త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Revamped Gold Monetisation Scheme | భారతీయుల ఇళ్లలో 5 ట్రిలియన్ డాలర్ల నిధి.. వృథాగా మూలనపడ్డ బంగారంతో కేంద్రం ‘గోల్డెన్’ స్కీమ్!

భారతీయుల ఇళ్లలో, గుడుల్లో వృథాగా ఉన్న రూ. లక్షల కోట్ల విలువైన బంగారాన్ని వినియోగంలోకి తెచ్చేందుకు కేంద్రం సిద్ధమైంది. జ్యువెలర్స్‌కు ఇందులో కీలక పాత్ర లభించనుంది.

J

Business | Published On Aug 12, 2026, 3.48 pm IST

Revamped Gold Monetisation Scheme | భారతీయుల ఇళ్లలో 5 ట్రిలియన్ డాలర్ల నిధి.. వృథాగా మూలనపడ్డ బంగారంతో కేంద్రం ‘గోల్డెన్’ స్కీమ్!
Advertisement
  • భారతీయుల ఇళ్లలో, దేవాలయాల్లో ఎలాంటి ఉపయోగం లేకుండా ఉన్న సుమారు 25 వేల నుంచి 50 వేల టన్నుల బంగారం (విలువ సుమారు $5 ట్రిలియన్లు)
  • ఆ బంగారాన్ని ఆర్థిక వ్యవస్థలోకి తెచ్చేందుకు కేంద్రం ప్రణాళిక
  • ఈ నెలాఖరులోగా 'గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్' (GMS)ను సరికొత్తగా తీసుకురానున్న ప్రభుత్వం
  • ఈసారి బ్యాంకులకు బదులు జ్యువెలర్స్‌కు కీలక బాధ్యతలు.
  • పాత బంగారాన్ని సేకరించి రిఫైనరీలకు పంపే జ్యువెలర్స్‌కు 1 శాతం వరకు కమీషన్
  • తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్స్ వంటి ప్రయోజనాలు
  • దీనివల్ల విదేశాల నుంచి బంగారం దిగుమతులు భారీగా తగ్గి, దేశ ఆర్థిక వ్యవస్థకు ఊరట కలగనుందని నిపుణుల అంచనా

Revamped Gold Monetisation Scheme | త్రినేత్ర.న్యూస్ : భారతీయులకు బంగారంపై ఉన్న మక్కువ అంతా ఇంతా కాదు. దేశవ్యాప్తంగా ఇళ్లలో ఉండే బీరువాల్లో, వెల్వెట్ పౌచ్‌ల్లో, రహస్య ప్రాంతాల్లో, దేవాలయాల్లో ఎలాంటి ఉపయోగం లేకుండా పడి ఉన్న బంగారం విలువ అక్షరాలా 5 ట్రిలియన్ డాలర్లు (సుమారు రూ.476 లక్షల కోట్లు - రూ.4.76 కోట్ల కోట్లు). ఇప్పుడు ఈ భారీ నిధికి ప్రాణం పోసి.. దేశ ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.

ఇందులో భాగంగా ఈ నెలాఖరులోగా తమ ప్రతిష్టాత్మక 'గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్' (GMS)ను సరికొత్తగా తీసుకురానుంది. భారతీయులకు బంగారంపై ఉన్న సెంటిమెంట్ కారణంగా గతంలో ఈ స్కీమ్ పెద్దగా సక్సెస్ కాలేదు. అందుకే ఈసారి ప్రజలకు బాగా నమ్మకం ఉన్న 'జ్యువెలర్స్' (Jewellers) చేతుల్లోకే ఈ బాధ్యతలను అప్పగించాలని ప్రభుత్వం భావిస్తోంది.

జ్యువెలర్స్‌కు 1% వరకు ఇన్సెంటివ్

ప్రస్తుతం ఆమోదం దశలో ఉన్న కొత్త GMS స్కీమ్ ద్వారా పాత బంగారాన్ని సేకరించే జ్యువెలర్స్‌కు మంచి లాభం చేకూరనుంది. ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ (IBJA) ప్రభుత్వానికి ఇచ్చిన ప్రతిపాదన ప్రకారం.. కస్టమర్ల నుంచి బంగారాన్ని సేకరించి రిఫైనరీలకు ఇచ్చే జ్యువెలర్స్‌కు సుమారు 0.75% నుంచి 1% దాకా డైరెక్ట్ ఇన్సెంటివ్ (incentive) దక్కే అవకాశం ఉంది.

రిటైల్ రంగంలో, ముఖ్యంగా భారీ స్థాయిలో వ్యాపారం చేసే వారికి ఈ 1% కమీషన్ అనేది 'గేమ్ ఛేంజర్' అవుతుందని ఇండస్ట్రీ నిపుణులు చెబుతున్నారు. ఈ స్కీమ్‌ను కస్టమర్లలోకి చురుగ్గా తీసుకెళ్లడానికి ఇది జ్యువెలర్స్‌కు మంచి ప్రోత్సాహకంగా పనిచేస్తుంది.

"ప్రతి కస్టమర్ తమకు పరిచయం ఉన్న జ్యువెలర్ల వద్దే బంగారం కొంటారు. కమీషన్ ఇస్తే ఈ స్కీమ్‌ను వారు కస్టమర్లలోకి సులభంగా తీసుకెళ్తారు. ఒకరకంగా జ్యువెలర్సే దీనికి బ్రాండ్ అంబాసిడర్లు." అని ఐబీజేఏ ప్రెసిడెంట్ పృథ్వీరాజ్ కొఠారి తెలిపారు.

తగ్గనున్న వడ్డీ భారం.. పెరగనున్న వర్కింగ్ క్యాపిటల్

ఈ స్కీమ్ వల్ల జ్యువెలర్స్‌కు కమీషన్ మాత్రమే కాకుండా 'చీపర్ ఫైనాన్సింగ్' (Cheaper Financing) రూపంలో అతిపెద్ద ప్రయోజనం కలగనుంది. దిగుమతి చేసుకున్న బంగారంపై తీసుకునే లోన్ వడ్డీ రేట్లు ప్రస్తుతం 5% వరకు ఉన్నాయి. అదే దేశీయంగా ఈ స్కీమ్ ద్వారా బంగారం అందుబాటులోకి వస్తే వడ్డీ రేట్లు భారీగా తగ్గుతాయి. ఇన్వెంటరీ (Inventory) నిర్వహణ ఖర్చులు, వర్కింగ్ క్యాపిటల్ సమస్యలు తీరి చిన్న, మధ్య తరహా వ్యాపారులకు ఇది ఒక లైఫ్‌లైన్‌గా మారనుంది.

భారీగా తగ్గనున్న కరెంట్ అకౌంట్ లోటు

చైనా తర్వాత ప్రపంచంలో అత్యధికంగా బంగారాన్ని వినియోగించే దేశం భారత్. ఏటా సుమారు 700 నుంచి 900 టన్నుల బంగారాన్ని మనం విదేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ప్రభుత్వ లెక్కల ప్రకారం, దిగుమతుల పరిమాణం 721 టన్నులకు పడిపోయినప్పటికీ.. రేట్లు పెరగడంతో 2026 ఆర్థిక సంవత్సరంలో మన గోల్డ్ ఇంపోర్ట్ బిల్లు రికార్డు స్థాయిలో $71.9 బిలియన్లకు చేరుకుంది.

జియో-పొలిటికల్ టెన్షన్స్, రూపాయి పతనం నేపథ్యంలో ఇంత భారీ స్థాయిలో దిగుమతులు చేసుకోవడం దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ఒత్తిడి పెంచుతోంది. అందుకే దేశీయంగా మూలన పడి ఉన్న బంగారాన్ని వినియోగంలోకి తెస్తే.. ఇంపోర్ట్స్ (Imports) తగ్గి, దేశ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్‌కు భారీ ఊరట లభిస్తుంది.

గతంలో స్కీమ్ ఎందుకు ఫెయిల్ అయింది?

ఇళ్లలో ఖాళీగా ఉన్న బంగారాన్ని బ్యాంకింగ్ సిస్టమ్‌లోకి తెచ్చి, దానిపై వడ్డీ (Returns) ఇచ్చే లక్ష్యంతో 2015లో తొలిసారి GMSను ప్రారంభించారు. అయితే నవంబర్ 2024 నాటికి కేవలం 5,700 మంది మాత్రమే దీని ద్వారా 31 టన్నుల బంగారాన్ని డిపాజిట్ చేశారు.

దీనికి ప్రధాన కారణం.. నమ్మకం లేకపోవడం. తమ పూర్వీకుల కాలం నాటి నగలను బ్యాంకులకు ఇచ్చి కరిగించడానికి (Melting) భారతీయులు ఇష్టపడలేదు. పైగా, ఈ స్కీమ్‌పై బ్యాంకులకు తగినంత మ్యాన్‌పవర్ లేకపోవడం, ప్రాసెస్ క్లిష్టంగా ఉండటం, రిటర్న్స్ తక్కువగా ఉండటం దీని ఫెయిల్యూర్‌కు దారితీశాయి.

సవాళ్లు ఏంటి?

కొత్త స్కీమ్‌లో బ్యాంకుల పాత్ర నామమాత్రంగానే ఉంటుంది. అంతా జ్యువెలర్స్ ద్వారానే జరుగుతుంది. అయితే ఈ స్కీమ్ విజయవంతం కావాలంటే 'పారదర్శకత' (Transparency) చాలా ముఖ్యం. పాత బంగారాన్ని కరిగించడం, ప్యూరిటీ చెక్ చేయడం, డిజిటల్ ట్రాకింగ్ విధానం, సెక్యూర్డ్ లాజిస్టిక్స్ వంటి ఆపరేషనల్ విషయాల్లో కస్టమర్లకు పూర్తి భరోసా కల్పించాల్సి ఉంటుందని కోటక్ సెక్యూరిటీస్ కమోడిటీస్ హెడ్ సునీల్ కట్కే అభిప్రాయపడ్డారు.

Advertisement
Advertisement