Harish Rao | “నేను రైతునవుతా.. దేశానికి అన్నం పెడతా” అని చెప్పుకొనే రోజు రావాలి
Harish Rao | రైతు బిడ్డ కూడా “నేను రైతునవుతాను.. వ్యవసాయం చేస్తాను.. ఈ దేశానికి అన్నం పెడతాను” అని గర్వంగా చెప్పుకునే రోజు రావాలని.. ఆరోజు కోసం అందరం కలిసి పని చేయాలి మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు (Harish Rao) పిలుపునిచ్చారు.
- ఆరోజు కోసం అందరం కలిసి పని చేయాలి
- అన్నదాత లేకుంటే ఈ దేశానికి అన్నమే లేదు
- ఉత్తమ రైతులను గౌరవించడం, వారి అనుభవాలను తెలపడం చాలా అవసరం
- అవార్డ్స్ కార్యక్రమం కోసం వైస్ టీవీ అద్భుత ఏర్పాట్లు చేసింది
- అవార్డులు అందుకున్న వారందరికీ అభినందనలు
- కిసాన్ మహరాజ్ అవార్డ్స్ కార్యక్రమంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు
Harish Rao | త్రినేత్ర న్యూస్: రైతు బిడ్డ కూడా “నేను రైతునవుతాను.. వ్యవసాయం చేస్తాను.. ఈ దేశానికి అన్నం పెడతాను” అని గర్వంగా చెప్పుకునే రోజు రావాలని.. ఆరోజు కోసం అందరం కలిసి పని చేయాలి మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు (Harish Rao) పిలుపునిచ్చారు. ఉత్తమ రైతులను గుర్తించి, గౌరవించి, వారి అనుభవాలను ఇతర రైతులకు తెలియజేయడం అత్యంత అవసరమన్నారు. కొత్త పద్ధతులను సైంటిస్టో, ఏ వ్యవసాయ అధికారో వచ్చి చెప్తే రైతులు పాటించకపోవచ్చని.. పక్క రైతుల ఫలితాలను ప్రత్యక్షంగా చూసినప్పుడే వారిలో మార్పు వస్తుందని చెప్పారు. గురువారం హైదరాబాద్ శిల్ప కళా వేదిక (Shilpakala Vedika)లో నిర్వహించిన కిసాన్ మహరాజ్ అవార్డ్స్ (Kisan Maharaj Awards) కార్యక్రమంలో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డితో కలిసి ముఖ్య అతిథిగా ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా అవార్డులు అందుకుంటున్న రైతు సోదర సోదరీమణులందరికీ అభినందనలు తెలియజేశారు.
రైతులను ఘనంగా సన్మానించడం సంతోషకరం
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఉత్తమ రైతులందరినీ గుర్తించి, వారిని సన్మానించాలనే గొప్ప సంకల్పంతో ఈ కిసాన్ మహారాజా అవార్డ్స్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహక బృందానికి ముందుగా నా హృదయపూర్వక అభినందనలు. సాధారణంగా సినిమా యాక్టర్లను, రాజకీయ నాయకులను, వివిధ రంగాల్లో విజయాలు సాధించిన ప్రముఖులను సత్కరిస్తుంటారు. కానీ రైతుల విషయానికి వచ్చేసరికి ఎందుకో చాలా తక్కువ సంస్థలు ముందుకొస్తుంటాయి. ఈరోజు ఈ కిసాన్ మహారాజా అవార్డ్స్ కార్యక్రమాన్ని వైస్ టీవీ (wise TV) చక్కగా ఏర్పాటు చేసింది. ఏదో ఒక చిన్న హాల్లో కార్యక్రమం నిర్వహించకుండా, ఆ పేరుకు తగ్గట్టుగా రైతులను అత్యంత ఘనంగా సన్మానించాలనే మంచి ఆలోచనతో ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయం.
ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చి అవార్డులు అందుకోబోతున్న రైతు సోదర సోదరీమణులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు. సమాజంలో రైతుకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. నిజానికి రైతు లేనిదే రాజ్యం లేదు అంటారు. అది మాటల్లోనే కాదు. ఈరోజు రైతు లేకపోతే ఈ దేశానికి అన్నం లేదు. ఇంత పెద్ద జనాభాకు, ఇన్ని కోట్ల మంది ప్రజలకు ఆహారాన్ని అందించడానికి ఆరుగాలం కష్టపడి, ఎండనక, వాననక, చలినక, రేయింబవళ్లు శ్రమించి మీరు పండించే పంటలే ఈ దేశ ప్రజల ఆకలిని తీరుస్తున్నాయి.
మనల్ని మనమే సన్మానించుకోవడం
ఈరోజు రైతుల్లో కూడా ఎంతోమంది ఉత్తమ రైతులు ఉన్నారు. ఆధునిక వ్యవసాయ పద్ధతులను, కొత్త మెళకువలు నేర్చుకొని, ప్రభుత్వ సహకారం ఉన్నా లేకపోయినా అద్భుతంగా పంటలు పండిస్తూ ఇతర రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. నిజంగా చెప్పాలంటే రైతును సన్మానించుకోవడం అంటే మనల్ని మనమే సన్మానించుకోవడం. ఎందుకంటే రైతే ఈ దేశానికి వెన్నెముక.
మీరు చేస్తున్న మంచి వ్యవసాయ కార్యక్రమాలు పదిమందికి ఆదర్శంగా నిలవాలి. ఇప్పటికే ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఈరోజు ఒక సైంటిస్ట్ వచ్చి చెప్పినా, ఒక వ్యవసాయ శాఖ అధికారి వచ్చి చెప్పినా, కొన్నిసార్లు రైతులు అంత త్వరగా కొత్త పద్ధతులను స్వీకరించకపోవచ్చు. కానీ తమ పక్క గ్రామంలో ఒక రైతు అద్భుతంగా పంట పండించి మంచి లాభాలు పొందుతున్నాడంటే, ఆ రైతును చూసి మిగతా రైతులు చాలా త్వరగా నేర్చుకుంటారు. ఆ పద్ధతులను తమ వ్యవసాయంలో అమలు చేస్తారు. దీనికి మా ప్రాంతంలో జరిగిన ఒక ఉదాహరణ చెబుతాను.
మా ప్రాంతంలో రైతులకు ఆయిల్ పామ్ మొక్కలు పెట్టాలని నేను చాలా ప్రోత్సహించాను. మన ప్రాంతం కూడా ఆయిల్ పామ్ సాగుకు అనుకూలంగా మారిందని, కాళేశ్వరం ప్రాజెక్టు వచ్చిన తర్వాత చెరువులు, చెక్‌డ్యామ్‌లలో నీరు చేరడం వల్ల వాతావరణంలో తేమ పెరిగిందని, ఆయిల్ పామ్ సాగు చేయాలని రైతులకు సూచించాను. మొదట్లో చాలామంది రైతులు తటపటాయించారు. కానీ కొంతమంది రైతులు ముందుకొచ్చి ఆయిల్ పామ్ సాగు ప్రారంభించారు. ఇప్పుడు ఆ రైతులకు పంట రావడం మొదలైంది. ఆ రైతులు పంట పండించి ఫలితాలు పొందడం చూసిన తర్వాత మిగతా రైతులు కూడా ఆయిల్ పామ్ సాగు చేయడానికి ముందుకొస్తున్నారు. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే, రైతులందరూ మాకు ఆయిల్ పామ్ మొక్కలు కావాలి, మేము కూడా ఆయిల్ పామ్ సాగు చేస్తామని అడుగుతున్నారు. మొక్కలు దొరకని పరిస్థితి కూడా ఏర్పడింది.
అంటే ఒక రైతు తన అనుభవంతో మంచి పంట పండించి లాభాలు పొందుతున్నప్పుడు, పక్కనున్న రైతులు కూడా ఆ పద్ధతులను చాలా సులభంగా స్వీకరిస్తారు. అందుకే ఉత్తమ రైతులను గుర్తించడం, వారిని గౌరవించడం, వారి అనుభవాలను ఇతర రైతులకు తెలియజేయడం చాలా అవసరం. ఈరోజు ఇక్కడికి వచ్చిన మీరందరూ ఒక్కొక్కరు ఒక్కో పంటలో, ఒక్కో వ్యవసాయ రంగంలో అద్భుతమైన ప్రతిభను కనబరిచి ఉత్తమ రైతులుగా ఈ అవార్డులు అందుకోబోతున్నారు.
రేవంత్ ప్రభుత్వం భయపడుతుంది
ఈరోజు మన రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైన పరిస్థితి నెలకొంది. ఇప్పుడు ఎల్‌నినో ప్రభావం వర్షాభావ పరిస్థితులు, నీటి కొరత, పంటలు ఎండిపోవడం వంటి సమస్యల గురించి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం రైతులకు భరోసా ఇవ్వాలి. కానీ దురదృష్టవశాత్తు రేవంత్ ప్రభుత్వం కూడా భయపడుతుంది. తాగడానికి నీళ్లు ఉండవు, పశువులు చనిపోతాయి, మనుషులు ఇబ్బందులు పడతారు, పంటలు ఎండిపోతాయి అని భయపెట్టడం ఒక ప్రభుత్వం చేయాల్సిన పని కాదు. ప్రభుత్వం ఎప్పుడైనా ప్రజలకు ధైర్యం ఇవ్వాలి. భరోసా ఇవ్వాలి. సమస్యలకు పరిష్కార మార్గం చూపించాలి.
ఈ ప్రశ్నలకు సమాధానం కావాలి
కానీ మన రాష్ట్రంలో దురదృష్టవశాత్తు ఉన్న నీళ్లను కూడా ఎత్తిపోసుకోలేకపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పంటలు నష్టపోయిన ఆ 25 లక్షల మంది రైతులను ప్రభుత్వం ఏ విధంగా ఆదుకుంటుంది? వారికి ఎలాంటి సహాయం అందిస్తుంది? పంట నష్టపరిహారం ఏ విధంగా చెల్లిస్తుంది? రైతులకు ఎక్స్‌గ్రేషియా ఎలా అందిస్తుంది? ఈ ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది.
పక్కన మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో రైతులకు ఏ విధంగా సహాయం అందించాలి, ఎలాంటి పరిహారం ఇవ్వాలి అనే అంశాలపై చర్చ జరుగుతున్నప్పుడు, మన రాష్ట్రంలోని రైతులకు కూడా స్పష్టమైన భరోసా ఇవ్వాలి. కేసీఆర్ ఎంతో గొప్ప ఆలోచనతో రైతు బంధు పథకం తెచ్చారు. కానీ దురదృష్టమేంటంటే ఇంకా మెరుగ్గా చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతుబంధు ఇస్తలేరు, రైతుబీమా ఆగిపోయింది, 24 గంటల విద్యుత్ కాస్తా ఆరేడు గంటలకు తగ్గిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్పు, మార్పు అని చెప్పారు. కానీ ఈ రకమైన మార్పు రావడం గురించి మనమందరం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఇలాంటి ఎల్‌నినో పరిస్థితుల్లో ప్రభుత్వం రైతులను ఆదుకోవాలి. రైతులకు అండగా నిలవాలి. వారికి ధైర్యాన్ని, భరోసాను ఇవ్వాలి. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కార మార్గాలను చూపించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను.
ఈరోజు ఉదయాన్నే లేచి, మీ మీ గ్రామాల నుంచి ఎంతో దూరం ప్రయాణించి, ఈ వేడుకలో, ఈ పండుగలో పాల్గొని కిసాన్ మహారాజా అవార్డులు అందుకుంటున్న రైతు సోదర సోదరీమణులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు. మీరందరూ ఇంకా ఇంకా ఎదగాలి. వ్యవసాయంలో మరిన్ని విజయాలు సాధించాలి. ఇతర రైతులకు ఆదర్శంగా నిలవాలి. ఈ సందర్భంగా నేను ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను. డాక్టర్ కొడుకు డాక్టర్ అవుతున్నాడు. లాయర్ కొడుకు లాయర్ అవుతున్నాడు. యాక్టర్ కొడుకు యాక్టర్ అవుతున్నాడు. లీడర్ కొడుకు లీడర్ అవుతున్నాడు. కానీ రైతు కొడుకు మాత్రం రైతు కావాలని ఆ రైతు కోరుకోలేని పరిస్థితి ఉంది. ఆ పరిస్థితి మారాలి.
రైతు తన కొడుకును చూసి, నువ్వు కూడా రైతు కావాలి అని గర్వంగా చెప్పుకునే రోజులు రావాలి. ఆ రోజు వచ్చినప్పుడే నిజంగా రైతును రాజును చేసినట్లు. ఆ రోజు వచ్చినప్పుడే రైతుల జీవితాల్లో నిజమైన వెలుగులు వచ్చినట్లు. ఆ రోజు వచ్చినప్పుడే వ్యవసాయానికి సమాజంలో రావాల్సిన గౌరవం వచ్చినట్లు. అలాంటి రోజు కోసం మనందరం కలిసి పనిచేయాలి. రైతు కుటుంబాలు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందాలి. వ్యవసాయం ఒక గౌరవప్రదమైన, లాభసాటైన వృత్తిగా నిలవాలి. రైతులకు మంచి రోజులు తప్పకుండా వస్తాయి. మళ్లీ వ్యవసాయ రంగంలో మంచి పరిస్థితులు ఏర్పడతాయి. రైతు రాజుగా నిలబడే రోజులు కూడా తప్పకుండా వస్తాయని నేను బలంగా విశ్వసిస్తున్నాను.
మీరంతా ధైర్యంగా ఉండండి
ఈరోజు ఇలాంటి కరువు పరిస్థితుల్లో, ఎల్‌నినో ప్రభావంతో ఎదురవుతున్న ఇబ్బందుల్లో రైతులెవరూ ధైర్యాన్ని కోల్పోవద్దని కోరుకుంటున్నాను. రైతు సోదరులారా, సోదరీమణులారా! మీరు ధైర్యంగా ఉండండి. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. కష్టాలు శాశ్వతం కాదు. మంచి రోజులు తప్పకుండా వస్తాయి. మీ అందరికీ ఉజ్వలమైన భవిష్యత్తు ఉండాలని, మీ పంటలు సమృద్ధిగా పండాలని, మీ కుటుంబాలు సుఖసంతోషాలతో ఉండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఈ కిసాన్ మహారాజా అవార్డ్స్ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించిన నిర్వాహకులందరికీ మరోసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అవార్డులు అందుకుంటున్న రైతు సోదర సోదరీమణులందరికీ మరోసారి నా అభినందనలు అని హరీశ్‌రావు పేర్కొన్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Ponnam Prabhakar | మున్నూరు కాపు భవన నిర్మాణానికి 5 కోట్లు కేటాయించడం సంతోషకరం: పొన్నం ప్రభాకర్
అక్టోబర్ 29, 2026

Harish Rao | కొండు ప్రతాప్ రావు రచించిన `ఆమె వెతలు` పుస్తకాన్ని ఆవిష్కరించిన హరీశ్ రావు
అక్టోబర్ 29, 2026

Model Schools | మోడల్ స్కూళ్లలో యోగా, ఆర్ట్, కంప్యూటర్ టీచర్లు.. 776 పోస్టుల భర్తీ
అక్టోబర్ 29, 2026
తాజావార్తలు
- ●ISRO | ఇస్రో కీలక ప్రయోగం.. అయినా నవిక్ పునరుద్ధరణకు మరింత సమయం..
- ●Regime Change | ఆ నిరసనల్లో పాల్గొనే వారు ప్రభుత్వ ఉద్యోగానికి అనర్హులు.. యూపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
- ●Ponnam Prabhakar | మున్నూరు కాపు భవన నిర్మాణానికి 5 కోట్లు కేటాయించడం సంతోషకరం: పొన్నం ప్రభాకర్
- ●Gold Prices | ఫెడ్ వడ్డీ రేట్ల ఎఫెక్ట్.. బంగారం, వెండిలపై ఇప్పుడు పెట్టుబడులు పెట్టవచ్చా..?
- ●Harish Rao | కొండు ప్రతాప్ రావు రచించిన `ఆమె వెతలు` పుస్తకాన్ని ఆవిష్కరించిన హరీశ్ రావు
- ●Rahul Gandhi | లాఠీలకు భయపడకండి.. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనుకుంటే చలో ఢిల్లీలో పాల్గొనండి : రాహుల్ గాంధీ

ISRO | ఇస్రో కీలక ప్రయోగం.. అయినా నవిక్ పునరుద్ధరణకు మరింత సమయం..

Regime Change | ఆ నిరసనల్లో పాల్గొనే వారు ప్రభుత్వ ఉద్యోగానికి అనర్హులు.. యూపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

Ponnam Prabhakar | మున్నూరు కాపు భవన నిర్మాణానికి 5 కోట్లు కేటాయించడం సంతోషకరం: పొన్నం ప్రభాకర్

Gold Prices | ఫెడ్ వడ్డీ రేట్ల ఎఫెక్ట్.. బంగారం, వెండిలపై ఇప్పుడు పెట్టుబడులు పెట్టవచ్చా..?





