త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

DGP Anand | అర్హులైన పోలీసుల‌కు త‌క్కువ వ‌డ్డీతో రుణాలు.. సిబ్బంది సంక్షేమ‌మే ప్ర‌ధాన ల‌క్ష్యం

DGP Anand | అర్హులైన పోలీసుల కుటుంబాల‌కు త‌క్కువ వ‌డ్డీతో రుణాలు అందించేలా చూడాల‌ని డీజీపీ సీవీ ఆనంద్ సూచించారు. ఓపెన్ ప్లాట్ రుణాలు 9 శాతం వడ్డీతో, గృహ రుణాలు 6.75 శాతం వడ్డీతో, వ్యక్తిగత రుణాలు రూ.5 లక్షల వరకు 11 శాతం వడ్డీతో, కుమార్తె వివాహానికి రూ.6 లక్షలు, దేశీయ, విదేశీ ఉన్నత విద్య కోసం రూ.30 లక్షల వరకు తక్కువ వడ్డీతో రుణాలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

S

Telangana | Published On Jul 20, 2026, 6.38 pm IST

DGP Anand | అర్హులైన పోలీసుల‌కు త‌క్కువ వ‌డ్డీతో రుణాలు.. సిబ్బంది సంక్షేమ‌మే ప్ర‌ధాన ల‌క్ష్యం
Advertisement
  • విద్య, వైద్యం, వివాహ సహాయం, బీమా పథకాల బలోపేతానికి ఆదేశాలు
  • ప్రతి రూపాయీ జవాబుదారీతనంతో ఖర్చు కావాలి
  • పోలీస్ వెల్ఫేర్ సొసైటీ, ఆరోగ్య భద్రత పథకాలపై సమీక్షలో డీజీపీ సి.వి. ఆనంద్

DGP Anand | త్రినేత్ర‌.న్యూస్‌: అర్హులైన పోలీసుల కుటుంబాల‌కు త‌క్కువ వ‌డ్డీతో రుణాలు అందించేలా చూడాల‌ని డీజీపీ సీవీ ఆనంద్ సూచించారు. ఓపెన్ ప్లాట్ రుణాలు 9 శాతం వడ్డీతో, గృహ రుణాలు 6.75 శాతం వడ్డీతో, వ్యక్తిగత రుణాలు రూ.5 లక్షల వరకు 11 శాతం వడ్డీతో, కుమార్తె వివాహానికి రూ.6 లక్షలు, దేశీయ, విదేశీ ఉన్నత విద్య కోసం రూ.30 లక్షల వరకు తక్కువ వడ్డీతో రుణాలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పోలీసు సిబ్బంది, వారి కుటుంబాల సంక్షేమమే తెలంగాణ పోలీసు శాఖ ప్రధాన లక్ష్యమన్నారు. డీజీపీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పోలీస్ వెల్ఫేర్ సొసైటీ మరియు ఆరోగ్య భద్రత (Arogya Bhadratha) విభాగాల సమీక్ష సమావేశంలో సంక్షేమ పథకాల అమలు, వాటి పురోగతి, భవిష్యత్ కార్యాచరణపై విస్తృతంగా సమీక్షించారు.

ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడారు. పోలీసు సిబ్బంది జీవన ప్రమాణాలను మెరుగుపరచడం, వారి కుటుంబాలకు ఆర్థిక, సామాజిక భరోసా కల్పించేందుకు శాఖ అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోంది. పోలీసు పిల్లల్లో ప్రతిభను ప్రోత్సహించేందుకు మెరిట్ స్కాలర్‌షిప్‌లు, మెరిటోరియస్ స్కాలర్‌షిప్‌లు అందిస్తున్నాం. జేఈఈ, నీట్‌తో పాటు జాతీయ, రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ప్రత్యేక ఆర్థిక సహాయం, స్కాలర్‌షిప్‌లు అందిస్తూ ఉన్నత విద్యను ప్రోత్సహిస్తున్నాం. సిబ్బందికి వివాహ, వైద్య, విద్యా రుణాలు త‌దిత‌ర సంక్షేమ పథకాల ద్వారా సమగ్ర ఆర్థిక భద్రత కల్పిస్తున్నాం అని డీజీపీ పేర్కొన్నారు.

ఆరోగ్య భద్రత పథకం కింద రూ.73.61 కోట్లు ఖర్చు..

పోలీసు ఆరోగ్య భద్రత పథకం కింద 2025 సంవత్సరంలో 33,126 మంది పోలీసు సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు చికిత్స పొందగా, 2026 జూన్ నాటికి 12,392 మంది ఈ పథకం ద్వారా వైద్య సేవలు పొందినట్లు వెల్లడించారు. ఇందుకోసం 2025లో రూ.181.74 కోట్లు, 2026, జూన్ నాటికి రూ.73.61 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు.

విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు మరణించిన పోలీసు సిబ్బంది కుటుంబాలకు గ్రూప్ పర్సనల్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పాలసీ ద్వారా ఆర్థిక రక్షణ కల్పిస్తున్నాం. ఈ పథకం కింద కానిస్టేబుల్ నుంచి ఏఎస్సై వరకు రూ.5 లక్షలు, ఎస్సైలు, ఇన్‌స్పెక్టర్లకు రూ.10 లక్షలు, డీఎస్పీలకు రూ.15 లక్షలు, ఐపీఎస్ అంతకంటే పైస్థాయి అధికారులకు రూ.25 లక్షల బీమా రక్షణ అందజేస్తున్నాం అని వివ‌రించారు.

దందాగా మారిస్తే సహించం..

సంక్షేమ పథకాలను వ్యాపార దందాగా మార్చే ప్రయత్నాలను ఏమాత్రం సహించబోం. సంక్షేమ పథకాలు వాటి అసలు లక్ష్యానికి అనుగుణంగా అమలయ్యేలా ప్రతి ఒక్కరూ నైతిక విలువలను పాటించాలి. కొద్దిమంది స్వార్థ ప్రయోజనాల కోసం వ్యవహరిస్తే వేలాది మంది పోలీసు కుటుంబాలు నష్టపోయే పరిస్థితి వ‌స్తుంది అని డీజీపీ ఆందోళన వ్యక్తం చేశారు.

బ‌డ్జెట్‌ను పెంచాలి..

పోలీసు క్యాంటీన్లు, కమర్షియల్ కాంప్లెక్స్‌లు తదితర వనరుల ద్వారా వచ్చే ఆదాయాన్ని యంగ్ ఇండియా పోలీస్ స్కూల్, పోలీసు పిల్లల విద్య, సివిల్స్, గ్రూప్స్ కోచింగ్, స్కాలర్‌షిప్‌లు, వివాహ సహాయం తదితర సంక్షేమ కార్యక్రమాలకు వినియోగించాలని డీజీపీ ఆనంద్‌ ఆదేశించారు. ఈ పథకాల అమలుకు అవసరమైన బడ్జెట్‌ను మరింత పెంచాలని అధికారులను ఆదేశించారు.

టెక్నాలజీ వినియోగాన్ని పెంచుదాం..

సంక్షేమ, ఆరోగ్య భద్రత విభాగాల్లో టెక్నాలజీ వినియోగాన్ని విస్తృతంగా పెంచాలని డీజీపీ సూచించారు. సంక్షేమ పథకాల లబ్ధిదారుల వివరాలు, నిధుల సమీకరణ, వినియోగం, సేవల అమలు వంటి అన్ని అంశాలను సమగ్ర ఆన్‌లైన్ వ్యవస్థలో నమోదు చేసే విధంగా డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ను రూపొందించాలని ఆదేశించారు. వెల్ఫేర్ సేవలను పూర్తిగా డిజిటలైజ్ చేసి పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంపొందించాలని సూచించారు. హోదాల వారీగా వెల్ఫేర్ కమిటీలను ఏర్పాటు చేయాలన్నారు. శాఖకు చెందిన కమర్షియల్ కాంప్లెక్స్‌ల అద్దె రేట్లను పారదర్శకంగా నిర్ణయించి, సిబ్బందికి, ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా లీజుకు ఇవ్వాలన్నారు. శాఖ వనరులను సమర్థంగా వినియోగించి సంక్షేమ కార్యక్రమాలకు అదనపు ఆదాయ వనరులు సమకూర్చాలని ఆదేశించారు.

సంక్షేమ కార్యక్రమాలపై సంబంధిత అధికారులు డీజీపీకి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరాలు అందజేశారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులను డీజీపీ ఆదేశించారు.

ఈ సమావేశంలో డీజీ (లా అండ్ ఆర్డర్) మహేష్ ఎం. భగవత్, ఏడీజీ సంజయ్ జైన్, ఐజీ (మల్టీజోన్-2) షహనవాజ్ ఖాసిం, ఐజీ (ప్రొవిజన్ అండ్ లాజిస్టిక్స్) గజరావు భూపాల్, పోలీస్ వెల్ఫేర్, ఆరోగ్య భద్రత కార్యదర్శి ఉదయ్ కుమార్ రెడ్డి, ఫైనాన్స్ అడ్వైజర్ శరత్ కుమార్, తెలంగాణ పోలీస్ అసోసియేషన్ ప్రతినిధులు గోపీ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డితో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement