త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | మళ్లీ సీఎంగా కేసీఆర్‌నే ప్రజలు కోరుకుంటున్న : హరీశ్‌రావు

Harish Rao | మళ్లీ సీఎంగా కేసీఆర్‌నే ప్రజలు కోరుకుంటున్నార‌ని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ హ‌రీశ్‌రావు అన్నారు. అశ్వారావుపేటలో మంగళవారం నిర్వహించిన బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో మాజీ మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన ఆయన, రాష్ట్ర ప్రజలు మళ్లీ కేసీఆర్ నాయకత్వాన్నే కోరుకుంటున్నారని అన్నారు.

P

Telangana | Published On Jun 23, 2026, 7.53 pm IST

Harish Rao | మళ్లీ సీఎంగా కేసీఆర్‌నే ప్రజలు కోరుకుంటున్న : హరీశ్‌రావు
Advertisement

Harish Rao | మళ్లీ సీఎంగా కేసీఆర్‌నే ప్రజలు కోరుకుంటున్నార‌ని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ హ‌రీశ్‌రావు అన్నారు. అశ్వారావుపేటలో మంగళవారం నిర్వహించిన బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో మాజీ మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన ఆయన, రాష్ట్ర ప్రజలు మళ్లీ కేసీఆర్ నాయకత్వాన్నే కోరుకుంటున్నారని అన్నారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ఎమ్మెల్సీలు తక్కళ్లపల్లి రవీందర్‌రావు, తాతా మధు, మాజీ ఎమ్మెల్యేలు మెచ్చా నాగేశ్వరరావు, తాటి వెంకటేశ్వర్లు, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ ఉప్పల వెంకటరమణతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

సమావేశంలో హరీశ్‌రావు మాట్లాడుతూ అచ్చంపేటలో చూసినా, అశ్వారావుపేటలో చూసినా ప్రజల నోట ఒకటే మాట వినిపిస్తోందన్నారు. ‘‘మాకు మళ్లీ కేసీఆర్ గారే రావాలి’’ అని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. మాటలు చెప్పే నాయకుడు కాదు, చేతల్లో చేసి చూపించే నాయకుడు కేసీఆర్ అని పేర్కొన్నారు. ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా ప్రజలకు అవసరమైన పథకాలను కేసీఆర్ తీసుకొచ్చారని అన్నారు. కళ్యాణలక్ష్మి పథకం ద్వారా 13 లక్షల మంది పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు సాయం అందించామని, దానికి దాదాపు రూ.13 వేల కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. అలాగే ఎన్నికల హామీల్లో లేకపోయినా రైతుబంధు పథకాన్ని అమలు చేసి, కరోనా వంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఆపకుండా 11 విడతల్లో రూ.73 వేల కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేశామని గుర్తుచేశారు. ‘‘బిడ్డ కాన్పుకు వెళ్తే రూ.12 వేల సాయం, కేసీఆర్ కిట్, పోషకాహారం అందించి తల్లి, బిడ్డను క్షేమంగా ఇంటికి చేర్చిన ప్రభుత్వం బీఆర్ఎస్‌ది. ఇవన్నీ ఎన్నికల కోసం పెట్టిన పథకాలు కావు. ప్రజల అవసరాలను గుర్తించి తీసుకొచ్చిన సంక్షేమ కార్యక్రమాలు’’ అని అన్నారు. మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి తాగునీరు అందించిన ఘనత కూడా కేసీఆర్‌కే దక్కుతుందన్నారు.

కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఎన్నో హామీలు ఇచ్చిందని, కానీ అధికారంలోకి వచ్చాక వాటి ఊసే ఎత్తడం లేదని విమర్శించారు. ‘‘కేసీఆర్ పెళ్లికి లక్ష రూపాయలు ఇస్తే మేము తులం బంగారం ఇస్తామని చెప్పారు. రైతులకు రూ.15 వేల సాయం చేస్తామని హామీ ఇ చ్చారు. కానీ ఇప్పుడు ఆ హామీల గురించి మాట్లాడటమే లేదు’’ అని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై విమర్శలు చేస్తూ, ‘‘రాములవారి మీద ఒట్టు పెట్టి రైతు రుణమాఫీ చేస్తానని చెప్పి మాట తప్పిన ఘనుడు రేవంత్‌రెడ్డి. దేవుడంటే కూడా భయం లేకుండా ప్రజలను మోసం చేశాడు’’ అని ఆరోపించారు. ఈ నెల 30న నిర్వహించనున్న రైతు ఆశీర్వాద సభను ప్రస్తావిస్తూ, ‘‘రైతులు ఎందుకు ఆశీర్వదించాలి? రైతుబంధు ఎగ్గొట్టినందుకా? రైతు భీమా ఆపేసినందుకా? లేక రైతు రుణమాఫీ హామీని నిలబెట్టుకోనందుకా?’’ అని ప్రశ్నించారు. గత ఏడాది అధిక వర్షాలతో పంటలు దెబ్బతింటే ఎకరానికి రూ.10 వేల పరిహారం ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిందని, కానీ ఒక్క రైతుకైనా ఆ సాయం అందిందా అని నిలదీశారు. రైతులకు యూరియా అందుబాటులో లేకపోయినా ప్రభుత్వం యాప్‌ల పేరుతో కాలయాపన చేస్తోందని విమర్శించారు.

గిరిజనులు, దళితుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని హరీశ్‌రావు ఆరోపించారు. ‘‘కోయలు, లంబాడాలకు ఎస్టీ కార్పొరేషన్ ద్వారా ఒక్కరికి కూడా రుణం ఇవ్వలేదు. ఒక్క రూపాయి సాయం కూడా అందలేదు. కేసీఆర్ హయాంలో 10 శాతం రిజర్వేషన్లు ఇచ్చాం. తండాలను గ్రామపంచాయతీలుగా మార్చాం. విదేశీ విద్య కోసం రూ.20 లక్షల ఓవర్సీస్ స్కాలర్‌షిప్‌లు ఇచ్చాం’’ అని తెలిపారు. ఎస్టీ కార్పొరేషన్‌కు రూ.2,750 కోట్లు, ఎస్సీ కార్పొరేషన్‌కు రూ.5,400 కోట్లు బడ్జెట్‌లో కేటాయించామని ప్రభుత్వం చెబుతోందని, కానీ ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదని ఆరోపించారు. ‘‘గిరిజనులకు మోసం.. దళితులకు మోసం.. బలహీన వర్గాలకు మోసం.. కాంగ్రెస్ ప్రభుత్వం అందరినీ మోసం చేసింది’’ అని వ్యాఖ్యానించారు. ఖమ్మం జిల్లాకు ముగ్గురు మంత్రులు ఉన్నా అభివృద్ధి మాత్రం శూన్యమని హరీశ్‌రావు విమర్శించారు. సీతారామ ప్రాజెక్టు పనులు ముందుకు సాగడం లేదని, అశ్వారావుపేటలో 100 పడకల ఆసుపత్రి ఇప్పటికీ పూర్తి కాలేదని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వద్ద మూడు శాఖలు ఉన్నాయని, కానీ విద్యాశాఖ, మున్సిపల్ శాఖ, హోంశాఖల్లో విఫలమయ్యారని ఆరోపించారు. ‘‘ఢిల్లీకి మూటలు మోసే శాఖలో మాత్రం పాస్ అయ్యారు. తన కుర్చీని కాపాడుకోవడమే ఆయన పని’’ అని ఎద్దేవా చేశారు.

జూపల్లి కృష్ణారావును ఉద్దేశించి మాట్లాడుతూ, ‘‘మీరు ఎగ్గొట్టిన రైతుబంధు విలువ రూ.29,350 కోట్లు. రూ.3 వేల కోట్ల బోనస్ ఇచ్చి రూ.29 వేల కోట్లు ఆపేసి గొప్పలు చెప్పుకోవడం సరికాదు’’ అని విమర్శించారు. రాష్ట్రంలో పోలీసుల దౌర్జన్యం పెరిగిందని ఆరోపించిన హరీశ్‌రావు, ‘‘కాంగ్రెస్ నేతల ఒత్తిడితో మా కార్యకర్తలపై అక్రమ కేసులు పెడితే చూస్తూ ఊరుకోం. బీఆర్ఎస్ కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన ప్రతి ఒక్కరి పేరు రాసిపెట్టుకోండి. ఎవ్వరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు’’ అని హెచ్చరించారు. కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ, గ్రామాల్లో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, కేసీఆర్ పాలనలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించాలని సూచించారు. ‘‘గెలుపు, ఓటములు సహజం. ఓడిపోయామని ఇంట్లో కూర్చోలేదు. ప్రజల కోసం ప్రశ్నిస్తున్నాం.. ప్రజల కోసం నిలబడుతున్నాం’’ అని చెప్పారు.

ప్రతిపక్ష హోదాపై ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, ‘‘బీఆర్ఎస్‌కు ప్రతిపక్ష హోదా రాదంటున్నారు. నిజమే.. మాకు ప్రతిపక్ష హోదా ఎందుకు వస్తుంది? రేపు పాలకపక్ష హోదానే వస్తుంది. ప్రజలు మళ్లీ బీఆర్ఎస్ వైపు చూస్తున్నారు’’ అని ధీమా వ్యక్తం చేశారు. మహిళలకు నెలకు రూ.2,500 ఇస్తామని చెప్పి 31 నెలలు గడిచినా అమలు చేయలేదని, ప్రతి మహిళకు రూ.75 వేల బకాయి పడ్డారని ఆరోపించారు. ‘‘ప్రజలకు డబ్బులు లేవంటారు. కానీ క్యాంపు కార్యాలయాలు, కంచెలు, గోడల కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు’’ అని విమర్శించారు. ‘‘ఫ్యూచర్ సిటీ, మూసీ ప్రాజెక్టులకు డబ్బులు ఉంటాయి. ఎందుకంటే అక్కడ కమిషన్లు వస్తాయి. రాష్ట్ర ఖజానాలో డబ్బులు ఉన్నాయి. కానీ ప్రజలకు ఇవ్వాలన్న మనసు ప్రభుత్వానికి లేదు. రేవంత్ పాలనంతా స్కాములే.. స్కీములు మాత్రం లేవు’’ అని హరీశ్‌రావు వ్యాఖ్యానించారు.

Advertisement
Advertisement