త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR | గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మళ్లీ గెలుస్తాం: కేటీఆర్‌

KTR | హైదరాబాద్‌–రంగారెడ్డి–మహబూబ్‌నగర్‌ గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ విజయం ఖాయమని ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ధీమా వ్యక్తం చేశారు. సిట్టింగ్‌ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు పార్టీకి అన్ని రకాల అనుకూల పరిస్థితులు ఉన్నాయని అన్నారు.

P

Telangana | Published On Sep 28, 2026, 8.45 pm IST

KTR | గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మళ్లీ గెలుస్తాం: కేటీఆర్‌
Advertisement

KTR | హైదరాబాద్‌–రంగారెడ్డి–మహబూబ్‌నగర్‌ గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ విజయం ఖాయమని ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ధీమా వ్యక్తం చేశారు. సిట్టింగ్‌ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు పార్టీకి అన్ని రకాల అనుకూల పరిస్థితులు ఉన్నాయని అన్నారు. త్వరలో రెండు గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో హైదరాబాద్‌, ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాల నేతలతో తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌ సమావేశమయ్యారు. గతంలో హైదరాబాద్‌–రంగారెడ్డి–మహబూబ్‌నగర్‌ స్థానం నుంచి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుమార్తె వాణీదేవిని బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా నిలబెట్టి ఘన విజయం సాధించామని కేటీఆర్‌ గుర్తుచేశారు. పార్టీ నేతలంతా ప్రణాళికాబద్ధంగా సమష్టిగా పనిచేయడం వల్లే ఆ విజయం సాధ్యమైందన్నారు. ఈసారి కూడా అదే స్ఫూర్తితో పనిచేయాలని సూచించారు.

ఓటరు నమోదుపై ప్రత్యేక దృష్టి

గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటరు నమోదు ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని కేటీఆర్‌ పిలుపునిచ్చారు. ఆయా జిల్లాల పరిధిలోని అర్హులైన పట్టభద్రులందరూ ఓటర్లుగా నమోదు అయ్యేలా చర్యలు చేపట్టాలని సూచించారు. పార్టీ నేతలు తమ కుటుంబ సభ్యులతోపాటు అర్హులైన ప్రతి పట్టభద్రుడి ఓటు నమోదుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు. పార్టీ తరఫున ఎవరు పోటీ చేసినా.. అభ్యర్థి కంటే ముందే పక్కా ప్రణాళికతో ఓటరు నమోదును పూర్తి చేయాలని, ఎన్నికల్లో విజయం కోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాలని కేటీఆర్‌ సూచించారు.

బీజేపీకి యువత దూరం..

దేశవ్యాప్తంగా బీజేపీ గ్రాఫ్‌ వేగంగా తగ్గుతోందని కేటీఆర్‌ అన్నారు. యువత ఆ పార్టీకి దూరమైందనే ఆందోళన బీజేపీ అగ్రనేతల్లోనూ ఉందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌పై ప్రజల్లో వ్యతిరేకత తారస్థాయికి చేరిందన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌ అనే రెండు ఢిల్లీ పార్టీలపై యువతలో తీవ్ర అసంతృప్తి ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు రేవంత్‌ సర్కారుపై ఆగ్రహంతో ఉన్నారని, నిరుద్యోగుల్లోనూ తీవ్ర అసంతృప్తి నెలకొందని కేటీఆర్‌ అన్నారు. వెయ్యి రోజుల పాలన పూర్తి చేసుకున్న ప్రభుత్వంపై విద్యావంతులు తీవ్రంగా స్పందిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఈ పరిస్థితులు బీఆర్‌ఎస్‌కు అనుకూలంగా మారుతున్నాయని చెప్పారు.

రెండు ఎమ్మెల్సీ స్థానాల్లోనూ గెలుస్తాం..

హైదరాబాద్‌–రంగారెడ్డి–మహబూబ్‌నగర్‌తో పాటు వరంగల్‌, ఖమ్మం, నల్లగొండ గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ స్థానాల్లోనూ బీఆర్‌ఎస్‌ గెలుపుపై పార్టీ నేతలు ధీమాతో ఉన్నారని కేటీఆర్‌ తెలిపారు. రెండు రోజుల క్రితం ఆయా జిల్లాల నేతలతో నిర్వహించిన సమావేశంలోనూ ఇదే విశ్వాసాన్ని వ్యక్తం చేశారని చెప్పారు. రెండు గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ స్థానాల్లోనూ బీఆర్‌ఎస్‌ విజయం సాధించే అవకాశం ఉందని కేటీఆర్‌ పేర్కొన్నారు. ఓటరు నమోదును ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని పార్టీ శ్రేణులంతా సమష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు.

Advertisement
Advertisement