త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bandi Sanjay | సీఎం కుర్చీకే ఎసరు.. కేసీ వేణుగోపాల్‌కు డైరెక్ట్‌గా డబ్బులు

ఖమ్మం మంత్రులు వసూళ్లలో బిజీగా ఉన్నారని, ఒక మంత్రి సీఎం రేవంత్‌ను కాదని నేరుగా కేసీ వేణుగోపాల్‌కు డబ్బులు ఇచ్చారని బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

J

Telangana | Published On Sep 9, 2026, 6.28 pm IST

Bandi Sanjay | సీఎం కుర్చీకే ఎసరు.. కేసీ వేణుగోపాల్‌కు డైరెక్ట్‌గా డబ్బులు

సంక్షిప్త సారాంశం

భద్రాచలంలో జరిగిన బీజేపీ ఆత్మీయ సమ్మేళనంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా మంత్రులపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్ర ఆరోపణలు చేశారు. ముగ్గురు మంత్రులు వసూళ్లలో బిజీగా ఉన్నారని, వారిలో ఒకరు ఏకంగా ముఖ్యమంత్రి సీటుకే ఎసరు పెడుతున్నారని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డిని కాదని ఓ మంత్రి.. కేరళ ఎన్నికల కోసం కేసీ వేణుగోపాల్‌కు నేరుగా డబ్బులు పంపారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రం తెలంగాణకు వేల కోట్ల నిధులు ఇస్తుంటే.. రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం వాటన్నింటికీ ఇందిరమ్మ స్టిక్కర్లు వేసుకుంటోందని మండిపడ్డారు.

Advertisement
  • ఖమ్మం మంత్రులపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Bandi Sanjay | త్రినేత్ర.న్యూస్ : భద్రాచలంలో జరిగిన బీజేపీ ఆత్మీయ సమ్మేళనంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) రాష్ట్ర ప్రభుత్వంపై, ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా మంత్రులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు ప్రజలను గాలికొదిలేసి వసూళ్లలో బిజీగా ఉన్నారని ఆరోపించారు.

సీఎం కుర్చీపై కన్ను.. ఢిల్లీకి మూటలు

ఖమ్మం జిల్లాకు చెందిన ఈ ముగ్గురు మంత్రుల తీరుపై తాము సర్వే చేయించగా సంచలన విషయాలు బయటపడ్డాయని బండి సంజయ్ తెలిపారు. వీరు ఆషామాషీ నేతలు కారని, ఒకరు సీఎంకు రైట్ హ్యాండ్, మరొకరు లెఫ్ట్ హ్యాండ్ అని, ఇంకొకరు ఏకంగా ముఖ్యమంత్రి సీటులోనే కూర్చోవడానికి రెడీగా ఉన్నారని ఎద్దేవా చేశారు. గతంలో ముఖ్యమంత్రి ద్వారా ఢిల్లీకి పైసలు వెళ్లేవని, కానీ ఇటీవలి కేరళ ఎన్నికల సమయంలో ఖమ్మం జిల్లాకు చెందిన ఓ మంత్రి.. సీఎం రేవంత్ రెడ్డిని సైతం పక్కనపెట్టి నేరుగా కేసీ వేణుగోపాల్‌కు డబ్బులు ఇచ్చారని సంచలన ఆరోపణలు చేశారు. ఈ పరిణామంతో సీఎంకు, సదరు మంత్రికి మధ్య ఆధిపత్య పోరు మొదలైందని విమర్శించారు.

కేంద్రం నిధులు.. కాంగ్రెస్ స్టిక్కర్లు

తెలంగాణ అభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) వేల కోట్ల రూపాయలు ఇస్తున్నారని బండి సంజయ్ గుర్తుచేశారు. భద్రాద్రి ప్రసాదం స్కీం కింద రూ.41 కోట్లు, ఖమ్మం-వైరా హైవేకి రూ.4,000 కోట్లు, మల్కాని గిరి-పాండురంగా పురం కొత్త రైల్వే లైన్‌కు రూ.3,600 కోట్లు, ఇండస్ట్రియల్ కారిడార్ కోసం రూ.8 వేల కోట్లు కేంద్రమే ఇచ్చిందన్నారు. రాష్ట్రంలో రోడ్లు, డ్రైనేజీలు, వీధి దీపాలు, ఉచిత బియ్యం, గ్యాస్, కిసాన్ సమ్మాన్ నిధి వంటివన్నీ కేంద్ర ప్రభుత్వానివేనని, కానీ రాష్ట్ర కాంగ్రెస్ నేతలు మాత్రం వాటన్నింటికీ 'ఇందిరమ్మ స్టిక్కర్లు' వేసుకుని రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.

ఎయిర్‌పోర్టుకు అడ్డుపడుతున్నారు

కొత్తగూడెంలో ఎయిర్‌పోర్ట్ (Kothagudem Airport) నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం అనుకూలమైన స్థలం కేటాయించకుండా నాటకాలు ఆడుతోందని బండి సంజయ్ విమర్శించారు. ఖమ్మం జిల్లాలో ముగ్గురు పవర్‌ఫుల్ మంత్రులున్నా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ఒక్క పైసా తీసుకురాలేకపోయారని దుయ్యబట్టారు. అదే కరీంనగర్‌లో బీజేపీ గెలిచిన వంద రోజుల్లోనే అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద రూ.830 కోట్లు, అమృత్ కింద రూ.140 కోట్లు, యూడీఎఫ్ కింద రూ.50 కోట్లు.. ఇలా వందల కోట్ల నిధులు తీసుకొచ్చామని వివరించారు. ఎవరికి ప్రజల మీద చిత్తశుద్ధి ఉందో, ఎవరు పేరు మార్చుకుని రాజకీయం చేస్తున్నారో ప్రజలే గమనించాలని కోరారు.

Advertisement
Advertisement