త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Nitin Nabin | రేపు క‌రీంన‌గ‌ర్‌కు బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు

Nitin Nabin | తెలంగాణలో పార్టీని మరింత బలోపేతం చేయడంపై బీజేపీ జాతీయ నాయకత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగా పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్‌ సోమవారం కరీంనగర్‌లో పర్యటించనున్నారు. ‘లోక్‌తంత్ర బచావో.. అరాజక్‌తా హటావో’ (ప్రజాస్వామ్యాన్ని కాపాడండి.. అరాచకాన్ని అంతం చేయండి) నినాదంతో చేపట్టిన దేశవ్యాప్త ప్రచారంలో భాగంగా నగరంలో భారీ మహా పాదయాత్ర నిర్వహించనున్నారు.

P

Telangana | Published On Nov 22, 2026, 4.50 pm IST

Nitin Nabin | రేపు క‌రీంన‌గ‌ర్‌కు బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు
Advertisement
  • ప్రజాస్వామ్యాన్ని కాపాడండి.. అరాచకాన్ని అంతం చేయండి నినాదంతో మ‌హాపాద్ర‌యాత్ర‌
  • కామన్ చౌరస్తాలో బహిరంగ సభ
  • లక్ష మందిని సమీకరించేందుకు బీజేపీ ఏర్పాట్లు

Nitin Nabin | తెలంగాణలో పార్టీని మరింత బలోపేతం చేయడంపై బీజేపీ జాతీయ నాయకత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగా పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్‌ సోమవారం కరీంనగర్‌లో పర్యటించనున్నారు. ‘లోక్‌తంత్ర బచావో.. అరాజక్‌తా హటావో’ (ప్రజాస్వామ్యాన్ని కాపాడండి.. అరాచకాన్ని అంతం చేయండి) నినాదంతో చేపట్టిన దేశవ్యాప్త ప్రచారంలో భాగంగా నగరంలో భారీ మహా పాదయాత్ర నిర్వహించనున్నారు. ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌)పై కాంగ్రెస్‌, ఇండియా కూటమి చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టడంతోపాటు ప్రజల్లో అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. సుమారు 2.5 కిలోమీటర్ల మేర సాగే పాదయాత్ర అనంతరం కామన్‌ చౌరస్తాలో నిర్వహించే బహిరంగ సభలో నితిన్ నబీన్‌ ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ తెలంగాణ శాఖ లక్ష మందిని సమీకరించేందుకు భారీ ఏర్పాట్లు చేస్తోంది. కరీంనగర్‌ ఎంపీ, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

భారీగా జన సమీకరణ

కరీంనగర్ మహా పాదయాత్రను బీజేపీ తెలంగాణ శాఖ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఏర్పాట్లను బండి సంజయ్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు, కార్యకర్తలను తరలించేందుకు ప్రత్యేకంగా వాహనాలను ఏర్పాటు చేస్తున్నారు. పాదయాత్ర మార్గాన్ని బండి సంజయ్ స్థానిక బీజేపీ నేతలతో కలిసి పరిశీలించి ఏర్పాట్లను ఖరారు చేశారు. పార్టీ జాతీయ అధ్యక్షుడికి స్వాగతం పలికేలా మార్గమంతా హోర్డింగ్‌లు, బ్యానర్లు, ఫ్లెక్సీలతో ముస్తాబు చేస్తున్నారు. పార్టీ శ్రేణులు ఇప్పటికే ఏర్పాట్లలో నిమగ్నమయ్యాయి. ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌)పై కాంగ్రెస్, ఇండియా కూటమి చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టడమే ఈ పాదయాత్ర ప్రధాన ఉద్దేశమని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఎస్‌ఐఆర్‌కు వ్యతిరేకంగా విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆరోపిస్తూ ప్రజల్లో అవగాహన కల్పించేందుకు దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు చెబుతున్నారు. కాంగ్రెస్, ఇండియా కూటమి పాలనలో జరుగుతున్నాయని తాము ఆరోపిస్తున్న అరాచకాలు, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్య పరిరక్షణ లక్ష్యంతోనే మహా పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు బండి సంజయ్ మీడియాకు తెలిపారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడటంతోపాటు ప్రజల్లో చైతన్యం తీసుకురావడమే ఈ కార్యక్రమం ఉద్దేశమని పేర్కొన్నారు.

మాదకద్రవ్యాల నిర్మూలనపైనా ప్రచారం

మహా పాదయాత్ర ద్వారా మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలపై కూడా ప్రజల్లో అవగాహన కల్పించనున్నట్లు బండి సంజయ్ వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆలోచన, కేంద్ర హోంమంత్రి అమిత్ షా లక్ష్యమైన ‘నషా ముక్త్ భారత్’ సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని పేర్కొన్నారు. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, మత్తు పదార్థాల రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని పిలుపునిచ్చారు.

ఈ నెల 2న హైదరాబాద్‌లో అమిత్ షా పాదయాత్ర

ఎస్‌ఐఆర్‌కు వ్యతిరేకంగా ఇండియా కూటమి చేస్తున్న ప్రచారాన్ని ఎదుర్కొనేందుకు ఈ నెల 2న కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్‌లో పాదయాత్ర నిర్వహించారు. ఆ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. ఎస్‌ఐఆర్‌లో తొలగించాల్సిన ‘గైర్హాజరు ఓటర్ల’ జాబితాలో మూడు కోట్ల మంది బంగ్లాదేశీ చొరబాటుదారులు ఉన్నారని ఆరోపించారు. అలాంటి వారిని కాపాడేందుకే కాంగ్రెస్ పార్టీ ఎస్‌ఐఆర్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన ప్రతి ఒక్కరినీ ఓటర్ల జాబితాల నుంచి తొలగించడంతోపాటు దేశం నుంచి బయటకు పంపేలా బీజేపీ చర్యలు తీసుకుంటుందని అమిత్ షా ప్రకటించారు. చొరబాటుదారులే తమ ఓటు బ్యాంకు కావడంతో కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు ఎస్‌ఐఆర్‌ను అడ్డుకుంటున్నాయని ఆరోపించారు. ఈ దేశ పౌరులకు మాత్రమే ఓటు హక్కు ఉండాలని, ఎస్‌ఐఆర్‌కు బీజేపీ కార్యకర్తలు పూర్తి మద్దతుగా నిలుస్తారని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో కరీంనగర్‌లో నితిన్ నబీన్ చేపట్టనున్న మహా పాదయాత్రకు రాజకీయంగా ప్రాధాన్యం ఏర్పడింది.

Advertisement
Advertisement