త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Padi Kaushik Reddy Expulsion | కౌశిక్‌పై వేటు.. అంత సులువేం కాదు

హుజూరాబాద్‌లో ఉపఎన్నిక రాబోతోందంటూ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు! ఎథిక్స్ కమిటీ ద్వారా పాడి కౌశిక్‌రెడ్డి సభ్యత్వం రద్దు సాధ్యమేనా? చట్టం ఏం చెబుతోంది?

J

Telangana | Published On Sep 28, 2026, 7.52 pm IST

Padi Kaushik Reddy Expulsion | కౌశిక్‌పై వేటు.. అంత సులువేం కాదు

సంక్షిప్త సారాంశం

హుజూరాబాద్ నియోజకవర్గానికి త్వరలో ఉపఎన్నిక రానుందంటూ సీఎం రేవంత్ రెడ్డి ఆఫ్ ది రికార్డుగా చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపాయి. అసెంబ్లీలో కడియం శ్రీహరితో వాగ్వాదం కేసులో ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై ఎథిక్స్ కమిటీ వేటు వేయనుందనే ప్రచారం ఊపందుకుంది. అయితే శాసనసభ సభ్యత్వాన్ని శాశ్వతంగా రద్దు చేయడం రాజ్యాంగ విరుద్ధమని బిహార్ ఎమ్మెల్సీ సునీల్ కుమార్ సింగ్ కేసులో (2025) సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. గతంలో 2018లో తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్ కుమార్‌ల సభ్యత్వ రద్దును కూడా హైకోర్టు కొట్టివేసిన విషయాన్ని న్యాయ నిపుణులు గుర్తుచేస్తున్నారు.

Advertisement
  • సభ్యత్వం రద్దు రాజ్యాంగ విరుద్ధమంటూ 2025లో తీర్పు చెప్పిన సుప్రీం కోర్టు
  • బీహార్ ఎమ్మెల్సీపై ఎథిక్స్ కమిటీ చర్యలను తప్పుబట్టిన అత్యున్నత న్యాయస్థానం
  • 2018లోనూ ఇదే తీర్పు ప్రకటించిన తెలంగాణ హైకోర్టు
  • కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ కుమార్ లపై సభ్యత్వాల రద్దును తప్పుబట్టిన సింగిల్ బెంచ్,డివిజన్ బెంచ్
  • హుజూరాబాద్ కు ఉప ఎన్నిక ఖాయమంటూ సీఎం ఆఫ్ ది రికార్డ్ కామెంట్స్
  • శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ ఎథిక్స్ కమిటీ నిర్ణయం తీసుకోనున్నదా?
  • ఆసక్తి కరంగా మారిన చర్చ

Padi Kaushik Reddy Expulsion | త్రినేత్ర న్యూస్ : త్వరలో హుజూరాబాద్ నియోజకవర్గానికి(Huzurabad Assembly Constituency) ఉప ఎన్నికలు రాబోతున్నాయంటూ సోమవారం (2026 సెప్టెంబర్ 28న) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆఫ్ ద రికార్డు గా చేసిన వ్యాఖ్యలు రాజకీయ కలకలం సృష్టిస్తున్నాయి. ఆ నియోజకవర్గపు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(Padi Kaushik Reddy)పై శాసన సభ ఎథిక్స్ కమిటీ(Telangana Ethics Committee)లో విచారణ జరుగుతున్న నేపథ్యంలో సీఎం చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. దీంతో.. పాడి కౌశిక్ రెడ్డి సభ్యత్వాన్ని రద్దు చేస్తూ ఎథిక్స్ కమిటీ నిర్ణయం తీసుకోనున్నదనే సంకేతాలు వెళ్లాయి. మరి నిజంగానే అదే జరిగితే.. ఖైరతాబాద్ (Khairatabad Assembly Constituency) లాగానే.. హుజూరాబాద్ స్థానం కూడా ఖాళీ అవుతుందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

అసలేం జరిగింది?

ఈ ఏడాది (2026) మార్చిలో బడ్జెట్ సమావేశాలు జరిగాయి. ఈ నేపథ్యంలో గనుల అక్రమాలపై మార్చి 29న చర్చ జరుగుతున్న సమయంలో.. తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకున్నది. బీఆర్ఎస్(BRS) నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి(Kadiyam Srihari) ప్రసంగాన్ని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి (Huzurabad MLA Padi Kaushik Reddy) అడ్డుకున్నారు. నువ్వు ఏ పార్టీలో ఉన్నావంటూ నిలదీశారు. అంతటితో ఆగకుండా.. దుర్భాషలాడుతూ, శ్రీహరిని అవమానపరిచేలా వ్యాఖ్యలు, సైగలు చేశారంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ప్రజాప్రతినిధి ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనగా పరిగణించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్(Telangana Speaker Gaddam Prasad Kumar), ఈ వ్యవహారాన్ని రేవూరి ప్రకాష్ రెడ్డి (Revuri Prakash Reddy) నేతృత్వంలోని ప్రివిలేజ్ అండ్ ఎథిక్స్ కమిటీకి పంపించారు. అసెంబ్లీ సీసీటీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలించిన కమిటీ కౌశిక్ రెడ్డి వివరణ కోరింది. కాగా, పూర్తి వివరణ ఇచ్చేందుకు పాడి కౌశిక్ రెడ్డి 6 వారాల గడువు కోరారు. కాగా.. కౌశిక్ రెడ్డి వివరణతో సంతృప్తి చెందకపోతే, ఆయనపై సభ్యత్వ రద్దు లేదా తీవ్రమైన క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని ఎథిక్స్ కమిటీ సిఫారసు చేసే అవకాశముందనే చర్చ జరుగుతోంది.ఇదే జరిగితే హుజూరాబాద్ నియోజకవర్గానికి కూడా బై-ఎలక్షన్ (Huzurabad By-election) తీసుకురావచ్చనేది కాంగ్రెస్ ఎత్తుగడగా కనిపిస్తోంది.

అది రాజ్యాంగ విరుద్ధం: సుప్రీం కోర్టు

ఇటువంటి వ్యవహారాల్లో తప్పుకు తగ్గట్టుగా క్రమశిక్షణ చర్యలు ఉండాలి తప్ప నేరుగా శాశ్వత బహిష్కరణ విధించడం రాజ్యాంగ విరుద్ధమంటూ 2025లో సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది. బీహార్ శాసన మండలి సభ్యుడు(Bihar MLC) ఆర్డేజీ ఎమ్మెల్సీ సునీల్ కుమార్ సింగ్ (RJD MLC Sunil Kumar Singh).. 2024లో సభలో ముఖ్యమంత్రిని ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయన ప్రవర్తనను తప్పుబడుతూ ఎథిక్స్ కమిటీ 2024 జూన్ 14న సిఫారసు చేయగానే దాన్ని బీహార్ మండలి చైర్మన్ ఆమోదించారు. సభలో ఓటింగ్ ప్రవేశపెట్టి.. మెజారిటీ ఓటింగ్ ప్రకారం ఎమ్మెల్సీ సునీల్ కుమార్ ను శాశ్వతంగా బహిష్కరించారు. తదనంతరం గెజిట్ విడుదల చేసి ఎన్నికల కమిషన్ కు లేఖ రాశారు. దీంతో ఆ ఎమ్మెల్సీ సీటు ఖాళీగా ఉందంటూ కమిషన్..ఉప ఎన్నిక కూడా నిర్వహించింది. కాగా, తనపై సునీల్ కుమార్ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

ఈ కేసులో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన్.కె.సింగ్ లతో కూడిన ధర్మాసనం చారిత్రాత్మక తీర్పునిచ్చింది. శాసనసభ తీసుకునే నిర్ణయాలకు కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో న్యాయ సమీక్ష నుంచి పూర్తి మినహాయింపు ఉండదని స్పష్టం చేసింది. తప్పుకు తగ్గట్టుగా క్రమశిక్షణా చర్యలు ఉండాలి తప్ప, నేరుగా శాశ్వత బహిష్కరణ విధించడం రాజ్యాంగ విరుద్ధమని తేల్చి, ఆయన సభ్యత్వాన్ని పునరుద్ధరిస్తూ 2025 ఫిబ్రవరి 25 తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఆర్డేడీ ఎమ్మెల్సీ తరపున రాజ్యసభ ఎంపీ, కాంగ్రెస్ నేత అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించడం గమనార్హం.

2018లో తెలంగాణలో కూడా..

2018 బడ్జెట్ సమావేశాల సందర్భంగా అసెంబ్లీలో అనుచితంగా ప్రవర్తించారనే ఆరోపణలతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి(Komatiredd Venkat Reddy), ఎస్.ఎ.సంపత్ కుమార్‌లపై(S.A.Sampath Kumar) అప్పటి ప్రభుత్వం శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ (వేటు వేస్తూ) నిర్ణయం తీసుకుంది.ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ వారు హైకోర్టును ఆశ్రయించగా, హైకోర్టు సింగిల్ బెంచ్ వారి సభ్యత్వాల రద్దును తప్పుబడుతూ, వారిపై వేటును తిరస్కరించింది. ఎమ్మెల్యేలుగా వారి సభ్యత్వాన్ని పునరుద్ధరించాలని తీర్పు ఇచ్చింది.ఎమ్మెల్యేల బహిష్కరణ రాజ్యాంగ నిబంధనలకు, అసెంబ్లీ నియమావళికి విరుద్ధంగా ఉందని కోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు వారిపై విధించిన వేటును కొట్టివేస్తూ, వెంటనే వారిని ఎమ్మెల్యేలుగా కొనసాగించాలని ఆదేశించింది.అయితే సింగిల్ బెంచ్ ఇచ్చిన ఈ తీర్పుపై అప్పటి ప్రభుత్వం/అసెంబ్లీ కార్యదర్శి హైకోర్టు డివిజన్ బెంచ్‌లో అప్పీల్ చేసినప్పటికీ, డివిజన్ బెంచ్ కూడా సింగిల్ బెంచ్ ఆదేశాలను సమర్థిస్తూ తీర్పునిచ్చింది. ఈ న్యాయపోరాటంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ కుమార్ లు విజయం సాధించారు.

తిరుగులేని ఆధారాలుంటే.. కష్టమే

పార్టీ ఫిరాయింపుల చట్టం అస్త్రంగా సుప్రీంకోర్టు వరకు పోరాడి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై (Khairatabad MLA Danam Nagender) అనర్హత వేటు పడింది. ఇందుకోసం బలమైన ఆధారాలు న్యాయస్థానం ముందు ఉంచగలిగారు. కాగా ఇప్పుడు హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి (Padi Kaushik Reddy Expulsion) లక్ష్యంగా శాసనసభ ఎథిక్స్ అండ్ ప్రివిలేజెస్ కమిటీల ద్వారా ఉచ్చు బిగించాలన్నది కాంగ్రెస్ పార్టీ వ్యూహంగా కనబడుతున్నది. కాగా. స్పీకర్ నిర్ణయం ఏదైనా సరే.. కౌశిక్ రెడ్డికి న్యాయస్థానాల తలుపు తట్టే పూర్తి రాజ్యాంగ హక్కు ఉంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 212 ప్రకారం చట్టసభల అంతర్గత వ్యవహారాల్లో కోర్టులు సాధారణంగా జోక్యం చేసుకోవు. కానీ, ఆ నిర్ణయాలు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉన్నా, విధించిన శిక్ష ప్రవర్తన కంటే మితిమీరినదిగా ఉన్నా న్యాయ సమీక్ష పరిధిలోకి వస్తాయని సుప్రీంకోర్టు పలు చరిత్రాత్మక తీర్పుల్లో తేల్చిచెప్పింది. మహారాష్ట్ర అసెంబ్లీలో అనుచిత ప్రవర్తన పేరుతో 12 మంది బీజేపీ ఎమ్మెల్యేలను ఏకంగా ఏడాది పాటు సస్పెండ్ చేయడాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. సస్పెన్షన్ అనేది సంబంధిత సెషన్‌కే పరిమితం కావాలని, ఏడాది పాటు వేటు వేస్తే ఆయా నియోజకవర్గాల ఓటర్ల హక్కులను హరించినట్లేనని ధర్మాసనం స్పష్టం చేసింది. కానీ తీవ్ర ఉల్లంఘనలు జరిగాయని న్యాయస్థానం అభిప్రాయపడితే.. అనర్హత వేటు నుంచి కాపాడడం కోర్టులకు కూడా సాధ్యం కాదని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దేశ పార్లమెంట్ చరిత్రలో 1951లో ముద్గల్ కేసు నుంచి మొదలుకుని 1978లో ఇందిరా గాంధీ, 2005 నాటి 'క్యాష్ ఫర్ క్వెరీ' స్కాంలో 11 మంది ఎంపీలు, 2016లో విజయ్ మాల్యా, 2023లో మహువా మోయిత్రా వరకు మొత్తం 17 మంది సభ్యులను ప్రివిలేజెస్ లేదా ఎథిక్స్ కమిటీ సిఫారసులతో సభ బహిష్కరించింది. అయితే ఇవన్నీ అవినీతి, సభా ధిక్కారం, తీవ్ర ఆర్థిక నేరాల వంటి తిరుగులేని ఆధారాలు ఉన్న కేసుల్లో జరిగాయి.కేవలం సభలో వాగ్వాదం, నిరసన వంటి ఘటనలకు ఎమ్మెల్యే సభ్యత్వాన్ని రద్దు చేయడం న్యాయస్థానాల విచారణలో నిలబడటం అత్యంత కష్టమని న్యాయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఒకవేళ కాంగ్రెస్ వ్యూహం ప్రకారం ఎథిక్స్ కమిటీ సిఫారసుతో స్పీకర్ కౌశిక్ రెడ్డిపై వేటు వేస్తే.. ఆయన వెంటనే హైకోర్టు లేదా సుప్రీంకోర్టు నుంచి స్టే తెచ్చుకునే అవకాశం కనబడుతున్నది.

Advertisement
Advertisement