త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ponguleti Srinivas Reddy | పార‌ద‌ర్శ‌క పాల‌న కోస‌మే శాశ్వ‌త భ‌వ‌నాలు: పొంగులేటి

Ponguleti Srinivas Reddy | ప్ర‌జ‌ల‌కు పార‌ద‌ర్శ‌క పాల‌న అందించాల‌నే ల‌క్ష‌యంతో ఆర్డీవో, తహసీల్దార్, స‌బ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు శాశ్వత భవనాలు నిర్మించాలని నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ఎన్ని తహసీల్దార్, ఆర్డీవో, స‌బ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి, శిథిలావ‌స్థ, పాల‌న‌కు అనువుగా లేని భ‌వ‌నాల‌ వివ‌రాలను సేకరించారు.

S

Telangana | Published On Jun 11, 2026, 4.38 pm IST

Ponguleti Srinivas Reddy | పార‌ద‌ర్శ‌క పాల‌న కోస‌మే శాశ్వ‌త భ‌వ‌నాలు: పొంగులేటి
Advertisement
  • మొద‌టిద‌శ‌లో 125 త‌హ‌సీల్దార్, 11 ఆర్డీవో ఆఫీసుల‌కు శాశ్వ‌త భ‌వ‌నాలు
  • అన్నీ ఒకే న‌మూనాలో ఉండేలా నిర్మాణాలు
  • స‌చివాల‌యంలో ఉన్న‌తాధికారుల స‌మీక్ష‌లో మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి

Ponguleti Srinivas Reddy | త్రినేత్ర‌.న్యూస్‌: ప్ర‌జ‌ల‌కు పార‌ద‌ర్శ‌క పాల‌న అందించాల‌నే ల‌క్ష‌యంతో ఆర్డీవో, తహసీల్దార్, స‌బ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు శాశ్వత భవనాలు నిర్మించాలని నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి తెలిపారు. ఈ భ‌వ‌నాల‌ను హౌసింగ్ కార్పొరేష‌న్ ఆధ్వర్యంలో నిర్మించ‌నున్న‌ట్లు ఆయ‌న పేర్కొన్నారు. సచివాలయంలో రెవెన్యూ, హౌసింగ్ శాఖ ఉన్నతాధికారులతో గురువారం ఆయ‌న సమీక్షా స‌మావేశం నిర్వహించి అధికారుల‌కు దిశానిర్దేశం చేశారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్రంలో ఎన్ని తహసీల్దార్, ఆర్డీవో, స‌బ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి, శిథిలావ‌స్థ, పాల‌న‌కు అనువుగా లేని భ‌వ‌నాల‌ వివ‌రాలను సేకరించారు.

ప్రభుత్వ కార్యాలయాలు అద్దె భవనాల్లో కొనసాగడం సరైంది కాదు. ప్రజలకు సేవలందించే కేంద్రాలు గౌరవప్రదంగా ఉండాలనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నాం. మొద‌టి ద‌శ‌లో అద్దె భావనాల్లో, శిథిలావస్థలో ఉన్న 125 తహసీల్దార్ కార్యాలయాలు, 11 ఆర్డీవో కార్యాలయాలను ఆధునిక సౌకర్యాలతో శాశ్వత భవనాలు నిర్మిస్తాం. అవ‌స‌ర‌మైన చోట‌ మ‌ర‌మ్మతులు చేప‌ట్టడానికి నివేదిక‌లు అందించాలి. ఇందుకు అవసరమైన స్థలాలను తక్షణమే గుర్తించి నిర్మాణ పనులు త్వరితగతిన ప్రారంభించేలా కార్యాచరణ రూపొందించాలి అని మంత్రి అధికారులను ఆదేశించారు.

రాష్ట్రవ్యాప్తంగా అన్ని భవనాలు ఒకే నమూనాలో, ప్రజలకు అందుబాటులో ఉండేలా డిజైన్ చేస్తాం. సీఎం రేవంత్ రెడ్డితో చర్చించి డిజైన్లకు తుది రూపు ఇస్తాం. త‌క్కువ ఖ‌ర్చుతో ప్రజ‌ల‌కు అత్యుత్తమ సేవ‌లు అందేలా ఈ భ‌వ‌నాల నిర్మాణం ఉంటుంది అని పొంగులేటి పేర్కొన్నారు.

గత ప్రభుత్వం ముందుచూపు లేకుండా మండలాల పునర్విభజన చేపట్టింది. కొన్ని మండలాలు రెండు మూడు జిల్లాల పరిధిలోకి వచ్చే విధంగా రూపొందించారు. అనేక కార్యాలయాల్లో కనీస వసతులు లేకపోవడం, సిబ్బంది కొరత తీవ్రంగా ఉండడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడ్డారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక‌ కొత్త మండలాలకు అవసరమైన పోస్టులు మంజూరు చేసి పరిపాలనను బలోపేతం చేశాం అని మంత్రి శ్రీ‌నివాస్‌రెడ్డి వివ‌రించారు.

12 క్ల‌స్ట‌ర్లుగా విభ‌జించి..

స్టాంప్స్ అండ్‌ రిజిస్ట్రేషన్ శాఖలో అత్యాధునిక వసతులతో ఇప్పటికే సమీకృత భవనాల నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల్లోని 39 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను 12 క్లస్టర్లుగా విభజించి సమీకృత భవనాలు నిర్మిస్తున్నాం. ఇప్పటికే గచ్చిబౌలి, మేడ్చల్-మల్కాజిగిరి, పఠాన్ చెరువు, కోహెడలలో భవనాలకు శంకుస్థాపన చేసి పనులు కూడా ప్రారంభించాం. జిల్లా నియోజకవర్గ కేంద్రాల్లో ఉన్న స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యాల‌కు సంబంధించి డాక్యుమెంట్ రిజిస్ట్రేష‌న్ సంఖ్యకు అనుగుణంగా భ‌వ‌నాలు నిర్మిస్తాం అని ఆయ‌న‌ వెల్లడించారు.

రెండు డీఐజీ, నాలుగు జిల్లా స‌బ్ రిజిస్ట్రార్, 52 స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యాల‌ను నాలుగు వేల చ‌ద‌ర‌పు అడుగుల నుంచి ప‌ది వేల చ‌ద‌ర‌పు అడుగులు ఉండేలా ఒకే నమూనాలో నిర్మించ‌బోతున్నాం. క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల కోసం అవసరమైన స్థలాలను గుర్తించే కార్యక్రమం ముమ్మరంగా సాగుతుంది. త్వరలోనే క్యూర్ పరిధిలోని జిల్లా కలెక్టర్లతో సమావేశం నిర్వహించబోతున్నాం అని పొంగులేటి శ్రీ‌నివాస్‌రెడ్డి పేర్కొన్నారు.

ఈ స‌మావేశంలో రెవెన్యూ కార్యదర్శి డి.ఎస్.లోకేష్‌ కుమార్, స్టాంప్స్ అండ్‌ రిజిస్ట్రేషన్ ఐ.జి. రాజీవ్ గాంధీ హ‌నుమంతు, హౌసింగ్ సెక్రటరీ వి.పి. గౌత‌మ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement