త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ponguleti Srinivas Reddy | మియాపూర్ భూములు అమ్మి.. పేదింటి ఆడ‌బిడ్డ‌ల‌కు ఇళ్లు క‌ట్టిస్తాం

Ponguleti Srinivas Reddy | ఇటీవ‌ల‌ కంచె గ‌చ్చిబౌలి భూములు.. తాజాగా మియాపూర్ భూముల (Miyapur Lands) విష‌యంలో సుప్రీంకోర్టు (Supreme Court) లో తెలంగాణ ప్ర‌భుత్వానికి అనుకూలంగా తీర్పు రావ‌డం ప్ర‌జా ప్ర‌భుత్వ న్యాయ‌పోరాటానికి నిద‌ర్శ‌న‌మ‌ని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి (Ponguleti Srinivas Reddy) అన్నారు.

S

Telangana | Published On Oct 30, 2026, 4.48 pm IST

Ponguleti Srinivas Reddy | మియాపూర్ భూములు అమ్మి.. పేదింటి ఆడ‌బిడ్డ‌ల‌కు ఇళ్లు క‌ట్టిస్తాం
Advertisement
  • ప్రభుత్వ భూముల పరిరక్షణలో ప్ర‌జా ప్ర‌భుత్వం రాజీలేని పోరాటం చేస్తోంది
  • కంచె గచ్చిబౌలి నుంచి మియాపూర్ భూముల్లో సుప్రీంకోర్టు తీర్పు నిద‌ర్శ‌నం
  • రెవెన్యూ యంత్రాంగానికి ప్రత్యేక అభినందనలు
  • సీఎం రేవంత్ పర్యవేక్షణలో ప్రభుత్వ భూముల పరిరక్షణకు పటిష్ట చర్యలు కొన‌సాగిస్తాం
  • రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

Ponguleti Srinivas Reddy | త్రినేత్ర న్యూస్‌: ఇటీవ‌ల‌ కంచె గ‌చ్చిబౌలి భూములు.. తాజాగా మియాపూర్ భూముల (Miyapur Lands) విష‌యంలో సుప్రీంకోర్టు (Supreme Court) లో తెలంగాణ ప్ర‌భుత్వానికి అనుకూలంగా తీర్పు రావ‌డం ప్ర‌జా ప్ర‌భుత్వ న్యాయ‌పోరాటానికి నిద‌ర్శ‌న‌మ‌ని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి (Ponguleti Srinivas Reddy) అన్నారు. బీఆర్ఎస్ నేతలు కొల్లగొట్టాలని చూసిన మియాపూర్ లోని 30 వేల కోట్ల విలువ చేసే 560 ఎకరాల భూమి ప్రభుత్వానిదే అని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందన్నారు. ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం న్యాయస్థానాల్లో సమర్థంగా ప్రభుత్వ వాదనలు వినిపించి ఆ భూములు ప్రభుత్వానికి దక్కడంలో కీలక పాత్ర పోషించిన రెవెన్యూ అధికారులు, న్యాయ నిపుణులు, ప్రభుత్వ న్యాయవాదులను ఆయ‌న‌ ప్రత్యేకంగా అభినందించారు. ఖమ్మం జిల్లా ఏదులాపురంలో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల బ్ధిదారుల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమంలో శుక్ర‌వారం ఆయ‌న మాట్లాడారు.

మియాపూర్ భూములు అమ్మి పేదింటి ఆడ‌బిడ్డ‌ల‌కు ఇందిర‌మ్మ ఇళ్ల‌ను క‌ట్టి చూపిస్తం. ప్రభుత్వ భూముల పరిరక్షణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం రాజీలేని వైఖరితో ముందుకు సాగుతోంది. ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా ఒకవైపు కఠిన చర్యలు తీసుకుంటూనే, మరోవైపు దశాబ్దాలుగా న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉన్న భూ వివాదాలను పరిష్కరించేందుకు సమర్థవంతమైన న్యాయపోరాటం చేస్తోంది. రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వ భూముల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. విలువైన ప్రభుత్వ భూములపై కొనసాగుతున్న న్యాయవివాదాలను త్వరితగతిన పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి సారించారు.

రెవెన్యూ అధికారులు, న్యాయశాఖ, ప్రభుత్వ న్యాయవాదుల మధ్య సమన్వయాన్ని పెంచి, సుప్రీంకోర్టు సహా వివిధ న్యాయస్థానాల్లో ప్రభుత్వ వాదనలను బలంగా వినిపించేందుకు అవసరమైన చర్యలు చేపట్టారు. గతంలో సరైన పర్యవేక్షణ, సమన్వయం కొరవడటంతో అనేక విలువైన ప్రభుత్వ భూములకు సంబంధించి దశాబ్దాల తరబడి న్యాయవివాదాలు కొనసాగాయి. ఈ పరిస్థితిని మార్చేందుకు ప్రజా ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతోంది. ప్రభుత్వ భూములకు సంబంధించిన పాత రికార్డులు, రెవెన్యూ ఆధారాలు, న్యాయపరమైన అంశాలను సమగ్రంగా పరిశీలించి, ప్రభుత్వ హక్కులను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటోంది.

కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాల విలువైన భూములు, మియాపూర్ భూముల విష‌యాల్లో సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు రావడం కీలక విజయం. ఈ రెండు ఉదంతాలు ప్రభుత్వ భూముల పరిరక్షణ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవను, రెవెన్యూ శాఖ సమర్థవంతమైన కార్యాచరణను ప్రతిబింబిస్తున్నాయి. గత రెండు దశాబ్దాలుగా వివాదాల్లో చిక్కుకున్న అత్యంత విలువైన భూములను న్యాయపోరాటం ద్వారా ప్రభుత్వానికి చెందేలా అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇవ్వడం సాధారణ విషయం కాదని. దీని వెనుక ప్రభుత్వ చిత్తశుద్ధి, అధికారుల సమన్వయం, న్యాయపరమైన కృషి ఉన్నాయి.

అది ప్ర‌జ‌లంద‌రి ఉమ్మ‌డి ఆస్తి

ప్రభుత్వ భూమి అంటే అది ఏ ఒక్క వ్యక్తికో, సంస్థకో చెందిన ఆస్తి కాదు. అది రాష్ట్ర ప్రజలందరి ఉమ్మడి ఆస్తి. నేటి తరంతో పాటు భవిష్యత్ తరాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ భూములను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఆక్రమణలకు పాల్పడినా, అక్రమంగా హక్కులు పొందేందుకు ప్రయత్నించినా ఉపేక్షించం. ప్రభుత్వ భూములను కాపాడటం అంటే ప్రజల సంపదన‌ను కాపాడటమే.

ఆక్రమణలను అడ్డుకోవడ‌మే కాకుండా, న్యాయస్థానాల్లోనూ ప్రభుత్వ హక్కులను సమర్థవంతంగా నిలబెట్టడమే మా ప్రభుత్వ లక్ష్యం. కంచె గచ్చిబౌలి, మియాపూర్ భూముల విషయంలో సాధించిన విజయాలు ఈ దిశగా మా ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వ భూముల పరిరక్షణకు మరింత పటిష్టమైన చర్యలు కొనసాగిస్తాం. ప్రజల ఆస్తులను కాపాడే విషయంలో ఎలాంటి రాజీ ఉండదు అని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్ల‌డించారు.

ట్యాగ్స్:

HyderabadKancha GachibouliMiyapur LandsPonguleti Srinivas ReddyRevanth ReddySupreme CourtTelangana
Advertisement
Advertisement