త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Teenmar Mallanna | మా మొద‌టి ఎమ్మెల్యే అభ్య‌ర్థి సైనికుడు.. ఇక‌ క‌త్తెర గుర్తుతో చ‌రిత్ర మారుస్తాం

Teenmar Mallanna | తెలంగాణ‌లో క‌త్తెర గుర్తుతో చ‌రిత్ర గ‌తిని మార్చి అమెరికా త‌ర‌హాలో విద్య‌ను అందిస్తామ‌ని ఎమ్మెల్సీ, తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్య‌వ‌స్థాప‌కులు తీన్మార్ మ‌ల్ల‌న్న పేర్కొన్నారు. త‌మ‌ పార్టీ తరపున జనగామ నియోజకవర్గ మొదటి ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్ భిక్షపతిని ఆయ‌న‌ అధికారికంగా ప్రకటించారు. 20 ఏళ్ల పాటు సైన్యంలో దేశానికి సేవ చేసి వచ్చిన ముదిరాజ్ బిడ్డ భిక్షపతిని గెలిపించుకోవాలని కోరారు.

S

Telangana | Published On Jul 31, 2026, 3.58 pm IST

Teenmar Mallanna | మా మొద‌టి ఎమ్మెల్యే అభ్య‌ర్థి సైనికుడు.. ఇక‌ క‌త్తెర గుర్తుతో చ‌రిత్ర మారుస్తాం
Advertisement
  • జ‌న‌గామ ఎమ్మెల్యే అభ్య‌ర్థిగా డాక్ట‌ర్ భిక్ష‌ప‌తిని ప్ర‌క‌టిస్తున్నాం
  • అన్ని ప్రైవేటు కాలేజీల్లో ఫ్రీ ఎడ్యుకేష‌న్ అందేదాక పోరాటం
  • అమెరికా తరహాలో విద్య అందిస్తాం
  • విద్యార్థుల స్కాలర్‌షిప్ నిధులను రేవంత్ సర్కార్ దారి మళ్లించింది
  • విద్యా మాఫియా కేటుగాళ్లు పల్లా, కొమ్మూరి
  • బీసీ బహుజన విద్యార్థి యువ చైతన్య సభలో నిప్పులు చెరిగిన ఎమ్మెల్సీ తీన్మార్ మ‌ల్ల‌న్న

Teenmar Mallanna | త్రినేత్ర‌.న్యూస్: తెలంగాణ‌లో క‌త్తెర గుర్తుతో చ‌రిత్ర గ‌తిని మార్చి అమెరికా త‌ర‌హాలో విద్య‌ను అందిస్తామ‌ని ఎమ్మెల్సీ, తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్య‌వ‌స్థాప‌కులు తీన్మార్ మ‌ల్ల‌న్న పేర్కొన్నారు. త‌మ‌ పార్టీ తరపున జనగామ నియోజకవర్గ మొదటి ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్ భిక్షపతిని ఆయ‌న‌ అధికారికంగా ప్రకటించారు. 20 ఏళ్ల పాటు సైన్యంలో దేశానికి సేవ చేసి వచ్చిన ముదిరాజ్ బిడ్డ భిక్షపతిని గెలిపించుకోవాలని కోరారు. ప్రతి ప్రైవేట్ కాలేజీలో ఫ్రీ ఎడ్యుకేషన్ అందే వరకు టీఆర్పీ పోరాడుతుందని స్పష్టం చేశారు. జ‌నగామ జిల్లా కేంద్రంలోనీ జూబ్లీ ఫంక్షన్ హాల్‌లో జిల్లా అధ్యక్షులు కట్ల సదానందం,యూత్ ప్రెసిడెంట్ పిట్టల సురేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన బీసీ బహుజన విద్యార్థి యువ చైతన్య సభకు ముఖ్య అతిథిగా హాజ‌రై తనదైన‌ శైలిలో అధికార, ప్రతిపక్ష పార్టీలపై విమ‌ర్శ‌లు గుప్పించారు.

25% ఉచిత సీట్ల గురించి ఏ ప్రభుత్వం మాట్లాడటం లేదు..

అమెరికా వంటి దేశాల్లో 12వ తరగతి వరకు ఉచిత విద్య అందుతోందని, తెలంగాణలో కూడా ప్రతి ప్రైవేట్ కాలేజీలో ఫ్రీ ఎడ్యుకేషన్ అందే వరకు టీఆర్పి పోరాడుతుందని మల్లన్న స్పష్టం చేశారు. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం దక్కాల్సిన 25% ఉచిత సీట్ల గురించి ఏ ప్రభుత్వం మాట్లాడటం లేదని ఆయన విమర్శించారు. మన తలరాతలు మారాలంటే 'కత్తెర' గుర్తుపై ఓటు వేసి రాజ్యాధికారం సాధించాలని పిలుపునిచ్చారు. విద్యార్థుల సమస్యలు, పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్, విద్యా వ్యాపారం చేస్తున్న రాజకీయ నాయకుల తీరుపై ఆయన మండిపడ్డారు. భిక్ష‌ప‌తిని గెలిపించుకుంటే జనగామలో పేద బిడ్డలకు ఉచిత విద్య, మెరుగైన భవిష్యత్తు అందుతుందని పేర్కొన్నారు.

శానిటరీ ప్యాడ్ల సొమ్ము 74 కోట్లు ఏమైనట్టు?

గత కేసీఆర్ ప్రభుత్వం తొమ్మిది, పదో తరగతి చదువుతున్న ఆడబిడ్డల కోసం ప్రవేశపెట్టిన శానిటైజేషన్ స్కీమ్ పథకాన్ని ప్రస్తుత ప్రభుత్వం అటకెక్కించిందని మల్లన్న మండిపడ్డారు. "ఆడబిడ్డల శానిటరీ ప్యాడ్ల కోసం కేటాయించిన 74 కోట్ల రూపాయలను దొంగతనంగా ఎత్తుకపోయి తిన్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులకు అందాల్సిన 1900 కోట్ల రూపాయల స్కాలర్‌షిప్ నిధులలో కేవలం 300 కోట్లు మాత్రమే విడుదల చేసి, మిగిలిన సొమ్మును రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇతర పనులకు దారి మళ్లించిందని మల్లన్న ఆరోపించారు. "పోలీసు శాఖలోని ఒక కుక్క ఆహారం కోసం నెలకు 16,000 రూపాయలు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం, హాస్టల్‌లో ఉండి చదువుకునే పేద బిడ్డలకు కనీసం 2000 రూపాయలు కూడా ఇవ్వడం లేదు. కుక్కకు ఉన్న విలువ కూడా విద్యార్థులకు లేదా?" అని ఆయన ప్రశ్నించారు. శ్రీ చైతన్య, నారాయణ వంటి విద్యా సంస్థలు ఇతర రాష్ట్రాల విద్యార్థుల ర్యాంకులను తమవిగా చూపించుకుంటూ తప్పుదోవ పట్టించే ప్రకటనలతో తల్లిదండ్రులను మోసం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. సీతక్క కంటే సీనియర్ మావోయిస్టు మా వనజక్క అని పేర్కొన్నారు.

విద్య కోసం త‌క్కువ ఖ‌ర్చు చేస్తున్న రాష్ట్రం తెలంగాణే..

'రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009' ప్రకారం ప్రైవేట్ పాఠశాలల్లో పేద విద్యార్థులకు దక్కాల్సిన 25% ఉచిత సీట్ల గురించి ప్రభుత్వం ప్రజలకు చెప్పడం లేదని, ఆ చట్టాన్ని అమలు చేయడం లేదని ఆయన ఆరోపించారు. దేశంలో విద్య కోసం అత్యంత తక్కువ ఖర్చు చేస్తున్న రాష్ట్రం తెలంగాణ అని, దీనివల్ల రాష్ట్ర విద్యా వ్యవస్థ దేశంలోనే 18వ స్థానానికి పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.కేవలం కార్పొరేట్ కాలేజీల్లో సీట్లు నింపడం కోసమే పదవ తరగతిలో అందరినీ పాస్ చేస్తున్నారని, ఇది విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడటమేనని ఆయన పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి మనవడు అమెరికాలో చదువుకుంటుంటే, పేద విద్యార్థులు మాత్రం కూలిపోయే స్థితిలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారని ఆయన ధ్వ‌జ‌మెత్తారు.

1,26,000 బీసీ ఓట్లున్న జనగామలో 11,000 ఓట్లున్న రెడ్లే ఏలాల్నా?

జనగామ నియోజకవర్గంలో రాజకీయం విద్యా వ్యాపారవేత్తల చేతుల్లో బందీ అయిందని మల్లన్న ఆరోపించారు. ఒకవైపు అనురాగ్ యూనివర్సిటీ యజమాని పల్లా రాజేశ్వర్ రెడ్డి, మరోవైపు కొమ్మూరి ఇన్స్టిట్యూట్ అధినేత కొమ్మూరి ప్రతాప్ రెడ్డి విద్యను అమ్ముకుంటూ కోట్ల రూపాయలు గడిస్తున్నారని ధ్వజమెత్తారు. "1,26,000 బీసీ ఓట్లున్న జనగామలో కేవలం 11,000 ఓట్లున్న రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వీళ్ళే ఎందుకు ఏలాలి? ఈ విద్యా వ్యాపారుల నుంచి జనగామను రక్షించుకోవాల్సిన అవసరం ఉంది" అని ఆయన పిలుపునిచ్చారు.

పార్టీ జెండా ఆవిష్కరణ..

సమావేశం అనంతరం తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న స్థానిక 5 మరియు 13వ వార్డుల్లో పార్టీ జెండాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు, స్థానిక నాయకులు మల్లన్నకు ఘన స్వాగతం పలికారు. ప్రజలను ఉద్దేశించి మల్లన్న మాట్లాడుతూ, తెలంగాణ రాజ్యాధికార పార్టీ సిద్ధాంతాలను ప్రతి ఇంటికి తీసుకెళ్లి పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎల్లబోయిన ఓదెలు యాదవ్, మహిళా అధ్యక్షురాలు పటేల్ వనజ, క్రమశిక్షణ కమిటీ చైర్మన్ బందారపు నర్సయ్య గౌడ్, మహిళా క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ పుష్ప లీలా, మైనారిటీ అధ్యక్షులు సల్మాన్, యూత్ అధ్యక్షులు చంద్రశేఖర్, కార్యదర్శి ప్రవీణ్ రాజ్, సహాయక కార్యదర్శి గిరగాని బిక్షపతి గౌడ్,యూత్ జనరల్ సెక్రటరీలు వీరమల్లు అనిల్, పోలు రాజు, మహిళా ఉపాధ్యక్షురాలు చేసుకూరి మౌనిక యాదవ్, రాష్ట్ర నాయకులు సుతారపు రంగన్న,స్టేట్ ఆఫీసు కోఆర్డినేటర్ లింగం యాదవ్, సంయుక్త కార్యదర్శి గడ్డం కృష్ణ, జిల్లా ఉపాధ్యక్షులు రేణుగుంట్ల మురళి బైండ్ల, బోడ రమేష్ నేత, మైనారిటీ జిల్లా అధ్యక్షులు యాకుబ్ పాషా, జిల్లా మహిళా అధ్యక్షురాలు దండు రాణి, హన్మకొండ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పూజారి సత్యనారాయణ, నియోజక వర్గ ఇంచార్జి సీసా శ్రీధర్ గౌడ్, యూత్ ఉపాధ్యక్షులు యమంకి విజయ్,యూత్ ప్రధాన కార్యదర్శి వంశీ, కార్యదర్శి గంగరాజు, విద్యార్థి విభాగం అధ్యక్షులు వెంపటి అజయ్, పట్టణ అధ్యక్షులు గుజ్జుక రాజు, పట్టణ యూత్ అధ్యక్షులు పానుగంటి కృష్ణ, యూత్ కార్యదర్శి ఎనగందుల ఉమేష్, మైనారిటీ పట్టణ అధ్యక్షులు ఎండి పాషా, జలీల్ పాషా, సల్మాన్, భానుచందర్ పాల్గొన్నారు.

Advertisement
Advertisement