CM Revanth Reddy | కేసీఆర్ ఎర్రవెల్లి మీటింగ్‌పై విచారణ!
CM Revanth Reddy | సెప్టెంబర్ 6న ఎర్రవెల్లి నివాసంలో జరిగిన సమావేశం మొదలు మూడు రోజులుగా చోటుచేసుకున్న పరిణామాలపై సమగ్ర విచారణ జరిపేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఐపీఎస్ అధికారి విజయ్‌కుమార్‌ను విచారణ అధికారిగా నియమిస్తూ విచారణ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శాసనసభలో ప్రకటించారు.
- ఈ నెల 6 తర్వాతి పరిణామాలపై కూడా..
- ఐపీఎస్ విజయ్‌కుమార్ నేతృత్వంలో విచారణ కమిటీ
- నివేదిక ఆధారంగా క్రిమినల్ కేసులు
- బీఆర్ఎస్ నేతలు ఉన్మాదుల్లా వ్యవహరించారని ఆరోపణ
- అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటన
CM Revanth Reddy | సెప్టెంబర్ 6న ఎర్రవెల్లి నివాసంలో జరిగిన సమావేశం మొదలు మూడు రోజులుగా చోటుచేసుకున్న పరిణామాలపై సమగ్ర విచారణ జరిపేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఐపీఎస్ అధికారి విజయ్‌కుమార్‌ను విచారణ అధికారిగా నియమిస్తూ విచారణ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శాసనసభలో ప్రకటించారు. సెప్టెంబర్ 6న జరిగిన కుట్ర నుంచి ఆ తర్వాత చోటుచేసుకున్న అన్ని సంఘటనలను క్రోడీకరించి, బాధ్యులపై సంపూర్ణ విచారణ జరిపి క్రిమినల్ కేసులు నమోదు చేసి శిక్షించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటే దేశంలో కోట్లాది ప్రజలకు ఒక నమ్మకం, ఒక భరోసా అని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ ఏం చేసిందని అడిగేవారు పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లను ఒకసారి పరిశీలించాలన్నారు. కాంగ్రెస్ దూరదృష్టితో ఈ దేశం అభివృద్ధి చెందేలా ఎలాంటి చర్యలు తీసుకుందో అర్థమవుతుందని చెప్పారు. ఎస్సీ, ఎస్టీలకు విద్య, ఉద్యోగం, రాజకీయాల్లో రిజర్వేషన్లు కల్పించింది కాంగ్రెస్ పార్టీయేనని, ఇది కాంగ్రెస్ పార్టీ విధానమని పేర్కొన్నారు.
శుద్ధీకరణ కార్యక్రమం హేయం
కర్ణాటకలోని ఒక చిన్న గ్రామంలో పుట్టి, రజాకార్ల దాడుల్లో తండ్రిని కోల్పోయి, కార్మిక నాయకుడిగా రాణించి జాతీయ స్థాయికి ఎదిగిన నేత మల్లికార్జున ఖర్గే అని సీఎం కొనియాడారు. 60 ఏళ్లుగా ఒక్కరోజు కూడా విరామం లేకుండా ఆయన ప్రజల కోసం పనిచేస్తున్నారని అన్నారు. ఉత్తరాఖండ్‌లో ఒక మైదానంలో జరిగిన సభలో మల్లికార్జున ఖర్గే పాల్గొంటే.. ఆగస్టు 10న బీజేపీ అనుబంధ సంస్థ అదే మైదానంలో శుద్ధీకరణ కార్యక్రమం చేపట్టడం హేయమైన చర్య అని మండిపడ్డారు. దీన్ని సభ ముక్తకంఠంతో ఖండిస్తోందన్నారు. ఈ ఘటనపై ఖర్గే రాజ్యసభలో భావోద్వేగంతో ప్రధానిని అడిగి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారని తెలిపారు. పార్లమెంట్ సభ్యులు రాష్ట్రపతిని కలిసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారని చెప్పారు.
ఫామ్‌హౌస్‌లో కుట్ర చేశారని ఆరోపణ
విద్యారంగంలో అక్రమాలు, ధరణి అక్రమాలు, 22 ఏ రాద్ధాంతంపై సభలో చర్చించాలని అనుకున్నామని సీఎం తెలిపారు. కానీ ఫామ్‌హౌస్‌లో కుట్ర చేసి తమ సభ్యులను సభను అడ్డుకునేందుకు ఉసిగొల్పారని ఆరోపించారు. సమస్యలపై చర్చ జరిగితే వారి పదేళ్ల దురాగతాలు, అప్పులపై ప్రజలకు అవగాహన కలుగుతుందని భయపడి చర్చ జరగకుండా కుట్ర చేశారని విమర్శించారు. అదే జరిగితే తెలంగాణ ప్రజలు ఇక శాశ్వతంగా వారి పార్టీని బొందపెడతారని అన్నారు. పార్లమెంట్‌పై దాడి చేసినవారికి, ముంబయి దాడులకు పాల్పడిన కసబ్‌కు, పుల్వామాలో సైనికులపై దాడిచేసిన తీవ్రవాదులకు, ఉన్మాదంతో సభాపతిని అవమానించిన వారికి పెద్ద తేడా లేదని సీఎం వ్యాఖ్యానించారు. ఉన్మాదానికి లోనై ఉసిగొల్పబడిన కొంతమంది ముష్కరులు అధికారులపై దాడులు చేయడంతోపాటు సభాపతి కుర్చీని అవమానించేలా వ్యవహరించారని ఆరోపించారు. వ్యక్తినే కాకుండా తల్లిని కూడా అవమానించారని అన్నారు. మహిళలను శక్తిగా కొలిచే సమాజం మనదని, భారతదేశాన్ని భారతమాతగా, తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ తల్లిగా భావిస్తున్నామని రేవంత్‌రెడ్డి అన్నారు. సభాపతిగా ఉన్న మీ మనసుకు గాయం చేయాలని ఉన్మాదంతో మాట్లాడారని పేర్కొన్నారు. ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ సభాపతికి క్షమాపణ చెప్పి, వారి సభ్యులతో క్షమాపణ చెప్పించి సభ సజావుగా జరిగేలా చూస్తారని అంతా భావించారని, కానీ అలా జరగకపోగా మరింత ఉన్మాదంతో వ్యవహరించారని విమర్శించారు.
దళితులను అవమానించారని మండిపాటు
ఏ ఫామ్‌హౌస్‌లో కుట్ర జరిగిందో ఆ ఫామ్‌హౌస్ ముందు దండోరా వేయాలని ప్రజాస్వామ్యవాదులు నిరసనకు దిగారని సీఎం చెప్పారు. వాళ్లలా ఉన్మాదానికి తెగబడలేదని, కేవలం డప్పు దరువులతో ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలిపారని అన్నారు. దళిత సోదరులు తమ మనసులోని భావాన్ని వ్యక్తం చేసేందుకు డప్పును ఒక సాధనంగా ఉపయోగిస్తారని చెప్పారు. మిమ్మల్ని అవమానించినట్లుగా కేసీఆర్ ఫామ్‌హౌస్ వద్ద వారిని అవమానించలేదని, దూషించలేదని అన్నారు. మమ్మల్ని బానిసలుగా భావించవద్దని, సహనాన్ని కోల్పోయేలా వ్యవహరించవద్దని మేల్కొలిపేందుకు అక్కడికి వెళ్లారని తెలిపారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు లేదా? అని ప్రశ్నించారు. ప్రతిపక్ష నాయకుడిగా బాధలో ఉన్నవారి సమస్యను పరిష్కరించే బాధ్యత వారిపై ఉందని, ఆ ప్రతినిధులను లోపలికి పిలిచి మాట్లాడి జరిగిన సంఘటనపై కేసీఆర్ బాధ్యతతో వ్యవహరించాల్సి ఉండేదని అన్నారు. కానీ, అలా వ్యవహరించకుండా మళ్లీ ఉన్మాదంతో వ్యవహరించారని విమర్శించారు. దళితులు తిరిగిన నేలను శుద్ధి చేయాలని ఆదేశించి తీవ్రంగా అవమానించారని ఆరోపించారు.
శుద్ధి చేయాల్సింది నేలను కాదు.. అహంకారాన్ని
అసలు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా.. రాతి యుగంలో ఉన్న రాక్షసుల్లా వ్యవహరిస్తారా? అని సీఎం ప్రశ్నించారు. సమాజంలో అశాంతిని ప్రోత్సహించి రెండు జాతుల మధ్య వైరంగా మార్చాలని అనుకుంటున్నారని ఆరోపించారు. పదేళ్లు అధికారంలో ఉండి, ధనబలంతో వ్యవస్థలను లొంగదీసుకోవాలనుకుంటున్నారని విమర్శించారు. వాళ్లు దళితులు నడిచిన నేలను శుద్ధిచేస్తే.. వారి మనసుల్లో పేరుకున్న అంటరానితనాన్ని ఎలా శుద్ధి చేయాలి అని ప్రశ్నించారు. నీళ్లతో కడగాలా? యాసిడ్‌తో కడగాలా? అని వ్యాఖ్యానించారు. దళితుడు దుక్కి దున్ని పంట పండిస్తే కడుపులు నిండుతున్నాయని అన్నారు. శుద్ధి చేయాల్సింది దళితులు నడిచిన నేలను కాదు.. మీ అహంకారం, అంటరానితనం ఆలోచనలను అని వ్యాఖ్యానించారు. కేసీఆర్ మనసులో పేరుకుపోయిన దొర అహంకారాన్ని శుద్ధి చేయాల్సి ఉందన్నారు. ఈ బాధ్యతను తెలంగాణ సమాజం తీసుకుంటుందని సీఎం చెప్పారు. సభాపతిని అవమానించిన వారిని చట్టపరంగా శిక్షించాలని ప్రభుత్వం బాధ్యతతో వ్యవహరిస్తుందని తెలిపారు. జరిగిన తప్పును ఒప్పుకుని క్షమాపణ చెబితే మీ కిరీటం ఊడి కింద పడుతుందా? అని ప్రశ్నించారు. ఒకవైపు మల్లికార్జున ఖర్గేకు జరిగిన అవమానమైనా, గడ్డం ప్రసాద్‌కుమార్‌కు జరిగిన అవమానమైనా ఈ సమాజానికి జరిగినట్లేనని రేవంత్‌రెడ్డి అన్నారు. ఇంకా కొంతమంది మనసుల్లో పేరుకున్న మనువాద భావాలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని చెప్పారు.
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం చర్యలు
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం ఎంతటివారినైనా ప్రభుత్వం విచారణ చేపట్టి శిక్షించాలని నిర్ణయించిందని సీఎం తెలిపారు. కుట్రలు పన్నినవారితో పాటు కుట్రలో భాగస్వాములైన వారిని చట్టపరిధిలో శిక్షించాలని నిర్ణయించామని చెప్పారు. సెప్టెంబర్ 6న జరిగిన కుట్ర నుంచి జరిగిన అన్ని సంఘటనలను క్రోడీకరించి అందరిపై సంపూర్ణ విచారణ చేసి, క్రిమినల్ కేసులు పెట్టి శిక్షించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. సభాపతిగా తమరు మానసిక ధైర్యం కోల్పోవద్దని, మీ మనసును గాయపరిచిన వారిని వదిలే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. చట్టాలు, సెక్షన్లు అడ్డుపెట్టుకుని కొంతమందికి బెయిల్ పొందొచ్చని.. కానీ తెలంగాణ సమాజం బెయిల్ ఇవ్వదని రేవంత్‌రెడ్డి అన్నారు. రజాకార్లను దిగంతాలకు తరిమి మట్టికరిపించిన చరిత్ర ఈ గడ్డదని పేర్కొన్నారు. ఈ ప్రభుత్వం మీకు అండగా నిలబడుతుందని సభాపతికి భరోసా ఇచ్చారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | జీవో 81, 85లు నకిలీ అయితే.. సీఎం రేవంత్, మంత్రులు కూడా నకిలీలే
సెప్టెంబర్ 9, 2026

Ranabaali | సింగనమల బొబ్బిలి రణబాలిరా నీ అక్క..! విజయ్ పవర్ఫుల్ డైలాగ్‌తో రణబాలి టీజర్..!
సెప్టెంబర్ 9, 2026

Harish Rao | ఇది బీఆర్ఎస్ సస్పెన్షన్ కాదు.. ప్రజా సమస్యలపై కాంగ్రెస్ విధించిన సస్పెన్షన్
సెప్టెంబర్ 9, 2026
తాజావార్తలు
- ●Bandi Sanjay | సీఎం కుర్చీకే ఎసరు.. కేసీ వేణుగోపాల్‌కు డైరెక్ట్‌గా డబ్బులు
- ●BRS MLAs | ఫేక్, ఏఐ జనరేటెడ్ చిత్రాలపై కఠిన చర్యలు తీసుకోండి
- ●TGEJAC | 18 లోపు పీఆర్సీ రిపోర్టు సమర్పించండి
- ●Mahesh Kumar Goud | మంత్రులందరి శాఖలు మార్చండి.. హైకమాండ్‌కు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక సూచన
- ●AYUSH Students Stipend Hike | స్టైపెండ్ డబుల్.. ఆయుష్ విద్యార్థులకు రేవంత్ సర్కార్ భారీ గిఫ్ట్
- ●RS Praveen Kumar | జీవో 81, 85లు నకిలీ అయితే.. సీఎం రేవంత్, మంత్రులు కూడా నకిలీలే

Bandi Sanjay | సీఎం కుర్చీకే ఎసరు.. కేసీ వేణుగోపాల్‌కు డైరెక్ట్‌గా డబ్బులు

BRS MLAs | ఫేక్, ఏఐ జనరేటెడ్ చిత్రాలపై కఠిన చర్యలు తీసుకోండి

TGEJAC | 18 లోపు పీఆర్సీ రిపోర్టు సమర్పించండి

Mahesh Kumar Goud | మంత్రులందరి శాఖలు మార్చండి.. హైకమాండ్‌కు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక సూచన



