త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

TUWJ | జర్నలిస్టుల ఆరోగ్య పథకం హామీని నెరవేర్చండి : టీయూడ‌బ్ల్యూజే

TUWJ | కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు గడుస్తున్నా, ఎన్నికల మేనిఫెస్టోలో జర్నలిస్టులకు ఇచ్చిన ఆరోగ్య పథకం హామీని ఇంతవరకు నెరవేర్చకపోవడం విచారకరమని, ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే జర్నలిస్టులకు ఆరోగ్య పథకాన్ని అమలు చేసి, ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (TUWJ) రాష్ట్ర అధ్యక్షులు కె. విరాహత్ అలీ కోరారు.

S

Telangana | Published On Sep 9, 2026, 7.32 pm IST

TUWJ | జర్నలిస్టుల ఆరోగ్య పథకం హామీని నెరవేర్చండి : టీయూడ‌బ్ల్యూజే
Advertisement

TUWJ | త్రినేత్ర‌.న్యూస్ : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు గడుస్తున్నా, ఎన్నికల మేనిఫెస్టోలో జర్నలిస్టులకు ఇచ్చిన ఆరోగ్య పథకం హామీని ఇంతవరకు నెరవేర్చకపోవడం విచారకరమని, ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే జర్నలిస్టులకు ఆరోగ్య పథకాన్ని అమలు చేసి, ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (TUWJ) రాష్ట్ర అధ్యక్షులు కె. విరాహత్ అలీ కోరారు.

బుధవారం నాడు ఆదిలాబాద్ పట్టణంలోని తరంగిణి ఫంక్షన్ హాలులో జరిగిన, తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (TUWJ) ఆదిలాబాద్ జిల్లా మహాసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.

రాష్ట్రంలో ఎనిమిదేళ్లుగా జేహెచ్ఎస్ పథకం అమలుకాకపోవడంతో అనారోగ్యాలకు గురవుతున్న జర్నలిస్టులు చికిత్స కోసం పడుతున్న తిప్పలు వర్ణనాతీతమని విరాహత్ అలీ ఆందోళన వ్యక్తం చేసారు. కార్పొరేట్ ఆసుపత్రులలో చికిత్స పొందే ఆర్థిక స్థోమత లేక, ఇప్పటికే వందల సంఖ్యలో జర్నలిస్టులు ప్రాణాలు కోల్పోయినట్లు ఆయన విచారం వ్యక్తం చేసారు. ఈ విషయాన్ని తాము పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా, ఎలాంటి ఫలితం మాత్రం లేదన్నారు. ఇప్పటికైనా ఆరోగ్య పథకాన్ని అమలుచేసి జర్నలిస్టుల ప్రాణాలకు భరోసా కల్పించాలని ఆయన కోరారు.

రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో, జర్నలిస్టుల అక్రెడిటేషన్ కార్డుల మంజూరీలో కలెక్టర్లు తిరకాసులు పెడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, వెంటనే అలాంటి వైఖరికి స్వస్తి పలికి కార్డులను మంజూరీ చేయాలని ఆయన డిమాండ్ చేసారు. ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ జర్నలిస్టుల పట్ల వ్యవహారిస్తున్న వైఖరిని ఆయన ఖండించారు. జిల్లాలో 15మంది జర్నలిస్టులపై అక్రమ కేసులు బనాయించడమే కాకుండా, వారికి మంజూరు అయిన అక్రెడిటేషన్ కార్డులను లాక్కోవడం సహించరానిదన్నారు. వెంటనే అక్రమ కేసులను ఉపసంహారించుకోవాలని, లేనిపక్షంలో పోరాటం తప్పదని ఆయన హెచ్చరించారు.

అలాగే జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, అక్రెడిటేషన్ కార్డుల కోసం దరఖాస్తులు చేసుకున్న జర్నలిస్టులపై స్పెషల్ బ్రాంచ్ పోలీసులతో విచారణ జరిపించడం సహించరానిదని విరాహత్ ఆందోళన వ్యక్తం చేసారు. ఈ ఇద్దరు అధికారుల వైఖరిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని ఆయన స్పష్టం చేసారు. జర్నలిజం వృత్తి పట్ల సమాజంలో విశ్వాసం సన్నగిల్లుతున్న నేటి పరిస్థితుల్లో, పవిత్రమైన మీడియా వృత్తికి పూర్వ వైభవం దక్కించేందుకు గాను నైతిక విలువలతో వృత్తి ధర్మాన్ని నిర్వర్తించాల్సిన బాధ్యత జర్నలిస్టులపై ఉంటుందని ఆయన సూచించారు. ఐజేయు జాతీయ కార్యవర్గ సభ్యులు నగునూరి శేఖర్ మాట్లాడుతూ, దశాబ్దాలుగా ఆదిలాబాద్ జిల్లాలో తమ సంఘం ఎంతో బలోపేతంగా ఉందని, అయితే సభ్యుల విశ్వాసాన్ని వమ్ము చేయకుండా జిల్లా నూతన కమిటీ చిత్తశుద్ధితో సేవలందించాలని ఆయన సూచించారు.

ఇంకా ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎలగందుల రవీందర్, ప్రకాష్ రెడ్డి, కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు గాండ్ల శ్రీనివాస్, కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు రజనీకాంత్, రాష్ట్ర చిన్న, మధ్యతరగతి పత్రికల సంఘం నాయకుడు హన్మంత్, ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు రాజేశ్వర్, కార్యదర్శి దేవేందర్ లతో పాటు జిల్లాలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సంస్థల్లో పనిచేస్తున్న దాదాపు 200 మంది జర్నలిస్టులు హాజరయ్యారు. అనంతరం జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

Advertisement
Advertisement