త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Niranjan Reddy | పాలమూరు రంగారెడ్డికి ఆ మూడు పార్టీలు మరణశాసనం: మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి

Niranjan Reddy | పాల‌మూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప‌థ‌కానికి బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు మ‌ర‌ణ‌శాస‌నం రాస్తున్నాయ‌ని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి (Niranjan Reddy) ఆరోపించారు. ఎత్తిపోతల డీపీఆర్‌ను (DPR) కేంద్ర ప్ర‌భుత్వం వెనక్కి పంపడం వెన‌క‌ కుట్ర దాగి ఉంద‌ని చెప్పారు.

G

Telangana | Published On Oct 8, 2026, 11.29 am IST

Niranjan Reddy | పాలమూరు రంగారెడ్డికి ఆ మూడు పార్టీలు మరణశాసనం: మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
Advertisement

Niranjan Reddy | త్రినేత్ర న్యూస్‌: పాల‌మూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప‌థ‌కానికి బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు మ‌ర‌ణ‌శాస‌నం రాస్తున్నాయ‌ని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి (Niranjan Reddy) ఆరోపించారు. ఎత్తిపోతల డీపీఆర్‌ను (DPR) కేంద్ర ప్ర‌భుత్వం వెనక్కి పంపడం వెన‌క‌ కుట్ర దాగి ఉంద‌ని చెప్పారు. పాల‌మూరుపై ఏపీలోని చంద్రబాబు (Chandrababu) సర్కారు కుట్రలు చేస్తున్న‌ద‌ని విమ‌ర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప‌థ‌కం (PRLIS) డీపీఆర్ కేంద్రానికి పంపించ‌లేద‌ని, తెలంగాణ వచ్చిన వెంటనే బీఆర్ఎస్ (BRS) స‌ర్కార్ డీపీఆర్‌ను సబ్మిట్ చేసింద‌న్నారు. నీటి కేటాయింపులతో కూడిన హైడ్రాలజీ అనుమతులు మినహా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల డీపీఆర్‌కు సంబంధించిన అన్ని అనుమతులు 99 శాతం సాధించామ‌ని చెప్పారు.

ప్రజాభిప్రాయ సేకరణ, పర్యావరణ అనుమతులు సాధించినా కేవలం చంద్రబాబు వత్తిడి మేరకు కేంద్రం డీపీఆర్‌ను వెనక్కి పంపింద‌ని మండిప‌డ్డారు. నీటి కేటాయింపులకు సంబంధించి కేడబ్ల్యూడీటీ 2, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ రిపోర్ట్ రానున్న ఈ పరిస్థితుల్లో డీపీఆర్‌ను వెనక్కు పంపడం అనేది తెలంగాణపై చంద్రబాబు చేస్తున్న కుట్ర అని ఆరోపించారు. ప్ర‌స్తుతం అధికారంలో ఉన్న‌ నాయకులు ఇప్పటికైనా కళ్లు తెరచి కేంద్రాన్ని ప్రశ్నించాల‌న్నారు.

కుట్రకోణం..

డీపీఆర్‌ను జీరో చేసినట్లయితే కేడబ్ల్యూడీటీ (KWDT) ముందుకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల అంశాలు రాకుండా నీటి కేటాయింపులు చేసి, నీటి కేటాయింపుల తర్వాత అసలు ఈ పథకం అనేదే లేద‌నే అంశాన్ని తెరమీదికి తెచ్చే కుట్రకోణం చంద్రబాబు ఆలోచన వెనుక దాగి ఉంద‌ని వెల్ల‌డించారు. పదేండ్ల క్రిత‌మే కేంద్రానికి డీపీఆర్ పంపించి.. దాదాపు అన్ని రకాల అనుమతులను, అన్ని రకాల అధికారిక పత్రాలను సమర్పించిన తర్వాత డీపీఆర్‌ను కేంద్రం వెనక్కి పంపిస్తుందన్నారు. అదే చంద్రబాబు నాయుడు వచ్చిన తరువాత పోలవరం, బనకచర్ల, గోదావరి నుండి కృష్ణా నదికి డైవర్షన్ చేసే ప్రాజెక్టులను కేంద్రం ఎలా గుర్తిస్తుంద‌ని ప్ర‌శ్నించారు.

కేంద్రం పక్షపాత ధోరణి

పదేళ్ల కిందట పంపిన డీపీఆర్‌ను వెనక్కి పంపించి, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల విషయంలో కేంద్రం వ్యవహరిస్తున్న తీరును తెలంగాణ (Telangana) సమాజం గమనించాల‌న్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన త‌ర్వాత‌ ప్రతిపాదించిన ప్రాజెక్టులకు అనుమతులతో పాటు అధికారిక గుర్తింపు ఇస్తుండటం కేంద్రం పక్షపాత ధోరణికి నిదర్శనమ‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

ఆంధ్రా అధికారులను సలహాదారులుగా నియమించుకుని

ఇంత జ‌రుగుతున్నా తెలంగాణ బీజేపీ (BJP) నేతలు చేతులు ముడుచుకొని కూర్చున్నార‌ని మండిప‌డ్డారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల కోసం ఎందుకు నోరెత్తడం లేదని ప్ర‌శ్నించారు. డీపీఆర్ ఆమోదం కోసం ఎందుకు వత్తిడి తేవడం లేద‌ని నిల‌దీశారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్రా అధికారులను సలహాదారులుగా నియమించుకుని, తెలంగాణ నీటి హక్కులను వారి చేతుల్లో పెట్టి చోద్యం చూస్తున్న‌ద‌ని ధ్వ‌జ‌మెత్తారు. ఈ మూడు పార్టీలు తెలంగాణ నీటి హక్కులను తాకట్టు పెట్టి తెలంగాణ భవిష్యత్తు దెబ్బతీస్తున్నాయని విమ‌ర్శించారు.

చేతగాని తనానికి నిదర్శనం

భవిష్యత్తులో తెలంగాణ సమాజానికి కాంగ్రెస్‌ ప్రభుత్వం (Congress Govt), ఈ నేతలు సమాధానం చెప్పుకోక తప్పద‌ని స్ప‌ష్టం చేశారు. ప్రజాక్షేత్రంలో వీరికి శిక్ష తప్పదన్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం డీపీఆర్ అసలు పరిశీలించ‌మ‌ని కేంద్ర జలవనరులశాఖ స్పష్టం చేయడం ఈ ప్రభుత్వం, తెలంగాణ బీజేపీ నేతల చేతగాని తనానికి నిదర్శనమ‌ని చెప్పారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల డీపీఆర్ పరిశీలించి ఆమోదం తెలపకుంటే ప్రజా ఉద్యమం చేపడతామని హెచ్చ‌రించారు.

Advertisement
Advertisement