త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bhatti Vikramarka and Ministers | ఒకే పాస్‌తో మెట్రో, ఆర్టీసీ సేవలు

Bhatti Vikramarka and Ministers | త్రినేత్ర న్యూస్: ఇక‌నుంచి ఒకే పాస్‌తో మెట్రోలో, ఆర్టీసీ బ‌స్సుల్లో ప్ర‌యాణించ‌వ‌చ్చ‌ని డిప్యూటీ సీఎం మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క తెలిపారు. త్వ‌ర‌లో డైలీ, వీక్లీ, నెల‌వారీ పాస్‌ల‌ను అందుబాటులోకి తీసుకురానున్న‌ట్లు చెప్పారు. ఆర్టీసీ, మెట్రోతో పాటు ఆటో రంగాన్ని ప్ర‌జా ర‌వాణా వ్య‌త‌స్థ‌లో భాగ‌స్వామ్యం చేస్తున్న‌ట్లు పేర్కొన్నారు.

S

Telangana | Published On Oct 2, 2026, 4.49 pm IST

Bhatti Vikramarka and Ministers | ఒకే పాస్‌తో మెట్రో, ఆర్టీసీ సేవలు
Advertisement
  • డైలీ, వీక్లీ, మంత్లి పాస్‌లను ప్రారంభించబోతున్నాం
  • ఫస్ట్ మైల్ - లాస్ట్ మైల్ కనెక్టివిటీపై ప్రత్యేక దృష్టి పెడుతున్నాం
  • ఆటో రంగాన్ని కూడా ప్రజా రవాణా వ్యవస్థలో భాగస్వామ్యం చేస్తున్నాం
  • మరిన్ని రవాణా సేవలను ఒకే డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పైకి తీసుకురావడానికి చర్యలు
  • ఆర్టీసీ, మెట్రో కామన్ పాస్ ఆవిష్కరణ‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, అధికారులు

Bhatti Vikramarka and Ministers | త్రినేత్ర న్యూస్: ఇక‌నుంచి ఒకే పాస్‌తో మెట్రోలో, ఆర్టీసీ బ‌స్సుల్లో ప్ర‌యాణించ‌వ‌చ్చ‌ని డిప్యూటీ సీఎం మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క తెలిపారు. త్వ‌ర‌లో డైలీ, వీక్లీ, నెల‌వారీ పాస్‌ల‌ను అందుబాటులోకి తీసుకురానున్న‌ట్లు చెప్పారు. ఆర్టీసీ, మెట్రోతో పాటు ఆటో రంగాన్ని ప్ర‌జా ర‌వాణా వ్య‌త‌స్థ‌లో భాగ‌స్వామ్యం చేస్తున్న‌ట్లు పేర్కొన్నారు. భ‌విష్య‌త్‌లో మ‌రిన్ని ర‌వాణా సేవ‌ల‌ను ఒకే డిజిట‌ల్ ప్లాట్‌ఫామ్‌పైకి తీసుకురావ‌డానికి చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌న్నారు. శుక్ర‌వారం మంత్రులు, అధికారుల‌తో క‌లిసి భ‌ట్టి ఆర్టీసీ, మెట్రో కామ‌న్ పాస్‌ను ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా మంత్రులందరికి వన్డే పాస్ ను కొనుగోలు చేశారు. రేపు ఉదయం 11 గంటలకు బేగంపేట మెట్రో స్టేషన్ నుంచి ప్రయాణం చేయనున్నట్లు పొన్నం తెలిపారు. అనంత‌రం ఆటో ఛార్జీల సవరణ చేస్తూ జీవో విడుదల చేశారు.

ఈ సంద‌ర్భంగా భ‌ట్టి ప్ర‌సంగించారు. ఫ‌స్ట్ మైల్ - లాస్ట్ మైల్ కనెక్టివిటీపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోంది. డిజిటల్ వీక్లీ బస్ పాస్ - రూ.600 లను ప్రారంభించాం. హైదరాబాద్ లో వేల కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నాం. హైదరాబాద్ ను ప్రపంచలోనే తలమానికంగా ఉండేలా తీర్చిదిద్దుతున్నాం. హైదరాబాద్ దేశానికి దశదిశలా మారేలా చేస్తున్నాం. హైదరాబాద్ మహా నగరంలో ప్రస్తుతం రూ. 52,000 కోట్ల పనులు జరుగుతున్నాయి. ఫేజ్ -2 లో రూ.38,000 కోట్ల మెట్రో పనులు చేపడుతున్నాం. రీజనల్ రింగ్ రోడ్ 366 కి.మి లతో... రూ.30, 627 అందుబాటులోకి తీసుకురాబోతున్నాం. 21 రీడియల్ రోడ్లను అందుబాటులోకి తీసుకొస్తున్నాం. మూసీ పునర్నిర్మాణ పనులు చేపడుతున్నాం.

30వేల ఎకరాల్లో భారత్ ప్యూచర్ సిటీగా అభివృద్ధి చేస్తున్నాం. మోస్ట్ లివబుల్ సిటీగా హైదారాబాద్ ను తీర్చిదిద్దుతున్నాం. హైద‌రాబాద్ లో పూర్తిగా ఎలక్ట్రిక్ బస్సులనే తిప్పాలని చూస్తున్నాం. ఆటోలకు రెట్రో ఫిట్ మెంట్ ను తీసుకొచ్చాం. హిల్ట్ పాలసీ తీసుకిస్తున్నాం.

ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాలి: మంత్రి పొన్నం ప్రభాకర్

ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ప్రజా రవాణా వ్యవస్థ బలోపేతంపై ప్రత్యేక దృష్టి. మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీపై పెరిగిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తున్న డ్రైవర్లు, కండక్టర్లు, సిబ్బందికి అభినందనలు. గ్రామీణ ప్రాంతాల నుంచి హైదరాబాద్ వరకు ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం. ప్రజా రవాణా వ్యవస్థ బలోపేతం అయితే ట్రాఫిక్ సమస్యలు, కాలుష్యం తగ్గుతాయి. ఆర్టీసీ, మెట్రో, ఆటో సేవలను సమన్వయం చేసి ప్రజలకు సులభమైన ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నాం.

ఆటో డ్రైవర్ల సమస్యలు, జీవనోపాధి, సంక్షేమాన్ని ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుంటుంది. దాదాపు 12 ఏళ్లుగా పెరగని ఆటో ఛార్జీలపై ప్రభుత్వం సానుకూలంగా పరిశీలన చేస్తోంది. ప్రజలపై అదనపు భారం పడకుండా, ఆటో డ్రైవర్లకు న్యాయం జరిగేలా ఛార్జీల నిర్ణయం ఉంటుంది. ఆటో కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తాం. విజన్-2047లో ప్రజా రవాణాకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నాం. భవిష్యత్ తరాలకు అనుగుణంగా సమగ్ర ప్రజా రవాణా వ్యవస్థను అభివృద్ధి చేస్తాం. హైదరాబాద్‌లో ఆర్టీసీ, మెట్రో, ఆటో తదితర రవాణా వ్యవస్థలను టెక్నాలజీతో అనుసంధానం చేస్తాం. ఆర్టీసీకి నెలకి 300 కోట్లు విడుదల చేస్తుందని అదనంగా 50 కోట్లు మొత్తం 350 కోట్లు నెలకి విడుదల చేస్తూ ఆర్టీసీ రిటైర్డ్ అయిన ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారిని కోరుతున్న.

చివరి మైలు ప్రయాణం మరింత సులభమ‌వుతుంది: మంత్రి వివేక్ వెంకట్ స్వామి

హైదరాబాద్, సికింద్రాబాద్, రంగారెడ్డి ప్రాంతాల్లో అర్బనైజేషన్‌కు అనుగుణంగా ప్రజా రవాణా సర్వీసులను మరింత పెంచాల్సిన అవసరం ఉంది. మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో ఆర్టీసీ బస్ సర్వీసులు గణనీయంగా మెరుగుపడ్డాయి. హైదరాబాద్‌లో కొత్త బస్సులను ప్రవేశపెట్టడం, మైనర్లకు ఉచిత బస్ ప్రయాణం కల్పించడం అభినందనీయం. మహిళలకు ఉచిత బస్ ప్రయాణం కోసం ప్రభుత్వం ఆర్టీసీకి సుమారు 12 వేల కోట్ల మేర ఖర్చును భరిస్తోంది. ప్రభుత్వ సహకారంతో ఆర్టీసీ సంస్థను మరింత బలోపేతం చేసే అవకాశం ఏర్పడింది. ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి గారి ఆధ్వర్యంలో సంస్థను సమర్థవంతంగా నడిపిస్తున్న అధికారులకు అభినందనలు.

ప్రస్తుతం మెట్రోలో ప్రయాణిస్తున్న వారి సంఖ్యను 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచే దిశగా చర్యలు అవసరం. మెట్రో స్టేషన్లకు ఆర్టీసీ బస్సుల కనెక్టివిటీ పెంచితే ప్రయాణికులకు చివరి మైలు ప్రయాణం మరింత సులభం అవుతుంది. ప్రజలు ఎక్కువగా ప్రజా రవాణాను వినియోగించేలా ప్రోత్సహించడం ద్వారా ట్రాఫిక్ సమస్యను తగ్గించవచ్చు. ఆటో డ్రైవర్లతో చర్చించి వారికి న్యాయం జరిగేలా తగిన చర్యలు తీసుకుంటాం. ఈ ప్రజా ప్రయోజన కార్యక్రమాన్ని చేపట్టిన మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి అభినందనలు.

నా చిన్న‌ప్పుడు బ‌స్సుల్లోనే తిరిగా: మంత్రి అజారుద్దీన్

మనకు ఎంత మంచి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉన్నా, దానికి అనుగుణంగా మంచి ప్రజా రవాణా వ్యవస్థ లేకపోతే ఆ మౌలిక వసతుల వల్ల ప్రజలకు పూర్తి ప్రయోజనం లభించదు. అందుకే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌తో పాటు సమర్థవంతమైన, సౌకర్యవంతమైన పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ వ్యవస్థ కూడా ఎంతో అవసరం. తెలంగాణలో ప్రస్తుతం రవాణా వ్యవస్థ ఎంతో అభివృద్ధి చెందింది. ఈ విషయంలో ముఖ్యమంత్రి నాయకత్వంలో, ఉప ముఖ్యమంత్రి సహకారంతో, మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో రవాణా శాఖ చేస్తున్న కృషి అభినందనీయం. నా చిన్న‌ప్పుడు ఎక్కువగా బస్సుల్లోనే ప్రయాణించేవాడిని. అప్పట్లో బస్సుల్లో ఫుట్‌బోర్డింగ్ కూడా సాధారణంగా కనిపించేది.

బేగంపేట సర్కిల్ దగ్గర కూడా నేను చిన్న వయసులో రెండు మూడు సార్లు ఫుట్‌బోర్డింగ్ చేస్తూ ప్రయాణించాను. ఒకసారి వెనుక నుంచి ఎవరో నెట్టడంతో కిందపడిపోయాను. ఆ రోజుల్లో ఆర్థిక పరిస్థితుల కారణంగా బస్సులోనే ప్రయాణించాల్సి వచ్చేది. బస్సుల్లో ప్రయాణం కూడా అంత సౌకర్యవంతంగా ఉండేది కాదు. కానీ ఈరోజు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. నేను దేశంలోని అనేక ప్రాంతాలకు, ఢిల్లీకి కూడా వెళ్తుంటాను. కానీ తెలంగాణలో ప్రస్తుతం అభివృద్ధి చెందుతున్న పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ వ్యవస్థను చూస్తే చాలా సంతోషంగా ఉంది. మెట్రో, ఆర్టీసీ బస్సులను ఒకే కామన్ పాస్ విధానంలోకి తీసుకురావడం మంచి నిర్ణయం. నాగిరెడ్డి, మెట్రో నుంచి సత్యనారాయణ, రవాణా శాఖకు చెందిన అధికారులు, సిబ్బంది ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికీ నా అభినందనలు.

రోజూ 35-40 లక్షల మంది రాకపోకలు : అద్దంకి దయాకర్, ప్రభుత్వ విప్

పేదలు, దిగువ మధ్యతరగతి, మధ్యతరగతి ప్రజలకు ఉపయోగపడే మరో కీలక కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చింది. టీజీఎస్‌ఆర్టీసీ - హైదరాబాద్ మెట్రో సంయుక్తంగా తీసుకున్న ఈ నిర్ణయం ప్రజా రవాణాలో కీలక ముందడుగు. నగరంలో సుమారు కోటి 30 లక్షల జనాభాతో పాటు రోజూ 35-40 లక్షల మంది రాకపోకలు సాగిస్తున్నారు. ప్రజా రవాణాను బలోపేతం చేయడం ద్వారా సామాన్య ప్రజలపై రవాణా భారం తగ్గుతుంది. ఆటో డ్రైవర్లకు తగిన న్యాయం జరిగేలా, వారి జీవనోపాధికి భరోసా కల్పించే విధంగా భవిష్యత్‌లో ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంది. విద్యార్థులు, యువత, ఉద్యోగులు, పేదలు, మధ్యతరగతి కుటుంబాలకు ఈ నిర్ణయం ఎంతో ఉపయోగకరం.

పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ బలంగా ఉంటే వ్య‌క్తిగ‌త వాహ‌నాల సంఖ్య త‌గ్గుతుంది: సంజయ్ జాజు, సీఎస్

ఈరోజు నాకు చాలా ప్రత్యేకమైన రోజు. నేను జూలై 1న తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన తర్వాత రెండు మూడు రోజుల్లోనే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి హైదరాబాద్ నగరంలోని పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ వ్యవస్థపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని సూచించారు. అప్పటి నుంచి మన మెట్రో నెట్‌వర్క్‌ను ఎలా విస్తరించాలి? ఆర్టీసీ నెట్‌వర్క్‌ను ఎలా మరింత బలోపేతం చేయాలి? డ్రైవర్లు, కార్మికులు, అధికారులు, వివిధ రవాణా వ్యవస్థల్లో పనిచేస్తున్న వారితో చర్చించి సిటిజన్లకు మరింత సౌకర్యవంతమైన రవాణా వ్యవస్థను ఎలా అందించాలి? అనే ఆలోచనతో అనేక సంప్రదింపులు ప్రారంభించాం.

ఈ సంప్రదింపుల సమయంలో ఒక ముఖ్యమైన విషయం మన దృష్టికి వచ్చింది. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే ప్రతిరోజూ దాదాపు 30 లక్షల మంది ప్రయాణికులు ఆర్టీసీ సేవలను ఉపయోగిస్తున్నారు. దాదాపు 5 లక్షల మంది ప్రయాణికులు హైదరాబాద్ మెట్రో సేవలను ఉపయోగిస్తున్నారు. నగరంలో ఆటో రిక్షాలను కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు తమ ప్రయాణ అవసరాలకు వినియోగిస్తున్నారు. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ బలంగా ఉంటే రోడ్లపై వ్యక్తిగత వాహనాల సంఖ్య తగ్గుతుంది. ట్రాఫిక్ సమస్యలు తగ్గుతాయి. కాలుష్యం తగ్గుతుంది. ప్రజలకు ప్రయాణ ఖర్చు కూడా తగ్గుతుంది.

ఒక మంచి నగరం, ఒక వైబ్రెంట్ సిటీ, ఒక బాధ్యతాయుతమైన మరియు ప్రజలకు అనుకూలమైన నగరం తయారవ్వడానికి బలమైన పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ వ్యవస్థ ఎంతో అవసరం. అందుకే తెలంగాణ ప్రభుత్వం ఒకవైపు మెట్రో నెట్‌వర్క్ విస్తరణకు కృషి చేస్తోంది. మరోవైపు ఆర్టీసీ నెట్‌వర్క్‌ను కూడా మరింత బలోపేతం చేయడానికి చర్యలు తీసుకుంటోంది. ఇదే సమయంలో ఆటో రవాణాకు సంబంధించిన పలు చర్యలు కూడా తీసుకుంటున్నాం. ఒక ప్రయాణికుడు తన ఇంటి నుంచి ముందుగా ఒక బస్సులో మెట్రో స్టేషన్‌కు వస్తాడు. అక్కడ మెట్రోలో ప్రయాణించి తన గమ్యస్థానానికి దగ్గరలోని మరో స్టేషన్‌కు చేరుకుంటాడు. అక్కడి నుంచి మళ్లీ బస్సు లేదా ఆటో ద్వారా తన కార్యాలయానికి లేదా ఇంటికి చేరుకుంటాడు దీనినే First Mile - Last Mile Connectivity అంటాం. కానీ ఈ మొత్తం ప్రయాణంలో ప్రయాణికుడు ఒక్కో దశకు ఒక్కో టికెట్ తీసుకోవాల్సి వస్తోంది.

మొదట బస్సుకు ఒక టికెట్, తర్వాత మెట్రోకు మరో టికెట్, చివరగా మరో బస్సు లేదా ఇతర రవాణా సౌకర్యానికి ఇంకో టికెట్. రోజుకు రెండు, మూడు, నాలుగు సార్లు ప్రయాణించే వ్యక్తికి ఇది ఒక అదనపు అసౌకర్యంగా మారుతుంది. రోజూ ఆఫీసుకు వెళ్లే కమ్యూటర్‌కు నెల మొత్తం ఇదే పరిస్థితి ఉంటుంది. అందుకే ప్రయాణికుడికి ఒకే వ్యవస్థ, ఒకే టికెట్, మరింత సౌకర్యవంతమైన ప్రయాణం అందించాలనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాం.

ఇది ప్రారంభ దశ. రాబోయే రోజుల్లో ప్రయాణికుల నుంచి వచ్చే సూచనలు, అనుభవాల ఆధారంగా మరిన్ని మెరుగుదలలు చేస్తాం. మా లక్ష్యం ఒక్కటే ప్రజలకు ప్రయాణాన్ని మరింత సులభంగా, సౌకర్యవంతంగా చేయడం. ఇందులో మరో ముఖ్యమైన అంశం మీ సేవా. 2011లో మీ సేవా ప్రారంభమైనప్పటి నుంచి ప్రజలకు అనేక రకాల ప్రభుత్వ సేవలను ఒకే వేదిక ద్వారా అందించడంలో కీలక పాత్ర పోషించింది. కామన్ టికెటింగ్ వ్యవస్థలో కూడా మీ సేవా వంటి డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లను వినియోగించుకోవడం మనకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఈరోజు ఆర్టీసీ, మెట్రో కలిసి కామన్ టికెట్ విధానాన్ని ప్రారంభించడం నాకు ఎంతో ఆనందంగా ఉంది.

చిన్న బ‌స్సుల కోసం ప్ర‌తిపాద‌న‌లు: వికాస్ రాజ్, స్పెషల్ సీఎస్

విజన్–2047 కింద తెలంగాణలో రవాణా వ్యవస్థను మరింత సులభతరం చేయడం, వేగవంతం చేయడం, ప్రజల ప్రయాణ సమయాన్ని తగ్గించడం వంటి అంశాలపై సమగ్రంగా చర్చిస్తున్నాం. 2047 నాటికి హైదరాబాద్ నుంచి రాష్ట్రంలోని ఏ మూలకు వెళ్లాలన్నా రెండు గంటల్లో చేరుకునే విధంగా రవాణా వ్యవస్థను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో యాక్షన్ ప్లాన్ రూపొందిస్తున్నాం. రోడ్ల అభివృద్ధిపై కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోంది.

ముఖ్యంగా ఓఆర్‌ఆర్ పరిధిలోని రోడ్లను సమగ్రంగా అభివృద్ధి చేయడం, అవసరమైన చోట్ల రోడ్ల విస్తరణ చేపట్టడం, అన్ని ప్రాంతాలను ఒక సమగ్ర రవాణా వ్యవస్థతో అనుసంధానం చేయడం వంటి అంశాలపై కార్యాచరణ రూపొందిస్తున్నాం. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ విషయంలో ఆర్టీసీ బస్సులు, మెట్రో రైలు సేవలు పరస్పరం అనుసంధానమయ్యే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. మెట్రో స్టేషన్లకు సమీప ప్రాంతాల నుంచి ప్రజలు సులభంగా చేరుకునేలా ఫీడర్ బస్సులను ఏర్పాటు చేయడం, అవసరమైన చోట్ల చిన్న బస్సులను కూడా అందుబాటులోకి తీసుకురావడం వంటి ప్రతిపాదనలను పరిశీలిస్తున్నాం.

ఎక్కడైతే మెట్రో స్టేషన్లకు సరైన కనెక్టివిటీ లేదో, ఆ ప్రాంతాల్లో రోడ్ల విస్తరణ, రోడ్డు కనెక్టివిటీ మెరుగుదల, ప్రజా రవాణా సౌకర్యాల పెంపుపై ప్రత్యేక దృష్టి పెడుతున్నాం. ముఖ్యంగా ఈజీ ట్రాన్స్‌పోర్ట్‌తో పాటు గ్రీన్ ట్రాన్స్‌పోర్ట్ కూడా మన భవిష్యత్ లక్ష్యం. పట్టణ ప్రాంతాల్లో కాలుష్యాన్ని తగ్గించేందుకు ఆటో రిక్షాల రెట్రోఫిటింగ్ వంటి కార్యక్రమాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది.

డ్రైవింగ్ లైసెన్స్, వెహికల్ ఫిట్‌నెస్ వంటి సేవలను మరింత సులభతరం చేయడం, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా సేవలను అందుబాటులోకి తీసుకురావడం వంటి అంశాలపై కూడా ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నాం.

ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ లు పట్నం మహేందర్ రెడ్డి, అద్దంకి దయాకర్, సీఎస్ సంజయ్ జాజు, స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్, ఆర్టీసీ ఎండీ వై.నాగిరెడ్డి, హైదరాబాద్ మెట్రో ప్రభుత్వ సలహాదారు NVS రెడ్డి , జీహెచ్ ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, రవాణా శాఖ కమిషనర్ ఇలాంబర్తి, ఇతర ముఖ్య అధికారులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement