త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ponnam Prabhakar | ఎన్నిక‌ల వ‌ర‌కే రాజ‌కీయాలు : మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్

Ponnam Prabhakar | ఎన్నికల వరకే రాజకీయాలు ఎన్నికల తర్వాత అభివృద్ధే లక్ష్యంగా అందరం కలిసి పనిచేద్దామ‌ని రాష్ట్ర మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ పిలుపునిచ్చారు. కేంద్ర మంత్రి బండి సంజయ్, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులతో కలిసి కరీంనగర్ ఉమ్మడి జిల్లా అభివృద్ధికి కృషి చేస్తామ‌ని స్ప‌ష్టం చేశారు.

S

Telangana | Published On Nov 9, 2026, 12.46 pm IST

Ponnam Prabhakar | ఎన్నిక‌ల వ‌ర‌కే రాజ‌కీయాలు : మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్
Advertisement

Ponnam Prabhakar | త్రినేత్ర న్యూస్ : ఎన్నికల వరకే రాజకీయాలు ఎన్నికల తర్వాత అభివృద్ధే లక్ష్యంగా అందరం కలిసి పనిచేద్దామ‌ని రాష్ట్ర మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ పిలుపునిచ్చారు. కేంద్ర మంత్రి బండి సంజయ్, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులతో కలిసి కరీంనగర్ ఉమ్మడి జిల్లా అభివృద్ధికి కృషి చేస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. క‌రీంన‌గ‌ర్‌లో సోమ‌వారం కేంద్ర మంత్రి బండి సంజ‌య్‌తో క‌లిసి మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ మీడియాతో మాట్లాడారు.

వ్యక్తిగత రాజకీయాలకు అతీతంగా జిల్లా అభివృద్ధి కోసం సమష్టిగా పనిచేయాలని నిర్ణయం తీసుకున్నాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో కరీంనగర్ ఉమ్మడి జిల్లాను అభివృద్ధిలో అగ్రభాగాన నిలబెడతాం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 70 నుంచి 90 శాతం పూర్తయి పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామ‌న్నారు.

భీమదేవరపల్లిలో నవోదయ విద్యాలయం ఏర్పాటు

విద్యారంగ అభివృద్ధిలో భాగంగా భీమదేవరపల్లిలో నవోదయ విద్యాలయం ఏర్పాటుకు ప్రతిపాదన చేశాం. రాజన్న సిరిసిల్ల జిల్లాలోనూ నవోదయ విద్యాలయం ఏర్పాటుకు ప్రతిపాదనలు చేశాం. జమ్మికుంట , హుస్నాబాద్‌లో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేయాలని అడుగుతున్నాం. ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం, ఫార్మసీ, ఇంజనీరింగ్ వంటి ఉన్నత విద్యా కోర్సులకు ప్రాధాన్యత కల్పిస్తున్నాం. అసంపూర్తిగా నిలిచిపోయిన మెడికల్ కాలేజీ నిర్మాణాన్ని పూర్తి చేయడంతో పాటు వైద్య రంగాన్ని అభివృద్ధి చేస్తాం. విద్య, వైద్యం, పారిశ్రామిక పార్కులు, మౌలిక సదుపాయాల కల్పనకు సమగ్ర ప్రణాళికతో ముందుకు పోతున్నామ‌ని పొన్నం ప్ర‌భాక‌ర్ తెలిపారు.

ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు అభివృద్ధిలో అపార అవకాశాలు

సింగరేణి, ఎన్టీపీసీ, గోదావరి జలసంపదతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు అభివృద్ధిలో అపార అవకాశాలు ఉన్నాయి. వేములవాడ, కొండగట్టు, ధర్మపురి, కాళేశ్వరం, కొత్తకొండ ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తున్నాం. ఎలగందుల ఖిల్లా, ఇతర పర్యాటక ప్రాంతాలు, జలవనరుల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో చర్యలు తీసుకుంటున్నాం. కరీంనగర్ నగరంలో పెరుగుతున్న పట్టణీకరణకు అనుగుణంగా అర్బన్ డెవలప్‌మెంట్‌కు ప్రాధాన్యత. రాష్ట్రంలో పట్టణాభివృద్ధి కోసం దాదాపు 1000 కొత్త పోస్టులకు ఇటీవల రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. కరీంనగర్‌లో అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను పేదలకు అందించేలా చర్యలు తీసుకోవాలని ఆర్థిక మంత్రిని, జిల్లా ఇంచార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కోరామ‌ని పేర్కొన్నారు.

అభివృద్ధి చెందిన జిల్లాగా ఉమ్మడి కరీంనగర్‌ను తీర్చిదిద్దడమే మా లక్ష్యం

ప్రజలకు సంబంధించిన ఉమ్మడి సమస్యలను మా దృష్టికి తీసుకువస్తే సానుకూలంగా స్పందించి పరిష్కారానికి కృషి చేస్తాం. జిల్లాకు అవసరమైన అభివృద్ధి పనులపై జర్నలిస్టులు కూడా సూచనలు చేస్తూ భాగస్వాములు కావాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వీలైనన్ని నిధులు తీసుకొచ్చి జిల్లా అభివృద్ధికి సమష్టిగా కృషి చేస్తాం. ఉత్తర తెలంగాణలో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన జిల్లాగా ఉమ్మడి కరీంనగర్‌ను తీర్చిదిద్దడమే మా లక్ష్యం. ప్రజాప్రతినిధిగా జిల్లా అభివృద్ధికి పాటుపడటం మా బాధ్యత.. ప్రజల ఆశీర్వాదంతో ఆ బాధ్యతను నెరవేరుస్తామ‌ని పొన్నం ప్ర‌భాక‌ర్ స్ప‌ష్టం చేశారు.

Advertisement
Advertisement