త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Basara IIIT | నీటి కొర‌త‌.. ఆన్‌లైన్ క్లాసుల బాట‌లో బాస‌ర ట్రిపుల్ ఐటీ

Basara IIIT | నీటి కొర‌త (Water Shortage) ప్ర‌భావంతో ద‌స‌రా సెల‌వుల‌ను పొడిగించిన బాస‌ర ట్రిపుల్ ఐటీ (Basara IIIT) యాజ‌మాన్యం.. తాజాగా ఆన్‌లైన్‌లో త‌ర‌గ‌తులు నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించింది. ఇందులో భాగంగా 2026–27 విద్యా సంవత్సరం మొదటి సెమిస్టర్‌కు సంబంధించిన సవరించిన అకడమిక్‌ షెడ్యూల్‌ను విడుదల చేసింది.

G

Telangana | Published On Oct 25, 2026, 7.17 am IST

Basara IIIT | నీటి కొర‌త‌.. ఆన్‌లైన్ క్లాసుల బాట‌లో బాస‌ర ట్రిపుల్ ఐటీ
Advertisement

Basara IIIT | త్రినేత్ర న్యూస్‌: నీటి కొర‌త (Water Shortage) ప్ర‌భావంతో ద‌స‌రా సెల‌వుల‌ను పొడిగించిన బాస‌ర ట్రిపుల్ ఐటీ (Basara IIIT) యాజ‌మాన్యం.. తాజాగా ఆన్‌లైన్‌లో త‌ర‌గ‌తులు నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించింది. ఇందులో భాగంగా 2026–27 విద్యా సంవత్సరం మొదటి సెమిస్టర్‌కు సంబంధించిన సవరించిన అకడమిక్‌ షెడ్యూల్‌ను విడుదల చేసింది. విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని పీయూసీ–1 నుంచి ఈ–4 వరకు విద్యార్థులకు సోమ‌వారం (అక్టోబర్ 26) నుంచి ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించనుంది. నవంబర్‌ 17 నాటికి ఆన్‌లైన్‌ బోధన (Online Classes) ద్వారా సిలబస్‌ పూర్తి చేయాలని షెడ్యూల్‌లో పేర్కొంది. అనంతరం దశలవారీగా విద్యార్థులను క్యాంపస్‌కు రప్పించనున్నారు.

యూనివర్సిటీ విడుదల చేసిన షెడ్యూల్‌ ప్రకారం పీయూసీ–1, పీయూసీ–2 విద్యార్థులు నవంబర్‌ 10న క్యాంపస్‌కు చేరుకోవాలి. నవంబర్‌ 10 నుంచి 18 వరకు వీరికి క్యాంపస్‌లో తరగతులు నిర్వహిస్తారు. ఇంజినీరింగ్‌ ఈ–1 నుంచి ఈ–4 వరకు విద్యార్థులు నవంబర్‌ 18న క్యాంపస్‌కు రిపోర్ట్‌ చేయాలి. ఆన్‌లైన్‌ తరగతుల సమయంలో విద్యార్థులు క్లాస్‌రూమ్‌ అప్‌డేట్స్‌ను క్రమం తప్పకుండా పరిశీలించాలని యాజమాన్యం సూచించింది.

మోటార్ల‌కు మ‌ర‌మ్మ‌తులు చేయ‌క‌నే..

ఐఐటీలో సుమారు 9 వేల మంది విద్యార్థులకు తాగునీరు, వంటశాలలు, స్నానాలు, మరుగుదొడ్లు, పారిశుద్ధ్య అవసరాలకు రోజుకు 25 లక్షల లీటర్ల నీరు అవసరం ఉంటుంది. ప్రస్తుతం 15 లక్షల లీటర్లు మాత్రమే సరఫరా అవుతున్న‌ది. ఒక‌వేళ క్యాంప‌స్‌ను తిరిగి ప్రారంభిస్తే దాదాపు 10 ల‌క్ష‌ల లీట‌ర్ల కొర‌త (Water Crisis) ఏర్పడే అవ‌కాశం ఉన్న‌ట్లు గుర్తించిన అధికారులు ద‌స‌రా సెల‌వుల‌ను (Dasara Holidays) పొడిగించారు. అయితే స‌మ‌స్య‌కు అసలు కార‌ణం అధికారుల నిర్ల‌క్ష్య‌మే అని తెలుస్తున్న‌ది. గోదావరి (Godavari Water) నుంచి నీటిని తోడే పంప్‌హౌస్‌లోని ప్రధాన మోటార్లు రెండు నెలలుగా పనిచేయడం లేదని సమాచారం. ప్రత్యామ్నాయ మోటారు కూడా పనిచేయకపోవడంతో ఇప్ప‌టివ‌ర‌కు క్యాంపస్‌లోని సమ్మర్‌ స్టోరేజ్‌ చెరువులో నిల్వ ఉన్న నీటిని వినియోగించారు. దీంతో చెరువులో ఉన్న నీరు కూడా కనిష్ట స్థాయికి చేరింది. ఈనేప‌థ్యంలో వ‌ర్సిటీలో ఇబ్బందులు అధిక‌మయ్యాయి. మోటార్లు చెడిపోయిన వెంటనే మరమ్మతులు చేసిన‌ట్ల‌యితే ఈ పరిస్థితి వ‌చ్చేది కాదని అధికారులు అంటున్నారు. కాగా, నీటి స‌ర‌ఫ‌రాల‌ను పున‌రుద్ధ‌రించేందుకు అధికారులు చ‌ర్య‌లు చేప‌డుతున్నారు.

 

Advertisement
Advertisement