త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Vemula Prashanth Reddy | ఒక్కో నిరుద్యోగికి తక్షణమే రూ.1.32 లక్షలు చెల్లించాలి

ఎన్నికల్లో హామీలిచ్చి కాంగ్రెస్ యువతను మోసం చేసిందని, కేసీఆర్ ప్రాజెక్టులకు రేవంత్ 'రిబ్బన్ రెడ్డి'లా మారారని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఫైర్ అయ్యారు.

J

Telangana | Published On Sep 5, 2026, 6.58 pm IST

Vemula Prashanth Reddy | ఒక్కో నిరుద్యోగికి తక్షణమే రూ.1.32 లక్షలు చెల్లించాలి
Advertisement
  • కేసీఆర్ హయాంలో కట్టిన ప్రాజెక్టులు, ఫ్లైఓవర్లకు రిబ్బన్లు కట్ చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి 'రిబ్బన్ రెడ్డి'గా మారారని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఎద్దేవా
  • గత ప్రభుత్వం లక్షా 60 వేల ఉద్యోగాలిస్తే.. కాంగ్రెస్ సర్కార్ కేవలం 16,978 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చిందని అసెంబ్లీ రికార్డులే చెబుతున్నాయన్న వైనం
  • ఉచిత స్కూటీలు, రూ.5 లక్షల విద్యా భరోసా కార్డ్, నిరుద్యోగ భృతి హామీలను గాలికొదిలేసి యువతను దారుణంగా మోసం చేశారని ఫైర్
  • పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలని, పాలిటెక్నిక్ విద్యార్థులకు నష్టం చేసే జీవో 69ని రద్దు చేయాలని సదస్సులో తీర్మానం

Vemula Prashanth Reddy | త్రినేత్ర.న్యూస్ : బాల్కొండ నియోజకవర్గం భీమ్‌గల్‌లో బీఆర్ఎస్ (BRS) ఆధ్వర్యంలో జరిగిన "విద్యార్థి, నిరుద్యోగ సదస్సు"లో మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కాంగ్రెస్ సర్కార్‌పై నిప్పులు చెరిగారు. యూత్ డిక్లరేషన్ (Youth Declaration) పేరిట ఎన్నికల్లో ఆచరణ సాధ్యంకాని హామీలిచ్చి కాంగ్రెస్ పార్టీ యువతను నిలువునా మోసం చేసిందని తీవ్రస్థాయిలో విమర్శించారు. కేసీఆర్ కట్టిన ప్రాజెక్టులకు రిబ్బన్లు కట్ చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి కాస్తా 'రిబ్బన్ రెడ్డి' (Ribbon Reddy) గా మారిపోయారని ఎద్దేవా చేశారు.

Vemula Prashanth Reddy Slams CM Revanth Reddy Over Telangana Jobs and Youth Issues

ఉద్యోగాల భర్తీలో పచ్చి అబద్ధాలు

బీఆర్ఎస్ హయాంలో లక్షా 60 వేల ఉద్యోగాలను విజయవంతంగా భర్తీ చేశామని, కానీ కాంగ్రెస్ సర్కార్ తామే 70 వేల ఉద్యోగాలిచ్చామంటూ పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తోందని వేముల మండిపడ్డారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో ఇచ్చిన లిఖితపూర్వక సమాధానం ప్రకారమే.. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ తొమ్మిది నెలల్లో ఇచ్చిన ఉద్యోగాలు కేవలం 16,978 మాత్రమేనని ఆయన సాక్ష్యాలతో సహా బయటపెట్టారు. ప్రభుత్వం భర్తీ చేసినట్లు చూపుతున్న 67 వేల పోస్టుల్లో.. 50 వేలకు పైగా ఉద్యోగాలు గత బీఆర్ఎస్ ప్రభుత్వమే నోటిఫికేషన్లు (Notifications) ఇచ్చి ప్రాసెస్ పూర్తి చేసినవని ఆయన స్పష్టం చేశారు.

Vemula Prashanth Reddy Slams CM Revanth Reddy Over Telangana Jobs and Youth Issues

అటకెక్కిన హామీలు.. యువతకు టోకరా

ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీల వీడియోలను ఎల్ఈడీ (LED) స్క్రీన్‌పై ప్రదర్శిస్తూ ప్రభుత్వం వైఫల్యాలను వేముల ఎండగట్టారు. యువతులకు ఉచిత ఎలక్ట్రిక్ స్కూటీలు (Electric Scooties), ఉన్నత చదువులకు ఉపయోగపడేలా రూ. 5 లక్షల విద్యా భరోసా కార్డ్, నిరుద్యోగులకు నెలకు రూ. 4,000 భృతి ఇస్తామన్న కాంగ్రెస్ హామీలు బుట్టదాఖలయ్యాయని ఆయన ప్రశ్నించారు. నిరుద్యోగ భృతి కింద చూసుకుంటే.. ఈ పాటికే ఒక్కో నిరుద్యోగికి రేవంత్ సర్కార్ రూ. 1.32 లక్షలు బాకీ పడిందన్నారు. అశోక్ నగర్ చౌరస్తాలో నిరుద్యోగులపై లాఠీచార్జ్ చేయడం ఈ ప్రభుత్వ దౌర్భాగ్య స్థితికి నిదర్శనమన్నారు. మరోవైపు, రూ. 12 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ (Fee Reimbursement) బకాయిలు చెల్లించకపోవడంతో విద్యార్థులు సర్టిఫికెట్లు తీసుకోలేక చదువులు ఆగిపోయే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.

Vemula Prashanth Reddy Slams CM Revanth Reddy Over Telangana Jobs and Youth Issues

ఇది చంద్రబాబు మార్క్ పచ్చపాలన

తెలంగాణలో ఇప్పుడు నడుస్తున్నది ప్రజాపాలన కాదని, చంద్రబాబు నాయుడు డైరెక్షన్‌లో పచ్చపాలన సాగుతోందని వేముల విమర్శించారు. కేసీఆర్ హయాంలో కరెంటు కోతలు లేవని, ఇప్పుడు మళ్లీ పల్లెల్లో ఇన్వర్టర్లు (Inverters), మోటార్ల కష్టాలు మొదలయ్యాయన్నారు. కాళేశ్వరంపై కక్షసాధింపు చర్యలతో గోదావరి జలాలను ఒడిసిపట్టకుండా ఆంధ్రాకు వదిలేస్తున్నారని మండిపడ్డారు.

సదస్సులో ఏకగ్రీవ తీర్మానాలు.. కీలక డిమాండ్లు

ఈ సదస్సుకు హాజరైన వేలాది మంది విద్యార్థులు, నిరుద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పలు డిమాండ్లను ఆమోదించారు.

  • కాంగ్రెస్ హామీ ఇచ్చినట్లుగా మూడేళ్ల వ్యవధికి గాను 6 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు, అఫీషియల్ జాబ్ క్యాలెండర్ (Job Calendar) విడుదల చేయాలి.
  • పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీసేలా తీసుకొచ్చిన జీవో 69 (GO 69) ని తక్షణమే రద్దు చేయాలి.
  • ప్రైవేట్ సెక్టార్‌లో స్థానిక యువతకు 75% రిజర్వేషన్ కల్పించే చట్టాన్ని తీసుకురావాలి.
  • యూత్ కమిషన్ ఏర్పాటు చేసి రూ.10 లక్షల వడ్డీలేని రుణాలు మంజూరు చేయాలి.
  • బాసర తరహాలో మరో 4 నూతన ట్రిపుల్ ఐటీలను (IIIT) ఏర్పాటు చేసి వర్సిటీల్లో ఖాళీలను భర్తీ చేయాలి.

కేంద్ర మంత్రులనే గద్దె దించిన చరిత్ర దేశ యువతకు ఉందని, జెన్-జీ (Gen-Z) యువత ఆగ్రహాన్ని రేవంత్ సర్కార్ తక్కువ అంచనా వేయవద్దని వేముల హెచ్చరించారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో ఆ యువతే ఏకమై రేవంత్ రెడ్డికి రాజకీయ రిటైర్మెంట్ (Political Retirement) ఇవ్వడం ఖాయమని స్పష్టం చేశారు.

Advertisement
Advertisement