త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kotta Prabhakar Reddy | లాస్య‌ మృతిలో వాస్త‌వాలు తేల్చాలి.. 20 ల‌క్ష‌ల ప‌రిహారం ఇవ్వాలి: ఎమ్మెల్యే కొత్త ప్ర‌భాక‌ర్‌రెడ్డి డిమాండ్‌

Kotta Prabhakar Reddy | సిద్దిపేట జిల్లా రాఘవాపూర్ కేజీబీవీ గురుకుల పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న లాస్య అనుమానాస్పద మృతిపై విచార‌ణ జ‌రిపి వాస్త‌వాలు తేల్చాల‌ని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్ర‌భాక‌ర్‌రెడ్డి (Kotta Prabhakar Reddy) డిమాండ్ చేశారు.

S

Telangana | Published On Oct 29, 2026, 3.09 pm IST

Kotta Prabhakar Reddy | లాస్య‌ మృతిలో వాస్త‌వాలు తేల్చాలి.. 20 ల‌క్ష‌ల ప‌రిహారం ఇవ్వాలి: ఎమ్మెల్యే కొత్త ప్ర‌భాక‌ర్‌రెడ్డి డిమాండ్‌
Advertisement

Kotta Prabhakar Reddy | త్రినేత్ర న్యూస్: సిద్దిపేట జిల్లా రాఘవాపూర్ కేజీబీవీ (Raghavapur KGBV) గురుకుల పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న లాస్య అనుమానాస్పద మృతిపై విచార‌ణ జ‌రిపి వాస్త‌వాలు తేల్చాల‌ని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్ర‌భాక‌ర్‌రెడ్డి (Kotta Prabhakar Reddy) డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి రూ.20 ల‌క్ష‌ల ప‌రిహారంతో పాటు ఒక‌టిరిక ప్ర‌భుత్వం ఉద్యోగం ఇవ్వాల‌న్నారు. సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీ ఎదుట బైఠాయించిన లాస్య కుటుంబ సభ్యులకు మద్దతుగా గురువారం రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ క‌మిష‌న్ చైర్మ‌న్‌ బక్కి వెంకటయ్యతో క‌లిసి ఆస్ప‌త్రి ఎదుట బైఠాయించారు. బాధ్యులైన వార్డెన్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

విద్యార్థిని మృతి చెందడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వాస్తవాలను పూర్తిస్థాయిలో వెలుగులోకి తీసుకురావాలి. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా ప్రభుత్వం తక్షణమే స్పందించాలి. నిరుపేద విద్యార్థుల భవిష్యత్తుకు సంక్షేమ గురుకులాలు ఎంతో కీలకమని, అలాంటి విద్యాసంస్థల్లో విద్యార్థుల భద్రత, ఆరోగ్యం, కనీస వసతుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. రాష్ట్రంలోని అన్ని సంక్షేమ గురుకులాలు, హాస్టళ్లలో సమగ్ర తనిఖీలు నిర్వహించి, తాగునీరు, మరుగుదొడ్లు, లైటింగ్, ప్రహరీ గోడలు, నాణ్యమైన భోజనం వంటి కనీస సౌకర్యాలను కల్పించాలి.

అనంత‌రం లాస్య మృతిపై సమగ్ర విచారణ జరిపించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ జిల్లా కలెక్టర్ హేమావతిని కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ ఘటనలో నిర్లక్ష్యానికి బాధ్యులైన వారిని గుర్తించి చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై కలెక్టర్ హేమావతి స్పందిస్తూ.. ఘటనను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని, ఇన్‌చార్జి మంత్రి దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు తెలిపారు. లాస్య మృతిపై సమగ్ర విచారణ జరిపించి బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఏం జ‌రిగిందంటే..

తొగుట మండలం గుడికందుల గ్రామానికి చెందిన దావులగల్ల లాస్య రాఘవపూర్ కస్తూర్బా పాఠశాలలో పదో తరగతి చదువుతుంది. దసరా సెలవుల అనంత‌రం ఇంటి నుంచి హాస్టల్‌కు వెళ్లింది. బుధవారం రాత్రి 10 గంటల సమయంలో లాస్య పుష్పవతి అయిందని పాఠశాల సిబ్బది త‌ల్లిదండ్రుల‌కు సమాచారం ఇచ్చారు. గురువారం తెల్లవారుజూమున 5 గంటల సమయంలో తల్లిదండ్రులు హాస్టల్‌కు చేరుకునే స‌రికి బాలిక‌ను పాఠ‌శాల సిబ్బంది సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

అయితే ఆసుపత్రికి చేరుకునే లోపే లాస్య ప్రాణాలు కోల్పోవ‌డంతో కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆరోగ్యంగా ఉన్న తమ కుమార్తె ఆకస్మికంగా మృతి చెందడంపై త‌మ‌కు అనుమానం క‌లిగిస్తోంద‌న్నారు. ఈ ఘ‌ట‌న‌పై సమగ్ర విచారణ జరిపి, వాస్తవాలను వెల్ల‌డించాల‌ని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

Advertisement
Advertisement