Telangana Section 22A Land Issues | 22-ఏ పొరపాటు కాదు.. ఉద్దేశపూర్వకమే!
22-ఏ నిషేధిత జాబితాలో ఉన్న ప్లాట్లు, ఇళ్లను రిజిస్ట్రేషన్ చేయవచ్చన్న ప్రభుత్వ మెమోపై తీవ్ర ఆందోళనలు! అసలు జాబితా నుంచి తొలగించకుండా చేసే రిజిస్ట్రేషన్లు చెల్లుతాయా?
సంక్షిప్త సారాంశం
జీహెచ్‌ఎంసీ, హెచ్ఎండీఏ, డీటీసీపీ అనుమతులున్న ఆస్తులు 22-ఏలో ఉన్నప్పటికీ రిజిస్ట్రేషన్లు చేయవచ్చంటూ ప్రభుత్వం సీసీఎల్‌ఏ ద్వారా మెమో (నెం. 47934/2026) జారీ చేసింది. రిజిస్ట్రేషన్ చట్టం ప్రకారం ప్రాథమికంగా 22-ఏ జాబితా నుంచి సర్వే నంబర్లను డీనోటిఫై చేయకుండా చేసే సేల్‌డీడ్‌లు కోర్టుల్లో, బ్యాంకు మార్ట్‌గేజ్‌లలో నిలబడవని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. సర్కారు రికార్డుల ప్రకారం 22-ఏలో 1.25 కోట్ల ఎకరాలు ఉండాల్సి ఉండగా, ప్రస్తుతం 99 లక్షల ఎకరాలే ఉన్నాయని.. ప్రైవేట్ పట్టా భూములు ఈ జాబితాలోకి ఎలా చేరాయనే దానికి ప్రభుత్వం బదులివ్వడం లేదు. గంపగుత్తగా సర్వే నంబర్లను నిషేధిత జాబితాలో పెట్టడం వల్ల నెలకు వందలాది పిటిషన్లు కోర్టులకు చేరుతున్నాయి; సబ్-డివిజన్ సర్వేలు చేయడమే దీనికి ఏకైక శాశ్వత పరిష్కారం.
Telangana Section 22A Land Issues | త్రినేత్ర న్యూస్ : ఏదేని ఒక భూ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలంటే.. ప్రభుత్వాలు, రెవెన్యూ పరిపాలన వ్యవస్థలు శాశ్వతమైన, పారదర్శకమైన, నిర్ధిష్టమైన మార్గాలను ఆన్వేశించాలి. ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించాలనే బలమైన రాజకీయ సంకల్పం ప్రభుత్వానికి ఉండాలి. కానీ రెండు రోజుల కిందట 22-ఏ సమస్య పరిష్కారానికి మార్గం సుగుమం అంటూ సాక్షాత్తు రెవెన్యూ శాఖ మంత్రి విడుదల చేసిన ప్రకటనతో ప్రజా ప్రభుత్వం అని చెప్పుకుంటున్న ఈ ప్రభుత్వానికి 22-ఏ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలనే సోయిలేదని తేలిపోయింది. ప్రజల ఆస్తులకు రక్షణ లేదని నిర్ధారణ అయ్యింది. రేవంత్ ప్రభుత్వంపై 22-ఏ బాదితుల ఆశలు పటాపంచలయ్యాయి. చట్టాన్ని అమలు చేయాల్సిన ప్రభుత్వమే చట్ట విరుద్దంగా ప్రకటనలివ్వడం, మేమో జారీ చేయడం వెనుకున్న మతలబు ఏమిటో అంతు చిక్కడం లేదు. ఇంతకు రెవెన్యూ మంత్రి చేసిన ప్రకటనలో ఏం చెప్పారంటే..? సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రజల ఆస్తులు రిజిస్ట్రేషన్ నిషేధిత జాబితాలో ఉన్నప్పటికీ జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, సీఎంసీ, ఎంఎంసీ, డీటీసీపీ, మున్సిపల్ అనుమతులున్న ఇళ్లు, ప్లాట్లు, ఫ్లాట్లను రిజిస్ట్రేషన్ చేస్తారని రెవెన్యూ మంత్రి ప్రకటన ఉద్దేశం. ఇది ఫాస్ట్‌ట్రాక్ పరిష్కారం అని రెవెన్యూ శాఖ మంత్రి నిర్లజ్జగా ప్రకటించారు. సదరు మంత్రి జారీ చేసిన ప్రకటనలోని అంశాలతోనే సీసీఎల్ఏ కమిషనర్ కూడా ప్రభుత్వ అధికారిక వర్గాలకు ఒక మెమో (నెంబర్.47934\2026)జారీ చేశారు. మంత్రి ప్రకటనతో 22-ఏ సమస్య పూర్తిగా సమసిపోయిందన్నట్లుగా మీడియా సంస్థలు ప్రముఖంగా ప్రచురించాయి. "తలకు దెబ్బ తగిలితే మోకాలికి చికిత్స చేసినట్టుషగా ఉంది ప్రజా ప్రభుత్వ వ్యవహారం. కేవలం ప్రభుత్వ ఆస్తులు మాత్రమే ఉండాల్సిన 22-ఏలో ప్రజల ప్రైవేటు ఆస్తులు ఎందుకు నమోదు అయ్యాయి ? ఎవ్వరు నమోదు చేశారు ? అనే అంశంపై మాత్రం ప్రభుత్వ పెద్దలెవ్వరూ నోరు మెదపడం లేదు. అధికారులు ప్రజలకు స్పష్టత ఇవ్వడం లేదు. కానీ రిజిస్ట్రేషన్ నిషేధిత జాబితాలో ఉన్న స్థిర ఆస్తులపై చేసే సేల్‌డీడ్‌లు, అగ్రిమెంట్లు న్యాయస్థానాల్లో, బ్యాంకు మార్టిగేజీలలో చెల్లుబాటు అవుతాయా..? ఆ ఆస్తులకు మార్కెట్ విలువ వర్తిస్తుందా..? అనేది 22-ఏ బాదితుల నుంచే కాదు, సాక్షాత్తు సబ్ రిజిస్ట్రార్ల నుంచి ఉత్పన్నమైతున్న ప్రశ్న.
ప్రభుత్వ వత్తిడి మేరకు 22-ఏ జాబితా నుంచి ప్రైవేటు ఆస్తులను రిజిస్ట్రేషన్ చేసి సేల్‌డీడ్‌లు విడుదల చేసినప్పటికీ, 22-ఏ చట్టం నిబంధనల ప్రకారం ఈ డాక్యమెంట్లు చెల్లుబాటు కావనేది నర్మగర్భం. వాస్తవానికి సెక్షన్-22-(ఏ)కు సంబంధించి ఐదు క్లాజులున్నాయి. ఇందులో మొదటగా సెక్షన్ 22-ఏ (ఎ)లో అసైన్డ్ ల్యాండ్స్, ఏజెన్సీ ప్రాంతాలలోని (1) ఆఫ్ 7 షెడ్యూల్డ్ భూములు ఉంటాయి. సెక్షన్ 22-ఏ1(బి)లో ప్రభుత్వ భూమలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఆస్తులు, మిలటరీ, రక్షణశాఖ, ఆటవీ భూములుంటాయి. సెక్షన్ 22-ఏ1(సీ)లో దేవాదాయశాఖ, వక్స్ భూములు ఉంటాయి. సెక్షన్ 22-ఏ1(డీ)లో సీలింగ్, సర్‌ప్లస్ (మిగులు) భూములు, సెక్షన్ 22-ఏ1(ఇ)లో ప్రజాప్రయోజనకర భూములు లేదా ఆస్తులు, ఎయిడెడ్ పాఠశాలలు, బ్యాంకులు, కోర్టు జప్తులో ఉన్న ఆస్తులు ఉండాలి. వీటన్నింటిని రిజిస్ట్రేషన్ చేయడానికి వీలుండదు. ఈ ఐదు క్లాజులలోని భూములను మాత్రమే 22-ఏ (రిజిస్ట్రేషన్ నిషేధిత జాబితా)లో చేర్చుతారు. ఈ జాబితా రూపొందించడానికి ముందు చాలా కసరత్తు జరుగుతుంది. మొదటగా గ్రామ నక్షను (సేత్వార్) ప్రకారం రూపొందించిన రెవెన్యూ రికార్డులలోని భూముల వివరాలను పరిశీలించి పట్టా (ప్రైవేటు), ప్రభుత్వ భూముల వివరాలను ఎండోమెంట్, ఫారెస్ట్, రక్షణ శాఖలతో పాటు ఇతర శాఖల ఆదీనంలోని భూముల వివరాలను సేకరించి 22-ఏలో చేర్చాల్సిన సర్వే నెంబర్ల వివరాలను స్థానిక తహసీల్దార్ ఆర్డీవో, అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) అనుమతితో జిల్లా కలెక్టర్‌కు నివేదిస్తారు. అనంతరం జిల్లా కలెక్టర్ పుఃనపరిశీలించి సీసీఎల్ఏ కమిషనర్‌కు పంపుతారు. రిజిస్ట్రేషన్ నిషేధిత జాబితాపై సంబంధిత జిల్లా కలెక్టర్ డిజిటల్ సిగ్నేచర్ తప్పనిసరి ఉండాలి. ఆ తర్వాత సీసీఎల్ఏ కమిషనర్ రెవెన్యూ సెక్రటరీ, రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ, రెవెన్యూ మంత్రి, ముఖ్యమంత్రి అనుమతి పొందిన తర్వాత ప్రభుత్వ ఆస్తులకు సంబంధించిన సర్వే నెంబర్లను, భూ విస్తీర్ణంతో సహా రాష్ట్ర స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ ఐజీకి అధికారికంగా 22-ఏ వివరలతో కూడిన నివేదికను అందిస్తారు. ఐజీ రిజిస్ట్రేషన్ శాఖకు చెందిన కంప్యూటర్ ఎయిడెడ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్(కార్డ్) వెబ్ కు అనుసంధానం చేస్తారు. ఇది భూపరిపాలన వ్యవహారంలో నింతరం జరిగే ప్రక్రియ. అయితే ఇంత పెద్ద పరిపాలన పరమైన వ్యవహారం ఒక క్లిక్ తో జరుగుతుందా ..? అనేది ప్రజలు ఆలోచించాలి. అలాగే అధికారుల తప్పిదంతోనే ప్రజల ఆస్తులు నిషేధిత జాబితాలో చేరాయని గతంలో ఇదే రెవెన్యూ శాఖ మంత్రి మీడియా సాక్షిగా ప్రకటించారు. ఆ తప్పు చేసిన అధికారి ఎవ్వరు ? ఎవ్వరి వత్తిడి మేరకు అలా చేశారు..? అతనిపై ప్రభుత్వం చర్యలు తీసుకుందా..? ఒకవేల తీసుకోకుంటే నేటి వరకు ఎందుకు నిర్ణయం తీసుకోలేదు..? నిజాం కాలం నుంచి పట్టా భూములుగా ఉన్న ప్రజల ఆస్తులు రాత్రికి రాత్రి నిషేధిత జాబితాలో ఎవ్వరు పెట్టారు ? ఎందుకు పెట్టారు ? ఒకవేల ప్రభుత్వం చెప్తున్నట్లుగా పొరపాటున జరిగిన తప్పున సవరించి 22-ఏలో చేర్చిన ప్రైవేటు స్థిర ఆస్తులకు విముక్తి కల్పించాలి. కానీ 22-ఏలో ఉన్నప్పటికీ రిజిస్ట్రేషన్లు చేయడం ఏమిటి ? అధికారులు పొరపాటుతో చేర్చిన ఆస్తులను ప్రభుత్వమే బేషరతుగా విడుదల చేయకుండ అధికారుల కమిటీకి ఆర్జీ పెట్టుకోవాలని చెప్పడం సబబు అవుతుందా..?
తెలంగాణా రాష్ట్రం లో 22-ఏ లో ఉండాల్సిన భూమి కోటి 25 లక్షల ఎకరాలు. ఇప్పుడు ఉన్నది 99 లక్షల ఎకరాలే అని ముఖ్యమంత్రి చెప్తున్నారు కానీ అటవీ, ప్రభుత్వ, అసైన్మెంట్, భూదాన్, వాటర్ బాడీస్, ఎండోన్మెంట్, వక్ఫు భూములు ఉండాల్సిన 22A లో ప్రైవేటు ఆస్తులు, పట్టా భూములు ఎలా చేరాయి అనేది మాత్రం చెప్పడం లేదు.
22 ఏ లో ఉండాల్సిన భూమి ఉండకపోతే ప్రభుత్వానికి, ప్రజల ఆస్తులకు నష్టం జరుగుతుంది. 22-ఏ ప్రైవేటు ఆస్తులుండటం వలన ప్రజల ఆస్తులకు హక్కులు లేకుండా పోతున్నాయి. అందుకే ఈ రెండు సమస్యలు ఎందుకు వచ్చాయి? ఎప్పుడు వచ్చాయి? ఏ విధంగా పరిష్కారం కావాలి? అనే అంశాలపై లోతైన చర్చ జరిగి, ఈ రెండు సమస్యలకు సత్వర, శాశ్వత పరిష్కారం దొరుతుకుంది కానీ ప్రకటనలతో కాదు అనే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తిస్తే ప్రజలకు మేలు జరుగుతుంది. లేదంటే ఆ ప్రజలే ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపడం ఖాయం.
ప్రభుత్వ, వివాదాస్పద భూములపై రిజిస్ట్రేషన్ లకు కట్టడి చేసేందుకు, ప్రైవేట్ పట్టా భూముల క్రయవిక్రయాలలో అక్రమాలు జరుగకుండా నివారించేందుకు 22-ఏ (రిజిస్ట్రేషన్ నిషేధిత భూముల జాబితా) రికార్డు అత్యంత పక్కగా, పారదర్శకంగా ఉండాలి. కానీ తెలంగాణలో 22-ఏ రికార్డు అత్యంత లోపభూయిష్టంగా ఉందని ప్రజలు చెప్పడమే కాదు, నాటి నాటి రాజశేఖర్ రెడ్డి, కేసీఆర్ ప్రభుత్వాల నుంచి నేటీ రేవంత్ ప్రభుత్వం వరకు బహిరంగంగా ఒప్పుకున్న నిజం. నిషేధిత జాబితాలో చేర్చాల్సిన భూములకు సంబంధించిన వివరాలను రెవెన్యూతో పాటు ఆయా శాఖల అధికారులు క్రమం తప్పకుండ రిజిస్ట్రేషన్ శాఖకు పంపాలి. కానీ రెవెన్యూ, ఎండోమెంట్, అటవీ వక్ఫు తదితర శాఖలలో భూ రికార్డుల నిర్వహణ, ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం అత్యంత లోపభూయిష్టంగా ఉందనేది బహిరంగ రహస్యం. దీంతో రెవెన్యూ అధికారులు నిషేధిత స్థలాల జాబితాలో పంపే వివరాలు, తప్పుల తడకలా ఉండటంతో రిజిస్ట్రేషన్ శాఖలో కొందరు అక్రమార్కులకు ఈ వ్యవహారం వరంగా మారుతుంది. హద్దులు పద్దులు లేకుండా గంపగుత్తగా ఇస్తున్న వివరాలు ఆస్తులను అమ్మేవారికి, కొనే వారికి శాపంగా మారుతున్నాయి. ఏదైనా తప్పు జరిగితే ఆ పాపం తమది కాదని రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖల అధికారులు చేతులెత్తేస్తుండటంతో విలువైన భూములను కొనుగోలు చేసిన ప్రజలు కోర్టుల చుట్టూ తిరగాల్సిన దుస్థితి దాపురించింది.
22-ఏ రికార్డును సవరించాలనే ప్రతిపాధనలు ప్రతి ప్రభుత్వంలోను జరిగాయి. 2005-06లో రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం ప్రయోగాత్మకంగా హైదరాబాద్ జిల్లాలో 22-ఏ సవరణలో భాగంగా ల్యాండ్ సర్వే నిర్వహించారు. కానీ టౌన్ సర్వేలో సర్వే నెంబర్ల ఓవర్ ల్యాపింగ్ సమస్య ఉత్పన్నం కావడంతో పెద్దఎత్తున రాజకీయ దుమారం లేవడంతో ఆ వ్యవహారంను అంతటితోనే నిలిపివేశారు. తదనంతరం కేసీఆర్ ప్రభుత్వం కూడా యావత్తు తెలంగాణ భూభాగాన్ని సర్వే చేసి రెవెన్యూ రికార్డులను క్రమబద్దీకరించడంతో పాటు అత్యంత పటిష్టంగా 22-ఏ రికార్డును రూపొందించి ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను సంరక్షించాలని ఆదేశించడంతో పాటు రూ.400 కోట్లను సర్వే అండ్ ల్యాండ్ రికార్డుల శాఖకు విడుదల చేశారు. సర్వే ఏజెన్సీల నుంచి టెండర్లను ఆహ్వానించారు. ఏమి జరిగిందో తెలియదు కానీ.. అది పట్టాలెక్కలేదు. 22-ఏ రికార్డు నిర్ధష్టంగా లేనప్పుడు ప్రభుత్వ భూములు పట్టా భూములుగా, పట్టా భూములు ప్రభుత్వ భూములగా రిజిస్ట్రేషన్లు జరగడం శరమామూలే. కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఉడిపోయిన చందంగా ప్రభుత్వ, దేవాదాయ, వక్ఫ్, ఎండోమెంట్, యుఎల్సీ, భూదాన్, ఫారెస్ట్ తదితర శాఖల ఆధీనంలోని ప్రభుత్వ ఆస్తులపై యధేచ్చగా రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి.
సెక్షన్ 22-ఎ కింద భూముల రిజిస్ట్రేషన్లపై నెలకొన్న వివాదాలపై సివిల్ కోర్టులలో రికార్డు స్థాయిలో రిట్లు దాఖలైతున్నాయి. నెలకు సుమారు ఎనమిది వందల నుంచి వెయ్యి కేసుల వరకు 22-ఏ బాదితుల కేసులు నమోదవుతున్నాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వ భూములను రిజిస్ట్రేషన్ చేస్తున్నారని కొందరు, తమ పట్టా భూములను కూడా సర్కార్ భూముల ఖాతాలో చేర్చి రిజిస్ట్రేషన్ చేయడం లేదని, పోజీషన్‌లో ఉన్నా..పట్టాదారు పాసుపుస్తకాలున్నా గానీ నిషేధిత జాబితాలో చేర్చారని మరికొందరు సివిల్ కోర్టులను ఆశ్రయిస్తున్నారు. దీంతో 2014-15లో హైకోర్టు విస్తృత ధర్మాసనం ప్రభుత్వానికి 22-ఏపై కొన్ని నిర్దిష్టమైన సూచనలు చేసింది. ఈ వివాదాలకు తెరదించడానికి సెక్షన్-22-ఏలో తలెత్తుతున్న ఫిర్యాదులను పరిష్కరించేందుకు ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. కానీ కోర్టు ఆదేశాలను నాటి, నేటి ప్రభుత్వాలు నిర్లక్ష్యంను కొనసాగిస్తున్నాయి.
1954-55 ఖాస్రా పహానిని రిజిస్ట్రేషన్, రెవెన్యూ అధికారులు ప్రామాణికంగా తీసుకుంటారు. కానీ ఖాస్రా పహాణీలో పట్టాభూములుగా ఉన్నా ఆ తర్వాతి క్రమంలో ఖారిజ్ ఖాతా(సర్కార్ ఖాతాలో) చేరాయి. ఉదాహరణకు గచ్చిబౌలిలోని ఓ సర్వే నెంబర్లో ఒక ఎకరా ప్రభుత్వ భూమి ఉంది అని రెవెన్యూ అధికారులు రిజిస్ట్రేషన్ శాఖకు పంపుతున్నారు. ఆ భూములు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉందనే హద్దులను పేర్కొనడం లేదు. దాని కంటూ ఒక లెక్క ఉండదు. తీరా కొనుగోలు దారులు, అమ్మకందారులు రిజిస్ట్రేషన్ కు వెళ్లే సరికి మీది 22-ఏలో ఉందని అధికారులు చేతులెత్తేస్తున్నారు. ఫలానా సర్వేనెంబర్లో ఇంత ప్రభుత్వభూమి అని గంపగుత్తగా గాలికి చెప్పే లెక్కలు కాకుండ.. మొత్తం సర్వేనెంబర్లో ప్రభుత్వ భూమి ఎంత వరకు ఉందనేది తేల్చి దానికి సబ్ డివిజన్ నెంబర్ ఇస్తేనే 22 (ఏ) అనేది సంపూర్ణంగా అమలు జరుగుతుందని సీనియర్ అధికారులు సూచిస్తున్నారు. 22 (ఏ) సవరణతో పాటు పొరపాట్లకు అధికారులను బాధ్యులుగా చేర్చితే రిజిస్ట్రేషన్, రెవెన్యూశాఖతో పాటు ఇతర శాఖల అధికారులపై కూడా బాధ్యత మరింత పెరుగుతుందని రెవెన్యూ నిపుణుల అభిప్రాయం. అలాగే ప్రభుత్వ శాఖల వెబ్ ల్యాండ్లలోని వివరాలను రిజిస్ట్రేషన్ శాఖ వెబ్సైట్ తో అనుసంధానం చేయడం ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం అని గతంలో అధికారులు నిర్ణయించారు. అయితే ఈ ప్రక్రియ ముందుకు సాగలేదు. రిజిస్ట్రేషన్ చట్టం 1908లోని సెక్షన్ 22 (ఎ) కు సంబంధించి వివాదాలు తలెత్తడానికి ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపం ప్రధాన కారణంగా చెప్పవచ్చు. ప్రస్తుతం సెక్షన్ 22 (ఏ)ప్రకారం నిషేధిత భూముల జాబితాను రిజిస్ట్రేషన్ శాఖకు చెందిన వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతున్నారు. కానీ వివిధ శాఖలు ఎప్పటికప్పుడు అప్డేట్ జాబితా ఇవ్వక పోవడం వల్ల గందరగోళ పరిస్థితులు నెలకొంటున్నాయి. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ భూముల పర్యవేక్షణ సక్రమంగా లేని కారణంగా ప్రభుత్వ భూములపై పట్టణ ప్రాంతాల్లో యదేచ్చగా క్రయ విక్రయాలు జరుగుతున్నాయి. ప్రభుత్వ భూముల ల్యాండ్ బ్యాంక్‌పై జిల్లా కలెక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహారిస్తున్నారు.

బూడిద సుధాకర్
ఫ్రీలాన్స్ జర్నలిస్టు
కాంటాక్టు నెంబర్ 7680992342
తాజావార్తలు
- ●OTT | డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజైన మౌనీరాయ్ బాలీవుడ్ బోల్డ్ మూవీ - రెడ్‌లైట్ ఏరియా కథలతో...
- ●Padi Kaushik Reddy Expulsion | కౌశిక్‌పై వేటు.. అంత సులువేం కాదు
- ●Samantha | జిమ్‌కు "నో" బ్రేక్ - బేబీ బంప్‌తో సమంత వర్కవుట్స్
- ●Countries Where Divorce Is Illegal | ఈ రెండు దేశాల్లో విడాకులు తీసుకోవడం నేరం
- ●TTD | నవరాత్రి బ్రహ్మోత్సవాలకు టీటీడీ పక్కా ప్లాన్..!
- ●Debjani Modak | బిగ్‌బాస్ బ్యూటీ దేబ్జానీ మోదక్ చేసిన తెలుగు సీరియల్స్ ఇవే

OTT | డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజైన మౌనీరాయ్ బాలీవుడ్ బోల్డ్ మూవీ - రెడ్‌లైట్ ఏరియా కథలతో...

Padi Kaushik Reddy Expulsion | కౌశిక్‌పై వేటు.. అంత సులువేం కాదు

Samantha | జిమ్‌కు "నో" బ్రేక్ - బేబీ బంప్‌తో సమంత వర్కవుట్స్

Countries Where Divorce Is Illegal | ఈ రెండు దేశాల్లో విడాకులు తీసుకోవడం నేరం



