త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Minister Ponguleti | నిషేధిత భూములపై ఆందోళన వద్దు

Minister Ponguleti | నిషేధిత ఆస్తుల (పీఓబీ/22ఎ) జాబితాలో ఉన్న భూముల విషయంలో ప్రజలు ఎలాంటి అపోహలు, ఆందోళనలు చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. చట్టబద్ధంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం కొత్తగా ఎలాంటి భూములను నిషేధిత జాబితాలో చేర్చలేదని తెలిపారు.

P

Telangana | Published On Aug 11, 2026, 5.51 pm IST

Minister Ponguleti | నిషేధిత భూములపై ఆందోళన వద్దు
Advertisement
  • చట్టబద్ధంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తాం
  • ఈ నెల 14లోగా అన్ని డాక్యుమెంట్లను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలి
  • మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్‌రెడ్డి
  • సబ్‌ రిజిస్ట్రార్ల విచక్షణాధికారాలకు చెక్‌

Minister Ponguleti | నిషేధిత ఆస్తుల (పీఓబీ/22ఎ) జాబితాలో ఉన్న భూముల విషయంలో ప్రజలు ఎలాంటి అపోహలు, ఆందోళనలు చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. చట్టబద్ధంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం కొత్తగా ఎలాంటి భూములను నిషేధిత జాబితాలో చేర్చలేదని తెలిపారు. గత ప్రభుత్వం నుంచి కొనసాగుతున్న చట్టపరమైన, సాంకేతిక సమస్యలను పరిష్కరించి బాధితులకు ఊరట కల్పిస్తామని పేర్కొన్నారు. మంగళవారం సచివాలయంలోని తన కార్యాలయంలో హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌-మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు, జిల్లా సబ్‌ రిజిస్ట్రార్లతో 22ఎ/పీఓబీ అంశంపై మంత్రి సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. ప్రజావాణితోపాటు కలెక్టర్లు, ఆర్డీవోలు, తహసీల్దార్లు, సబ్‌ రిజిస్ట్రార్లకు జిల్లాల వారీగా అందిన దరఖాస్తులు, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.

14లోగా ఆన్‌లైన్‌లో వివరాలు

భూముల క్రమబద్ధీకరణకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటివరకు జారీ చేసిన జీవోలు, ఉత్తర్వులు, మెమోలు, భూసేకరణ ప్రొసీడింగ్స్‌, లే-అవుట్‌ అనుమతులు తదితర అన్ని పత్రాలను ఈ నెల 14లోగా ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. దీనివల్ల నకిలీ పత్రాలకు అడ్డుకట్ట వేయడంతోపాటు రిజిస్ట్రేషన్‌ సమయంలో అసలైన, నకిలీ డాక్యుమెంట్లను పరిశీలించేందుకు వీలవుతుందని చెప్పారు. మరింత పారదర్శకత కోసం పహాణీలను సైతం సబ్‌ రిజిస్ట్రార్లకు అందుబాటులోకి తెచ్చే చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వచ్చిన దరఖాస్తుల్లో ఏవి నిజమైనవో గుర్తించి, వాటిని యుద్ధప్రాతిపదికన పరిష్కరించాలని కలెక్టర్లను ఆదేశించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆలోచనలు, సూచనలకు అనుగుణంగా ప్రజా కోణంలో నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు.

మూడు రోజుల్లో కారణాలు చెప్పాలి

పీఓబీ దరఖాస్తులను కేసుల వారీగా ప్రతిరోజూ సమీక్షించాలని మంత్రి ఆదేశించారు. 22ఎ పేరుతో పేదలు, అర్హులకు ఉద్దేశపూర్వకంగా అన్యాయం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. సబ్‌ రిజిస్ట్రార్లకు విచక్షణాధికారాలు, అదనపు అధికారాలు ఉండకూడదని స్పష్టం చేశారు. ఆన్‌లైన్‌లో నమోదైన వివరాల ఆధారంగానే నిర్ణయాలు తీసుకునేలా వారి అధికారాలను పరిమితం చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణలో రాజీ ప్రసక్తే లేదని, తప్పులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పీఓబీ జాబితాలోని ఆస్తుల రిజిస్ట్రేషన్లను గుడ్డిగా తిరస్కరించకుండా మూడు రోజుల సమయం తీసుకుని, తిరస్కరణకు కారణాలను స్పష్టంగా తెలియజేయాలని సూచించారు. పీఓబీకి సంబంధించిన ప్రతి దరఖాస్తును ఇకపై తహసీల్దార్‌కు కాకుండా నేరుగా కలెక్టర్‌కు పంపాలని ఆదేశించారు.

త‌క్ష‌ణ అమ‌లుకు ఆదేశాలు..

గతంలో వ్యవసాయ, వ్యవసాయేతర, పీఓబీ జాబితాలు వేర్వేరుగా ఉండేవని, వాటిని సమీకృతం చేయడంతో కొన్ని ఆస్తులు నిషేధిత జాబితాలో ఉన్నట్లు కనిపించి రిజిస్ట్రేషన్లు నిలిచిపోతున్నాయన్న ఫిర్యాదులు వస్తున్నాయని మంత్రి తెలిపారు. తాజాగా ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేస్తున్న సమాచారంతో సరిపోల్చుకుని నిర్ణయాలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. నాలుగు జిల్లాల పరిధిలోని సబ్‌ రిజిస్ట్రార్లతో మంగళవారం సాయంత్రంలోగా సమావేశం నిర్వహించి, ఉన్నతస్థాయి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను వారికి వివరించి తక్షణం అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖ ఐజీని మంత్రి ఆదేశించారు. సమావేశంలో రెవెన్యూ కార్యదర్శి డీఎస్‌ లోకేశ్‌కుమార్‌, స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ ఐజీ రాజీవ్‌గాంధీ హనుమంత్‌, ఆయా జిల్లాల కలెక్టర్లు, జిల్లా రిజిస్ట్రార్లు పాల్గొన్నారు.

Advertisement
Advertisement