని వెల్లడించారు. 600 బస్సులకు మహిళలను యజమానులుగా చేసే కార్యక్రమాన్ని చేపట్టామని, మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తూ ఆర్టీసీని బలోపేతం చేస్తున్నామని తెలిపారు. ‘ఆర్టీసీ కార్మికులు కేవలం ఉద్యోగులు కాదు.. ప్రజా రవాణా వ్యవస్థకు వెన్నెముక. వారి హక్కులను కాపాడటం, సంక్షేమాన్ని పరిరక్షించడం ప్రజాపాలన ప్రభుత్వ బాధ్యత. కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికలతో ప్రజాస్వామ్య హక్కులను తిరిగి పునరుద్ధరిస్తున్నాం. భవిష్యత్‌లోనూ కార్మికుల భాగస్వామ్యంతో ఆర్టీసీని మరింత బలోపేతం చేస్తాం’ అని మంత్రి పొన్నం ప్రభాకర్ స్ప‌ష్టం చేశారు.

Advertisement

తాజావార్తలు

Advertisement