త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Minister Komatireddy | ఇంత విషం ఇచ్చి చంపండి..! మంత్రి కోమ‌టిరెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..

Minister Komatireddy | త‌న‌ను మాన‌సికంగా ఇబ్బంది పెట్టాల‌నుకుంటే ఒకేసారి త‌న‌కు విష‌మిచ్చి చంపేయాలని, ఈ జీవితంపై పెద్ద‌గా ఆస‌క్తి లేదంటూ మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మంత్రి శ‌నివారం మీడియా స‌మావేశం నిర్వ‌హించారు.

P

Telangana | Published On Jan 10, 2026, 5.22 pm IST

Minister Komatireddy | ఇంత విషం ఇచ్చి చంపండి..! మంత్రి కోమ‌టిరెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..
Advertisement

Minister Komatireddy | త‌న‌ను మాన‌సికంగా ఇబ్బంది పెట్టాల‌నుకుంటే ఒకేసారి త‌న‌కు విష‌మిచ్చి చంపేయాలని, ఈ జీవితంపై పెద్ద‌గా ఆస‌క్తి లేదంటూ మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మంత్రి శ‌నివారం మీడియా స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ప‌లు అంశాల‌పై సుదీర్ఘంగా స్పందించారు. ఇటీవ‌ల సోష‌ల్ మీడియా వేదిక‌గా న‌ల్గొండ జిల్లాకు చెందిన మ‌హిళా ఐఏఎస్ అధికారులు, మంత్రుల‌పై వ‌స్తున్న ఆరోప‌ణ‌ల‌ను ఖండించారు. ఐఏఎస్ అధికారులు బాధ్య‌త‌గా ప‌ని చేస్తున్నార‌ని, అలాంటి అధికారుల‌పై సోష‌ల్ మీడియాలో దుష్ప్ర‌చారం చేయ‌డం ఏంట‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. ఐఏఎస్ అధికారుల‌ను ఇబ్బంది పెట్టి సాధించేది ఏం ఉంద‌ని ఆయ‌న మీడియాను ప్ర‌శ్నించారు. ఐఏఎస్ కొలువంటే ఆషామాషీ కాద‌న్నారు. ఐఏఎస్ అధికారుల‌కే ఇలాంటి ప‌రిస్థితి వ‌స్తే మిగ‌తా వారి ప‌రిస్థితి ఏంట‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఏవైనా వార్త‌ల‌ను రాయాల‌నుకుంటే త‌న‌పై, త‌న కుటుంబంపై రాయాల‌ని.. మ‌హిళ అధికారుల‌పై రాయొద్ద‌న్నారు. ఛానెల్స్‌లో రేటింగ్ కోసం, యూట్యూబ్‌లో వ్యూస్ కోసం త‌ప్పుడు వార్త‌లు రాయ‌డం స‌రికాద‌న్నారు.

నిప్పులాగా బ‌తికిన‌వాన్ని..

నేను తెలంగాణ ఉద్య‌మ‌కారుడిని. మ‌మూలు మూడెక‌రాల రైతుని. ఐదుగురం అన్న‌ద‌మ్ములం.. నా భాగాన మూడు ఎక‌రాలు. నేను ఏడుసార్లు పోటీ చేశాను.. నా ఎన్నిక‌ల అఫిడ‌విట్‌లో ఇవే ప్రాప‌ర్టీస్ ఉంటాయి. నిప్పులాగా బ‌తికిన‌వాన్ని. కానీ ఇవాళ న‌న్ను మాన‌సికంగా వేధించారు. అస‌లు ఈ రాజ‌కీయాలు ఏంది..? అప్పుడు నా కొడుకు చ‌నిపోయిన‌ప్పుడే రాజ‌కీయాలు బంద్ చేసి ఉంటే బాగుంటుండే. తెలంగాణ ఉద్య‌మం కోసం నా వంతు పాత్ర పోషించాను. సొరంగం స్టార్ట్ చేయించాను. ఎంజీ యూనివ‌ర్సిటీ క‌ట్టించాను. మినిస్ట‌ర్‌ను అయ్యాను. ఇన్ని చేసినోన్ని కూడా మీరు వ‌దిలి పెడుత‌లేరు. న్యాయానికి ఏమున్న‌ది. అందుకే త‌ప్పు చేసిన వాడిని శిక్షించ‌మ‌ని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. ఈ తప్పుడు రాతల వల్ల ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది. ఇంకా సరిపోదు అనుకుంటే నాకింత విషమిచ్చి చంపేయండి అని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

బ‌దిలీల్లో మంత్రుల పాత్ర లేదు..

మ‌హిళా అధికారుల‌పై త‌ప్పుడు వార్త‌లు రాయొద్ద‌న్నారు. మంత్రుల బ‌దిలీల వ్య‌వ‌హారంలో మంత్రుల పాత్ర ఏమీ లేద‌ని.. సీఎం, సీఎస్, ప‌రిపాల‌న విభాగం చూసుకుంటుంద‌న్నారు. తాను మంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించాక నల్లగొండ జిల్లాలో నలుగురు కలెక్టర్లు బ‌దిలీ అయ్యార‌న్నారు. ఐఏఎస్‎ల బదిలీ వ్యవహారం ముఖ్య‌మంత్రే చూస్తున్నార‌ని.. మంత్రులు, ఎమ్మెల్యేలకు తెలియకుండానే బ‌దిలీలు జ‌రుగుతాయ‌న్నారు. అధికారులు జిల్లాకు వ‌చ్చి బాధ్య‌త‌లు తీసుకొని త‌మ‌ను క‌లిసే వ‌ర‌కు, మీడియాలో చూసే వ‌ర‌కు బ‌దిలీలు తెలియ‌ద‌న్నారు. అయితే, ఐఏఎస్‌పై సోష‌ల్ మీడియాలో వ‌చ్చిన వార్త‌ల‌పై ద‌ర్యాప్తు చేయాల‌ని ముఖ్య‌మంత్రితో పాటు డీజీపీతో మాట్లాడాన‌న్నారు. ఈ అంశంపై విచార‌ణ జ‌రుగుతుంద‌ని.. ఆ త‌ర్వాత చ‌ట్ట‌ప‌రంగా చ‌ర్య‌లుంటాయ‌న్నారు.

మాన‌సికంగా కుంగ‌దీయ‌డం స‌రికాదు..

36 సంవ‌త్స‌రాలుగా కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున క‌మ్యూనిస్టులు, టీఆర్ఎస్‌, టీడీపీతో పోరాటం చేశాన‌న్నారు. కాంగ్రెస్ పార్టీ గుర్తించి ఏడుసార్లు పోటీ చేసే అవ‌కాశం క‌ల్పించింద‌న్నారు. ఆరుసార్లు గెలిస్తే రెండుసార్లు మంత్రిగా, ఒకోసారి ఎంపీగా ప‌ని చేశాన‌న్నారు. ప్ర‌ధాని, కేంద్ర‌మంత్రులు, సీఎంల‌తో మాట్లాడి ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించామ‌న్నారు. మంత్రిగా ప‌ని చేసిన స‌మ‌యంలోనే తాను తెలంగాణ ఉద్య‌మంలో పాల్గొన్నాన‌ని.. ఆ స‌మ‌యంలో విద్యార్థులు చ‌నిపోవ‌డం చూసి త‌న కొడుకు రాజీనామా చేయాల‌ని చెప్పాడ‌ని కోమ‌టిరెడ్డి గుర్తు చేసుకున్నారు. త‌న చ‌రిత్ర అంద‌రికీ తెలుసున‌ని, ఈ విధంగా త‌న‌ను ఇబ్బంది పెట్ట‌డం, మాన‌సికంగా కుంగ‌దీయ‌డం స‌రికాదు. మాన‌సికంగా కొడుకు చ‌నిపోయిన‌ప్పుడే.. మాన‌సికంగా చ‌చ్చిపోయాన‌న్నారు. ఆ స‌మ‌యంలోనే రాజకీయాలు వ‌దిలేద్దామ‌నుకున్నాన‌ని.. కానీ, చాలామంది వేదాంత గ్రూప్ చైర్మ‌న్ త‌ర‌హాలో ప్ర‌జ‌ల‌కు సేవ చేయాల‌ని సూచించార‌న్నారు. అందుకే కొడుకు చిర‌కాలం గుర్తుంచేలా పేరుపై సేవ కార్య‌క్ర‌మాలు చేస్తూ వెళ్లాల‌ని సూచించార‌ని కోమ‌టిరెడ్డి తెలిపారు.

సంక్రాంతికి వెళ్లేవారికి ఇబ్బంది లేకుండా చ‌ర్య‌లు..

సంక్రాంతి పండుగ నేప‌థ్యంలో ఏపీ, తెలంగాణ మ‌ధ్య ప్ర‌యాణించే వారికి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామ‌న్నారు. గత సంవ‌త్స‌రం సంక్రాంతికి సుమారు 9.97 లక్షల వాహనాలు సరిహద్దులు దాటగా, ఈ ఏడాది ఆ సంఖ్య 12 లక్షలకు చేరుకునే అవ‌కాశం ఉంద‌న్నారు. హైదరాబాద్-విజయవాడ మార్గంలో విపరీతమైన రద్దీ ఉండే అవకాశం ఉన్నందున, ప్రయాణికులు హైదరాబాద్-కర్నూలు వంటి ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ప్ర‌యాణం చేయాల‌ని సూచించారు. రద్దీ ఒక పరిమితిని మించి పెరిగితే, వాహనాలను టోల్ ఫీజు వసూలు చేయకుండానే అనుమ‌తించాల‌ని ఆదేశాలు జారీ చేసిన‌ట్లు తెలిపారు. తెలంగాణకు టోల్ ఫ్రీ పర్మిషన్ ఇచ్చేందుకు కేంద్రం నిరాక‌రించింద‌న్న ఆయ‌న‌.. ట్రాఫిక్ జామ్ కాకుండా చర్యలు తీసుకుంటామ‌న్నారు. వ‌చ్చే ఏడాదికి హైద‌రాబాద్‌-విజ‌య‌వాడ ఆరులైన్ట ర‌హ‌దారి ప‌నులు పూర్తి చేస్తామ‌న్నారు. రెండు న‌గ‌రాల మ‌ధ్య ప్ర‌యాణ స‌మ‌యం త‌గ్గించేందుకు హైస్పీడ్ రైల్ ప్రాజెక్ట్ కోసం డీపీఆర్ పిలిచిన‌ట్లుగా వివ‌రించారు.

Advertisement

తాజావార్తలు

Advertisement