త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Vemula Prashanth Reddy | మేడిగడ్డ బ్యారేజ్ చెక్కుచెదరలేదు.. కాంగ్రెస్ అబద్ధాల ప్రచారం బట్టబయలైంది

Vemula Prashanth Reddy | మేడిగడ్డ బ్యారేజ్ కొట్టుకుపోయిందని, కూలిపోయిందని కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న‌ ప్రచారం పచ్చి అబద్ధమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

S

Telangana | Published On Nov 3, 2026, 8.09 pm IST

Vemula Prashanth Reddy | మేడిగడ్డ బ్యారేజ్ చెక్కుచెదరలేదు.. కాంగ్రెస్ అబద్ధాల ప్రచారం బట్టబయలైంది
Advertisement

ఎస్సార్ఎస్పీ, నిజాంసాగర్ ప్రాజెక్టులను నింపాలి
రైతుల పంటలను కాపాడటంలో
రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలం
మేడిగడ్డ వద్ద 85 పిల్లర్లు నిటారుగా ఉన్నాయి..
కూలిపోయిందన్న ప్రచారం పచ్చి అబద్ధం
కేసీఆర్ పేరు రాకూడదనే దుర్బుద్ధితోనే
నీళ్లను సముద్రం పాలు చేస్తున్నారా?
రెండు టీఎంసీల ప్రవాహం ఉన్నా ఎత్తిపోయరా?
పంటలు ఎండిపోతుంటే ప్రభుత్వ మొద్దు నిద్ర
సాగునీరు విడుదల చేయకపోతే
కేటీఆర్ నాయకత్వంలో రైతు పోరుబాట తప్పదు

Vemula Prashanth Reddy | త్రినేత్ర న్యూస్ : మేడిగడ్డ బ్యారేజ్ కొట్టుకుపోయిందని, కూలిపోయిందని కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న‌ ప్రచారం పచ్చి అబద్ధమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సాగునీరు అందక ఎండిపోతున్న పంటలను, రైతుల గోసను స్వయంగా చూసిన ఉమ్మడి జిల్లా బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు మొదట కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని ప్రాణహిత-గోదావరి సంగమ ప్రాంతాన్ని, సిరోంచ, కాళేశ్వరం మధ్య గోదావరి బ్రిడ్జ్ వద్ద ఉన్న నీటి ప్రవాహాన్ని, కన్నెపల్లి పంప్‌హౌస్ ప్రాంతాన్ని పరిశీలించి తదనంతరం నేరుగా మేడిగడ్డ బ్యారేజీని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మేడిగడ్డ బ్యారేజ్ వద్ద గోదావరి నీటి ప్రవాహాన్ని పరిశీలించిన అనంతరం బ్యారేజ్ పైకి వాహనాలు వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంతో కాసేపు వారితో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి బీఆర్ఎస్ ప్రతినిధులు వాగ్వాదానికి దిగారు.

ఈ సందర్భంగా వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. మేడిగడ్డ బ్యారేజ్ మొత్తం 85 పిల్లర్లతో నిటారుగా చెక్కు చెదరకుండా నిలబడి ఉన్న వాస్తవాన్ని స్వయంగా మీడియా కెమెరాల సాక్షిగా ప్రజలందరూ గమనించవచ్చని పేర్కొన్నారు. గత మూడు వర్షాకాలాల్లో సంభవించిన భారీ వరదలు, లక్షలాది క్యూసెక్కుల ప్రవాహాన్ని తట్టుకొని నిలబడిన ఈ బ్యారేజిలో ఒక్క పిల్లర్ కూడా కొట్టుకుపోలేదని స్పష్టం చేశారు. కేవలం రెండు మూడు పిల్లర్లకు చిన్నపాటి మరమ్మతులు అవసరమైతే, వాటిని మూడేళ్లుగా బాగుచేయడం చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రాజెక్టు మొత్తం కూలిపోయిందంటూ దుష్ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కరువు పరిస్థితుల్లోనూ మేడిగడ్డ వద్ద దాదాపు 22,000 క్యూసెక్కుల ప్రవాహం

ప్రస్తుత కరువు పరిస్థితుల్లోనూ మేడిగడ్డ వద్ద దాదాపు 22,000 క్యూసెక్కుల ప్రవాహం (రోజుకు సుమారు 2 టీఎంసీల మేర నీరు) వృథాగా దిగువకు తరలిపోతోందని ప్రశాంత్ రెడ్డి తెలిపారు. కన్నెపల్లి పంపులను ఆన్ చేసి ఆ నీటిని ఎత్తిపోస్తే ఎస్సారెస్పీ (SRSP), నిజాంసాగర్ సహా మిడ్ మానేరు, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, రంగనాయక సాగర్ వంటి రిజర్వాయర్లన్నింటినీ నింపవచ్చని వివరించారు. రోజుకు ఒక టీఎంసీ చొప్పున 90 రోజులు నీటిని ఎత్తిపోస్తే ఎస్సారెస్పీ ప్రాజెక్టును పూర్తిగా నింపవచ్చని, రోజుకు అర టీఎంసీ చొప్పున నెలన్నర రోజులు పంపింగ్ చేస్తే 18 టీఎంసీల సామర్థ్యం గల నిజాంసాగర్‌ను పూర్తిగా నింపే అవకాశముందని గుర్తుచేశారు. నీరు లేక గుత్ప, అలీసాగర్, చౌట్‌పల్లి హన్మంత్‌రెడ్డి, నవాబు, వేంపల్లి, సారంగాపూర్, మెంట్రాజ్‌పల్లి లిఫ్టుల కింద, నిజాంసాగర్ ఆయకట్టు కింద లక్షలాది ఎకరాల పంటలు ఎండుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం దున్నపోతు మీద వాన పడ్డట్టు వ్యవహరిస్తోందని మండిపడ్డారు.

ప్రజలను మోసగించే సరికొత్త డ్రామా

గోదావరి జలాలను ఎత్తిపోసి చెరువులు, రిజర్వాయర్లు నింపితే కేసీఆర్‌కి ఎక్కడ మంచి పేరు వస్తుందోనన్న ద్వేషపూరితమైన దుర్బుద్ధితోనే కాంగ్రెస్ ప్రభుత్వం నీటిని ఎత్తిపోయకుండా సముద్రం పాలు చేస్తోందని ఆరోపించారు. ఇక్కడ నీటిని దిగువకు వదిలేస్తుంటే, చంద్రబాబు ఆ నీటిని వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న కుప్పం వరకు తరలించుకుపోతున్నారని, కానీ తెలంగాణలో పక్కనే ఉన్న ప్రాజెక్టులకు మాత్రం ఈ ప్రభుత్వం నీరివ్వడం లేదని దుయ్యబట్టారు. తుమ్మిడిహట్టి వద్ద ప్రస్తుతం కేవలం 4,000 క్యూసెక్కుల ప్రవాహం మాత్రమే ఉండగా, మేడిగడ్డ వద్ద 22,000 క్యూసెక్కుల నీరు అందుబాటులో ఉన్నప్పటికీ, అక్కడ ప్రాజెక్టు కడతామని చెప్పడం ప్రజలను మోసగించే సరికొత్త డ్రామా అని కొట్టిపారేశారు.

'రైతు పోరుబాట' ఉద్యమాన్ని చేప‌డుతాం

రేవంత్ రెడ్డి ప్రభుత్వం తన రాక్షస వైఖరిని, దుర్బుద్ధిని విడనాడి, ఇప్పటికైనా తక్షణమే మోటార్లు ఆన్ చేసి వృథాగా పోతున్న నీటిని ప్రాజెక్టులకు ఎత్తిపోయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం మొండిగా వ్యవహరించి సాగునీరు అందించకపోతే తెలంగాణ రైతుల ఉసురు తగులుతుందని హెచ్చరించారు. తక్షణమే నిర్ణయం తీసుకోకపోతే, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాయకత్వంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రైతాంగాన్ని ఏకం చేసి పెద్దఎత్తున 'రైతు పోరుబాట' ఉద్యమాన్ని చేపడతామని వేముల ప్రశాంత్ రెడ్డి హెచ్చరించారు.

ఈ పర్యటనలో వేముల ప్రశాంత్ రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యేలు గోవ‌ర్ధ‌న్ బాజిరెడ్డి, గంప గోవ‌ర్ధ‌న్‌, జీవ‌న్ రెడ్డి, పుట్ట మ‌ధు, గ‌ణేశ్ బిగాలా, జాజాల సురేంద‌ర్, హ‌నుమంత్ షిండే, విఠల్ రావు, షేక్ ముజీబుద్దీన్ తదితర ముఖ్య నేతలు పాల్గొన్నారు.

ట్యాగ్స్:

BRS PartyCongress GovtIrrigationKaleshwaramMedigadda BarrageTelanganaVemula Prashanth Reddy
Advertisement
Advertisement