త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Number Plate Cloning | నంబ‌ర్ ప్లేట్ క్లోనింగ్ నేరాల‌తో వాహ‌న‌దారుల్లో ఆందోళ‌న‌.. వేలాదిగా త‌ప్పుడు చ‌లాన్లు జారీ..

Number Plate Cloning | మీరు ఎప్పుడూ ప్ర‌యాణం చేయ‌ని ర‌హ‌దారిపై, మీరు పాల్ప‌డ‌ని ట్రాఫిక్ ఉల్లంఘ‌న‌కు మీకు చ‌లాన్ వ‌స్తే ఎలా ఉంటుంది..? ప్ర‌స్తుతం హైద‌రాబాద్ న‌గ‌రంలో చాలా మందికి ఈ స‌మ‌స్యే ఎదుర‌వుతోంది. కొంద‌రు వ్య‌క్తులు వాహ‌నాల‌కు చెందిన నంబ‌ర్ ప్లేట్ల‌ను క్లోనింగ్ చేస్తూ చ‌లాన్ల నుంచి త‌ప్పించుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్న కేసులు ఇటీవ‌లి కాలంలో భారీగా పెరిగాయి.

S

Telangana | Published On Apr 24, 2026, 1.05 pm IST

Number Plate Cloning | నంబ‌ర్ ప్లేట్ క్లోనింగ్ నేరాల‌తో వాహ‌న‌దారుల్లో ఆందోళ‌న‌.. వేలాదిగా త‌ప్పుడు చ‌లాన్లు జారీ..
Advertisement

Number Plate Cloning | మీరు ఎప్పుడూ ప్ర‌యాణం చేయ‌ని ర‌హ‌దారిపై, మీరు పాల్ప‌డ‌ని ట్రాఫిక్ ఉల్లంఘ‌న‌కు మీకు చ‌లాన్ వ‌స్తే ఎలా ఉంటుంది..? ప్ర‌స్తుతం హైద‌రాబాద్ న‌గ‌రంలో చాలా మందికి ఈ స‌మ‌స్యే ఎదుర‌వుతోంది. కొంద‌రు వ్య‌క్తులు వాహ‌నాల‌కు చెందిన నంబ‌ర్ ప్లేట్ల‌ను క్లోనింగ్ చేస్తూ చ‌లాన్ల నుంచి త‌ప్పించుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్న కేసులు ఇటీవ‌లి కాలంలో భారీగా పెరిగాయి. దీని వ‌ల్ల వాహ‌న‌దారులు తీవ్ర ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. అయితే నేర‌స్తులు ఈ మోసాన్ని చాలా సింపుల్‌గా చేస్తున్నారు. వారు చట్టబద్ధంగా ఉన్న వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్‌ను కాపీ చేసి తమ వాహనాలకు అమర్చుకుంటారు. అనంతరం వారు నిరభ్యంతరంగా ట్రాఫిక్ నిబంధనల‌ను ఉల్లంఘిస్తారు. ఈ క్ర‌మంలో ప్రతి సారి ఆటోమేటెడ్ కెమెరా ఆ ఉల్లంఘనల‌ను రికార్డ్ చేసినప్పుడు చలాన్ అసలు నేరస్తుడికి కాకుండా, నిరపరాధ వాహన యజమానికి చేరుతుంది.

నంబ‌ర్ ప్లేట్‌ను మార్చి వాడ‌డంతో..

న‌గ‌రంలోని ప‌లు ప్రాంతాల్లో చోటు చేసుకున్న ఇదే త‌రహాకు చెందిన సంఘ‌ట‌న‌ల్లో స్థానిక ట్రాఫిక్ పోలీసులు నేర‌స్తుల‌పై కేసులు న‌మోదు చేశారు. కుర్మగూడ మదన్నపేట్‌కు చెందిన మొహమ్మద్ రఫీయుద్దీన్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అతను తన టూ-వీలర్ నంబర్‌ను మార్చి వాడడం వల్ల, ఓల్డ్ మలక్‌పేట్‌కు చెందిన షాహీన్ బేగం వాహనానికి తప్పుగా ట్రాఫిక్ చలాన్లు జారీ అయ్యాయి. జాయింట్ కమిషనర్ (ట్రాఫిక్) జోయెల్ డేవిస్ తెలిపిన ప్రకారం.. నిందితుడు వాడిన మార్చిన నంబర్ ప్లేట్ కారణంగా అసలు యజమానికి 23 ట్రాఫిక్ చలాన్లు తప్పుగా జారీ అయ్యాయ‌ని తెలిపారు.

మోసాల్లోనూ సాంకేతిక‌త‌..

మరో ఘటనలో, కూకట్‌పల్లి ప్రాంతానికి చెందిన ఎ.లక్ష్మి అనే మహిళ తనకు సంబంధం లేని ట్రాఫిక్ ఉల్లంఘనలకు వ‌రుసగా చలాన్లు అందుకోసాగింది. దీంతో ఆమె పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌గా, వారు విచార‌ణ చేప‌ట్టారు. షేక్ అబ్బు బాబా (41), అతని కుమారుడు షేక్ రిహాన్ (19) అనే వ్య‌క్తులు తమ బైక్ నంబర్‌ను ఆమె వాహన నంబర్‌కు దగ్గరగా మార్చి, అధికారులను తప్పుదారి పట్టించి జరిమానాల‌ను తప్పించుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇలా ఇటీవ‌లి కాలంలో ఈ త‌ర‌హా నేరాల సంఖ్య పెరిగింది. కాగా ఈ మోసాలు మరింత సాంకేతికంగా చోటు చేసుకుంటున్నాయి. జూబ్లీ హిల్స్‌లో మ‌ద్యం మత్తులో ఉన్న ఓ బీఎండబ్ల్యూ డ్రైవర్ చైనాలో తయారైన‌ రిమోట్-ఆపరేటెడ్ ఫ్లిప్ నంబర్ ప్లేట్లను ఉపయోగిస్తూ పట్టుబడ్డాడు. స్టీరింగ్ వీల్ దగ్గర ఉన్న బటన్‌ను ట‌చ్ చేస్తే వాహనం నంబర్ వెంటనే మారే విధంగా ఈ వ్యవస్థ ప‌నిచేస్తుంద‌ని పోలీసులు తెలిపారు.

10 నెల‌ల్లో 36వేల‌కు పైగా త‌ప్పుడు చ‌లాన్లు..

ఇటీవ‌లి కాలంలో న‌గ‌ర వ్యాప్తంగా ఇదే త‌ర‌హాలో వాహ‌న నంబ‌ర్ ప్లేట్ల క్లోనింగ్ నేరాలు భారీ ఎత్తున చోటు చేసుకుంటున్నాయ‌ని పోలీసులు వెల్ల‌డించిన గ‌ణాంకాల్లో తేలింది. 2025లో మొదటి 10 నెలల్లోనే హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు 36వేలకు పైగా ఎర్రోనియస్ (త‌ప్పుడు) చలాన్లు జారీ చేసినట్లు వెల్ల‌డైంది. అలాగే సైబరాబాద్, రాచకొండ పోలీస్ క‌మిష‌నరేట్ల ప‌రిధుల్లోనూ వేలాదిగా ఫిర్యాదులు అందాయి. అయితే పోలీసుల వ‌ద్ద ఉన్న అధునాత‌న సాంకేతిక వ్య‌వ‌స్థ ఈ క్లోనింగ్ మోసాల‌ను ప‌సిగ‌డుతోంది. ఏఎన్‌పీఆర్ కెమెరాలు ఒకే రిజిస్ట్రేషన్ నంబర్‌ను ఒకేసారి పలు ప్రదేశాల్లో గుర్తించడం ద్వారా అసంభవ పరిస్థితులను గుర్తించి, క్లోనింగ్‌ను బయటపెడుతున్నాయి. మాన్యువల్ తనిఖీలతో అయితే ఈ మోసాల‌ను అస‌లు గుర్తించ‌లేమ‌ని అధికారులు చెబుతున్నారు.

నంబ‌ర్ ప్లేట్ మార్పిడి శిక్షార్హ‌మైన నేరం..

హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు నంబర్ ప్లేట్ మార్పిడి శిక్షార్హమైన‌ నేరమని హెచ్చరించారు. అనుమానాస్పద వినియోగాన్ని ఈ-చలాన్ పోర్టల్ ద్వారా లేదా వాట్సాప్ హెల్ప్‌డెస్క్ నంబర్ 8712661690 ద్వారా వెంటనే తెలియజేయాలని వాహ‌న‌దారుల‌కు సూచించారు. అయితే వాహ‌న‌దారులు ట్రాఫిక్ ఈ-చ‌లాన్ పోర్ట‌ల్‌లో త‌ర‌చూ త‌మ వాహ‌నాల‌కు సంబంధించి ఏవైనా చ‌లాన్లు పెండింగ్‌లో ఉన్నాయా, లేదా అనే వివ‌రాలను చెక్ చేసుకుంటే త‌ప్పుడు చ‌లాన్ల‌ను త్వ‌ర‌గా గుర్తించి ఫిర్యాదు చేయ‌వ‌చ్చ‌ని, దీంతో ఈ త‌ర‌హా నేరాల‌కు అడ్డుక‌ట్ట వేయ‌వ‌చ్చ‌ని తెలిపారు.

Advertisement
Advertisement