త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Nalgonda Fake Death Certificate Scam | రిటైర్డ్ ఉద్యోగి డ్యూటీలోనే చనిపోయినట్లు ఫేక్ డెత్ సర్టిఫికెట్.. రూ.16 లక్షల డీల్‌.. ప్రభుత్వ జాబ్ కొట్టారు

నల్గొండలో ఓ విస్తుపోయే స్కామ్ బయటపడింది. గవర్నమెంట్ జాబ్ కోసం రిటైర్డ్ ఉద్యోగి డ్యూటీలోనే చనిపోయినట్లు ఫేక్ డెత్ సర్టిఫికెట్ సృష్టించిన 14 మంది అరెస్ట్ అయ్యారు.

J

Telangana | Published On Nov 8, 2026, 10.00 pm IST

Nalgonda Fake Death Certificate Scam | రిటైర్డ్ ఉద్యోగి డ్యూటీలోనే చనిపోయినట్లు ఫేక్ డెత్ సర్టిఫికెట్.. రూ.16 లక్షల డీల్‌.. ప్రభుత్వ జాబ్ కొట్టారు

సంక్షిప్త సారాంశం

నల్గొండ జిల్లాలో కారుణ్య నియామకం (Compassionate Appointment) కింద గవర్నమెంట్ జాబ్ పొందేందుకు, రిటైర్ అయిన 6 నెలలకు చనిపోయిన ఉద్యోగిని సర్వీసులోనే మరణించినట్లు ఫేక్ డెత్ సర్టిఫికెట్ సృష్టించారు. మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు, మీ-సేవ నిర్వాహకులు, మున్సిపల్, డీఎంహెచ్‌ఓ (DMHO) ఆఫీస్ సిబ్బంది కలిసి రూ.16 లక్షలకు డీల్ కుదుర్చుకుని ఈ స్కామ్‌కు పాల్పడ్డారు. ఫేక్ డాక్యుమెంట్లతో దామరచర్ల పీహెచ్‌సీలో ఉద్యోగం పొందిన కుమారుడు రాజుతో పాటు సహకరించిన 14 మందిని పోలీసులు అరెస్ట్ చేయగా, మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. నిందితుల నుంచి రూ.5 లక్షల క్యాష్, ఒక కంప్యూటర్, ప్రింటర్, 12 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు నల్గొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ వెల్లడించారు.

Advertisement

Nalgonda Fake Death Certificate Scam | త్రినేత్ర న్యూస్ : నల్గొండ జిల్లా వైద్యారోగ్య శాఖలో ఓ ఘరానా ఉద్యోగ స్కామ్ వెలుగులోకి వచ్చింది. రిటైర్ అయిన ఆరు నెలల తర్వాత మరణించిన ఓ హెల్త్ అసిస్టెంట్.. డ్యూటీలో ఉండగానే చనిపోయినట్లు ఫేక్ డెత్ సర్టిఫికెట్ సృష్టించి, ఆయన కొడుకుకు కారుణ్య నియామకం కింద గవర్నమెంట్ జాబ్ ఇప్పించిన 14 మంది ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా శాలిగౌరారం పీహెచ్‌సీ (PHC)లో హెల్త్ అసిస్టెంట్‌గా పనిచేసిన చామకూరి వెంకటేశ్వర్లు 2025 మే 31న రిటైర్ అయ్యారు. ఆ తర్వాత కిడ్నీ వ్యాధితో బాధపడుతూ అదే ఏడాది నవంబర్ 17న మృతి చెందారు. అయితే ఆయన స్వగ్రామమైన నకిరేకల్ మండలం ఒగోడులో జరిగిన దశదిన కర్మల రోజున ఈ నయా స్కామ్‌కు పునాది పడింది.

రూ.16 లక్షల డీల్‌తో మాస్టర్ ప్లాన్

వెంకటేశ్వర్లు రిటైర్మెంట్‌కు ముందే డ్యూటీలో ఉండగా చనిపోయినట్లు రికార్డులు మార్చితే, ఆయన కుమారుడు చామకూరి రాజుకు కారుణ్య నియామకం కింద గవర్నమెంట్ జాబ్ వస్తుందని తోటి ఉద్యోగులు, బంధువులు ఐడియా ఇచ్చారు. ఇందుకోసం మృతుడి భార్య వసంత, కుమారుడు రాజు, బంధువులు రాజశేఖర్, రవీందర్‌తో పాటు శాలిగౌరారం పీహెచ్‌సీ సీనియర్ అసిస్టెంట్ కంచర్ల జగన్నాధ రెడ్డి కలిసి రూ.16 లక్షలకు డీల్ కుదుర్చుకున్నారు.

అడ్రస్ మార్చి.. ఫేక్ డెత్ సర్టిఫికెట్ సృష్టించి

ఈ ప్లాన్‌లో భాగంగా ముందుగా నల్గొండలోని మీ-సేవ ఆపరేటర్ పనస చంద్రశేఖర్ సాయంతో మృతుడి ఆధార్ కార్డులో అడ్రస్‌ను నల్గొండ టౌన్‌లోని చైతన్యపురి కాలనీకి మార్చారు. ఆ తర్వాత మున్సిపల్ వార్డు ఆఫీసర్ శివ జనార్ధన్, శానిటరీ ఇన్‌స్పెక్టర్ ప్రదీప్ రెడ్డి, మీ-సేవ ఏవో రాజశేఖర్‌లతో కుమ్మక్కై.. వెంకటేశ్వర్లు రిటైర్మెంట్‌కు మూడు రోజుల ముందు, అంటే 2025 మే 28నే చనిపోయినట్లు నల్గొండ మున్సిపాలిటీ నుంచి ఫేక్ డెత్ సర్టిఫికెట్ పుట్టించారు.

డీఎంహెచ్‌ఓ ఆఫీస్‌లో ఫైల్ క్లియర్

ఈ నకిలీ డెత్ సర్టిఫికెట్‌తో కారుణ్య నియామకం కోసం శాలిగౌరారం పీహెచ్‌సీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఆకుల కృష్ణ సూర్య శిల్ప ద్వారా ఫైల్‌ను డీఎంహెచ్‌ఓ (DMHO) ఆఫీస్‌కు పంపించారు. అక్కడ సీనియర్ అసిస్టెంట్ గింకల రాకేష్, జూనియర్ అసిస్టెంట్ మోహన్ కృష్ణ, ఏవోలు మహబూబ్ అలీ, జితేందర్ రెడ్డి, సీసీ రంజిత్ కుమార్ తప్పుడు ఎంక్వైరీ రిపోర్టులు తయారు చేసి ఫైల్ క్లియర్ చేశారు. దీంతో మృతుడి కుమారుడు రాజుకు దామరచర్ల పీహెచ్‌సీలో గవర్నమెంట్ జాబ్ వచ్చేసింది.

బయటపడ్డ బండారం.. 14 మంది అరెస్ట్

నల్గొండ మున్సిపాలిటీ నుంచి జారీ అయిన డెత్ సర్టిఫికెట్‌పై అనుమానం రావడంతో మున్సిపల్ కమిషనర్ వంశీకృష్ణ నల్గొండ వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు తీగ లాగితే మొత్తం డొంక కదిలింది. ఈ స్కామ్‌లో ఉద్యోగం పొందిన రాజుతో పాటు కుటుంబ సభ్యులు, మున్సిపల్, హెల్త్ డిపార్ట్‌మెంట్ ఉద్యోగులు సహా మొత్తం 14 మందిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుల నుంచి రూ.5 లక్షల క్యాష్, కంప్యూటర్, ప్రింటర్, 12 మొబైల్ ఫోన్లు సీజ్ చేసినట్లు ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Advertisement
Advertisement