త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

IDL Lake | కూక‌ట్‌ప‌ల్లి ఐడీఎల్ చెరువులో.. గ‌ణేశ్ విగ్ర‌హాల నిమ‌జ్జ‌నానికి ‘హైడ్రా’ భ‌గీర‌థ ప్ర‌య‌త్నం

IDL Lake | కూకట్‌ప‌ల్లిలోని ఐడీఎల్ చెరువులో గ‌ణేశ్ విగ్ర‌హాల నిజ‌మ‌జ్జ‌నాల‌కు ఎలాంటి ఆటంకం ఏర్పడకుండా హైడ్రా భగీరథ ప్రయత్నం చేస్తోంది. వేలాదిగా తరలి వచ్చే విగ్రహాలు గంగమ్మ ఒడికి చేరేలా ఏర్పాట్లు చేస్తోంది. ప్రధాన రహదారివైపు చెరువును లోతుగా త‌వ్వి.. నీటితో నింపేందుకు చ‌ర్య‌లు తీసుకుంటోంది.

S

Hyderabad | Published On Sep 9, 2026, 7.42 pm IST

IDL Lake | కూక‌ట్‌ప‌ల్లి ఐడీఎల్ చెరువులో.. గ‌ణేశ్ విగ్ర‌హాల నిమ‌జ్జ‌నానికి ‘హైడ్రా’ భ‌గీర‌థ ప్ర‌య‌త్నం
Advertisement
  • చెరువును త‌వ్వి నీటితో నింపేందుకు హైడ్రా చ‌ర్య‌లు
  • 20 అడుగుల మేర పూడిక తీసి నీటిని నింపుతున్న హైడ్రా

IDL Lake | త్రినేత్ర‌.న్యూస్ : కూకట్‌ప‌ల్లిలోని ఐడీఎల్ చెరువులో గ‌ణేశ్ విగ్ర‌హాల నిజ‌మ‌జ్జ‌నాల‌కు ఎలాంటి ఆటంకం ఏర్పడకుండా హైడ్రా భగీరథ ప్రయత్నం చేస్తోంది. వేలాదిగా తరలి వచ్చే విగ్రహాలు గంగమ్మ ఒడికి చేరేలా ఏర్పాట్లు చేస్తోంది. ప్రధాన రహదారివైపు చెరువును లోతుగా త‌వ్వి.. నీటితో నింపేందుకు చ‌ర్య‌లు తీసుకుంటోంది. వ్యర్థ జలాలు పోయి మంచి నీరు చేరేలా ఏర్పాట్లు చేస్తోంది. 20 అడుగులకు పైగా వ్యర్థాలతో కూడిన పూడికను తొలగించడంతో ఊట నీరు కూడా వ‌చ్చి చేరుతోంది. ఈ నీటికి తోడు అదనంగా నీటిని నింపే ఏర్పాట్లు హైడ్రా చేస్తోంది. గణేష్ నిమజ్జనం సమయానికి ఈ ఏర్పాట్లు పూర్తి చేయడానికి హైడ్రా ముమ్మరంగా ప్ర‌య‌త్నిస్తోంది.

హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ ఇప్ప‌టికే ఐడీఎల్ చెరువును సంద‌ర్శించి నిమ‌జ్జ‌నానికి ఇబ్బంది లేకుండా.. చేస్తున్న ఏర్పాట్ల‌ను స‌మీక్షించారు. చెరువు పున‌రుద్ధ‌ర‌ణ ప‌నులకు ఎలాంటి ఆటంకం లేకుండానే.. చెరువులో నిమ‌జ్జ‌నానికి అనువుగా నీరు చేరేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశించారు. స్థానికులు, గ‌ణేష్ ఉత్స‌వ క‌మిటీ ప్ర‌తినిధులు, స్థానిక నాయ‌కులతో పాటు ఎమ్మెల్యే మాధ‌వ‌రం కృష్ణారావు కూడా హైడ్రా క‌మిష‌న‌ర్‌ను క‌లిసి నిమ‌జ్జ‌నానికి ఏర్పాట్లు చేయాల‌ని ఈ సంద‌ర్భంగా కోరారు. చెరువు మిగ‌తా ప్రాంతంలో ఉన్న నీటిని మొత్తం ఇక్క‌డ‌కు తీసుకువ‌చ్చి నిమ‌జ్జ‌నానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాల‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ సూచించారు. ఈ మేర‌కు కూక‌ట్‌ప‌ల్లి ఐడీఎల్ చెరువులో నిమ‌జ్జ‌న ఏర్పాట్లు సాగుతున్నాయి.

త‌వ్విన‌కొద్దీ వస్తున్న వ్యర్థాలు..

కూక‌ట్‌ప‌ల్లి ఐడీఎల్ చెరువులో తవ్వినకొద్దీ ప్ర‌మాద‌క‌ర వ్యర్థాలు బ‌య‌ట‌కు వస్తున్నాయి. నేరుగా మురుగు చేర‌డం, ప్లాస్టిక్ వ్య‌ర్థాలు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, కొబ్బ‌రి పీచు, చెత్త పెద్ద‌మొత్తంలో బ‌య‌ట ప‌డుతోంది. వ్య‌ర్థాలు నీటి అడుగుకు చేరి.. భూమిలోకి నీరు ఇంకే ప‌రిస్థితి లేకుండా మారింది. ఇప్పుడా వ్య‌ర్థాల తొల‌గింపుతో పాటు త‌ర‌లించ‌డం చాలా ఇబ్బందిగా మారింది.

రాంకీ సంస్థ ద్వారా ప‌ర్యావ‌ర‌ణానికి ఎలాంటి ముప్పు లేకుండా చ‌ర్య‌లు తీసుకుంటోంది హైడ్రా. పీఓపీలో కాల్షియం స‌ల్ఫేట్ హెమిహైడ్రేట్ ప్ర‌ధానంగా ఉంటుంది. ఇది నీటిలో క‌లిసిన‌ప్పుడు జిప్సంగా మారి.. క‌ర‌గ‌డానికి వీలు లేకుండా అడుగుభాగంలో పేరుకుపోతుంది. ఇలా ద‌శాబ్దాలుగా ఐడీఎల్ చెరువులోకి చేరే పీఓపీతో కాలుష్యం పెర‌గ‌డంతో పాటు.. భూగ‌ర్భ జ‌లాలు పెర‌గ‌డానికి కూడా వీలు లేని ప‌రిస్థితి ఏర్ప‌డింది. మురుగు నీటితో కొట్టుకొచ్చిన చెత్త‌, ప్లాస్టిక్ వ్య‌ర్థాలు, పీవోపీని ఎప్ప‌టికప్పుడు తొల‌గిస్తే ప్ర‌మాదం ఉండేది కాదు.. ఇప్పుడిది 20 అడుగుల‌కు పైగా పేరుకుపోయింది. ల‌క్ష‌ల ట‌న్నుల పూడిక‌ను హైడ్రా తొల‌గిస్తోంది. రాత్రి, ప‌గ‌లు పూడిక‌ను తొల‌గించి.. ఐడీఎల్ చెరువు ప్ర‌ధాన ర‌హ‌దారికి ఆనుకుని లోతుగా చెరువును హైడ్రా త‌వ్వుతోంది. ఇందులోకి నీరు వ‌చ్చేలా చ‌ర్య‌లు తీసుకుంటోంది. నిమ‌జ్జ‌నానికి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్ల‌ను చేస్తోంది. నిమ‌జ్జ‌నం త‌ర్వాత మొత్తం పూడిక‌ను తొల‌గించి 72 ఎక‌రాల మేర చెరువు పున‌రుద్ధ‌ర‌ణ ప‌నులు పూర్తి చేయ‌డానికి హైడ్రా చ‌ర్య‌లు తీసుకుంటోంది.

Advertisement
Advertisement