త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Drinking Water | కృష్ణాలో నీళ్లు లేవు.. బోరింగ్‌ల‌ను రిపేర్ చేయండి

Drinking Water | తెలంగాణ‌లో వ‌ర్షాభావ ప‌రిస్థితుల నేప‌థ్యంలో రాష్ట్ర ప్ర‌భుత్వం తాగునీటి వ‌నరుల‌పై దృష్టి సారించింది. అన్ని రిజ‌ర్వాయ‌ర్లు డెడ్ స్టోరేజీకి చేరుకోవ‌డంతో.. తాగునీటి స‌మ‌స్య ప‌రిష్కారానికి ప్ర‌భుత్వం చ‌ర్య‌లు చేప‌ట్టింది. ఈ నేప‌థ్యంలో గ్రామాల్లో పనిచేయని హ్యాండ్‌పంపులు, బోరింగ్‌ల‌కు వెంట‌నే మరమ్మతు చేయాల‌ని కాంగ్రెస్ స‌ర్కార్ కీల‌క ఆదేశాలు జారీ చేస్తోంది.

S

Telangana | Published On Jul 20, 2026, 5.36 pm IST

Drinking Water | కృష్ణాలో నీళ్లు లేవు.. బోరింగ్‌ల‌ను రిపేర్ చేయండి
Advertisement

ఉమ్మ‌డి పాల‌మూరులో 40 శాతం లోటు వ‌ర్ష‌పాతం
భూగ‌ర్భ జ‌లాల‌ను పెంచుకునేందుకు
వ‌ర్ష‌పు నీటిని ఒడిసిప‌ట్టాలి
త‌క్కువ నీటితో పండే పంట‌లు వేయాలి
ఉపాధి హామీ కింద ఎక్కువ రోజులు ప‌ని క‌ల్పించాలి
ప్ర‌తి మండ‌లానికి ప్ర‌త్యేకాధికారి
ఇది మ‌నుషులు సృష్టించిన సంక్షోభం కాదు..
ప్ర‌కృతి విసిరిన స‌వాల్
రైతులు ప్ర‌భుత్వానికి అండ‌గా ఉండాలి
ప్ర‌తి కుటుంబానికి మేం అండ‌గా ఉంటాం..
ఎల్‌నినో ప్ర‌భావాన్ని త‌గ్గించేందుకు చ‌ర్య‌లు తీసుకుంటాం
ఉమ్మ‌డి మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లా స‌మీక్ష‌లో మంత్రి దామోద‌ర‌

Drinking Water | త్రినేత్ర‌.న్యూస్ : తెలంగాణ‌లో వ‌ర్షాభావ ప‌రిస్థితుల నేప‌థ్యంలో రాష్ట్ర ప్ర‌భుత్వం తాగునీటి వ‌నరుల‌పై దృష్టి సారించింది. అన్ని రిజ‌ర్వాయ‌ర్లు డెడ్ స్టోరేజీకి చేరుకోవ‌డంతో.. తాగునీటి స‌మ‌స్య ప‌రిష్కారానికి ప్ర‌భుత్వం చ‌ర్య‌లు చేప‌ట్టింది. ఈ నేప‌థ్యంలో గ్రామాల్లో పనిచేయని హ్యాండ్‌పంపులు, బోరింగ్‌ల‌కు వెంట‌నే మరమ్మతు చేయాల‌ని కాంగ్రెస్ స‌ర్కార్ కీల‌క ఆదేశాలు జారీ చేస్తోంది. అవసరమైతే ప్రత్యామ్నాయ తాగునీటి ఏర్పాట్లు కూడా చేయాలని అధికార యంత్రాంగానికి స్ప‌ష్ట‌మైన ఆదేశాలు ఇస్తోంది.

ఎల్‌నినో ప్ర‌భావాన్ని ప్ర‌జ‌ల‌పై ప‌డ‌నివ్వ‌కుండా అన్ని శాఖ‌లు స‌మ‌న్వ‌యంతో యుద్ధ ప్ర‌తిపాదిక‌న ప‌ని చేయాల‌ని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోద‌ర రాజ‌న‌ర్సింహ ఆదేశించారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ప్రజలకు, రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎల్‌నినో ప్రభావాన్ని సమర్థంగా ఎదుర్కోవడం రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యత అని ఆయ‌న పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు, రాష్ట్ర మంత్రివర్గ నిర్ణయాల మేరకు మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల, నారాయణపేట జిల్లాల పరిస్థితులను అధికారులతో సమగ్రంగా సమీక్షించిన‌ట్లు మంత్రి రాజ‌న‌ర్సింహ పేర్కొన్నారు.

ప్రస్తుతం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో సాధారణ వర్షపాతంతో పోలిస్తే సుమారు 40 శాతం లోటు నమోదైంది. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ప్రతి శాఖ ముందస్తు కార్యాచరణతో సిద్ధంగా ఉండాలని స్పష్టంగా ఆదేశించాను. జూలై 31 నాటికి అన్ని శాఖలు తమ కార్యాచరణ ప్రణాళికలు, అవసరమైన ప్రతిపాదనలను ప్రభుత్వానికి సమర్పించాలని సూచించాను. అవసరమైతే అదనపు నిధులు కేటాయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఎల్‌నినో అంటే ఏమిటి, దాని ప్రభావం ప్రజల జీవితాలపై, వ్యవసాయంపై ఎలా ఉంటుందో గ్రామస్థాయి వరకు శాస్త్రీయ అవగాహన కల్పించాలని అధికారులకు సూచించాను. ప్రజల్లో అనవసర భయాందోళనలు కాకుండా వాస్తవ సమాచారాన్ని అందించాల్సిన బాధ్యత మనందరిదీ అని దామోద‌ర స్ప‌ష్టం చేశారు.

నీటి సంర‌క్ష‌ణ ప‌నులు విస్తృతంగా చేప‌ట్టాలి

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో సాగునీటి అవసరాలు ప్రధానంగా కృష్ణా జలాలపైనే ఆధారపడి ఉన్నాయి. అందుబాటులో ఉన్న ప్రతి నీటి వనరును అత్యంత సమర్థంగా వినియోగిస్తూ తాగునీటికి అత్యున్నత ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులను ఆదేశించాను. గ్రామాల్లో పనిచేయని హ్యాండ్‌పంపులు, బోర్లు వెంటనే మరమ్మతు చేయాలి. అవసరమైతే ప్రత్యామ్నాయ తాగునీటి ఏర్పాట్లు కూడా చేయాలి. భూగర్భ జలాలను పెంచేందుకు వర్షపు నీటిని ఒడిసిపట్టే కార్యక్రమాలను వేగవంతం చేయాలి. బోర్‌వెల్ రీచార్జ్, ఇంకుడు గుంతలు, చెక్‌డ్యాంలు, పర్కొలేషన్ ట్యాంకులు వంటి నీటి సంరక్షణ పనులను విస్తృతంగా చేపట్టాలని సూచించిన‌ట్లు ఆయ‌న తెలిపారు.

ప్ర‌త్యామ్నాయ పంట‌ల‌ను ప్రోత్స‌హించాలి

వ్యవసాయ, ఉద్యానవన శాఖలు సమన్వయంతో పనిచేస్తూ రైతులకు శాస్త్రీయ సలహాలు అందించాలి. అధిక నీటి అవసరం ఉండే పంటలకు బదులుగా తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలి. విత్తనాలు, సాంకేతిక సహాయం సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించిన‌ట్లు మంత్రి స్ప‌ష్టం చేశారు.

నిరంతర విద్యుత్ స‌ర‌ఫ‌రా ఉండేలా ఏర్పాట్లు

గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు తగ్గకుండా ఉపాధి హామీ పథకం కింద విస్తృతంగా పనులు చేపట్టాలని సూచించాను. అవసరమైతే సాధారణ పరిస్థితుల కంటే ఎక్కువ రోజుల ఉపాధి కల్పించేలా ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు స్పష్టం చేశాను. వ్యవసాయం, తాగునీటి అవసరాలకు ఎలాంటి అంతరాయం లేకుండా నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా ముందస్తు ఏర్పాట్లు చేయాలని విద్యుత్ శాఖను ఆదేశించిన‌ట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి పేర్కొన్నారు.

సీజ‌న‌ల్ వ్యాధుల నివార‌ణ‌కు చ‌ర్య‌లు ముమ్మ‌రం

ప్రజారోగ్య పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నాం. నీటి ద్వారా వ్యాపించే వ్యాధులను నివారించేందుకు ఆరోగ్య శాఖ అప్రమత్తంగా ఉండాలి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవసరమైన మందులు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, అత్యవసర వైద్య సామగ్రి అందుబాటులో ఉంచాలని సూచించాను. డెంగీ, మలేరియా, చికున్‌గున్యా, డయేరియా, గ్యాస్ట్రోఎంటరైటిస్ వంటి వ్యాధుల నివారణకు పారిశుద్ధ్య కార్యక్రమాలు, క్లోరినేషన్, ఫాగింగ్, యాంటీ లార్వా చర్యలను ముమ్మరం చేయాలని ఆదేశించాన‌ని మంత్రి తెలిపారు.

కుంభ‌వృష్టి వ‌ర్షాల‌కు, ఆక‌స్మిక వ‌ర‌దలకు అవ‌కాశం

ప్రతి ఉమ్మడి జిల్లాకు ప్రత్యేక అధికారులను నియమించినట్లే, ప్రతి మండలానికి కూడా ప్రత్యేక అధికారులను నియమించి పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించేలా వ్యవస్థను బలోపేతం చేయాలని సూచించాను. ఎల్‌నినో కారణంగా వర్షాభావంతో పాటు కొన్ని సందర్భాల్లో కుంభవృష్టి వర్షాలు, ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందువల్ల పంచాయతీరాజ్, మున్సిపల్, నీటి పారుదల శాఖలు ఈ పరిస్థితులకు కూడా పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉండాలని ఆదేశించాన‌ని చెప్పారు.

రైతులు ప్ర‌భుత్వానికి స‌హ‌క‌రించాలి

ఇది మనుషులు సృష్టించిన సంక్షోభం కాదు.. ప్రకృతి విసిరిన సవాల్. ఈ సవాల్‌ను ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు కలిసి సమష్టిగా ఎదుర్కోవాలి. ప్రజలు, రైతులు ప్రభుత్వానికి సహకరించాలని కోరుతున్నాను. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి కుటుంబానికి అండగా ఉంటుంది. ప్రజలపై ఎల్‌నినో ప్రభావం తగ్గించేందుకు అవసరమైన ప్రతి చర్యను తీసుకుంటామ‌ని మంత్రి దామోద‌ర రాజ‌న‌ర్సింహ భ‌రోసా ఇచ్చారు.

Advertisement
Advertisement