త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Pocharam Srinivas Reddy | అసలు… నా ఫోనే ఎత్తుతలేరు : ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి

Pocharam Srinivas Reddy | మాజీ స్పీక‌ర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి రేవంత్ స‌ర్కార్‌పై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను ఏ మంత్రీ పట్టించుకోవడం లేదని .. ఈ ప్రభుత్వంలో ఒక్క పనీ కావడం లేదని అనుచరులతో చెప్పుకొని వాపోయారు

S

Telangana | Published On Aug 11, 2026, 6.01 pm IST

Pocharam Srinivas Reddy | అసలు… నా ఫోనే ఎత్తుతలేరు : ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి
Advertisement

అభివృద్ధికి స‌హ‌క‌రిస్తామ‌ని సీఎం చేబితేనే కాంగ్రెస్‌లో చేరాను
సీఎం మాట‌లు మంత్రులు విన‌డం లేదు
మంత్రులేమో ఫోన్లు లిఫ్ట్ చేయ‌రు
ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Pocharam Srinivas Reddy | త్రినేత్ర‌.న్యూస్ : మాజీ స్పీక‌ర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి రేవంత్ స‌ర్కార్‌పై మ‌రోసారి తిరుగుబాటు చేశారు. ఈ క్ర‌మంలోనే రేవంత్ రెడ్డిని ల‌క్ష్యంగా చేసుకుని ఆయ‌న సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. బాన్సువాడ నియోజ‌క‌వ‌ర్గం అభివృద్ధికి సహకరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెబితేనే పార్టీలో చేరాన‌ని పోచారం స్ప‌ష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన 6 నెల‌ల్లోనే బాన్సువాడ నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న సమస్యలు పరిష్కరిస్తామని సీఎం చెబితేనే జాతీయ కండువా కప్పుకున్నాన‌ని వివ‌రించారు. ముఖ్యమంత్రి మాటలు మంత్రులు వినడం లేదు.. సీఎం స్వయానా నిధులు మంజూరు చేయమని మంత్రుల‌కు చెప్పిన వారు పెడ‌చెవిన పెడుతున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

వేం నరేందర్ రెడ్డికి 50 సార్లు ఫోన్ చేసిన

మంత్రులకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదు.. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క కూడా సీఎం మాట‌లు ప‌ట్టించుకోవ‌డం లేదు. వేం నరేందర్ రెడ్డికి స్వయాన ముఖ్యమంత్రి చెప్పిన పట్టించుకోవడం లేదు.. వేం నరేందర్ రెడ్డికి 50 సార్లు ఫోన్ చేసిన ఫోన్ అటెండ్ చేయడం లేదని పోచారం నిప్పులు చెరిగారు. అప్పటి రాజకీయ పరిణామాల వల్ల కొంతమంది దౌర్భాగ్యులు చేసిన పని వల్ల పార్టీ మారాల్సి వచ్చిందని పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

ఐదు నెల‌ల క్రిత‌మే పోచారం తిరుగుబాటు

కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఈ ఏడాది ఏప్రిల్ నెల‌లో తొలిసారి తిరుగుబాటు చేశారు. సిద్దాపూర్ రిజర్వాయర్ పనులకు నిధులు మంజూరు చేయడం లేదంటూ సొంత ప్రభుత్వంపై ఆయ‌న నిర‌స‌న వ్య‌క్తం చేశారు. నేను ఈ వయస్సులో నిధులు మంజూరు చేయాలని మంత్రుల కాలు మొక్కాల్నా? మంత్రికి 20 సార్లు చెప్పా.. నిధులు మంజూరు చేయాలని అయినా పట్టించుకోలేదు. బీఆర్ఎస్ హయాంలో ఇంట్లో కూర్చుంటే జీవోలు వచ్చాయి. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట తప్పిండు. ఈ ప్రభుత్వంలో మంత్రులు ఎమ్మెల్యేల ఫోన్లు లేపరు.. ప్రభుత్వం ఉందా... ఉంటే అది పనిచేస్తుందా అనే అనుమానం కలుగుతుంది అని పోచారం శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యానించిన సంగ‌తి తెలిసిందే.

2024 జూన్‌లో కాంగ్రెస్‌లో పోచారం చేరిక‌

2024 జూన్ 21వ తేదీన పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంటికి సీఎం రేవంత్ రెడ్డి స్వ‌యంగా వెళ్లి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. అదే స‌మ‌యంలో పోచారంతో పాటు ఆయ‌న కుమారుడు భాస్క‌ర్ రెడ్డికి కాంగ్రెస్ కండువా క‌ప్పారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డిన త‌ర్వాత కేసీఆర్ కేబినెట్‌లో పోచారం వ్య‌వ‌సాయ శాఖ మంత్రిగా ప‌ని చేశారు. 2018లో మ‌ళ్లీ బాన్సువాడ నుంచి గెలుపొంది.. శాస‌న‌స‌భ స్పీక‌ర్‌గా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించారు. 2023 ఎన్నిక‌ల్లోనూ బీఆర్ఎస్ త‌ర‌పున‌ పోచారం మ‌రోసారి విజ‌యం సాధించి.. చివ‌ర‌కు 2024లో కాంగ్రెస్ కండువా క‌ప్పుకున్నారు.

Advertisement
Advertisement