త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Chhattisgarh | త్వరగా డబ్బు సంపాదించాలనే దురాశ.. సోషల్ మీడియా చూసి మేనల్లుడిని చంపి కిడ్నీలు, ఊపిరితిత్తులు తొలగించిన నిందితుడు

Chhattisgarh | చాలా త‌క్కువ స‌మ‌యంలో ఈజీగా డ‌బ్బు సంపాదించాల‌నే (earn quick money) దురాశ‌తో ఓ వ్య‌క్తి నాలుగేళ్ల బాలుడిని దారుణంగా హ‌త‌మార్చాడు. అనంత‌రం చిన్నారి శ‌రీరం నుంచి అవ‌య‌వాల‌ను (organs) వేరు చేసి ఆన్‌లైన్‌లో విక్ర‌యించాల‌ని ప్లాన్ చేశారు. ఈ దారుణ‌ ఘ‌ట‌న ఛ‌త్తీస్‌గ‌ఢ్ జిల్లాలో వెలుగు చూసింది.

D

National | Published On Nov 9, 2026, 12.17 pm IST

Chhattisgarh | త్వరగా డబ్బు సంపాదించాలనే దురాశ.. సోషల్ మీడియా చూసి మేనల్లుడిని చంపి కిడ్నీలు, ఊపిరితిత్తులు తొలగించిన నిందితుడు
Advertisement

Chhattisgarh | త్రినేత్ర న్యూస్ : ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh)లో దారుణం వెలుగు చూసింది. సోషల్ మీడియా ప్రభావంతో చాలా త‌క్కువ స‌మ‌యంలోనే సులభంగా డబ్బు సంపాదించాలనే (earn quick money) దురాశతో ఓ వ్య‌క్తి నాలుగేళ్ల బాలుడిని దారుణంగా హ‌త‌మార్చాడు. అనంత‌రం బాలుడి శ‌రీరం నుంచి కిడ్నీలు, ఊపిరితిత్తులు, క‌ళ్ల‌ను (organs) వేరు చేసి ఆన్‌లైన్‌లో విక్ర‌యించాల‌ని ప్లాన్ చేశాడు.

పోలీసులు తెలిపిన వివ‌రాల ప్రకారం.. జష్‌పూర్ (Jashpur) జిల్లాలోని లోధేనపాథ్ మహువా గ్రామానికి (Lodhenapath Mahua village) చెందిన 27 ఏళ్ల వాసుదేవ్ అలియాస్ టాంగ్ను రోజువారీ కూలీగా ప‌నిచేస్తూ జీవ‌నం సాగిస్తున్నాడు. అయితే, కూలీ ప‌నుల‌తో వ‌చ్చే ఆదాయం స‌రిపోక‌.. అడ్డ‌దారుల్లో డ‌బ్బు సంపాదించాల‌నే దుర్బుద్ధి పుట్టింది. చాలా త‌క్కువ స‌మ‌యంలోనే సులభంగా డబ్బు సంపాదించాల‌ని అనుకున్నాడు. త్వరగా ధనవంతుడు కావడానికి మార్గాల కోసం నిరంతరం సోషల్ మీడియాలో వెతికేవాడు. ఈ క్ర‌మంలోనే చిన్న పిల్ల‌ల అవ‌య‌వాల‌ను తొలగించి విక్రయించాలనే ఆలోచన పుట్టింది.

వ‌రుస‌కు మేన‌ల్లుడ‌య్యే నాలుగేళ్ల బాలుడు జితేంద్ర రామ్‌పై అత‌డి క‌న్ను ప‌డింది. ఇంకేముంది న‌వంబ‌ర్ 5న బాలుడికి మాయ‌మాట‌లు చెప్పి త‌న వెంట తీసుకెళ్లాడు. చికెన్ తినిపించి బ‌ల‌వంతంగా మ‌ద్యం తాపాడు. బాలుడు మ‌త్తులోకి జారుకోగానే గొంతుకోసి హ‌త‌మార్చాడు. అనంత‌రం చిన్నారి శ‌రీరం నుంచి అవ‌య‌వాల‌ను వేరుచేసి ఓ ప్లాస్టిక్ క‌వ‌ర్‌లో భ‌ద్ర‌ప‌రిచాడు. అనంత‌రం మృత‌దేహాన్ని గోనెసంచిలో కుక్కి గ్రామ స‌మీపంలోని ఒక మొక్కజొన్న పొలంలో ఉన్న నీటి గుంతలో పడేసి మట్టితో కప్పేశాడు.

అయితే, బాలుడు క‌నిపించ‌క‌పోవ‌డంతో కంగారుప‌డిన కుటుంబ స‌భ్యులు చుట్టుప‌క్క‌ల ప్రాంతాల్లో వెతికారు. అయినా చిన్నారి జాడ తెలియ‌క‌పోవ‌డంతో న‌వంబ‌ర్ 7న స‌న్నా పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టిన‌ట్లు జష్‌పూర్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (SSP) లాల్ ఉమేద్ సింగ్ తెలిపారు. కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి బాలుడి కోసం వెతుకుతుండ‌గా.. మొక్క‌జొన్న పొలం స‌మీపంలోని నీటితో నిండిన గుంత‌లో బాలుడి మృత‌దేహం ల‌భ్య‌మైన‌ట్లు చెప్పారు.

ద‌ర్యాప్తు చేప‌ట్టిన పోలీసులు వాసుదేవ్‌ను అదుపులోకి తీసుకుని విచారించ‌గా.. అస‌లు విష‌యం బ‌య‌ట‌ప‌డింది. విచార‌ణ‌లో నిందితుడు నేరాన్ని అంగీక‌రించాడు. రోజూవారీ కూలీ ఆదాయం స‌రిపోవ‌డం లేద‌ని.. త్వ‌ర‌గా డ‌బ్బు సంపాదించే మార్గాల కోసం క్ర‌మం త‌ప్ప‌కుండా సోష‌ల్ మీడియాలో వెతికేవాడిన‌ని విచార‌ణ‌లో నిందితుడు సంచ‌ల‌న విష‌యాలు వెల్ల‌డించాడు. చిన్న పిల్ల‌ల అవ‌య‌వాల‌ను విక్ర‌యించి డ‌బ్బు సంపాదించాల‌ని అనుకున్న‌ట్లు చెప్పాడు. ఈ క్ర‌మంలోనే జితేంద్ర రామ్‌ను తీసుకెళ్లి హ‌త్య చేసిన‌ట్లు నేరం ఒప్పుకున్నాడు. నిందితుడి వాంగ్మూలాన్ని న‌మోదు చేసిన పోలీసులు అత‌డిని అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై మరింత దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.

Also Read..

మంట‌ల్లో కారు.. చిన్నారి స‌హా ఆరుగురు స‌జీవ‌ద‌హ‌నం

88 రోజులైనా ముగియని పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. 18 ఏళ్ల రికార్డ్ బ్రేక్

ప్ర‌జ‌లు లేకుండానే ప్ర‌జాభిప్రాయ సేక‌ర‌ణా?.. దీనిని తుగ్లక్ పాలన కాకపోతే ఇంకేమి అనాలి?: కేటీఆర్‌

Advertisement
Advertisement