త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Candeur Lakescape Kondapur | ప్రాణాల మీదకు తెస్తున్న 47 అంతస్తుల నిర్మాణం.. కారుపై పడిన భారీ రాయి, తృటిలో తప్పించుకున్న విద్యార్థి

కొండాపూర్‌లో నిర్మాణంలో ఉన్న 47 అంతస్తుల భవనం పైనుంచి భారీ బండరాయి కారుపై పడటంతో కారు రూఫ్ ధ్వంసమైంది. ఈ ప్రమాదం నుంచి ఓ పాఠశాల విద్యార్థి తృటిలో తప్పించుకున్నాడు.

J

Hyderabad | Published On Sep 9, 2026, 7.04 pm IST

Candeur Lakescape Kondapur | ప్రాణాల మీదకు తెస్తున్న 47 అంతస్తుల నిర్మాణం.. కారుపై పడిన భారీ రాయి, తృటిలో తప్పించుకున్న విద్యార్థి

సంక్షిప్త సారాంశం

కొండాపూర్‌లో క్యాండియర్ లేక్‌స్కేప్ చేపడుతున్న 47 అంతస్తుల భవన నిర్మాణంలో కనీస భద్రతా ప్రమాణాలు పాటించడం లేదని విమర్శలు వస్తున్నాయి. భవన నిర్మాణ ప్రాంతం నుంచి ఓ భారీ రాయి కింద వెళ్తున్న కారుపై పడటంతో కారు పైకప్పు తీవ్రంగా ధ్వంసమైంది. పాఠశాలకు వెళ్తున్న ఓ విద్యార్థి అదృష్టవశాత్తూ ఎలాంటి గాయాలు లేకుండా ఈ ప్రమాదం నుంచి ప్రాణాపాయం తప్పించుకున్నాడు. గతంలో చిరక్ ఇంటర్నేషనల్ స్కూల్ ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదని, తాజా ఫిర్యాదులతో గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Candeur Lakescape Kondapur | హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో నిర్మాణంలో ఉన్న ఓ భారీ బహుళ అంతస్తుల భవనం స్థానికుల ప్రాణాల మీదకు తెస్తోంది. క్యాండియర్ లేక్‌స్కేప్ (Candeur Lakescape) సంస్థ చేపడుతున్న 47 అంతస్తుల నిర్మాణంలో కనీస భద్రతా చర్యలు (Safety measures) తీసుకోకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా పైనుంచి ఓ భారీ బండరాయి కింద వెళ్తున్న కారుపై పడటంతో కారు పైకప్పు (Roof) నుజ్జునుజ్జయింది.

స్వల్ప వ్యవధిలో తప్పిన ప్రాణాపాయం

సెప్టెంబర్ 9వ తేదీ ఉదయం సుమారు 7:50 గంటల సమయంలో కారు డ్రైవర్.. ఓ మాజీ ఎంపీ కుమారుడు అయిన బాలుడిని స్కూల్‌లో డ్రాప్ చేస్తుండగా ఈ భయానక ఘటన చోటుచేసుకుంది. అదృష్టవశాత్తూ కారులోని విద్యార్థికి ఎలాంటి భౌతిక గాయాలు కాలేదు కానీ, కారుకు మాత్రం తీవ్ర నష్టం వాటిల్లింది. రాయి పడిన వేగానికి కారు రూఫ్ తీవ్రంగా ధ్వంసమైంది. బాలుడు ఉన్న కారుపై ఇలా రాయి పడటం పట్ల విద్యార్థి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. బాధ్యులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని వారు స్కూల్ యాజమాన్యానికి రాసిన ఇమెయిల్ ద్వారా డిమాండ్ చేశారు.

Candeur Lakescape Negligence Huge Rock Falls on Car in Kondapur

గతంలోనూ ఫిర్యాదులు.. పట్టించుకోని యంత్రాంగం

క్యాండియర్ లేక్‌స్కేప్ నిర్మాణ సంస్థ భద్రతా వైఫల్యాలపై ఆరోపణలు రావడం ఇదే తొలిసారి కాదు. పక్కనే ఉన్న చిరక్ ఇంటర్నేషనల్ స్కూల్ (Chirec International School) పై కూడా గతంలో రాళ్లు పడ్డాయని ఆ స్కూల్ యాజమాన్యం అధికారులకు ఫిర్యాదు చేసింది. అయినా సంబంధిత యంత్రాంగం ఏమాత్రం పట్టించుకోలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

Candeur Lakescape Negligence Huge Rock Falls on Car in Kondapur

నిర్మాణ సంస్థ నిర్లక్ష్యంపై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వస్తుండటంతో, తాజాగా జరిగిన ఈ ప్రమాదంపై బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గచ్చిబౌలి పోలీసులు (Gachibowli Police) స్పందించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, లోతైన దర్యాప్తు ప్రారంభించారు. కనీస సేఫ్టీ నెట్స్ లేకుండా అంత ఎత్తులో నిర్మాణాలు చేపడుతుండటం స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది.

Advertisement
Advertisement