త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Farmer Mela | కొడంగల్‌లో నవంబర్ 7 నుంచి 9 వరకు మెగా రైతు మేళా

Farmer Mela | రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులు, నూతన సాంకేతిక పరిజ్ఞానం, అధిక ఆదాయం అందించే ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన కల్పించడంతో పాటు వ్యవసాయ రంగంలో సాధించిన పురోగతిని ప్రదర్శించే లక్ష్యంతో ఈ నెల 7 నుంచి 9వ తేదీ వరకు కొడంగల్‌లో మూడు రోజుల పాటు మెగా రైతు మేళాను నిర్వహించనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.

S

Telangana | Published On Nov 4, 2026, 5.13 pm IST

Farmer Mela | కొడంగల్‌లో నవంబర్ 7 నుంచి 9 వరకు మెగా రైతు మేళా
Advertisement

నవంబర్ 7న సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం
150 ఎగ్జిబిషన్ స్టాళ్లు ఏర్పాటు
రైతులకు ఆధునిక వ్యవసాయంపై అవగాహన
శాస్త్రవేత్తలు, ప్రగతిశీల రైతులతో సమావేశాలు
50 వేల మంది రైతుల హాజరవుతారని అంచనా
రైతులందరూ మెగా రైతు మేళాను సద్వినియోగం చేసుకోవాలి
వ్య‌వ‌సాయ శాఖ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర్ రావు

Farmer Mela | త్రినేత్ర న్యూస్ : రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులు, నూతన సాంకేతిక పరిజ్ఞానం, అధిక ఆదాయం అందించే ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన కల్పించడంతో పాటు వ్యవసాయ రంగంలో సాధించిన పురోగతిని ప్రదర్శించే లక్ష్యంతో ఈ నెల 7 నుంచి 9వ తేదీ వరకు కొడంగల్‌లో మూడు రోజుల పాటు మెగా రైతు మేళాను నిర్వహించనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. నవంబర్ 7వ తేదీన ఉదయం 10 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి ఇతర మంత్రులు, ప్రజాప్రతినిధులు, ప్రముఖుల సమక్షంలో ఈ మేళాను ప్రారంభించనున్నారని వెల్లడించారు. ప్రారంభోత్సవం అనంతరం ముఖ్యమంత్రి, మంత్రులు ప్రదర్శన స్టాళ్లను సందర్శించనున్నారు.

ఈ మెగా రైతు మేళాలో వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖ, ఆయిల్‌ఫెడ్, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం (PJTAU), పశుసంవర్ధక శాఖ, బ్యాంకింగ్ సంస్థలు, విత్తన పరిశ్రమ, వాలంతరి (WALAMTARI), క్రిడా (CRIDA), కేంద్ర ప్రభుత్వ సంస్థలు సహా మొత్తం 26 ప్రభుత్వ శాఖలు, అనుబంధ సంస్థల భాగస్వామ్యంతో సుమారు 150 ఎగ్జిబిషన్ స్టాళ్లను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. వ్యవసాయ ఇన్‌పుట్స్, నూతన తరం రసాయనాలు, నాణ్యమైన విత్తనాలు, ఆధునిక వ్యవసాయ పరికరాలు, యంత్రాలు, వ్యవసాయ డ్రోన్లు, వివిధ శాఖల సాంకేతిక పరిజ్ఞానం, ప్రభుత్వ కార్యక్రమాలను ఈ స్టాళ్ల ద్వారా ప్రదర్శించనున్నారని అన్నారు.

మూడు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో రైతులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, అవార్డు గ్రహీతలైన ప్రగతిశీల రైతులతో సాంకేతిక సమావేశాలు, ముఖాముఖి చర్చలు నిర్వహించనున్నారు. వివిధ ప్రభుత్వ శాఖలు, జాతీయ, అంతర్జాతీయ సంస్థలు, ప్రైవేటు రంగ సంస్థలు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలు (FPOs), ఇతర భాగస్వామ్య సంస్థల ఆధ్వర్యంలో ప్రదర్శనలు, ప్రత్యక్ష అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఆధునిక వ్యవసాయ పద్ధతులు, పంటల విలువ ఆధారిత ఉత్పత్తులు, మార్కెట్ అవకాశాలు, వినూత్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడం ద్వారా రైతుల ఆదాయాన్ని పెంపొందించుకునే మార్గాలను వివరించనున్నారు.

రైతులకు వ్యవసాయ పరికరాలు, యంత్రాల పంపిణీ

మొదటి రోజు ముఖ్యమంత్రి, ఇతర ప్రముఖుల సమక్షంలో కస్టమ్ హైరింగ్ సెంటర్లు, పప్పుధాన్యాల మిల్లులు, నూనె గానుగ యూనిట్లు, భూసార పరీక్ష కార్డులు, బయో రిసోర్స్ ఇన్‌పుట్ సెంటర్లు, ఉద్యానవన శాఖకు సంబంధించిన డ్రిప్ సిస్టమ్స్ తదితర వ్యవసాయ పరికరాలు, యంత్రాలు, యూనిట్లను రైతులకు అందించనున్నారు. మొదటి రోజు కార్యక్రమాలు సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనున్నాయి.

రెండో రోజు మహిళా రైతులకు ప్రత్యేక ప్రాధాన్యత

రెండో రోజు కార్యక్రమాల్లో అధిక సంఖ్యలో మహిళా రైతులు పాల్గొనేలా ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు. వ్యవసాయం, అనుబంధ రంగాల్లో మహిళా రైతుల పాత్ర, ఆదాయాన్ని పెంపొందించుకునే అవకాశాలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై వారికి అవగాహన కల్పించనున్నారు. మూడో రోజు పొరుగు జిల్లాల నుంచి సుమారు 50 వేల మంది రైతులను సమీకరించనున్నారు. చివరి రోజు సాయంత్రం గౌరవ ముఖ్యమంత్రి ప్రసంగంతో మెగా రైతు మేళా ముగియనుంది.

Advertisement
Advertisement