త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

TIMS | త్వ‌ర‌లో టిమ్స్‌ను ప్రారంభించ‌నున్న సీఎం.. ఏర్పాట్ల‌ను స‌మీక్షించిన‌ మంత్రి రాజ‌న‌ర్సింహ‌

TIMS | హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌లో నిర్మించిన అత్యాధునిక టిమ్స్ (TIMS) ఆస్పత్రి త్వరలో ప్రజలకు అందుబాటులోకి రానుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆస్పత్రిని ప్రారంభించనున్న నేపథ్యంలో ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ శనివారం ఆస్పత్రిని సందర్శించి ఏర్పాట్లను సమీక్షించారు.

P

Telangana | Published On Jun 6, 2026, 4.28 pm IST

TIMS | త్వ‌ర‌లో టిమ్స్‌ను ప్రారంభించ‌నున్న సీఎం.. ఏర్పాట్ల‌ను స‌మీక్షించిన‌ మంత్రి రాజ‌న‌ర్సింహ‌
Advertisement

TIMS | హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌లో నిర్మించిన అత్యాధునిక టిమ్స్ (TIMS) ఆస్పత్రి త్వరలో ప్రజలకు అందుబాటులోకి రానుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆస్పత్రిని ప్రారంభించనున్న నేపథ్యంలో ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ శనివారం ఆస్పత్రిని సందర్శించి ఏర్పాట్లను సమీక్షించారు. ఆస్పత్రిలోని ఏ, బీ, సీ బ్లాకులను పరిశీలించిన మంత్రి, ఓపీ రిజిస్ట్రేషన్ కౌంటర్లు, ఇన్‌పేషెంట్ వార్డులు, అత్యవసర విభాగం, ఐసీయూలు, ఆపరేషన్ థియేటర్లు, సీటీ స్కాన్, ఎంఆర్‌ఐ, డయాగ్నస్టిక్ కేంద్రాలు, ల్యాబొరేటరీలు, బ్లడ్ బ్యాంక్, మెకనైజ్డ్ ల్యాండ్రీ, సెంట్రలైజ్డ్ కిచెన్, ఫార్మసీ తదితర విభాగాలను సందర్శించారు.

ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన ఆధునిక వైద్య పరికరాలు, మౌలిక వసతులు, సేవల నిర్వహణ వ్యవస్థలను స్వయంగా పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రారంభోత్సవానికి ముందు పెండింగ్‌లో ఉన్న అన్ని పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆర్ అండ్ బీ, ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. రోగులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నీటి సరఫరా, విద్యుత్, పారిశుధ్యం, భద్రత, అగ్నిమాపక వ్యవస్థలను అత్యున్నత ప్రమాణాలతో సిద్ధం చేయాలని సూచించారు. ఓపీ, రిజిస్ట్రేషన్ కౌంటర్లు, హెల్ప్ డెస్క్‌లు, ఫార్మసీ సేవలు, వెయిటింగ్ ఏరియాలను మరింత బలోపేతం చేయాలని మంత్రి చెప్పారు. సీటీ స్కాన్, ఎంఆర్‌ఐ, డిజిటల్ ఎక్స్‌రే, అల్ట్రాసౌండ్ వంటి ఆధునిక యంత్రాలు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండేలా అవసరమైన వైద్యులు, టెక్నీషియన్లు, సిబ్బందిని సిద్ధంగా ఉంచాలని అధికారులకు సూచించారు.

గుండె సంబంధిత వ్యాధుల చికిత్సలు, అవయవ మార్పిడి శస్త్రచికిత్సలకు సనత్‌నగర్ టిమ్స్‌ను ప్రత్యేక కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నామని మంత్రి తెలిపారు. క్యాథ్‌ల్యాబ్‌లు, ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్ సదుపాయాలు, అత్యాధునిక ఆపరేషన్ థియేటర్లతో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ఆస్పత్రి సిద్ధంగా ఉందన్నారు. పేదలకు కార్పొరేట్ స్థాయి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యానికి అనుగుణంగా ఈ ఆస్పత్రిని తీర్చిదిద్దుతున్నామని రాజనర్సింహ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలకు ప్రపంచ స్థాయి వైద్య సేవలు అందించే ప్రముఖ వైద్య సంస్థగా టిమ్స్ ఎదగాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

రోగులతో పాటు వారి సహాయకులకు కూడా మెరుగైన సౌకర్యాలు కల్పించాలని మంత్రి సూచించారు. ధర్మశాలలు, క్యాంటీన్లు, పార్కింగ్ సదుపాయాలు, హాస్టల్ బ్లాకులు, ఇతర సహాయక సేవలను సమగ్రంగా అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. అనంతరం ఆస్పత్రి నిర్వహణ, వైద్య సేవలు, మానవ వనరులు, భద్రత, పారిశుధ్యం తదితర అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి క్రిస్టినా జడ్ చొంగ్తు, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నరేంద్ర కుమార్, నిమ్స్ డైరెక్టర్ బీరప్ప, ఆర్ అండ్ బీ, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement