త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

సాగ‌ర్ నిండినా చెరువులు నింప‌లేం..!

Minister Komatireddy | నాగార్జునసాగర్‌ ప్రాజెక్టులో ప్రస్తుతం ఉన్న నీరు తాగునీటి అవసరాలకే సరిపోతుందని.. పై నుంచి నీరు వచ్చే పరిస్థితి కూడా కనిపించడం లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ఈ పరిస్థితుల్లో రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ వరి సాగు చేయకుండా ఆరుతడి పంటల వైపు మళ్లేలా అధికారులు, ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలని ఆదేశించారు.

P

Telangana | Published On Aug 8, 2026, 3.54 pm IST

సాగ‌ర్ నిండినా చెరువులు నింప‌లేం..!
Advertisement
  • ఆరుత‌డి వైపు రైతులు మ‌ళ్లాలి
  • ఎల్‌నినో ప్ర‌భావంతో తీవ్ర నీటి ఎద్ద‌డి
  • అధికారుల‌కు మంత్రి కోమ‌టిరెడ్డి ఆదేశాలు

Minister Komatireddy | నాగార్జునసాగర్‌ ప్రాజెక్టులో ప్రస్తుతం ఉన్న నీరు తాగునీటి అవసరాలకే సరిపోతుందని.. పై నుంచి నీరు వచ్చే పరిస్థితి కూడా కనిపించడం లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ఈ పరిస్థితుల్లో రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ వరి సాగు చేయకుండా ఆరుతడి పంటల వైపు మళ్లేలా అధికారులు, ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలని ఆదేశించారు. శనివారం నల్లగొండ జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా సాగునీటి సలహా మండలి సమావేశానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాగార్జునసాగర్‌లో నీరు డెడ్‌ స్టోరేజీకి చేరిందని తెలిపారు. శ్రీశైలం నుంచి నీరు వచ్చినా ప్రస్తుతం పంటలకు సాగునీరు అందించే పరిస్థితి లేదన్నారు. సాగర్‌లో ఉన్న నీరు జూన్‌ 2027 వరకు తాగునీటి అవసరాలకే సరిపోతుందని చెప్పారు. ఏఎంఆర్‌పీ కూడా సగం మాత్రమే నిండిందని, గతంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి చూడలేదన్నారు.

ల‌క్ష‌న్న‌ర ఎక‌రాల‌కు పెంచాలి..

రానున్న రోజుల్లో సూపర్‌ ఎల్‌నినో ప్రభావంతో దక్షిణ తెలంగాణలో పరిస్థితులు మరింత ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందని మంత్రి పేర్కొన్నారు. కష్టకాలంలో అధికారులు, ప్రజాప్రతినిధులు రైతులకు అండగా నిలవాలని సూచించారు. జిల్లాలో ప్రస్తుతం 33 వేల ఎకరాల్లో వరికి బదులుగా ఆరుతడి పంటలు సాగు చేస్తున్నారని, ఈ విస్తీర్ణాన్ని లక్షన్నర ఎకరాలకు పెంచేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు నిండినప్పటికీ చెరువులు నింపే పరిస్థితి ఉండకపోవచ్చని మంత్రి అన్నారు. ఇప్పటికే బోర్లలో భూగర్భజలాలు తగ్గిపోతున్నాయని, నీటి కొరతను దృష్టిలో ఉంచుకొని రైతులు వరి సాగు వైపు వెళ్లకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. కూరగాయలు, ఉద్యాన పంటలు సాగు చేయడంతోపాటు సేంద్రియ వ్యవసాయం వైపు రైతులను మళ్లించాలని సూచించారు. జిల్లాలో 9 వేల ట్రాన్స్‌ఫార్మర్లపై ఓవర్‌లోడ్‌ ఉన్న విషయాన్ని మంత్రి ప్రస్తావించారు. అవసరమైన విద్యుత్‌ సామగ్రిని సమకూర్చేందుకు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకుంటామని చెప్పారు.

2028 ఆగస్టులోగా ఎస్‌ఎల్‌బీసీ పూర్తి

కరువు పరిస్థితులు ఎదురైనా నల్లగొండ జిల్లాకు శాశ్వతంగా సాగునీరు అందించే ఎస్‌ఎల్‌బీసీ సొరంగం పనులను కొనసాగిస్తున్నామని మంత్రి తెలిపారు. 2028 ఆగస్టు నాటికి పనులు పూర్తి చేస్తామని చెప్పారు. ఎస్‌ఎల్‌బీసీ కోసం ఎంతైనా ఖర్చు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారని పేర్కొన్నారు. శ్రీశైలం డెడ్‌ స్టోరేజీలో ఉన్న సమయంలోనూ ఎస్‌ఎల్‌బీసీ ద్వారా సాగునీరు అందించే అవకాశం ఉంటుందని అన్నారు. ఏఎంఆర్‌పీ, ఎస్‌ఎల్‌బీసీ, బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్టుల ద్వారా జిల్లాలో నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని మంత్రి తెలిపారు. అధికారులు తరచూ క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులకు ధైర్యం చెప్పాలని, ప్రస్తుత పరిస్థితులను వివరించి ఆరుతడి పంటల సాగుకు ప్రోత్సహించాలని సూచించారు. జిల్లా సాగునీటి సలహా మండలి సమావేశాలను ఇకపై తరచూ నిర్వహించాలని ఆదేశించారు. వివిధ ప్రాజెక్టుల కింద రైతులు వరుసగా రెండు పంటలు వరి సాగు చేస్తున్నారని మంత్రి అన్నారు. దీనివల్ల భవిష్యత్తులో భూములు సారం కోల్పోయి పనికిరాకుండా పోయే ప్రమాదం ఉందన్నారు. అధికంగా ఎరువులు వినియోగించడం, నిరంతరం వరి సాగు చేయడం వల్ల భూముల సామర్థ్యం దెబ్బతింటుందని రైతులకు వివరించాలని సూచించారు. జిల్లాకు 5 వేల స్ప్రింక్లర్‌ యూనిట్లు కావాలని అధికారులు కోరగా, వాటిని తక్షణమే మంజూరు చేయించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.

ఆగస్టు 15లోగా ఆరుతడి పంటలపై దృష్టి

ఎల్‌నినో ప్రభావంతో రానున్న రోజుల్లో సాగునీటికి మరింత ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉందని ఎమ్మెల్సీ శంకర్‌నాయక్‌ అన్నారు. పంట మార్పిడిపై రైతుల వద్దకు వెళ్లి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి రైతులను చైతన్యపరచాలని సూచించారు. క‌లెక్ట‌ర్ బీ చంద్ర‌శేఖ‌ర్ మాట్లాడుతూ ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు లేక ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు తగ్గిపోయాయని తెలిపారు. రానున్న రోజుల్లో ఎగువ నుంచి సాగునీరు వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నందున రైతులు వేయబోయే పంటలు, తాగునీరు, ఇతర అవసరాలపై ముందస్తు ప్రణాళిక రూపొందించేందుకు సమావేశం నిర్వహించినట్లు చెప్పారు. సెప్టెంబర్‌లోనూ సూపర్‌ ఎల్‌నినో ప్రభావం ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచనలను దృష్టిలో ఉంచుకోవాలన్నారు. ఉత్తర తెలంగాణలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉన్నప్పటికీ దక్షిణ తెలంగాణలో వర్షాలు తక్కువగా ఉండే అవకాశముందని తెలిపారు. ఆగస్టు 15 వరకు మాత్రమే ఆరుతడి పంటలు వేసుకునే అవకాశం ఉన్నందున వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులు వెంటనే క్షేత్రస్థాయికి వెళ్లి రైతులను చైతన్యపరచాలని కలెక్టర్‌ సూచించారు.

Advertisement
Advertisement