త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Vemula Prashanth Reddy | సీఎం గారూ మా రక్తం తీసుకోండి.. రైతులకు కాళేశ్వరం నీళ్లివ్వండి!

సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు కౌంటర్‌గా మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నిరసన. ముప్కాల్ పంప్ హౌస్ వద్ద రైతుల రక్తాన్ని చూపుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

J

Telangana | Published On Jul 13, 2026, 5.24 pm IST

Vemula Prashanth Reddy | సీఎం గారూ మా రక్తం తీసుకోండి.. రైతులకు కాళేశ్వరం నీళ్లివ్వండి!

సంక్షిప్త సారాంశం

కన్నెపల్లి పంప్‌హౌస్ బటన్ నొక్కి వృథాగా పోతున్న కాళేశ్వరం జలాలను ఎస్సారెస్పీకి తరలించి రైతులకు అందించాలని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి చేసిన 'రక్తం చల్లుతా' వ్యాఖ్యలకు కౌంటర్‌గా బాల్కొండ రైతుల తరఫున ఆయన రెండు సీసాల రక్తాన్ని ప్రదర్శించారు. కేసీఆర్ నిర్మించిన ముప్కాల్ రివర్స్ పంపింగ్ పంప్ హౌస్ సాక్షిగా అనుచరులతో కలిసి ఈ వినూత్న నిరసన చేపట్టారు. ఈగోలకు, పంతాలకు పోకుండా పారుతున్న గోదావరి నీటిని ఎత్తిపోసి రైతుల పంటలను కాపాడాలని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

Advertisement
  • ముప్కాల్ పంప్ హౌస్ సాక్షిగా మాజీ మంత్రి వేముల వినూత్న నిరసన

Vemula Prashanth Reddy | త్రినేత్ర.న్యూస్ : బాల్కొండ రైతుల పక్షాన మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి (Vemula Prashanth Reddy).. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి (Revanth Reddy) వినూత్న రీతిలో నిరసన తెలియజేశారు. కన్నెపల్లి మోటార్లు ఆన్ చేసి, వృథాగా సముద్రం పాలవుతున్న కాళేశ్వరం జలాలను (Kaleshwaram waters) రైతులకు అందించాలని డిమాండ్ చేస్తూ.. ముప్కాల్ పంప్ హౌస్ (Mupkal pump house) వద్ద చేతుల్లో రక్తపు సీసాలు పట్టుకుని ఆయన ప్రభుత్వ తీరును ఎండగట్టారు.

'రాక్షస భాష వద్దు.. మా రక్తం తీసుకోండి'

నీళ్లు వృథాగా పోతున్నాయని.. వెంటనే కన్నెపల్లి మోటార్లు ఆన్ చేసి రైతులకు సాగునీరు ఇవ్వాలని కేటీఆర్, హరీష్ రావు కోరితే.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాక్షస భాష మాట్లాడుతున్నారని వేముల మండిపడ్డారు. "వాళ్లను కోసి ఆ రక్తాన్ని పంటలకు చల్లితే పండుతాయని ముఖ్యమంత్రి అన్నారు. ఆయన మా రక్తాన్ని చల్లుతా అన్నాడు కాబట్టే, మేము మా రక్తాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. బాల్కొండ రైతుల తరఫున ముప్కాల్ రివర్స్ పంపింగ్ పంప్ హౌస్ సాక్షిగా ఈ రక్తాన్ని ఇస్తున్నాం. రేవంత్ రెడ్డి గారూ.. మా రక్తాన్ని తీసుకొని రైతులకు కాళేశ్వరం నీళ్లు ఇవ్వండి" అని వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

కేసీఆర్ 'కట్టిన ఇల్లు.. పెట్టిన పొయ్యి'

కాళేశ్వరం ప్రాజెక్టు కోసం, ఎస్సారెస్పీ (SRSP) పునర్జీవనం కోసం మాజీ సీఎం కేసీఆర్ (KCR) కట్టిన ఇల్లు, పెట్టిన పొయ్యి మాదిరిగా అన్నింటినీ సిద్ధం చేసి ఉంచారని ప్రశాంత్ రెడ్డి గుర్తుచేశారు. కన్నెపల్లి పంప్ హౌస్ బటన్ నొక్కితే ఆ జలాలు నేరుగా ఎస్సారెస్పీలో వచ్చి పడతాయన్నారు. ఎస్సారెస్పీ పునర్జీవనంలో భాగంగా వరద కాలువ మీద రాంపూర్, రాజేశ్వరపేట్, ముప్కాల్ అనే మూడు రివర్స్ పంపింగ్ (Reverse pumping) పంప్ హౌస్‌లను గత ప్రభుత్వం అత్యద్భుతంగా నిర్మించిందని ఆయన వివరించారు. అందులో ఆఖరిదైన ముప్కాల్ పంప్ హౌస్ తమ బాల్కొండ నియోజకవర్గంలోనే ఉందన్నారు.

ఈగోలు పక్కనపెట్టి రైతులను ఆదుకోండి

పారుతున్న గోదావరి నీటిని కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా ఎత్తిపోసి వరద కాలువ, కాకతీయ కాలువ, లక్ష్మీ కాలువలను వెంటనే నింపాలని ప్రభుత్వాన్ని ఆయన కోరారు. అలాగే ప్యాకేజీ 21 ద్వారా మెంక్రాస్ పల్లి పంప్ హౌస్ ఆన్ చేసి కప్పలవాగు, పెద్దవాగులకు నీరు ఇవ్వాలన్నారు. గుత్ప, అలీసాగర్, ఆర్మూర్ లిఫ్ట్‌లకు కూడా ఇక్కడి నుంచే నీళ్లు ఇవ్వొచ్చని ప్రభుత్వానికి సూచించారు.

వర్షాలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఈ సమయంలో పంతాలకు, ఈగోలకు పోకుండా రైతుల ఉసురు పోసుకోవద్దని ముఖ్యమంత్రిని వేముల హెచ్చరించారు. కేసీఆర్ కట్టిన పంప్ హౌస్‌లు అన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయని, బేషజాలకు పోకుండా తక్షణమే కన్నెపల్లి మోటార్లు ఆన్ చేసి పంటలను కాపాడాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Advertisement
Advertisement