త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ponnam Prabhakar | 14న మ‌హాత్మా జ్యోతిబాపూలే దంప‌తుల విగ్ర‌హావిష్క‌ర‌ణ‌

Ponnam Prabhakar | మహాత్మా జ్యోతిబాపూలే, సావిత్రిబాయి పూలే దంపతుల విగ్రహాలను ఈనెల 14వ తేదీ సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించనున్నారు.

S

Telangana | Published On Aug 12, 2026, 3.50 pm IST

Ponnam Prabhakar | 14న మ‌హాత్మా జ్యోతిబాపూలే దంప‌తుల విగ్ర‌హావిష్క‌ర‌ణ‌
Advertisement

Ponnam Prabhakar | త్రినేత్ర‌.న్యూస్ : మహాత్మా జ్యోతిబాపూలే, సావిత్రిబాయి పూలే దంపతుల విగ్రహాలను ఈనెల 14వ తేదీ సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించనున్నారు. హెచ్‌ఎండీఏ గ్రౌండ్స్‌ ఎదురుగా ఏర్పాటు చేస్తున్న పూలే దంపతుల విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమానికి సంబంధించిన తుది ఏర్పాట్లను మంత్రి పొన్నం ప్రభాకర్ బుధవారం పరిశీలించారు. కార్యక్రమం నిర్వహణకు సంబంధించి జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ అధికారులకు మంత్రి పలు సూచనలు చేశారు.

అనంతరం బీసీ సంక్షేమ శాఖ, జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ అధికారులతో మినిస్టర్ క్వార్టర్స్‌లో మంత్రి సన్నద్ధత సమావేశం నిర్వహించారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి ఆదేశించారు.

ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. పూలే దంపతుల విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సభను విజయవంతం చేసేందుకు హైదరాబాద్‌ పరిధిలోని స్థానిక ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు విస్తృతంగా జన సమీకరణ చేపట్టాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా బీసీ సంఘాల నాయకులు, వివిధ కుల సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంత్రి పిలుపునిచ్చారు.

సాంస్కృతిక కార్యక్రమాలు

సభా వేదికపై మహాత్మా జ్యోతిబాపూలే, సావిత్రిబాయి పూలే దంపతుల జీవితం, వారి సామాజిక సంస్కరణ ఉద్యమం, విద్యా రంగానికి చేసిన సేవలు, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం వారు చేసిన కృషిని ప్రతిబింబించేలా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. అదేవిధంగా పూలే దంపతుల జీవిత చరిత్ర, వారి ఆశయాలు, సామాజిక ఉద్యమంపై బ్రౌచర్‌ను రూపొందించి విడుదల చేయాలని సూచించారు.

విగ్రహావిష్కరణ కార్యక్రమానికి సంబంధించి బుధ‌వారం సాయంత్రం 4 గంటలకు డీఎస్‌ఎస్‌ భవన్‌లో బీసీ ఎమ్మెల్యేలు, బీసీ నాయకులు, కుల సంఘాల ప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. పూలే దంపతుల ఆశయాలను ముందుకు తీసుకెళ్లే దిశగా ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని ఆయన సూచించారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దానం నాగేందర్, బీసీ సంక్షేమ శాఖ సెక్రటరీ బాలమయాదేవి, గురుకుల సెక్రటరీ సైదులు, బీసీ సంక్షేమ శాఖ అధికారులు మల్లయ్య బట్టు, అలోక్ కుమార్, మామిడి హరికృష్ణ, ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ సంతోష్, హెచ్‌ఎండీఏ ఎస్సీ అప్పారావు తదితర అధికారులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement