త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ponnam Prabhakar | రూ. 30 వేల కోట్ల స‌హాయం అందించాల‌ని కేంద్రాన్ని కోరుతాం

Ponnam Prabhakar | తెలంగాణలో కరువు పరిస్థితుల నివారణకు రూ. 30 వేల కోట్ల సహాయం అందించాలని కేంద్రాన్ని కోరుతూ ప్రధానమంత్రికి లేఖ రాయాలని పీఏసీ నిర్ణయం తీసుకుంది అని మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ తెలిపారు.

S

Telangana | Published On Nov 22, 2026, 4.34 pm IST

Ponnam Prabhakar | రూ. 30 వేల కోట్ల స‌హాయం అందించాల‌ని కేంద్రాన్ని కోరుతాం
Advertisement

Ponnam Prabhakar | త్రినేత్ర న్యూస్ : తెలంగాణలో కరువు పరిస్థితుల నివారణకు రూ. 30 వేల కోట్ల సహాయం అందించాలని కేంద్రాన్ని కోరుతూ ప్రధానమంత్రికి లేఖ రాయాలని పీఏసీ నిర్ణయం తీసుకుంది అని మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ తెలిపారు. తెలంగాణ కరువు పరిస్థితులను జాతీయ విపత్తుగా పరిగణించి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరించాలని డిమాండ్ చేస్తున్నామ‌ని ఆయ‌న పేర్కొన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పొలిటిక‌ల్ అడ్వైజ‌రీ క‌మిటీ స‌మావేశం ముగిసిన అనంత‌రం పొన్నం ప్ర‌భాక‌ర్ మీడియాతో మాట్లాడారు.

తెలంగాణ కాంగ్రెస్ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ (PAC) సమావేశం పీసీసీ అధ్యక్షుడు అధ్యక్షతన సుదీర్ఘంగా జరిగింది. పీఏసీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, మంత్రులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. తెలంగాణ నూతన కాంగ్రెస్ ఇంచార్జ్ బీఎం సందీప్‌కు స్వాగతం పలుకుతూ పీఏసీ సమావేశంలో తీర్మానం చేయడం జరిగింది. గత ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ పార్టీకి అందించిన సేవలకు ధన్యవాదాలు తెలుపుతూ పీఏసీ తీర్మానం చేసింది అని తెలిపారు.

2027 జనగణనలో ఓబీసీ కులగణన కోసం ప్రత్యేక కాలమ్

2027 జనగణనలో ఓబీసీ కులగణన కోసం ప్రత్యేక కాలమ్ చేర్చాలని కాంగ్రెస్ పీఏసీ తీర్మానం చేసింది. జనగణన ప్రశ్నావళిలో ఓబీసీ కులగణనకు అవకాశం కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లేందుకు పార్టీ, ప్రభుత్వ సమన్వయంపై పీఏసీ సమావేశంలో చర్చించామ‌న్నారు.

కాంగ్రెస్ పార్టీ అప్ర‌మ‌త్తంగా ఉండాలి

మండల, గ్రామ, పట్టణ, వార్డు కాంగ్రెస్ కమిటీలను మరింత బలోపేతం చేయాలని నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ అనుబంధ సంఘాలను పటిష్టపరిచి పార్టీ సంస్థాగత బలోపేతానికి చర్యలు చేపట్టాలని పీఏసీ నిర్ణ‌యించింది. కేంద్ర బీజేపీ నేతల పర్యటనల నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ శ్రేణులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఓటర్ రివిజన్ ప్రక్రియలో అర్హులైన ఓటర్ల పేర్లు తొలగించకుండా ఓటు హక్కును కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీ అప్రమత్తంగా ఉండాలని నిర్ణయం తీసుకున్న‌ట్లు మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ పేర్కొన్నారు.

డిసెంబర్ 7తో ప్రజా ప్రభుత్వం మూడేళ్లు పూర్తి

రాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు స్థానాలను గెలుచుకోవడమే లక్ష్యంగా ఇప్పటి నుంచే కార్యాచరణ చేపట్టాలని నిర్ణ‌యించాం. డిసెంబర్ 7తో ప్రజా ప్రభుత్వం మూడేళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేయాలన్నారు. ఢిల్లీ రాంలీలా మైదాన్ సభలో తెలంగాణ భాగస్వామ్యంపై ప్ర‌స్తావ‌న వ‌చ్చింద‌న్నారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ ద్వారా 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ దిశగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషిని కాంగ్రెస్ నూతన ఇంచార్జ్ ప్రశంసించారు. కాంగ్రెస్ నూతన ఇంచార్జ్ సందీప్ త్వరలో రాష్ట్ర నాయకులతో విడివిడిగా సమావేశమై అభిప్రాయాలు సేకరించనున్నార‌ని పొన్నం ప్ర‌భాక‌ర్ స్ప‌ష్టం చేశారు.

Advertisement
Advertisement