త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | ఫ్యూచ‌ర్ సిటీని క‌చ్చితంగా ర‌ద్దు చేస్తాం.. తేల్చిచెప్పిన హ‌రీశ్‌రావు

Harish Rao | బీఆర్ఎస్ పార్టీ క్షేత్రస్థాయిలో చాలా స్ట్రాంగ్‌గా ఉంది కాబట్టే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నిద్రలో కూడా మేమే గుర్తుకొస్తున్నాం అని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ హ‌రీశ్‌రావు పేర్కొన్నారు. మళ్లీ మళ్లీ స్పష్టంగా చెబుతున్నాం.. మేము అధికారంలోకి రాగానే ఈ ఫ్యూచర్ సిటీని కచ్చితంగా రద్దు చేస్తామ‌ని హ‌రీశ్‌రావు తేల్చిచెప్పారు.

S

Telangana | Published On Jun 11, 2026, 4.00 pm IST

Harish Rao | ఫ్యూచ‌ర్ సిటీని క‌చ్చితంగా ర‌ద్దు చేస్తాం.. తేల్చిచెప్పిన హ‌రీశ్‌రావు
Advertisement

Harish Rao | త్రినేత్ర‌.న్యూస్ : బీఆర్ఎస్ పార్టీ క్షేత్రస్థాయిలో చాలా స్ట్రాంగ్‌గా ఉంది కాబట్టే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నిద్రలో కూడా మేమే గుర్తుకొస్తున్నాం అని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ హ‌రీశ్‌రావు పేర్కొన్నారు. మళ్లీ మళ్లీ స్పష్టంగా చెబుతున్నాం.. మేము అధికారంలోకి రాగానే ఈ ఫ్యూచర్ సిటీని కచ్చితంగా రద్దు చేస్తామ‌ని హ‌రీశ్‌రావు తేల్చిచెప్పారు. గురువారం మీడియాతో హ‌రీశ్‌రావు చిట్ చాట్ చేసిన సంద‌ర్భంగా ఈ వ్యాఖ్య‌లు చేశారు.

ఫ్యూచర్ సిటీ అని గొప్పలు చెబుతున్న ఆ ప్రాజెక్టు.. ఇప్పుడు అక్కడి చుట్టుపక్కల గ్రామాలకు ఓ శాపం కాబోతోంది. హెచ్ఎండీఏ ద్వారా అప్పులు తేవడమే కాకుండా, రెగ్యులర్ ట్యాక్స్‌తో పాటు కొత్తగా టోల్ గేట్లు పెట్టి మరీ 'అడిషనల్ ఇంపాక్ట్ ఫీజు పేరుతో' ప్రజల జేబులు గుల్ల చేయబోతున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా, ఎఫ్ఆర్‌బీఎం పరిమితికి మించి వేల కోట్ల అప్పులు తేవడానికి ఈ ప్రభుత్వం ఏకంగా దళారులను పెట్టుకుంది. అప్పులు ఇప్పించినందుకు ఆ బ్రోకర్లకు వందల కోట్లు కమీషన్లుగా దోచిపెడుతున్నారు. మన రాష్ట్రం కమీషన్లు ముట్టజెప్పగానే.. ముంబైకి చెందిన ఆ బ్రోకర్ ఏకంగా ఓ విమానమే కొనుక్కున్నాడు. కమీషన్ల కోసం వందల కోట్ల అప్పులు తెస్తున్న ఘనత ఈ ప్రభుత్వానిదే అని హ‌రీశ్‌రావు అన్నారు.

 

మా గురించి నిద్రలో కూడా ఎందుకు కలవరిస్తున్నాడు?

ఎన్నికల మేనిఫెస్టోలో నిరుద్యోగులకు పరీక్షా ఫీజులు ఫ్రీ అని నమ్మబలికి.. తీరా అధికారంలోకి వచ్చాక పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల ఫీజులను సైతం అడ్డగోలుగా పెంచేశారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అని చెప్పి, మగవాళ్లకు మాత్రం బస్సు ఛార్జీలు డబుల్ చేసి ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి అనేక సందర్భాల్లో బీఆర్ఎస్ గురించి పదే పదే మాట్లాడుతున్నాడు. మేము నిజంగానే 'చెల్లని నోటు' అయితే, మా గురించి నిద్రలో కూడా ఎందుకు కలవరిస్తున్నాడు? మరి సీపీఐ గురించి ఎందుకు మాట్లాడటం లేదు? అని నిల‌దీశారు.

ఫార్మాసిటీ కోసం నా సొంత భూమి 17 ఎకరాలు ఇచ్చాను

ఫార్మాసిటీలో పెట్టుబడులు పెడదామని ఎంతోకాలంగా ఎదురుచూసిన కంపెనీలు, ఈ ప్రభుత్వ తీరుతో విసిగిపోయి చివరకు ఆంధ్రప్రదేశ్ నెల్లూరు లోని శ్రీసిటీలో పెట్టుబడులు పెట్టాయి. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రస్తుత మంత్రులు భట్టి విక్రమార్క, సీతక్క, స్వయంగా రేవంత్ రెడ్డి.. తాము అధికారంలోకి రాగానే ఫార్మాసిటీ రైతుల భూములు తిరిగి ఇస్తామని అనేకసార్లు హామీ ఇచ్చారు. తీరా అధికారంలోకి వచ్చాక, ఆ భూములను కాంగ్రెస్ అనుయాయులకు అప్పజెబుతామంటే మేము చూస్తూ ఊరుకోం. ఫార్మాసిటీ కోసం ఆనాడు మేము కేంద్రం నుంచి అన్ని రకాల ఎన్విరాన్‌మెంటల్ క్లియరెన్స్ అనుమతులు సాధించాం. ఈ భూమిని ఇతర అవసరాలకు వాడితే అనుమతులు వాటంతట అవే రద్దవుతాయి అని అందులో స్పష్టమైన నిబంధన ఉంది. ఫార్మాసిటీకి కాకుండా వేరే వాటికి వాడితే ఆ అనుమతులు ఆటోమేటిక్‌గా రద్దవుతాయి. ఫార్మాసిటీ కోసం నా సొంత భూమి 17 ఎకరాలు ఇచ్చాను. ఆ ప్రాజెక్టు కోసం భూమి ఇచ్చిన మొదటి వ్యక్తిని నేనే అని హ‌రీశ్‌రావు తెలిపారు.

జర్నలిస్టులకు ఆ పాత భూములే ఎందుకు ఇవ్వడం లేదు?

జర్నలిస్టుల సంక్షేమ నిధి కింద ఏకంగా రూ. 100 కోట్లు కేటాయించిన ప్రభుత్వం మాది. మీడియా అకాడమీ కార్యాలయం కట్టింది, అత్యధిక సంఖ్యలో అక్రిడిటేషన్ కార్డులు ఇచ్చింది కూడా మేమే. హైదరాబాద్ మినహా అన్ని జిల్లాల్లో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చాం. గజ్వేల్, జహీరాబాద్ లాంటి నియోజకవర్గాల్లో ఏకంగా ఇళ్లు కూడా కట్టించి ఇచ్చాం. జర్నలిస్టులకు ఎలాంటి న్యాయపరమైన వివాదాలు లేని భూములు ఎన్నో ఉన్నాయి, వాటిని ఇవ్వండి. ఫ్యూచర్ సిటీలో స్థలాలు ఇస్తామంటే మేమేమీ వ్యతిరేకించడం లేదు. కానీ అక్కడ ఇప్పటికే కొందరు రైతులు కేసులు వేశారు. కాబట్టి ఎలాంటి ఇబ్బందులు లేని భూములు జర్నలిస్టులకు ఇవ్వాలని కోరుతున్నాం. పాత భూములను ఎందుకు తీసుకుంటున్నావు? సుప్రీంకోర్టు కేసు కొట్టివేసిందని చెబుతున్నప్పుడు, జర్నలిస్టులకు ఆ పాత భూములే ఎందుకు ఇవ్వడం లేదు? ఇక్కడ ఇవ్వడానికి సుప్రీంకోర్టు తీర్పు అడ్డు వచ్చినప్పుడు.. ఫ్యూచర్ సిటీలో ఇవ్వడానికి ఆ తీర్పు అడ్డురాదా అని హ‌రీశ్‌రావు నిల‌దీశారు.

Advertisement
Advertisement