త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Konda Surekha | పులుల సంర‌క్ష‌ణ ప‌ట్ల బాధ్య‌తాయుతంగా వ్య‌వ‌హ‌రించాలి : మంత్రి కొండా సురేఖ‌

Konda Surekha | పులుల సంరక్షణ పట్ల సమాజంలోని అన్ని వర్గాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ పిలుపునిచ్చారు. ఈ భూమి కేవలం మనుషుల ఆవాసం మాత్రమే కాదని, సమస్త జీవరాశుల ఉమ్మడి నివాసం అని గుర్తించి ప్రకృతి పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతతో ముందుకు రావాలని కోరారు.

S

Telangana | Published On Jul 29, 2026, 6.09 pm IST

Konda Surekha | పులుల సంర‌క్ష‌ణ ప‌ట్ల బాధ్య‌తాయుతంగా వ్య‌వ‌హ‌రించాలి : మంత్రి కొండా సురేఖ‌
Advertisement

Konda Surekha | త్రినేత్ర‌.న్యూస్ : పులుల సంరక్షణ పట్ల సమాజంలోని అన్ని వర్గాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ పిలుపునిచ్చారు. ఈ భూమి కేవలం మనుషుల ఆవాసం మాత్రమే కాదని, సమస్త జీవరాశుల ఉమ్మడి నివాసం అని గుర్తించి ప్రకృతి పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతతో ముందుకు రావాలని కోరారు. ఈ రోజు అంతర్జాతీయ పులుల దినోత్సవాన్ని పురస్కరించుకుని మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా దూలపల్లిలోని తెలంగాణ స్టేట్ ఫారెస్ట్ అకాడమీలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్బంగా ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను మంత్రి పరిశీలించారు. పులుల సంరక్షణకు సంబంధించిన లఘు చిత్రాన్ని మంత్రి వీక్షించారు.

ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ సభను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రతి సంవత్సరం జూలై 29న ప్రపంచ పులుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని తెలిపారు. పులుల సంరక్షణ ప్రాధాన్యతపై ప్రపంచవ్యాప్తంగా అవగాహన పెంపొందించేందుకు 2010లో రష్యాలోని సెయింట్ పీటర్స్ బర్గ్ లో ప్రారంభమైన ఈ కార్యక్రమం నేడు ప్రకృతి పరిరక్షణకు ఒక గొప్ప వేదికగా నిలిచిందన్నారు. పులి అటవీ సంపదకు ప్రతీక అని, పులిని పరిరక్షించడమంటే అడవిని, పర్యావరణాన్ని, జీవవైవిధ్యాన్ని, భావితరాల భవిష్యత్తును పరిరక్షించడమేనని అన్నారు.

వేట, అడవుల నరికివేత, అక్రమ రవాణా వంటి కారణాలతో వాటి సంఖ్య తీవ్రంగా తగ్గిపోయిందని మంత్రి సురేఖ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిని మార్చేందుకు నాటి ప్రధాని ఇందిరా గాంధి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం 1972లో వన్యప్రాణి సంరక్షణ చట్టాన్ని, 1973లో “ప్రాజెక్ట్ టైగర్” ను ప్రారంభించి దేశవ్యాప్తంగా పులుల సంరక్షణకు బలమైన చర్యలు చేపట్టిందని వివరించారు. ఈ చర్యల ఫలితంగానే నేడు భారతదేశం ప్రపంచ పులుల సంరక్షణలో అగ్రగామిగా నిలిచిందని మంత్రి తెలిపారు. ప్రస్తుతం ప్రపంచంలోని మొత్తం పులుల్లో సుమారు 75 శాతం పులులు భారతదేశంలోనే ఉన్నాయని, దేశంలో ప్రస్తుతం 58 టైగర్ రిజర్వులు విజయవంతంగా పనిచేస్తున్నాయని పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్రానికి కూడా ఈ విషయంలో విశిష్టమైన స్థానం ఉందని మంత్రి అన్నారు. అమ్రాబాద్, కవ్వాల్ టైగర్ రిజర్వులు దేశంలోనే ప్రాముఖ్యత కలిగిన పులుల అభయారణ్యాలుగా గుర్తింపు పొందాయని మంత్రి తెలిపారు. అమ్రాబాద్ టైగర్ రిజర్వులో నీటి వనరుల అభివృద్ధి, వాటి ఆవాసాల మెరుగుదల, ఆధునిక రక్షణ చర్యల వల్ల పులుల సంఖ్య గణనీయంగా పెరిగిందని మంత్రి స్పష్టం చేశారు.

కవ్వాల్ టైగర్ రిజర్వులో పులుల సంఖ్యను వృద్ధి చేసేందుకు టైగర్ రీఇంట్రడక్షన్‌ను చేపట్టినట్లు మంత్రి సురేఖ తెలిపారు. ఇందులో భాగంగా కవ్వాల్ టైగర్ రిజర్వ్‌ను మహారాష్ట్రలోని తడోబా టైగర్ రిజర్వుతో అనుసంధానించి పులుల సహజ సంచారానికి అనుకూల పరిస్థితులు కల్పించినట్లు వివరించారు. దీంతోపాటు ప్రజల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించడం వంటి కార్యక్రమాలను అటవీ శాఖ అమలు చేస్తున్నదని మంత్రి తెలిపారు.

అడవులను కాపాడుకుందామని, వన్యప్రాణులను సంరక్షిద్దామని, భావితరాలకు పచ్చని తెలంగాణను అందిద్దామని ఈ సందర్భంగా మంత్రి సురేఖ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా పులుల సంరక్షణకు అటవీ శాఖతో పాటు, ప్రతి పౌరుడు బాధ్యత తీసుకోవాలని మంత్రి కొండా సురేఖ పిలుపునిచ్చారు.

ఫారెస్ట్ అకాడమీలో శిక్షణ పొందుతున్న మహారాష్ట్ర, ఒడిశా, మధ్యప్రదేశ్, కేరళ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులను ఉద్దేశించి "అటవీ సంపదను పరిరక్షించడంలో నిబద్ధత, నిజాయితీ, సేవాభావంతో పనిచేసి భావి తరాలకు పచ్చని తెలంగాణను అందించాలి" అని మంత్రి దిశా నిర్దేశం చేశారు. అటవీ సంపద, వన్య ప్రాణుల సంరక్షణలో విశేష కృషి చేసిన పలువురు అటవీ శాఖ ఉద్యోగులకు ప్రశంసా పత్రంతో పాటు, నగదు బహుమతిని మంత్రి సురేఖ అందించారు. అదే విధంగా అంతర్జాతీయ పులుల సంరక్షణ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన చిత్ర‌లేఖన పోటీలో గెలిచిన విద్యార్థులకు మంత్రి సురేఖ ప్రశంసా పత్రాలు, బహుమతులు అందించారు.

ఈ కార్యక్రమంలో అటవీదళాల ప్రధాన సంరక్షణాధికారి వినయ్ కుమార్, కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్ లర్ దండా రాజిరెడ్డి, పిసిసిఎఫ్ (డెవలప్ మెంట్) రత్నాకర్ జౌహరి, సిసిఎఫ్ టిజిఎస్ఎఫ్ఎ డైరక్టర్ ప్రియాంక వర్గీస్, సిసిఎఫ్ ఎన్ క్షితిజ, టైగర్ సెల్ రీసర్చ్ సైంటిస్ట్ అయాన్ సాధు, అమ్రాబాద్ ఫీల్డ్ డైరెక్టర్ ప్రసాద్, కవాల్ టైగర్ రిజర్వ్ ఫీల్డ్ డైరెక్టర్ శాంతారాం పలువురు అటవీశాఖ అధికారులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Advertisement
Advertisement