‘సారీ’ చెప్పలేదు.. పార్టీని వీడలేదు.. అసలు కొండా ప్లాన్ ఏంటి?
మంత్రి పదవి పోయినా కొండా దంపతుల దూకుడు తగ్గలేదు... తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. కాంగ్రెస్‌లోనే ఉంటూనే పవర్ పాలిటిక్స్‌లో వారు వేస్తున్న కొత్త వ్యూహాల అసలు కథేంటో చూద్దాం.
సంక్షిప్త సారాంశం
మంత్రి పదవి ఊడినంత మాత్రాన తమ రాజకీయ కథ ముగియలేదని నిరూపిస్తూ కొండా దంపతులు చేస్తున్న వ్యూహాలు ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్‌లో హీట్ పెంచుతున్నాయి. కాంగ్రెస్‌లోనే ఉంటూ స్థానిక ప్రత్యర్థులను దెబ్బకొట్టడం, అధిష్టానంతో బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం వెనుక వారి అసలు ప్లాన్ ఏంటో ఈ విశ్లేషణలో చూద్దాం.
పదవి పోయినా తగ్గని దూకుడు.. కొండా సురేఖ ఎపిసోడ్ వెనుక అసలు రాజకీయం ఇదీ!
మంత్రి పదవి పోయిన తర్వాత కొండా సురేఖ ఏం చేస్తారు?
కాంగ్రెస్‌పై తిరుగుబాటు చేస్తారా?
పార్టీ మారతారా? లేక మౌనంగా ఉంటారా?
ఈ ప్రశ్నలకు వరంగల్ కార్యకర్తల సమావేశంలో కొండా సురేఖ, కొండా మురళి చేసిన వ్యాఖ్యలు దాదాపుగా సమాధానం చెప్పేశాయి. ‘సారీ’ చెప్పలేదని పదవి పోయిందంటున్నారు.. కానీ కాంగ్రెస్‌ను వీడేది లేదంటున్నారు. కూతురు సుష్మిత మాటలతో తమకు సంబంధం లేదని దూరం పెడుతున్నారు.. అదే సమయంలో మళ్లీ పదవులు వస్తాయన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు. అధిష్ఠానంపై నేరుగా యుద్ధం చేయకుండా స్థానిక ప్రత్యర్థులపై మాత్రం దూకుడు చూపుతున్నారు. ఈ మాటలన్నింటినీ కలిపి చూస్తే.. పదవి పోయిందన్న ఆవేశంతో పార్టీకి దూరం కావడం కంటే, కాంగ్రెస్‌లోనే ఉంటూ వరంగల్‌లో తమ రాజకీయ పట్టు, అధిష్ఠానం ముందు తమ విలువ తగ్గకుండా చూసుకోవడమే కొండా దంపతుల ప్రస్తుత లెక్కగా కనిపిస్తోంది.
‘సారీ’ అంటే పదవి ఉండేదా?.. ఆ మాట వెనుక లెక్క ఇదే!
క్షమాపణ చెబితే మంత్రి పదవి ఉండేదని, అయినా సురేఖ అందుకు సిద్ధపడలేదని కొండా మురళి చెప్పారు. అయితే పార్టీ నాయకత్వం మాత్రం క్రమశిక్షణకు సంబంధించిన పరిణామాల నేపథ్యంలోనే చర్య తీసుకున్నట్లు చెబుతోంది. కాబట్టి ‘సారీ చెప్పకపోవడమే పదవి పోవడానికి కారణం’ అన్నది కొండా దంపతుల వాదనగానే చూడాలి. కానీ రాజకీయంగా ఈ మాట వారికి ఉపయోగపడుతోంది. ‘పదవి కోసం ఆత్మగౌరవాన్ని వదులుకోలేదు’ అనే సందేశాన్ని కేడర్‌లోకి తీసుకెళ్లడం ద్వారా పదవి కోల్పోవడాన్ని ఓటమిగా కాకుండా సానుభూతిగా మార్చుకునే అవకాశం వారికి దొరుకుతోంది.
పార్టీ మారితే రిస్క్.. కాంగ్రెస్‌లో ఉంటేనే ఛాన్స్!
కాంగ్రెస్‌ను వీడేది లేదని సురేఖ స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో వరంగల్ తూర్పు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగానే పోటీ చేసి గెలుస్తానన్న ధీమానూ వ్యక్తం చేశారు. ఇక్కడే వారి రాజకీయ దిశ స్పష్టమవుతోంది. పార్టీ మారితే కొత్త సమీకరణాలు, కేడర్‌ను వెంట తీసుకెళ్లడం వంటి సవాళ్లు ఎదురవుతాయి. కాంగ్రెస్‌లోనే ఉంటే పాత కేడర్‌ను కాపాడుకోవడంతో పాటు అధిష్ఠానంతో భవిష్యత్ అవకాశాలనూ తెరిచి ఉంచుకోవచ్చు. అంటే వారి లైన్ కాంగ్రెస్‌తో యుద్ధం కాదు.. కాంగ్రెస్‌లోనే తమ స్థలాన్ని తిరిగి బలపరుచుకోవడం.
ఢిల్లీతో సేఫ్ గేమ్.. వరంగల్‌లో పవర్ గేమ్!
అధిష్ఠానం నుంచి తనకు ఫోన్లు వచ్చాయని, పార్టీ తమ రాజకీయ ప్రయోజనాలను చూసుకుంటుందనే సంకేతాలు ఉన్నాయని సురేఖ చెబుతున్నారు. దీనిపై పూర్తి స్పష్టత లేకపోయినా.. ఢిల్లీతో సంబంధాల తలుపులు మాత్రం మూసుకోవడం లేదు. అదే సమయంలో వరంగల్‌లో ప్రత్యర్థులపై కొండా దంపతుల స్వరం మరింత గట్టిగా ఉంది. బసవరాజు సారయ్యపై మురళి విమర్శలు చేయడం, ప్రత్యర్థులను ఉద్దేశించి సురేఖ తీవ్ర వ్యాఖ్యలు చేయడం దీనికి ఉదాహరణ. అధిష్ఠానంతో తలపడితే భవిష్యత్ అవకాశాలు మూసుకుపోతాయి. స్థానిక ప్రత్యర్థులతో పోరాడితే మాత్రం కాంగ్రెస్‌లోనే ఉంటూ తమ వర్గాన్ని కాపాడుకోవచ్చు. ప్రస్తుతం వారి వ్యూహంలో కనిపిస్తున్న కీలకమైన తేడా ఇదే.
కూతురి మాట వేరు.. మా మాట వేరు..హైకమాండ్‌కు క్లియర్ మెసేజ్!
సుష్మిత విషయంలో కొండా మురళి చేసిన వ్యాఖ్య కూడా రాజకీయంగా కీలకం. తనది, సురేఖది ఒకే మాట అని.. కూతురి మాట వేరని, ఆమె నిర్ణయాలు ఆమెవేనన్న అర్థంలో మాట్లాడారు. సుష్మిత వ్యాఖ్యలు గత వివాదంలో చర్చకు వచ్చిన నేపథ్యంలో ఈ దూరం ప్రాధాన్యం సంతరించుకుంది. కూతురు వ్యాఖ్యల రాజకీయ భారాన్ని తమ భవిష్యత్తుతో ముడిపెట్టవద్దని కాంగ్రెస్ నాయకత్వానికి చెప్పే ప్రయత్నంగా దీనిని చూడవచ్చు. ఒకవైపు సుష్మిత వైఖరిని వేరు చేస్తున్నారు.. మరోవైపు తాము మాత్రం కాంగ్రెస్‌లోనే ఉంటామని స్పష్టం చేస్తున్నారు. అంటే తమ రాజకీయ దారి విషయంలో అధిష్ఠానానికి సందేహం లేకుండా చేయాలన్న సంకేతం కనిపిస్తోంది.
పదవి పోయింది.. ‘పిక్చర్ అభీ బాకీ’ అంటున్నారా?
ఇదే సమావేశంలో భవిష్యత్ పదవుల ప్రస్తావన కూడా వచ్చింది. వచ్చే ఎన్నికల్లో మళ్లీ గెలిచి మంత్రి అవుతానని సురేఖ ధీమా వ్యక్తం చేశారు. మురళికి కూడా మంచి అవకాశం వస్తుందనే సంకేతాలు ఉన్నాయని చెప్పారు. అవి అధిష్ఠానం ఇచ్చిన అధికారిక హామీలని ఇప్పుడే చెప్పలేం. కానీ ఇక్కడ పదవి వస్తుందా లేదా అన్నదానికంటే ‘మా రాజకీయ కథ ముగియలేదు’ అనే సందేశమే ముఖ్యం. పదవి పోయిన నేతకు భవిష్యత్తు లేదన్న భావన కేడర్‌లో ఏర్పడితే వర్గం బలహీనపడుతుంది. అందుకే మళ్లీ అవకాశాలు వస్తాయన్న ధీమా ద్వారా కేడర్‌లో ఆశను నిలబెట్టే ప్రయత్నం కనిపిస్తోంది.
‘కొండా పవర్’కు ఇదే అసలు టెస్ట్!
ఈ మొత్తం ఎపిసోడ్‌లో అసలు రాజకీయ లెక్క ఇదే. మంత్రి పదవి ఉన్నప్పుడు పదవే సురేఖకు పవర్ సెంటర్. ఇప్పుడు ఆ కుర్చీ లేదు. ఇక అధిష్ఠానం ముందు కొండా దంపతుల విలువను నిర్ణయించేది వరంగల్‌లో వారి వెంట ఎంత కేడర్ ఉంది? ఎన్నికల్లో ఎంత ప్రభావం చూపగలరు? వారిని పక్కనపెట్టి కాంగ్రెస్ ముందుకు వెళ్లగలదా? అన్న అంశాలే. అందుకే కార్యకర్తల సమావేశం కూడా కీలకం. పదవి పోయినా తమ వెంట కేడర్ ఉందని చూపగలిగితే అదే కొత్త రాజకీయ బలం.
మొత్తంగా కొండా దంపతుల మాటల్లో కనిపిస్తున్న లైన్ స్పష్టం ‘సారీ’ అంశంతో ఆత్మగౌరవ ఇమేజ్‌ను కాపాడుకోవడం.. కూతురు వ్యాఖ్యల నుంచి తమను వేరు చేసుకోవడం.. అధిష్ఠానంతో దారులు మూసుకోకుండా చూడటం.. స్థానిక ప్రత్యర్థులకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా తమ కేడర్‌ను నిలబెట్టుకోవడం. అంటే పోయిన మంత్రి కుర్చీని వెంటనే తిరిగి పొందడం కంటే.. ‘కాంగ్రెస్‌కు మా అవసరం ఇంకా ఉంది’ అని నిరూపించుకోవడమే ఇప్పుడు కొండా దంపతుల అసలు రాజకీయ పోరాటంగా కనిపిస్తోంది. పదవి పోయింది.. కానీ ‘కొండా చాప్టర్’ ఇంకా క్లోజ్ కాలేదు!
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Agriculture | సేంద్రియ పంటలకు మార్కెట్లో అత్యధిక డిమాండ్
- ●CM Prajavani | ప్రజల విశ్వాసం పెరిగేలా అధికారులు పని చేయాలి
- ●MRI Scanning | అర్హులైన రోగులకు ఉచితంగా ఎంఆర్ఐ స్కానింగ్
- ●Vice President | 17న హైదరాబాద్‌కు ఉప రాష్ట్రపతి.. ఏర్పాట్లపై సీఎస్ సమీక్ష
- ●Apple | ఐక్లౌడ్ సేవలను విస్తరించిన యాపిల్.. నెలకు రూ.75కే ప్లాన్, 50జీబీ స్టోరేజ్..
- ●SpiceJet | స్పైస్‌జెట్ చోర్ హై.. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ప్రయాణికుల ఆందోళన

Agriculture | సేంద్రియ పంటలకు మార్కెట్లో అత్యధిక డిమాండ్

CM Prajavani | ప్రజల విశ్వాసం పెరిగేలా అధికారులు పని చేయాలి

MRI Scanning | అర్హులైన రోగులకు ఉచితంగా ఎంఆర్ఐ స్కానింగ్

Vice President | 17న హైదరాబాద్‌కు ఉప రాష్ట్రపతి.. ఏర్పాట్లపై సీఎస్ సమీక్ష






