త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

E20 Petrol Impact | ఈ20 పెట్రోల్ వినియోగంపై సందేహాలు.. వివ‌ర‌ణ ఇచ్చిన కేంద్ర‌మంత్రి గ‌డ్క‌రీ..!

E20 Petrol Impact | ఈ20 పెట్రోల్‌ వినియోగంపై వాహనదారుల్లో ఉన్న సందేహాలకు కేంద్రం స్పష్టత ఇచ్చింది. భారత్‌ స్టేజ్‌-3 (బీఎస్‌-3) ప్రమాణాలకు చెందిన 2005 ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి వచ్చిన వాహనాల్లో 2016కు ముందు తయారైన కొన్ని మోడళ్లకు మాత్రమే రబ్బరు భాగాలు, గ్యాస్కెట్ల మార్పు అవసరం కావొచ్చ‌ని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు.

P

Business | Published On Jul 29, 2026, 5.41 pm IST

E20 Petrol Impact | ఈ20 పెట్రోల్ వినియోగంపై సందేహాలు.. వివ‌ర‌ణ ఇచ్చిన కేంద్ర‌మంత్రి గ‌డ్క‌రీ..!
Advertisement

E20 Petrol Impact | ఈ20 పెట్రోల్‌ వినియోగంపై వాహనదారుల్లో ఉన్న సందేహాలకు కేంద్రం స్పష్టత ఇచ్చింది. భారత్‌ స్టేజ్‌-3 (బీఎస్‌-3) ప్రమాణాలకు చెందిన 2005 ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి వచ్చిన వాహనాల్లో 2016కు ముందు తయారైన కొన్ని మోడళ్లకు మాత్రమే రబ్బరు భాగాలు, గ్యాస్కెట్ల మార్పు అవసరం కావొచ్చ‌ని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు. రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానంలో ఆయన ఈ వివరాలు వెల్లడించారు. ఈ20 (80 శాతం పెట్రోల్, 20 శాతం ఇథనాల్‌) వినియోగంతో వాహనాల మైలేజీ తగ్గుతుందన్న ఆందోళనలపై స్పందిస్తూ.. వాహనం మైలేజీ కేవలం ఇంధన రకంపైనే ఆధారపడదని, డ్రైవింగ్‌ విధానం, వాహన పరిస్థితి వంటి అనేక అంశాలు ప్రభావం చూపుతాయని వాహన తయారీ సంస్థలు, టెస్ట్ కంపెనీలు స్పష్టం చేశాయని తెలిపారు.

ఈ20 ప్రభావంపై ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐఓసీఎల్‌), ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోలియం (ఐఐపీ) డెహ్రాడూన్‌, సియామ్‌, ఏఆర్‌ఏఐ సంయుక్తంగా అధ్యయనం చేశాయని గడ్కరీ పేర్కొన్నారు. ఈ పరిశోధనల్లో కార్లు, ద్విచక్ర వాహనాల ఇంజిన్లలో ఎలాంటి మార్పులు అవసరం లేదని తేలిందన్నారు. పాత వాహనాల పనితీరులోనూ గణనీయమైన మార్పులు, అసాధారణ అరుగుదల కనిపించలేదని చెప్పారు. డ్రైవింగ్‌ సామర్థ్యం, స్టార్టింగ్‌ సమస్యలు, మెటల్‌, ప్లాస్టిక్‌ భాగాల అనుకూలత వంటి అంశాల్లోనూ ఎలాంటి ఇబ్బందులు గుర్తించలేదని మంత్రి వివరించారు. బీఎస్‌-3 ప్రమాణాల కిందకు వచ్చే, 2016కు ముందు తయారైన కొన్ని వాహనాల్లో మాత్రమే రబ్బరు భాగాలు, గ్యాస్కెట్లను మార్చాల్సి రావచ్చని, సాధారణ సర్వీసింగ్‌ సమయంలోనే ఈ పనిని పూర్తి చేయొచ్చ‌ని తెలిపారు.

ఈ20 ఇంధనంపై ముందస్తు అధ్యయనాలు, పరీక్షలు నిర్వహించిన తర్వాతే దశలవారీగా అమలు చేస్తున్నట్లు కేంద్రం పేర్కొంది. నీతి ఆయోగ్‌ ఆధ్వర్యంలో 2020 డిసెంబర్‌ 26న ఏర్పాటైన అంత‌ర్గ‌త మంత్రిత్వ కమిటీ వాహనాల అనుకూలత, మైలేజీ, ఇంధన సామర్థ్యంపై సమగ్ర అధ్యయనం చేసిందని గడ్కరీ తెలిపారు. ఈ అధ్యయనంలో ఇంజిన్‌ పనితీరు, ఇంధన వ్యవస్థ, ఉద్గారాలు, మన్నిక, ఇంధన సామర్థ్యం వంటి అంశాలను పరిశీలించినట్లు చెప్పారు. ఇథనాల్‌ కలిపిన పెట్రోల్‌ వినియోగం భారత్‌లో కొత్త కాదని మంత్రి తెలిపారు. 2001లో పైలట్‌ ప్రాజెక్టుగా ప్రారంభమైన ఈ కార్యక్రమంలో 2006లో ఈ5 ఇంధనాన్ని ప్రవేశపెట్టారని, మౌలిక వసతులు, ఉత్పత్తి సామర్థ్యం పెరగడంతో ఇథనాల్‌ మిశ్రమ శాతం క్రమంగా పెంచామని వివరించారు. ప్రపంచంలోని పలు దేశాలు, ముఖ్యంగా బ్రెజిల్‌, చాలా కాలంగా ఇథనాల్‌ మిశ్రమ ఇంధనాన్ని వినియోగిస్తున్నాయని తెలిపారు.

కాగా, పాత వాహనాలపై ప్రభావం, మైలేజీ తగ్గుదల, నిర్వహణ ఖర్చులపై ప్రతిపక్షాలు, వినియోగదారుల సంఘాలు ఆందోళనలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కేంద్రం ఈ వివరణ ఇచ్చింది. ఈ20 ఇంధనంతో నడిచే వాహనాలకు సంబంధించి తయారీ సంస్థలు వారంటీ రూల్స్‌ను కొనసాగిస్తాయని గడ్కరీ వివ‌రించారు.

Advertisement
Advertisement