KCR | త్రినేత్ర.న్యూస్ : బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మానుకోట జిల్లాకు చెందిన యువనేత ఎన్నారై డాక్టర్ ఎర్రంరెడ్డి తిరుపతి రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల మీద తిరుపతి రెడ్డి చేస్తున్న పోరాటాన్ని కేసీఆర్ అభినందించారు. ఈ సందర్భంగా ఆయనకు చిరు సత్కారం చేశారు. అలాగే అమెరికాలో ప్రవాస తెలుగు వారి సమస్యల గురించి వాకబు చేశారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో పాలకుర్తి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి మంచి ఫలితాలు రావడం పట్ల కేసీఆర్ ఎర్రబెల్లి దయాకర్ రావును అభినందించారు. ఇదే ఉత్సాహంతో రానున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించాలని సూచించారు. త్వరలోనే బీఆర్ఎస్ రాష్ట్ర కమిటీతో పాటు సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసేందుకు అన్ని కమిటీలను వేసి సమర్థులైన నాయకులకు కీలక పదవులను కట్టబెడుతామని ఈ సమావేశంలో చర్చకు వచ్చిందన్నారు ఎర్రబెల్లి దయాకర్ రావు. ఎన్నారై తిరుపతి రెడ్డి మాట్లాడుతూ.. గత రెండేండ్ల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ఆగమైందని, మళ్లీ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే.. కేసీఆర్‌తోనే సాధ్యమవుతుందన్నారు. తెలంగాణలో మళ్లీ బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు మా ప్రవాస తెలంగాణ వాసులందరం కలిసి కృషి చేస్తామని స్పష్టం చేశారు.