త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR | అదే జరిగితే తెలంగాణ ఉద్యమానికి మించి మరో జల ఉద్యమం పుట్టుకొస్తుంది

కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ నీటి హక్కులను తాకట్టు పెడుతోందని, అన్యాయం జరిగితే మరో మహా ఉద్యమం తప్పదని కేటీఆర్ ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరించారు.

J

Telangana | Published On Aug 8, 2026, 5.57 pm IST

KTR | అదే జరిగితే తెలంగాణ ఉద్యమానికి మించి మరో జల ఉద్యమం పుట్టుకొస్తుంది

సంక్షిప్త సారాంశం

కృష్ణా, గోదావరి జలాల (GRMB) విషయంలో తెలంగాణకు నష్టం జరిగే ఎజెండాను అంగీకరిస్తే మరో భారీ జల ఉద్యమం తప్పదని కేటీఆర్ హెచ్చరించారు. ఏపీకి అనుకూలంగా వ్యవహరించే ఆదిత్యనాథ్ దాస్‌ను రాష్ట్ర సలహాదారుగా పెట్టుకోవడంపై మండిపడ్డారు. హైడ్రా (HYDRA) పేరుతో పేదల ఇళ్లను కూలగొట్టి, ఆ 2500 ఎకరాలను పెద్దలకు కట్టబెడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో విద్యుత్ కోతలు విపరీతంగా ఉన్నాయని, 24 గంటల కరెంట్ ఎక్కడ ఇస్తున్నారో సబ్-స్టేషన్ వద్దకు వచ్చి నిరూపించాలని సవాల్ విసిరారు.

Advertisement
  • జల దోపిడీకి కాంగ్రెస్ సర్కార్ సై
  • రేవంత్ రెడ్డి తీరుపై కేటీఆర్ ఫైర్

KTR | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణ జల హక్కులు, వ్యవసాయ కరెంట్ కోతలు, హైడ్రా (HYDRA) కూల్చివేతలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR).. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జీఆర్ఎంబీ (GRMB) సమావేశాల నుంచి రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాల వరకు పలు కీలక అంశాలపై శనివారం మీడియాతో జరిపిన 'చిట్ చాట్'లో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

నీటి హక్కులపై రాజీ పడితే మహా ఉద్యమమే..

రాష్ట్ర జల ప్రయోజనాలకు నష్టం కలిగించేలా ఉన్న జీఆర్ఎంబీ ఎజెండాపై సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రజలకు సమాధానం చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఆ ఎజెండాను ఒప్పుకుని మీటింగ్‌కు ఎలా హాజరవుతారని ప్రశ్నించారు. ఒకవేళ కేంద్ర ప్రభుత్వంతో చేతులు కలిపి తెలంగాణకు నీటి వాటాల్లో అన్యాయం చేస్తే మాత్రం.. రాష్ట్రంలో మలిదశ ఉద్యమాన్ని మించిన మరో 'జల ఉద్యమం' పుట్టుకొస్తుందని హెచ్చరించారు. తెలంగాణ నీటి హక్కులను కాపాడటమే తమ పార్టీ మొదటి ప్రాధాన్యత అని స్పష్టం చేశారు.

ఏపీ నేతల డైరెక్షన్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తిగా చంద్రబాబు కనుసన్నల్లోనే పనిచేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. ఒకప్పుడు తెలంగాణకు బద్ధ వ్యతిరేకిగా పనిచేసిన ఆదిత్యనాథ్ దాస్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం సలహాదారుగా పెట్టుకోవడం సిగ్గుమాలిన చర్య అని విమర్శించారు. పక్క రాష్ట్రం మన నదుల నుంచి నీళ్లు ఎత్తుకుపోతున్నా.. ముఖ్యమంత్రికి కనీస సోయి లేదని, పంపులు ఎప్పుడు ఆన్ చేయాలో కూడా తెలియని పరిస్థితిలో సీఎం ఉన్నారని ఎద్దేవా చేశారు. యాగాలు చేయడం తప్పుకాదని, కానీ దానితో పాటు రైతుల కష్టాలను కూడా పట్టించుకోవాలని హితవు పలికారు.

కరెంట్ కోతలు, క్షుద్ర రాజకీయాలు..

రాష్ట్రంలో రైతులకు 24 గంటల కరెంట్ ఇస్తున్నామని కాంగ్రెస్ మంత్రులు అబద్ధాలు చెబుతున్నారని.. రోజుకు 5 నుంచి 6 సార్లు కరెంట్ కోతలు (Power cuts) ఉంటున్నాయని కేటీఆర్ మండిపడ్డారు. ఏ సబ్-స్టేషన్ (Sub-station) వద్దకైనా వచ్చి వాస్తవాలు చూసేందుకు తాను సిద్ధమని సవాల్ విసిరారు. దేవుడి గుడికి వెళ్తే క్షుద్రపూజలు అని ప్రచారం చేస్తున్నారని.. మేడిగడ్డ లాంటి ప్రాజెక్టులను డ్యామేజ్ చేసి లబ్ధి పొందాలని చూసిన కాంగ్రెస్ పార్టీకి క్షుద్ర రాజకీయాలు బాగా తెలుసని కౌంటర్ ఇచ్చారు.

హైడ్రాతో పేదల ఇళ్లపై దాడి..

హైడ్రా (HYDRA) విషయంలో హైకోర్టు చేసిన వ్యాఖ్యలు ముఖ్యమంత్రి అసమర్థతకు.. వైఫల్యానికి నిదర్శనమని కేటీఆర్ దుయ్యబట్టారు. న్యాయస్థానాలు చెప్పినా విననని రేవంత్ హిట్లర్‌లా ప్రవర్తిస్తూ రాజ్యాంగ వ్యవస్థలను తుంగలో తొక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో తమ ప్రభుత్వ హయాంలో ప్రజలను విపత్తుల నుంచి కాపాడేందుకు ఈవీడీఎం (EVDM) వ్యవస్థను తీసుకువస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం దాని పేరును హైడ్రాగా మార్చి విధ్వంసం సృష్టిస్తోందని ఆరోపించారు. "హైడ్రా పేరుతో పేదవాళ్లను కొట్టి.. 2500 ఎకరాల భూమిని లాక్కొని పెద్దవాళ్లకు అమ్ముకునే కుట్ర జరుగుతోంది. మా హయాంలో 58 జీవో కింద లక్షలాది మందికి పట్టాలు ఇస్తే.. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కరికైనా పట్టా ఇచ్చిందా? పైగా వేలాది మంది పేదల ఇళ్లను కూలగొట్టారు" అంటూ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement
Advertisement